భారతదేశంలో కుల గణనపై ఇటీవలి కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ (S.O. 2681(ఈ), తేది 16 జూన్ 2025) ద్వారా, 2027 జనాభా గణనలో కుల గణన కొనసాగుతుందని స్పష్టమైన ఆధారం అందింది. రాహుల్ గాంధీ, జైరాం రమేష్, సచిన్ పైలట్ వంటి నేతలు చేసిన విమర్శల నేపథ్యంలో నిజం ఏమిటో ప్రజలకు తెలియజేయాలనే స్పష్టమైన ఉద్దేశంతో ఈ వ్యాసం రూపొందించాం. ఇది ఏకపక్ష విమర్శల కోసం కాదు.. వాస్తవ సమాచారాన్ని, చట్టబద్ధ ఆధారాలను ప్రజలకు అందించాలనే ప్రయత్నం. సమాధానంగా ఈ విశ్లేషణాత్మక వ్యాసం అందిస్తున్నా. ఇది కేవలం రాజకీయ విమర్శకు ప్రతివిమర్శగా కాకుండా.. ప్రజలకు నిజాలు తెలియజేయాలనే ఒక బాధ్యతతో రూపొందించబడిన విశ్లేషణ.
కుల గణన — చట్టబద్ధ ప్రామాణికత
2025 జూన్ 16న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ S.O. 2681(E) ద్వారా — 2027 జనాభా గణన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో 2019లో ORGI (Registrar General & Census Commissioner) జారీ చేసిన నోటిఫికేషన్ S.O. 1455(E)ను “supersession except as respects things done…” అనే క్లాజ్‌తో పునరుద్ధరించారు. అంటే గతంలో హౌస్ లిస్టింగ్ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలు రద్దుకాకుండా కొనసాగుతాయి. ఆ షెడ్యూల్‌లో కాలమ్ 13 “Caste/Tribe Name of the Head of Household” అని స్పష్టంగా ఉన్నది. ఇది ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర సామాజిక వర్గాలు (ఓబీసీలు, బీసీలు, ఇతరులు) కూడా తమ కుల వివరాలు నమోదు చేసుకునే చట్టబద్ధ అవకాశాన్ని కల్పిస్తుంది.
ఎస్సీ, ఎస్టీలకు 1951 నుంచే కుల గణన.. ఇప్పుడు ఇతరులకు కూడా అవకాశం
భారతదేశంలో 1951 నుంచి ప్రతి జనాభా గణనలో ఎస్సీ, ఎస్టీల కుల వివరాలు నమోదవుతూ వొచ్చాయి. కానీ ఇతర సామాజిక వర్గాల సమాచారం, ముఖ్యంగా బీసీలది, ఎప్పటికీ అధికారికంగా నమోదు కాలేదు. ఇకపై కాలమ్ 13 ద్వారా — ఇతర వర్గాల ప్రజలు కూడా తమ కుల వివరాలు నమోదు చేసుకునే అవకాశం చట్టబద్ధంగా కలుగుతుంది.
2027 జనాభా గణన కేవలం గణాంక ప్రక్రియ కాదు. ఇది భారత సామాజిక నిర్మాణాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునే చారిత్రక అవకాశం. వనరుల పంపిణీ, హక్కుల అమలు, పాలనా ప్రతినిధ్యాల విషయంలో గణన ఆధారంగా రూపొందే విధానాలే గుణాత్మక మార్పులకు మార్గం.
సెస్ 2011 విఫల మోడల్ — తార్కిక గణన అవసరం
సెస్ అంటే సోషల్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ . ఇది 2011లో రానురానుగా చేపట్టబడిన ఓ పెద్ద ప్రయత్నం అయినా — దానికి చట్టపరమైన స్థిరత్వం లేకపోవడం, గణాంక విభాగం కాకుండా గ్రామీణ అభివృద్ధి శాఖ, పట్టణ అభివృద్ధి శాఖల ద్వారా అమలు చేయడం వల్ల ఇది విశ్వసనీయత కోల్పోయింది. 4,893 కోట్లు ఖర్చైన ఈ గణనలో కులాల బదులు గోత్రాల పేర్లు, ఇంటిపేర్లు, డూప్లికేట్లు భారీగా నమోదయ్యాయి. దీని ఫలితంగా బీసీల వివరాలు విశ్వసనీయంగా అందుబాటులో లేకుండా పోయాయి. ఇదే కారణంగా, ఈ గణనను అధికారికంగా వాడలేని స్థితి వచ్చింది.
రాజ్యాంగపరమైన ఆధారాలు కుల గణన అవసరం అనే అంశానికి రాజ్యాంగమే మార్గదర్శనం:
• ఆర్టికల్ 15(4), 16(4): సామాజిక, విద్యా మరియు ప్రభుత్వ నియామకాలలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం.
• ఆర్టికల్ 38(2): సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించాలనే లక్ష్యం.
• ఆర్టికల్ 340: వెనుకబడిన వర్గాల గుర్తింపు కోసం కమిషన్ ఏర్పాటు.
• ఆర్టికల్ 243డి(6), 243టి(6): స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల కోసం సామాజిక వర్గాల గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అధికారం.
ఈ అంశాలన్నీ బలపడాలంటే గణనే ఆధారంగా ఉండాలి.
2010 మే 7న అప్పటి హోం మంత్రి పి. చిదంబరం లోక్‌సభలో: “We must count the OBCs — we must count castes. That is a necessity for our society.” అని వ్యాఖ్యానించారు. కానీ ఆ ప్రకటన తర్వాత గణన బాధ్యతను గణాంక విభాగం కాకుండా గ్రామీణ అభివృద్ధి శాఖకు అప్పగించడం వల్ల, శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేకపోయారు. ఫలితంగా సెస్ గణన అనర్థకంగా మిగిలిపోయింది.
ఇప్పుడు చారిత్రక అవకాశం — శాస్త్రీయంగా ముందుకు నడవాలి
2025 గెజిట్ ప్రకటన ద్వారా గణనకు చట్టబద్ధ నిర్మాణం ఏర్పడినప్పటికీ ఈ ప్రక్రియను శాస్త్రీయంగా, పారదర్శకంగా, సామాజిక న్యాయపరంగా కొనసాగించాల్సిన బాధ్యత మిగిలే ఉంది. దీన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే శిక్షణ పొందిన గణకులు, తార్కికంగా రూపొందించిన కుల జాబితాలు, పరిశీలన పద్ధతులు, డిజిటల్ మౌలిక వనరులు, ప్రజలతో సంప్రదింపులు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, స్థానిక నిపుణుల సూచనలు పరిగణనలోకి ఈసుకోవాలి. ఈ చర్యలన్నీ పరస్పర సమన్వయంతో అమలులోకి రావాలి. అప్పుడే కుల గణన ఒక సమర్థవంతమైన, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియగా నిలుస్తుంది.
గణనలో లేని వర్గం అభివృద్ధిలోనూ ఉండదు
2027 జనాభా గణన కేవలం గణాంక ప్రక్రియ కాదు. ఇది భారత సామాజిక నిర్మాణాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునే చారిత్రక అవకాశం. వనరుల పంపిణీ, హక్కుల అమలు, పాలనా ప్రతినిధ్యాల విషయంలో గణన ఆధారంగా రూపొందే విధానాలే గుణాత్మక మార్పులకు మార్గం. డా బీఆర్. అంబేడ్కర్ ఇలా చెప్పారు. “సమాజంలోని అన్యాయాన్ని అద్దంలో చూపాలంటే గణన అవసరం.” ప్రజాస్వామ్యంలో గణనలో లేని వర్గం అభివృద్ధిలోనూ స్థానం పొందలేరు. కాబట్టి ఇది కేవలం లెక్కల లెక్క కాదు. ఇది సామాజిక చైతన్యానికి, రాజ్యాంగ న్యాయానికి గణాంక రూపంలో వేసే శాశ్వత పునాది. అనిపేర్కొన్నారు.

vkmrao48@gmail.com | 9849912948





