వరుస భేటీలు ..!

బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) వరుసగా రెండు రోజుల నుండి ఆపార్టీ సీనియర్‌ ‌నాయకుడు సిద్దిపేట శాసనసభ్యుడు,మాజీ మంత్రి  తన్నీరు హరీష్‌రావు ఇంటికి వెళ్ళడం తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. ప్రధానంగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆధిపత్యంపైన రాష్ట్రంలో విస్తృత చర్చజరుగుతున్న నేపథ్యంలో  వీరి భేటీ ఆసక్తిని కలిగిస్తున్నది. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటినుండి ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పూర్తిగా ఫామ్‌హౌజ్‌కే పరిమితమైనారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకపోవడంతో అధికార, విపక్ష పార్టీల నుంచి ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్నారు.

దీనికితోడు పార్టీపరమైన కార్యక్రమాలన్నిటినీ కెటిఆర్‌, ‌హరీష్‌రావులే అన్నిటికీ తామే అన్నట్లుగా తమ భుజస్కందాలపై మోస్తున్నారు. అధికార పార్టీ నుండి వొస్తున్న విమర్శలైతేనేమీ, ప్రభుత్వం నుండి ఎదురవుతున్న సవాళ్లను వారు ధీటుగా ఎదుర్కుంటున్నారు. ప్రధానంగా కెటిఆర్‌ అన్ని తానేఅయి వ్యవహరిస్తున్న తరుణంలో పార్టీ అధ్యక్షుడి బాధ్యతలుకూడా కెటిఆర్‌కే అప్పగించే అవకాశాలున్నట్లు తీవ్ర ప్రచారం జరుగుతున్నది. అయితే ఆయనకన్నా ముందునుండి అంటే పార్టీ పుట్టినప్పటినుండి మామ అంటే కెసిఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ వొస్తున్న హరీష్‌రావు ప్రాధాన్యతను  కావాలనే తగ్గిస్తున్నారన్న వదంతులు కూడా బాగానే ప్రచారంలో ఉన్నాయి. పార్టీలో ఏ అవాంతరం ఏర్పడినా, కష్టకాలంలో తన నేర్పరితనంతో సమస్యలను పరిష్కరించే ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరున్న హరీష్‌రావు వర్గానికి ఈ వదంతులు కాస్తా మనస్తాపాన్ని కలిగించాయి. అవికాస్తా హరీష్‌రావును ఇరకాటకంలో పడేసాయి.

ఆయన కూడా మానసిక సంఘర్షణకు గురైనట్లు అనేక కథనాలు చోటుచేసుకున్నాయి. అయినా ఆయన ఎక్కడా నోరు జారలేదు. పైగా తాను పార్టీకి, పార్టీ అధినేతకు విధేయుడినన్న విషయాన్ని చాలాకాలంగా పబ్లిక్‌గానే చెబుతూ వొచ్చినప్పటికీ, ఆయన పార్టీ వీడుతాడన్న ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువైంది. తాజాగా ఒక ప్రెస్‌మీట్‌లో ఇదే విషయాన్ని మరోసారి చెబుతూ కెటిఆర్‌ ‌పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టినా తనకు అభ్యంతరం లేదని, తాను ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్దంగా ఉన్నానంటూ మరోసారి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ భారతీయ జనతాపార్టీలోకి వెళ్తాడని లేదా సొంత పార్టీని ఏర్పాటు చేస్తాడంటూ సోషల్‌ ‌మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వొస్తూనే ఉన్నాయి. దీనిపై టీవీ డిబేట్ లు కూడా మొదలైనాయి. తాజాగా ఆపార్టీ అత్యంత ఘనంగా వరంగల్‌లో జరుపుకున్న రజతోత్సవ సభలో ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించారన్న  చర్చ కూడా మొదలైంది. దీంతో ఈ వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తున్న సోషల్‌ ‌మీడియాపై చర్యలు తీసుకోవాల్సిందిగా సైబర్‌ ‌క్రైమ్‌ ‌సెల్‌కు బిఆర్‌ఎస్‌పార్టీ ఫిర్యాదుచేసింది. ఇలాంటి పరిస్థితిలో కెటిఆర్‌  ‌రెండు (శుక్ర, శని)రోజులుగా కోకపేటలోని హరీష్‌రావు ఇంటికి వెళ్ళడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శుక్రవారం సుమారు రెండు గంటలపాటు మాట్లాడుకున్న వీరిద్దరు తిరిగి శనివారం కూడా భేటీ కావడం పైన అనేక ఊహాగానాలు వెలుగుచూస్తున్నాయి. అయితే ఈ భేటీ వెనుక ఆపార్టీ అధినేత కెసిఆర్‌ ఆదేశమున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది.

కెసిఆర్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌కే పరిమితం కావడంతో హరీష్‌రావు, కెటిఆర్‌తోపాటు కవిత ఎవరికి వారు బలమైన నాయకులుగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీ మూడు ముక్కలు అవుతుందంటూ ప్రతిపక్షాలు ప్రచారాన్ని అందుకున్నాయి. వీటన్నిటికీ తెరదించేందుకే కెసిఆర్‌ ‌హరీష్‌రావు వద్దకు వెళ్ళాల్సిందిగా కెటిఆర్‌ను ఆదేశించి ఉండవచ్చన్న టాక్‌ ‌నడుస్తున్నది. కవితకూడా స్వంత పార్టీని ఏర్పాటుచేసుకునే ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న ఆరోపణల దృష్ట్యా పార్టీలో ధ్రానమైన ఈ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటేనే దీనికి తెరపడుతుందనుకుంటున్నారు. ప్రస్తుతం కవిత అమెరికాలో ఉండడం, కెటిఆర్‌ ఈనెల 30న లండన్‌కు వెళ్తుండడంతో వారిద్దరు ఇండియాకు చేరుకున్న తర్వాత చర్చించుకునే అవకాశాలున్నాయనుకుంటున్నారు. ఇదిలా ఉంటే పార్టీపై వొస్తున్న ఆరోపణలను ఆ పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకే వారి భేటీ  జరిగిందని చెబుతున్నారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కావొచ్చింది. అధికారంలోకి రాకముందు ఆ పార్టీ చేసిన వాగ్దానాలేవీ నేటికీ నెరవేర్చలేదన్న ఆరోపణలున్నాయి. సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ప్రజల వద్దకు చేరలేదు. తాజాగా కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, హైడ్రా , నిరుపేదలకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌లు తదితర అంశాలపై ఇప్పటివరకు పార్టీ ప్రధాన నాయకులే స్పందిస్తూ వొస్తున్నారు. ఇక నుండి గ్రామీణ స్థాయి నాయకులను, పార్టీ అనుబంధ సంఘాలను వీటిలో భాగస్వాములను చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకే వారి మధ్య  చర్చలు జరిగాయంటున్నారు. ఏది ఏమైనా వారి భేటీ  అంశాలపై వారిరువురు వివరణ ఇస్తేనే ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్  ‌పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *