- పథకాలు అందకపోవడానికి పదేళ్ల దోపిడీ కారణం
- గిరిజన మహిళ రైతులను చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది
- 18న ఇందిరా గిరి జల సౌర వికాసం పథకం ప్రారంభం
- గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లు
- ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ప్రతి పథకం ప్రజల మంచి కోసం తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వం వుండకూడదని టీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని లక్ష్మీ నరసింహపురం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా వేల కోట్లతో సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నామ న్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన వారు సంక్షేమ పథకాలను ఆనాడు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
ప్రజల సొమ్మును గత పాలకులు దోపిడీ చేయడం వల్లనే నేడు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న రైతు రుణమాఫీ, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా పోయాయన్నారు. గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసే ఆలోచన ప్రభుత్వానికి వున్నదన్నారు. అటవీ హక్కుల చట్టం కింద కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు పొందిన గిరిజన రైతులు సాగు చేసుకునేందుకు వెళితే.. మహిళలని చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్ర గత ప్రభుత్వానిదన్నారు.
గిరిజన రైతులకు భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ఈనెల 18న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట లోని చెంచు కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ పథకం కింద 12,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు గిరిజనులకు ఆదాయం వచ్చేలా ఉద్యానవన శాఖతో ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు.ఈ పథకం కింద ప్రతి గిరిజన రైతుకు సోలార్ విద్యుత్ పంపుసెట్టు, స్ప్రింక్లర్లు, అవకాడో, పామ్ ఆయిల్ వంటి మొక్కలు ఉచితంగా అంజేస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మన జీవితాలు మెరుగవుతాయి, దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతుందన్న ఉద్దేశంతోనే పోరాటం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే సోనియాగాంధీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసిందని అన్నారు.
ధనిక రాష్ట్రాన్నిరూ. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో దించారన్నారు. పదేళ్ల కాలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు, ఏ ఒక్క దళితునికి మూడెకరాల భూమి పంపిణీ చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, ప్రతి మండలంలో కేజీ టు పీజీ పాఠశాల నెలకొల్పుతామన్న హామీని అమలు చేయలేదన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పుచేసిన కె.సి.ఆర్. ప్రభుత్వం ఒక పెద్ద పరిశ్రమ, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ వంటి ఒక భారీ ఏ ఒక్క నీటి ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేకపోయిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సొమ్మును కాజేసి దివాలా తీయించి బ్యాంకులకు రాష్ట్రాన్ని కుదువబెట్టిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రిమండలి నిరంతరం కృషి చేస్తున్నదన్నారు.
ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశాం, రూ. 22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నాం, గిరిజన నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ పథకం దేశ చరిత్రలోనే ఓ రికార్డు అన్నారు.
ఇంటికో ఉద్యోగమని హామీ ఇచ్చిన కె.సి.ఆర్. పదేళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయారు కానీ మేం అధికారంలోకి రాగానే సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఏడాదిన్నర కాలంలో 57వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసాం మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం అనే స్వయం ఉపాధి పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి గుర్తు చేశారు. 5 లక్షల మంది నిరుద్యోగులు తమ కాళ్లపై నిలబడేలా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్ల నిధులు ఖర్చు చేయనున్నామన్నారు. జూన్ 2న నిరుద్యోగ యువకులకు రాజీవ్ యువ వికాసం మంజూరు లెటర్లు అందజేస్తామన్నారు. కె.సి.ఆర్.కు. నిరుద్యోగ యువతను పట్టించుకునే తీరికే లేకపోయిందన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి వంటి ఏ పథకాన్ని ఆపలేదు రైతు భరోసా పథకానికి మరో రెండు వేలు అదనంగా జోడించి అందజేస్తున్నామని గుర్తుచేశారు. రూ.లక్ష రుణమాఫీనీ కెసిఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు చేయలేకపోయింది అదే తమ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని మొదటి ఏడాదిలోనే చేసింది.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ కోసం రూ.21,500 కోట్లు ఖర్చు చేసామని చెప్పారు. రూ.13వేల కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రతినెల 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామ ని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మించనున్నట్టు తెలిపారు. 200 యూనిట్ల లోపు వాడుకునేవారికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. అందుకు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లిస్తుందని ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో 80 నుంచి 90 శాతం మంది కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు అందిస్తూ వారి తరఫున రూ. 12,500 కోట్ల రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నదని తెలిపారు. కెసిఆర్ నీటిపారుదల ప్రాజెక్టులను గాలికి వదిలేస్తే మేము రాగానే ఆరు నెలల్లో పూర్తి అయ్యేవి, మూడు సంవత్సరాల్లో పూర్తి అయ్యేవి గుర్తించి నిధులు కేటాయించి వాటిని పూర్తి చేస్తున్నామన్నారు.



