తెలంగాణా ప్రజాసమితి, విద్యార్థి కార్యాచరణసమితుల ఆధ్వర్యంలో సాగిన తెలంగాణా బంద్,తెలంగాణా విద్రోహదినం, కోరికల దినం, అనే ముఖ్యకార్యక్రమాలూ పికెటింగ్, ధర్నా, శాసనోల్లంఘన హర్తాళ్ వంటి ఆందోన కార్యక్రమాలు వరుసగా సాగినవి. కోరికల దినం తరువాత రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం శోక దినాలుగా పరిగణించి 13 రోజులలో ఉద్యమాన్ని నిల్పివేశారు. ఈ విరామంలో చెన్నారెడ్డి గారి నాయకత్వాన పదిమంది తెలంగాణా కాంగ్రెసు నాయకులు తెలంగాణా జిల్లాలలో పర్యటన చేసినారు. ఎన్ జి ఓ . సంఘం ఉపాధ్యాయ సంఘం ప్రత్యేక రాష్ట్రం కావాలనే నిర్ణయాలను ప్రకటించారు.
మే 22న తెలంగాణా ప్రజా సమితికి చెన్నారెడ్డిగారు అధ్యక్ష పదవి వర్గాన్ని ఏర్పాటు చేశారు. మే 26 నుండి ఆందోళనకు పిలుపు ఇచ్చారు. ప్రజా సమితికి డా॥ చెన్నారెడ్డి ఎన్నికను నిరసించిన వారు విద్యార్థి నాయకుడు శ్రీ శ్రీధర్ రెడ్డి నాయత్వాన అవినీతిపరులైన రాజకీయవాదుల స్వార్ధం వల్లనే నేటి పరిస్థితి దాపురించిందనీ, పవిత్రమైన ప్రజా సమితికి అటువంటి రాజకీయవాదుల నాయకత్వం సక్రమం కాదనీ ప్రకటించి శ్రీధర్ రెడ్డిగారినే ప్రజా సమితి అధ్యక్షులుగా నియమించారు. ఈ విధంగా ప్రజాసమితి ఇప్పుడు రెండుగా చీలిపోయిందనవచ్చు. సోషలిస్టు యూత్ ఫోరం నాయకత్వాన ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును కోరటమే గాని, పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాలు ఈ ఉద్యమాన్ని స్వార్థం కోసం వినియోగించకుండా ప్రజలు జాగ్రత్త పడాలని ప్రచారం వరంగల్లు నుండి సాగుతున్నది.
ప్రజాసమితి శ్రీధర్ రెడ్డి నాయకత్వాన ఉన్న ప్రజాసమితి రెండూ ప్రత్యేక తెలంగాణా కోసమే ఆందోళన సాగించాలంటున్నవి. మరొక వైపున తెలంగాణా కాంగ్రెస్ స్థాపన ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్జివోల సంఘ నాయకుడు శ్రీ ఆమోస్ ఒక ప్రకటనలో జూన్ 15కు ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయకపోతే విప్లవం సంభవించగలదని హెచ్చరించారు. నక్సలైట్లు స్వతంత్రపార్టీ వారూ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని అంటున్నారు.
నల్లగొండ, షంషాబాద్, సికింద్రాబాద్, గద్వాల్, చేర్యాలలో పోలీసులు కాల్పులకు నేటి వరకు 50 మందిబలి అయిపోయారు. వీరిలో ముగ్గురు జామియా ఉస్మానియా రైలు స్టేషన్ తగులబడిన సందర్భంలో మరణించారు. తెలంగాణా అంతటా దాదాపు 10 వేలమంది అరెస్టు అయ్యారు. 151 సెక్షన్ క్రింద , పిడి చట్టం క్రింద సుమారు 700 వరకు అరెస్టు చేయబడ్డారు. వీరంతా తరువాత విడుదల అయినారు) 5 కోట్లకు పై బడిన ఆర్ టీసీ బస్సులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆస్తిపాస్తులు, పది లక్షలవిలువైన ప్రయివేటు ఆస్తిపాస్తులు విధ్వంసం అయినాయి. లాఠీచార్జ్ వగైరాలలో 400 మందికి పైగా స్వల్ప గాయాలు పడ్డారు. హర్తాల్ వల్ల సుమారు 20 కోట్లవిలువ వ్యాపారం దెబ్బతిన్నది. రవాణా సౌకర్యాలు
స్తంభించినందున సుమారు 5 కోట్ల విలువ ఎగుమతి దిగుమతి వ్యాపారాలు నిల్చిపోయినవి. రోజూ లక్షవిలువ చేసే ఆర్.టి.సి. ఆదాయ భ్రష్టమైపోయింది.ప్రజాసమితి అభ్యర్థిగా ఆ సంస్థ కార్యదర్శి వెంకట్రామారెడ్డిగారు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి శాసనమండలికి ఎన్నిక అయినారు. శ్రీ ప్రతాపరెడ్డి నాయకత్వాన రాష్ట్ర సమైక్యతాసంఘం ఏర్పడి ప్రచారం చేస్తోంది తెలంగాణా అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేసిందో అంకెలు వివరాలు తెలిపే పట్టికలను ప్రభుత్వ సమాచార శాఖ విడుదల చేయటం ప్రారంభించింది. హైద్రాబాద్ మేయర్ నాయకత్వాన గోడల మీద అసభ్య వ్రాతలు చెరిపివేసే కార్యక్రమం జరిగేది.
రాష్ట్ర సమైక్యతా ప్రచారం కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీ వారునల్లగొండ జిల్లాలోనూ, సమైక్యతా సంఘం తరఫున నాగర్ కర్నూల్ లోనూ సభలు జరిపినారు. సమైక్యతా సంఘం వాలంటీర్లు డాక్టర్ చెన్నారెడ్డి ఇంటిముందు ధర్నా చేయగా డాక్టర్ చెన్నారెడ్డి పిలుపుపై పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రజాసమితి నూతన అధ్యక్షుడిగా శ్రీ చెన్నారెడ్డి ఇచ్చిన పిలుపునందుకొని 26-5- 69 నుండి జరిగిన శాసనోల్లంఘన సత్యాగ్రహాలు ప్రారంభమైనవి. తెలంగాణ అంతటా 30-5 69 నాటికి కనీసం 1000 మంది అరెస్టు చేయబడినారు. నాగర్ కర్నూల్ సభలోముఖ్యమంత్రి ప్రసంగానికి నిరసనగా రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శ్రీ కె.రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఆరుగురు కాంగ్రెస్ శాసనసభ్యులను మూడేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరించింది. (తెలంగాణ ఉద్యమం ప్రారంభమైననాటి నుండి 30-5-69 వరకు ఇది సంగ్రహ చరిత్ర.)





