మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిచినప్పటికీ విపక్ష బీఆర్ ఎస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో తమ బలాన్ని స్థిరంగా ప్రదర్శించాయనేది గెలిచిన వార్డులు, వొచ్చిన వోట్ల శాతాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. తుది గణాంకాల ప్రకారం కాంగ్రెస్ 1537 వార్డులు, 93 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లలో విజయం సాధించి తన బలాన్ని మరింతగా పెంచుకున్నట్టు కనిపిస్తున్నా, బీఆర్ ఎస్, బీజేపీల బలం చెక్కు చెదరలేదన్న సంగతి స్పష్టమవుతోంది. బీఆర్ ఎస్ మొత్తం 781 వార్డులు 19 మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలు గెలుచుకుంది.
ఒక్క కార్పొరేషనపై కూడా గులాబీ జెండా ఎగరలేదు. 2020 స్థానిక ఎన్ని కల్లో ఈ పార్టీ గెలుచుకున్న 112 మున్సిపాలిటీలతో పోలీస్తే ఇది చాలా తక్కువే అన్నది సత్యం. కానీ వోట్ల పరంగా గమనిస్తే పార్టీ బాగా పుంజుకున్నట్టు స్పష్టమవుతుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన వోట్లు 16.7% మాత్రమే. కానీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన వోట్లు ఏకంగా 30శాతానికి చేరడం బీఆర్ ఎస్ వేగంగా పుంజుకుంటున్న వైనాన్ని వెల్లడిస్తోంది. ముఖ్యంగా పార్టీ పనితీరు సంగారెడ్డి జిల్లాలో అద్భుతంగా ఉండటం విశేషం. మొత్తం 11 మున్సిపల్ సీట్లలో ఆరింటిని కైవసం చేసుకోవడమే ఇందుకు ఉదాహరణ.
ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 116 మున్సిపల్ స్థానల్లో 66 స్థానాల్లో మాత్రమే స్పష్టమైన మెజారిటీ సాధించింది. మరో 18 మున్సిపాలిటీలను ఇండిపెండెంట్ల సహాయంతో మాత్రమే ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. అదే 2020లో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 130 మున్సిపాలిటీల్లో 122 స్థానాలను గెలుచుకొని తన అప్రతిహత ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరిప్పుడు కాంగ్రెస్ అంతటి విజయాన్ని అందుకోలేదన్నది ఇక్కడ ప్రధానం. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కేవలం ఐదు మున్సిపాలిటీలు, 569 వార్డులు (2755 మొత్తం వార్డులు) మాత్రమే గెలుచుకోగలిగింది. మరిప్పుడు అదే విపక్షస్థానంలో ఉన్న బీఆర్ ఎస్ ప్రదర్శన నాడు కాంగ్రెస్ కంటే ఎన్నోరెట్లు మెరుగన్న సంగతి స్పష్టమవుతోంది. అంటే బీఆర్ ఎస్ క్షేత్రస్థాయిలో తన బలాన్ని కోల్పోలేదన్నది సుస్పష్టం. ప్రస్తుతం బీఆర్ ఎస్ 13 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ సాధించగా, మరో 19 మున్సిపాలిటీల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంతేకాదు మరో పది, పదిహేను మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ స్పష్టమైన ప్రభావం చూపే స్థితిలో ఉంది .
ఇక బీజేపీ విషయానికి వొస్తే 335 వార్డులను తన ఖాతాలో వేసుకుంది. నారాయణ్‌పేట్, భైంసా మున్సిపాలిటీ లతో పాటు కరీంనగర్ కార్పొరేషన్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన 34% వోట్లు ఇప్పుడు ఇరవై శాతానికి పడిపోవడం పార్టీకి వోట్ల పరంగా నష్టపోయిందనే చెప్పాలి. కాకపోతే ఒక కార్పొరేషన్‌ను, రెండు మున్సిపాలిటీలను గెలవడాన్ని పరిశీలిస్తే, ఉత్తర తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నదనే అనుకోవాలి. 2020 మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ 311 వార్డుల్లో గెలుపొందగా, తాజా ఎన్నికల్లో 336 వార్డుల్లో గెలవడం ఒక మాదిరి మెరుగైన పనితీరు ప్రదర్శనగా చెప్పవొచ్చు.
అప్పట్లో జీహెచ్ ఎంసీలో 48 సీట్లు గెలవడం ద్వారా చరిత్ర సృష్టించగా ఈసారి కరీంనగర్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకొని మరో చరిత్రను లిఖించింది. అంతేకాదు అప్పటి ఎన్నికల్లో పార్టీ వోటు షేరు 13-14% ఉండగా ఇపుడది 20%కు చేరుకోవడం మెరుగైన పార్టీ పనితీరుకు నిదర్శనం.ఈ వోట్ల శాతాన్ని పరిశీలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక సమస్యలు ప్రాధాన్యత వహిస్తాయని స్పష్టమవుతోంది. అదే లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ సమస్యలు, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి సమస్యలు కీలకంగా మారతాయన్నది ప్రజల వోటింగ్ సరళిని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాకపోతే బీజేపీ అప్పుడూ, ఇప్పుడూ మూడోస్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వొచ్చింది.
ఈ ఎన్నికల్లో 181 నుంచి 200 వరకు గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులు కింగ్‌మేకర్లుగా మారారు. 34-38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఫలితంగా కాంగ్రెస్ కేతనపల్లి, కొత్తగూడెం స్థానాల్లో సీపీఐ మద్దతు పొందింది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ స్థానాన్ని ఎంఐఎం మద్దతుతో కైవసం చేసుకుంది. అలియాబాద్, నర్సాపూర్‌లలో తన బద్ధ శత్రువు బీజేపీ మద్దతు తీసుకోవడం విశేషం. ఇక వర్థన్నపేట మున్సిపాలిటీలో ఒకే ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్-బీఆర్ ఎస్‌ల స్థానాలు సమానం కావడంతో ఎక్స్ అఫిసియో మెంబర్ల వోటుతో పార్టీ మున్సిపాలిటీని గెలుచుకుంది. మొత్తంమీద చెప్పాలంటే బీఆర్ ఎస్, బీజేపీలు తమ పురోగతిని నమోదు చేయగా, కాంగ్రెస్ సంఖ్యాపరంగా తన బలాన్ని తెలియజెప్పింది.