కాంబోడియా ప్రయాణం – గిరియానం 16

 సాధారణంగా వియత్నాం కాంబోడియా దేశాలకు ఒకేసారి వెళుతుంటారు. నేనూ చాలా రోజులుగా అలాగే వెళ్లాలనుకున్నాను. కానీ నా ప్రయాణాల అనుభవం వల్ల విడి విడిగా వెళ్ళడమే మంచిదనిపించింది. ఎందుకంటే అలా కలిపి వెళ్ళడం వలన ఆయా దేశాలలోని అన్ని ప్రదేశాలు చూడడానికి వీలుపడదు. అలా వెళ్ళినట్లయితే కంబోడియాలో సెo రిప్ ( SIEM REAP ) ఒక్కటే చూసే అవకాశం ఉండేది. ఆ వివరాలు మరో ఆర్టికల్ లో రాస్తాను. మేం ఒక్క కాంబోడియాకే వెళ్ళడం వల్ల మా ప్రయాణ ప్రణాళికలో ఫ్నోo పెన్ ( PHNOM PENH ) నగరాన్ని కూడా చేర్చాం. అరవైయేళ్ళు దాటిన నలుగురు మహిళలం అనుకున్న ప్రకారం హైదరాబాదు నుంచి నాలుగు గంటల ప్రయాణం తర్వాత బ్యాంకాక్ లో దిగాం. విమానంలో తినడానికి వెజ్ బిరియానీ ఇచ్చారు. గేట్ వద్దకు చేరుకున్నాం. ఉదయం 6.20 న. లకు మా ఎయిర్ ఏషియా విమానం ఏడుగంటలకు బయలుదేరి 8-20 ని.లకు ఫ్నోo పెన్ అంతర్జా తీయ విమానాశ్రయంలో దిగింది. ఇంతకు ముందు ఇచ్చిన వెజ్ బిరియానీ ఈ విమానంలో కూడా ఇచ్చారు. మేం దానికి బదులుగా కాఫీ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాం. కానీ చివరికి అదే తినవలసి వచ్చింది.

దాని మీద కూడా మా జోకులు వేసుకుంటూ వాటితోపాటు దానినీ పొట్టలోకి తోసేసాం. పరిస్థి తులు అనుకూలించనప్పుడు ఆ వాతావరణాన్ని తేలిక పరచుకోవడానికి మనకున్న ఇంధనం హాస్యం మాత్రమే అనిపిస్తుంది నాకు. విమానం దిగి ఇమ్మిగ్రేషన్ ముగించుకొని, లగేజీ తీసుకొని బయటకు వచ్చేసరికి ఉదయం తొమ్మిది అయింది . మన కంటే కాంబోడియా కాలమానం గంటన్నర ముందుoటుంది. మేం బయటకు వచ్చేసరికి గైడ్ టామ్ రెడీగా ఉన్నాడు. టామ్ తనను పరిచయం చేసుకొని వాహనం దగ్గరికి తీసుకు వెళ్ళాడు. హుండై కారు. ఐదు సీట్లతో విశాలంగా, కొత్తగా బాగుంది. ఫ్నోo పెన్ నగరం కంబోడియా రాజధాని. శుభ్రంగా, విశాలమైన రోడ్లతో బాగుంది.

జనాభా ఇరవై రెండున్నర లక్షలని, ఎత్తైన భవనం 44 అంతస్తులని అది ఒకటే వుందని టామ్ చెప్పాడు. నగరాన్ని చూసుకుంటూ మేం పదిన్నరకు సన్ అండ్ మూన్ నాలుగు నక్షత్రాల హోటల్ కు చేరుకున్నాం. బ్రేక్ ఫాస్ట్ టైం పదిగంటలవరకే.. కానీ హోటల్ యాజమాన్యం మా కొరకు వేడిగా ఆమ్లెట్, కాఫీ, పళ్ళు లాంటివి వెల్ కం డ్రింక్ తోపాటు ఏర్పాటు చేసారు. టామ్ లంచ్ కు తీసుకువెళ్లడానికి పన్నెండు గంటలకు వస్తానని చెప్పాడు. అంత తొందరగా తినే అలవాటు లేదని, బ్రేక్ఫాస్ట్ కూడాఆలస్యంగా చేసాం కాబట్టి ఒంటిగంట తర్వాత రమ్మని చెప్పాం. ఆ హోటల్ చెక్ ఇన్ టైం మధ్యాహ్నం పన్నెండు గంటలకు. స్పెషల్ రిక్వెస్ట్ పైన ఒక గంట ముందరే  పదకొండు గంటలకే రూం రెడీచేసి ఇచ్చారు. గది అన్ని వసతులతో, సపరేట్ బెడ్స్ తో విశాలంగా చాలా బాగుంది. మేం కాసేపు విశ్రాంతి తీసుకొని, తయారై కింద లాబీలోకి వెళ్ళేసరికి టామ్ సిద్ధంగా ఉన్నాడు.

ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్ళి భోజనం ముగించాం. సమయం మూడు గంటలయింది. అక్కడినుంచి సెంట్రల్ మార్కెట్ కు వెళ్ళాం. టామ్ అక్కడ మమ్మల్ని దింపేసి, హోటల్ కు తిరిగి ఎలా వెళ్లాలో గుర్తులు చెప్పి, రాత్రి ఏడుగంటలకు వచ్చి డిన్నర్ కు తీసుకెళతానని చెప్పి వెళ్ళిపోయాడు.  విశాలమైన వృత్తాకార భవనంలో ఉన్న స్థానిక మార్కెట్ అది. అక్కడ పూలు, పండ్లు, కూరగాయలతోపాటు అన్నివస్తువులు లభిస్తాయి. దాదాపు వెయ్యికి పైగా దుకాణాలున్నాయి. నాలుగు వైపులా నాలుగు ప్రవేశ ద్వారాలున్నాయి. అన్నీ ఒకేలాగా ఉన్నాయి. మనుషులు కూడా దాదాపు అందరూ ఒకేలాగా ఉన్నారు. మాలో కొందరికి పద్మవ్యూహంలోకి ప్రవేశించామా? తిరిగి బయటకు వెళ్ళగలమా? అనే సందేహం కలిగింది. ఏ ద్వారం గూండా లోపలికి వెళ్లామో అదే మార్గంలో బయటికి రాకపోతే దారితప్పిపోయే ప్రమాదముంది. మేం లోపలికి వెళ్ళిన మార్గంలోని షాప్ నంబర్లు గుర్తుపెట్టుకున్నాం. అవి రిపీట్ అయ్యే అవకాశం లేదు. క్షేమంగా బయటకు వెళ్ళవచ్చు.

సుమారు మూడు గంటలు మార్కెట్ అంతా గాలించాo . ఇలాంటి చోట్లోనే మనకు అక్కడి ప్రజల జీవన విధానం తెలుస్తుంది. స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. స్త్రీలకు చాలా కష్టపడి పనిచేసే తత్వం ఉంది. ఇంగ్లీషు ఎవరికీ రాదు. అయినప్పటికీ విదేశీయులతో వాళ్ళు చేస్తున్న వ్యాపార నైపుణ్యానికి అబ్బుర పడ్డాను. కొన్ని షాపుల్లో తగ్గించి ఇస్తు న్నారు. చాలా తక్కువ షాపుల్లో fixed Rates ఉన్నాయి. రాధ జేడ్ స్టోన్ తో చేసిన గాజులు, ఏవో కొన్ని బొమ్మలు కొన్నది. ఎండ తాకిడి తట్టు కోవడానికి నేను రెండు డాలర్లకు ఒక టోపీ కొన్నాను. కంబోడియా కరెన్సీని ‘రీల్ ‘ అంటారు. డాలర్స్ కూడా తీసుకుంటారు కాబట్టి మేం ఇక్కడినుంచి రీల్స్ తీసుకుపోలేదు. మన ఒక రూపాయి సూమారు 43 రీల్స్ కు సమా నం. అను తన దువ్వెన ఎయిర్ పోర్టులో మర్చిపోవడం వల్ల తప్పనిసరయి ఒక చెక్క దువ్వెన కొన్నది. ఇతర షాపుల్లో ఆరు డాలర్స్ చెప్పిన దువ్వెన ఒక షాపులో పెద్దావిడ రెండు డాలర్స్ చెప్పి ఏమీ తగ్గించలేదు. మరెన్నో షాపుల్లో తిరిగి చూసి చివరికి ఆ పెద్దావిడ షాపులోనే కొనింది. రెండు డాలర్స్ ఇస్తే 1000 రీల్స్ ఆవిడ తిరిగి ఇచ్చింది. ఆవిడ ఖచ్చితత్వానికి, నిజాయితీకి ముగ్ధులమైనాం.

సమయం ఐదున్నర దాటింది. తిరిగివెళ్ళే మార్గం కోసం కాస్తా తికమక పడినా షాప్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం వల్ల సరైన దారిలోనుంచే బయటకు వచ్చాం. గైడ్ చెప్పిన గుర్తులను పోల్చుకుంటూ హోటల్ కు చేరుకున్నాం. ఒక కిలోమీటర్ దూరంలో వుంది హోటల్. కొత్త ప్రదేశాలలో, దేశం కాని దేశంలో గైడ్ లేకుండా రోడ్లవెంబడి నడవడం భలే థ్రిల్లింగ్ గా వుంటుంది. సాయంత్రం ఏడు గంటలకు గైడ్ వచ్చి ఇండియన్ రెస్టారెంట్ కు డిన్నర్ కు తీసుకు వెళ్ళాడు. రేపు మేం చూడబోయే రాయల్ ప్యాలెస్, (Tuol sleng Museum ) టోల్ స్లెoగ్ మ్యూజియం, కిల్లింగ్ ఫీల్డ్స్, ఫ్నోo టెంపుల్ గురించిన విశేషాలు తర్వాత ఆర్టికల్ లో తెలియజేస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *