విద్యా కమిషన్ సిఫారసులతో విద్యా అభివృద్ధి జరిగేనా..?

“ఇంత వ్యయంతో ఏర్పాటయ్యే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు యేటా బడ్జెట్ లో నిధులు క్రమం తప్పకుండా కేటాయిస్తారన్న నమ్మకం లేదు. ఆర్ధిక ఇబ్బందులతో, ప్రతి మూడునెలలకూ అప్పుల కోసం పడిగాపులు గాచే ప్రస్తుత ప్రభుత్వం రేపు చేతులెత్తేయదని చెప్పకుండా ఉండలేము. ఊరి బడిలో లభించే స్థానిక సంస్కృతి, జాతీయభావన, నైతిక విలువలు, గ్రామీణ పని సంస్కృతి , గ్రామీణ వాతావరణం కార్పొరేట్ సిలబసులుండే తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధుల కోసం వెంపర్లాడడం చూస్తే నిర్వహణ నిధుల లేమి నిజమయ్యే అవకాశం ఉంది..”

maisa srinivas
-మైస శ్రీనివాసులు 
TPTF పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సంక్షోభ సమయాల్లో ఛైతన్యశీల పోరాటాలకు సిద్ధమయ్యే తెలంగాణ సమాజం ఇటీవల నిస్సత్తువలోకి కూరుకుపోయినట్టుంది. సమాజ మనుగడకు ఊతమయ్యే ప్రధానాంశాల్లో ముఖ్యమైనదైన ప్రభుత్వ విద్య క్రమేణా కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నది. “ప్రభుత్వ విద్య”అనే అంశం దానికి సంబంధించిన విషయాలు తమకు పట్టనట్టు, ప్రభుత్వ విద్య తమకు దూరమవుతుందనే స్పృహ సమాజానికి లేకపోవటం శోచనీయం. ఉపాధ్యాయ వృత్తి ఉనికికే ప్రమాదం వాటిల్లే ప్రతిపాదనలు చేసిన ఈ నివేదిక పై కనీసం నిరసన కూడా రాలేదు తెలంగాణలో విద్యా సంస్కరణల కోసం ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ ఇటీవల వెలువరించిన నివేదికలో ప్రతిపాదించిన పలు అంశాలు సంస్కరణల పేరిట తెలంగాణలో ప్రభుత్వ విద్యను సమాధి చేసే విధంగా ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు కమిషన్ చైర్మన్ గారి వ్యక్తిగత ఆలోచనల సారానికి అద్దం పడుతున్నాయి.

తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక దీర్ఘకాలంలో ఆచరణ యోగ్యం కాని, ప్రజలకు ప్రభుత్వ విద్యను దూరం చేసే ప్రతిపాదనలను పొందుపరచింది. ఈ ప్రతిపాదనలన్నీ ప్రపంచ బ్యాంకు విధించిన షరతులకు లోబడి సిద్దంచేసిన కార్యాచరణ తప్ప వేరొకటి కాదని పరిశీలిస్తే తెలుస్తుంది. నివేదిక ఆసాంతం ప్రభుత్వ విద్యపైనా, ప్రభుత్వ ఉపాధ్యాయవృత్తిపై కుట్రపూరిత విద్వేషాన్ని వెళ్లగక్కింది. ఉపాధ్యాయులకు ఉన్న ప్రయోజనాలు వేతనాలు, పదోన్నతులు, బదిలీలు పై చేసిన సిఫారసుల వలన ప్రభుత్వ విద్యా బలోపేతం అవుతుందా.. ప్రభుత్వ విద్యా అభివృద్ధికి ఉపాధ్యాయులే అడ్డంకిగా మారారా..విద్యా కమిషన్ ఎవరి ప్రయోజనాల కోసం ఈ నివేదిక రూపొందించారనేది తెలంగాణ సమాజం తెలుసుకోవాలి.
2024 సెప్టెంబర్ 3న లో ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ 14 మాసాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి తమ సిఫారసులతో కూడిన నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేశారు. విద్యా కమిషన్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 305 విద్యాసంస్థలు పర్యటించి, 54 సమావేశాలు,10 సెమినార్లు, 7 పబ్లిక్ హియరింగ్స్ నిర్వహించి, 5 రాష్ట్రాలు, 3 దేశాలు పర్యటించి ఈ నివేదిక రూపొందించారు. “కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా’ ఉంది. కమిషన్ కు ఏ ఉపాధ్యాయ సంఘం, విద్యారంగ మేధావులూ కూడా ప్రతిపాదించని సిఫారసులను నివేదికలో పొందుపరిచారు. నివేదిక అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో, విద్యావేత్తలతో చర్చించకుండానే సిఫారసుల అమలుకు వెంటనే ఆమోదం తెలపడంతో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇవి ఉనికిలోకి రానున్నాయని ప్రకటించారు.ప్రభుత్వం ఏక పక్ష విధానాలతో అమలు చేసే నిర్ణయాలు ఎంత కాలం నిలబడతాయనేది ప్రశ్నించుకోవాలి.
కమిషన్ ప్రతిపాదనల్లో ప్రధానమైనది తెలంగాణా పబ్లిక్ స్కూల్ ల ఏర్పాటు. ఈ ప్రతిపాదన ఊరి బడిని మాయం చేయనుంది. కిలో మీటర్ దూరానికొక ప్రాథమిక,రెండు కిలో మీటర్లకు ఒక ప్రాథమికోన్నత, ఐదు కిలో మీటర్లకు ఒక హైస్కూలు ఉండాలనే విద్యాహక్కు చట్టం సూచనలను ఈ కమిషన్ విస్మరించింది. దశలవారీగా మండల జనాభా ప్రాతిపదికన ప్రతి 20 వేల జనాభాకు ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటును ప్రతిపాదించింది. 2026-27 నుండి 2031-32 వరకు రెండు దఫాలుగా 632 మండలాల్లో 2190 తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను ఒక్కొక్క తెలంగాణా పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 15 కోట్ల చొప్పున 32,850 కోట్లు వెచ్చించాలని సిఫారసు చేసారు.ఈ పాఠశాలల్లో శిశు తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకూ ప్రవేశాలుంటాయి. ఒక్కక్క తెలంగాణా పబ్లిక్ స్కూల్ 4 లేదా 6 ఎకరాలు స్థలంలో ఏర్పాటయి అవి కార్పొరేట్ హంగులను సంతరించుకుంటాయి.
మండలంలోని గ్రామాల్లో, తండాల్లోని ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పదిహేను వందల మంది విద్యార్థుల నమోదుతో సమీకృత విద్యను అందించటం వీటి లక్ష్యం. ఈ లక్ష్యాలకు చేరువలో ప్రయోగాత్మకంగా కమిషన్ ఆధ్వర్యంలో రూపుదిద్దిన ఆరుట్ల విద్యాకేంద్రాన్ని ఉదహరిస్తున్నది. స్థానిక, స్థానికేతర ప్రముఖుల ఆర్ధిక సహకారంతో ఆరుట్ల విద్యాకేంద్రం ఏర్పాటు అన్ని ప్రాంతాల్లో విజయవంతం ఆవుతుందన్న గ్యారెంటీ ఉండదు. ఈ బడుల ఏర్పాటు జరిగిన ప్రాంతంలోని మండలంలోని పలు గ్రామాలు, తండాల్లోని ప్రభుత్వ బడులు మూత బడుతాయి. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు దెబ్బతింటాయి. అదనపు ఉపాధ్యాయుల సంఖ్య పెరిగినట్లు రికార్డులు చూపుతాయి. ఇకపై ఉపాధ్యాయుల నియామకాలు, డి.ఎస్.సి.ల ఊసుండదు. ఇంత భారీ వ్యయంతో ఈ స్కూళ్ల ఏర్పాటు బదులు ఆ నిధులతో గ్రామాల్లోని ప్రభుత్వ బడులలో సౌకర్యాలు మెరుగు పరచవచ్చు.
ఊరిబడి పచ్చగుంటే ఊరు బాగుంటుంది.ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యపై తమ సొంత విధానం రుద్దటం గత మూడు దశాబ్దాలుగా జరుగుతోంది. ఒక పాలక పార్టీ ప్రారంభించిన వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మరో పాలక పార్టీ ఇంకో వ్యవస్థను ప్రారంభిస్తుంది. మొదటి వ్యవస్థ నిరాదరణకు గురవుతుంది. ఇప్పుడు వేలాది కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఉనికికి గ్యారెంటీ ఉండదు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్న ఊరిలోని ప్రభుత్వ బడికి పంపటానికే ఇష్టపడతారే కానీ మండల కేంద్రం వరకూ రవాణా సౌకర్యం ఉన్నా  కూడా పంపుతారన్న నమ్మకం లేదు. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రజలు కానీ ,ప్రజా ప్రతినిధులు కానీ, తల్లిదండ్రులు కానీ, ఊపాధ్యాయులు.. వారి సంఘాలు కానీ కోరలేదు. ఉపాధ్యాయుల కొరత , సౌకర్యాల లేమి, నిధుల కొరత , మూడు దశాబ్దాలుగా లోపించిన పర్యవేక్షణ ఫలితంగా ప్రయివేటు బడుల బస్ లు ఊర్లోకి వస్తున్నాయంటే తల్లిదండ్రులకు ప్రభుత్వ బడి పై అసంతృప్తి ఉందనే  కదా! మెరుగైన సౌకర్యాలున్న ప్రైవేట్ బడికి అప్పులు చేసైనా పంపిస్తున్నారు. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుతో రకరకాల ప్రభుత్వ బడులకు వెళ్ళే విద్యార్థులే తరలుతారు. ఫలితంగా క్రమంగా ఊర్లలో ప్రభుత్వ బడులు మూత పడే ప్రమాదం వుంది.
ఇంత వ్యయంతో ఏర్పాటయ్యే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు యేటా బడ్జెట్లో నిధులు క్రమం తప్పకుండా కేటాయిస్తారన్న నమ్మకం లేదు. ఆర్ధిక ఇబ్బందులతో, ప్రతి మూడునెలలకూ అప్పుల కోసం పడిగాపులు గాచే ప్రస్తుత ప్రభుత్వం రేపు చేతులెత్తేయదని చెప్పకుండా ఉండలేము. ఊరి బడిలో లభించే స్థానిక సంస్కృతి, జాతీయభావన, నైతిక విలువలు, గ్రామీణ పని సంస్కృతి , గ్రామీణ వాతావరణం కార్పొరేట్ సిలబసులుండే తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. ఇంటి భాషకూ , బడి భాషకు తేడాలుండి సరైన భాషా సామర్ధ్యాలకు విద్యార్థి దూరమయ్యే ప్రమాదముంది . ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ లకు నిధుల కొరతతో అప్పుల కోసం వివిధ సంస్థలను ప్రభుత్వం దేబిరిస్తోంది. కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధుల కోసం వెంపర్లాడడం చూస్తే నిర్వహణ నిధుల లేమి నిజమయ్యే అవకాశం ఉంది.
ఉపాధ్యాయులపై కుట్ర పూరిత దాడి…ప్రతిపాదన విద్యా కమిషన్ చేసిన మరో ప్రమాదకరమైన ప్రతిపాదన ప్రభుత్వ ఉపాధ్యాయుల పై విద్వేష వాఖ్యలు. ఉపాధ్యాయుల వేతనాలు తగ్గించాలని,అట్టి మిగులు నిధుల ప్రభుత్వ బడుల మౌలిక సదుపాయాల పెంపుకు వినియోగించాలన్నారు. “ప్రభుత్వ బడులు కొంత కాలం తర్వాత ఉండబోవని” ఒక ఇంటర్వ్యులో స్వయంగా చెప్పిన కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆ మిగులు నిధులతో ఏ బడుల అభివృద్ధికి వ్యయం చేస్తారో తెలియపరచలేదు. కమిషన్ చేసిన అధ్యయన సారాంశం ఇదేనా! మంచి ఫలితాలు సాధిస్తున్న ప్రయివేట్ బడుల ఉపాధ్యాయులతో పోల్చితే ప్రభుత్వ ఊపాధ్యాయుల జీతాలు ఎక్కువగా ఉన్నాయని , పైగా విద్యార్థుల సామర్ధ్యాలు అంతంత మాత్రంగా కూడా లేవని వాఖ్యానించారు.
జి.ఓ.1 మేరకు ప్రైవేటు బడుల యాజమాన్యం తమ వార్షిక ఆదాయంలో 95 శాతం మౌలిక సౌకర్యాల పెంపుకూ, ఉపాధ్యాయుల జీతాలకు చెల్లించాలని చెపుతుంది. ఈ సమస్య పై అధ్యయనం చేయటం మరిచారు. అంతేకాదు 65 శాతం విద్యార్థులు చదివే ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల ప్రమాణాలు ఎంత బాగా ఉన్నాయో అసర్ నివేదికలు చెబుతున్నాయి. ఈ విద్యార్థులు కూడా తెలంగాణ సమాజం బిడ్డలే కదా ! వీరికి రాజ్యాంగ లక్ష్యాలు, విద్యా లక్ష్యాల కనుగుణంగా విద్యా ప్రమాణాలు ఉండాలి కదా ! ఇందుకోసం కమిషన్ చేసిన ప్రయత్నం శూన్యం.! ఆటోమెటిక్ అడ్వాన్స్ స్కీం కింద టైం స్కేల్ ద్వారా వచ్చే ప్రమోషన్ నిలిపి వేయాలని , సీనియారిటీ ద్వారా లభించే పదోన్నతులు నిలిపివేయాలని, పరీక్షలు నిర్వహించి పదోన్నతులు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులకు కూడా ఇదే ప్రతిపాదన చేసి, ఆచరించి చూస్తే బాగుంటుంది.
ఉపాధ్యాయుల నియామకాలు కాంట్రాక్టు పద్దతిన చేయాలని, మొదటి రెండేళ్ళు అప్రెంటీస్ గా పనిచేయించాలని ప్రతిపాదించారు. అప్రెంటీస్ అంటే వెట్టి చాకిరి చేయించటమే! సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులిచ్చిన విషయం కమిషన్ దృష్టిలో లేదు. ఈ అప్రెంటిస్,కాంట్రాక్టు నియమాకాలు ప్రపంచ బ్యాంకు నిర్ధేశాలని ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాలంలోనే బయటపడింది. ఇప్పుడు మళ్ళీ వాటినే తిరిగి ప్రతిపాదిస్తున్న ఈ నివేదిక ప్రపంచ బ్యాంకు నిర్ధేశాలకు లోబడి ఉందని  భావించాల్సిందే! పైగా జాతీయ విద్యా విధానం – 2020 కూడా ఇవే సూచనలు చేసిన విషయం గమనార్హం. అనేక దేశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.అంతర్జాతీయ సంస్థ యునెస్కో, అంతర్జాతీయ కార్మిక సంస్థ 1966 లోనే ఉపాధ్యాయుల ఆర్ధిక ఆంతస్తు, సాంఘిక హోదా పెంచాలని సూచించాయి. తరగతి గదిలో జాతి నిర్మాణం చేసే ఉపాధ్యాయులు, కర్మాగారంలో ఒ క పనిముట్టు సృష్టించినట్టుగా పిల్లవాడిని మనిషిగా రూపుదిద్దే ఉపాధ్యాయులు , వారి మానసిక స్థితి ఎలా ఉండాలి. ఉపాధ్యాయులను ఇన్ని రకాల సమస్యలలోకి నెట్టి వేస్తే అతను తరగతిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధించగలడా! ప్రభుత్వ ఉపాధ్యాయుల పై ఇంత వ్యతిరేకత ఉంటే  వ్యక్తిగా అది మురళి అభిప్రాయం. కానీ ఆయన ఆభిజాత్యాన్ని కమిషన్ చైర్మన్ హోదాలో నివేదికలో ప్రతిపాదించటం సరైంది కాదు.
స్వాతంత్య  కాలం నుండి ఉపాధ్యాయులు సాధించుకున్న ప్రతి హక్కు కూడా సమిష్టి పోరాటాల ద్వారా పొందినవే! ఉపాధ్యాయులకు సామాజిక బాధ్యతలుంటాయి. మిగతా ఉద్యోగుల కన్నా ఉపాధ్యాయులకు భవిష్యత్ తరాలను రూపుదిద్దే బాధ్యత భుజస్థంధాల ఫై ఆధార పడి ఉంటుంది. కనుకనే.ఆచార్య దేవోభవ అంటూ టీచర్ అని గురువును గౌరవించడం మన సంప్రదాయం. ప్రతి వంద మంది విద్యార్థులలో ప్రయివేట్ పాఠశాలలు, గురుకులాలు వంటి ఆనేక రకాల పాఠశాలలకు పోగా అట్టడుగు వర్గాల, ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉండే పేద వర్గాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో నమోదు అవుతున్నారు.
ఏటా నిర్వహించే బడిబాట ద్వారా వీధుల్లో తిరిగి నమోదు చేసుకున్న పిల్లలను తీర్చిదిద్దటంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల శ్రమను మరచి పోయి కమిషన్ నివేదిక ప్రభుత్వ బడులపై ప్రభుత్వ ఉపాధ్యాయు లపై ఈ విధంగా విషం కక్కడం సరైందికాదు. ఇప్పటికే 29 రకాల పాఠశాలల వ్యవస్థ ఉందని కమిషన్ చైర్మన్ గారు అంటూనే వారు 30 వ పాఠశాల వ్యవస్థను తీసుకు వచ్చారు. తెలంగాణా పబ్లిక్ స్కూల్ల ఏర్పాటు వలన ఇప్పుడున్న 29 రకాల పాఠశాలల వ్యవస్థ క్రమంగా అంతరించి పోతుందనే విచక్షణ లేకపోవటం బాధాకరం. పోరాడి సాధించుకున్న కొత్త రాష్ట్రం తెలంగాణ లో విద్యా సంస్కరణలు తెలంగాణ సమాజ అభివృద్ధి కి దోహద పడాలి కానీ తెలంగాణ విద్యారంగాన్ని అభివృద్ధి పేరిట సమూలంగా విధ్వంసం చేయడానికి తెలంగాణ విద్యా కమిషన్ ఈ నివేదిక  సిద్దం చేసిందని భావించక తప్పదు. మూతబడిన బడులను తెరిపించి వాటిలో మౌలిక సౌకర్యాల కల్పనకు  దోహదం చేసే విధంగా నివేదికను మార్పులు చేయాలి. భూమి లేని చోట వ్యవసాయం ఉండదు. బడి లేని చోట జ్ఞానాభివృద్ధి , నైతిక విలువలున్న రేపటి తరం సృష్టించబడదు.
కమిషన్ నివేదిక వెలువడిన తర్వాత రాష్ట్రంలో అనేక మంది విద్యావేత్తలు మార్చి 17 న ఓ రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించి,నివేదిక పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.జిల్లా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, పలు ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రమంతటా వ్యక్తమైన ఈ వ్యతిరేకతలకు వెరసి ప్రభుత్వ సమాచారం వెబ్ సైట్ లో నివేదిక కాపీని కనిపించకుండా తీసేసింది. క్షేత్రస్థాయిలో చర్చకు విద్యారంగ మేధావులతో, రాజకీయ పక్షాల మేధో ప్రతినిధులతో‌, సీనియర్ రిటైర్డ్ ఉపాధ్యాయులతో , గ్రామీణ ప్రాంత యువతతో, ప్రజలతో,ఉపాధ్యాయ సంఘాలతో విస్తృత స్థాయి చర్చలు జరిపి అందరి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి. చర్చలనంతరమే నివేదిక ఆమలుకు ముందడుగేయాలి. తెలంగాణ సమాజం  భౌతిక పరిస్థితులు, లభించే సహజవనరులు సమర్థవంతంగా వాడుకునే మానవ వనరుల రూపకల్పనకు విద్యా విధాన రూపకల్పనకు దోహదఫడే దిశగా విద్యా కమిషన్ ప్రయత్నం చేసి సిఫార్సులు రూపొందించాలి. అంతేకానీ కార్పొరేట్ శక్తులకు చౌక కార్మికులను తయారు చేసే కర్మాగారాలుగా మన విద్యాలయాలు ఉండకూడదు. ఇప్పటికైనా ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించి తెలంగాణకు సరైన దిక్సూచిగా ఉండే విద్యా విధానాన్ని రూపకల్పన చేయుటకు చర్యలు తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *