పుస్తకాల పండుగ మళ్లీ ఒకసారి!

“మతం ఎంత కమ్మేసినా, మనిషి సహజీవన సంస్కృతి నిరంతరాయంగా సాగుతూనే ఉంది. పండుగలలో సామూహికత్వాన్నీ, కలయికనూ, వేడుకనూ మనుషులు ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అందుకే మతాచారాలూ సంస్కృతీ చెప్పే పండుగలతో ఏమీ సంబంధం లేకపోయినా, పుస్తకాల పండుగను పండుగ అని పిలవడమే మనుషులకు ఇష్టం. అది హైదరాబాదులో ప్రతి సంవత్సరం డిసెంబర్ చివర, మంచి చలిలో మెదడులో వేడిని రాజేసే పుస్తకాల మధ్య మనుషుల ఆత్మీయ కలయికల పండుగలా జరుగుతుంది.”

telanganardham venugopalహైదరాబాద్ కు ఏటేటా వచ్చే పండుగ ఈ శుక్రవారం నుంచి పది రోజుల పాటు మళ్లీ వస్తున్నది. ఇది అక్షరాల పండుగ. ఆలోచనల పండుగ. పుస్తకాల పండుగ. సమాచారపు పండుగ. జ్ఞానపు పండుగ. కలయికల పండుగ. వేడుకల పండుగ. కనుల పండుగ.  కాలచక్రంలో ప్రతి పండుగా ఏడాదికోసారి వస్తుంది. ఎప్పుడో మానవ సమూహాలు వేట సాధించినప్పుడో, మరొక సమూహం మీద విజయం సాధించినప్పుడో, ప్రకృతి మార్పులను గుర్తించినప్పుడో, వ్యవసాయం మొదలుపెట్టాక పంటల చక్రాన్ని గుర్తు పెట్టుకోవడానికో, ఏదో ఒక జ్ఞాపకాన్ని తలచుకోవడానికో, ఒక నాయకుడినీ, వీరుడినీ తలచుకోవడానికో, అటువంటి అనేకానేక సందర్భాల కలయికలనూ వేడుకలనూ పండుగలుగా మార్చుకున్నారు.

ప్రయాణ సౌకర్యాలేమీ లేని రోజుల్లో దూరప్రాంతాల బంధుమిత్రుల కలయిక కోసం, సామూహిక వేడుక కోసం, ఇచ్చిపుచ్చుకోవడం కోసం, వినోద విలాసాల కోసం తయారు చేసుకున్నవీ పండుగలు. ప్రధానంగా సంస్కృతి పరమైన, మానవీయమైన, సామూహికమైన పండుగలు. కాలక్రమంలో ఆ సహజ, నైసర్గిక సంస్కృతిని మింగేయడం ప్రారంభించిన ఆధిపత్య శక్తులు, వ్యవస్థీకృత మతం, మూఢనమ్మకాలు, అర్థంలేని ఆచార వ్యవహారాలు, తంతులు, రీతి రివాజులు పండుగలలో నుంచి ఆ నైసర్గిక సామూహికత్వాన్ని, అమాయకత్వాన్ని తొలగించి వాటి రూపాన్నీ, సారాన్నీ కూడా మార్చేశాయి. పండుగలోని సహజత్వం ఆ మేరకు తగ్గిపోతూ ఖర్చు,  ఆడంబరం, ప్రదర్శనాతత్వం,  ఆర్భాటం,  శ్రమ పెరుగుతూ వచ్చాయి.

మతం ఎంత కమ్మేసినా, మనిషి సహజీవన సంస్కృతి నిరంతరాయంగా సాగుతూనే ఉంది. పండుగలలో సామూహికత్వాన్నీ, కలయికనూ, వేడుకనూ మనుషులు ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అందుకే మతాచారాలూ సంస్కృతీ చెప్పే పండుగలతో ఏమీ సంబంధం లేకపోయినా, పుస్తకాల పండుగను పండుగ అని పిలవడమే మనుషులకు ఇష్టం. అది హైదరాబాదులో ప్రతి సంవత్సరం డిసెంబర్ చివర, మంచి చలిలో మెదడులో వేడిని రాజేసే పుస్తకాల మధ్య మనుషుల ఆత్మీయ కలయికల పండుగలా జరుగుతుంది. పుస్తకాల చదువరులూ కానివాళ్లూ, అనేక అభిరుచుల వాళ్లు, అనేక వయసుల వాళ్లు, అనేక భాషల వాళ్లు, అనేక ప్రాంతాల వాళ్లు, అనేక భావజాలాల వాళ్లు పది రోజుల పాటు అరమరికలు లేకుండా అక్షర ప్రపంచంలో గాలి పటాల్లా, ఇంద్రధనుస్సుల్లా, తూనీగల్లా, సీతాకోకచిలుకల్లా, పావురాళ్లలా, లేడి పిల్లల్లా విహరిస్తుంటారు.

నిజానికి హైదరాబాదుకు చిరకాలంగా, శతాబ్దాలుగా ఈ బహుభాషా, బహుళత్వ సంప్రదాయం ఉంది. కనీసం మూడు వందల ఏళ్లు ఈ నగరం విభిన్న భాషల ప్రజల రాజధానిగా ఉంది. అన్ని భాషా సంస్కృతులనూ సాహిత్యాలనూ ఆదరించింది. ఆ చారిత్ర వారసత్వానికి కొనసాగింపుగానే నగరంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద చిన్న పాయగా మొదలై ఇప్పుడు మహానదిగా, పుస్తక సముద్రంగా మారింది హైదరాబాద్ బుక్ ఫేర్. ఒకప్పుడు కొన్ని డజన్ల పుస్తకాల దుకాణాలతో, ఒక చిన్న పాఠశాల, కళాశాల ఆవరణలో ప్రారంభమయిన బుక్ ఫేర్ ఇప్పుడు మూడు వందల యాభైకి పైగా పుస్తకాల దుకాణాలకు విస్తరించింది. లక్షలాది మంది సందర్శకులు వస్తున్నారు. కోట్ల రూపాయల పుస్తకాలు అమ్మకం అవుతున్నాయి. ఒక ప్రక్రియ అని కాదు, ఒక భాష అని కాదు, ఒక రచయిత అని కాదు, ఒక ప్రచురణకర్త అని కాదు, మానవ సమాజంలో ఎంత వైవిధ్యం ఉందో పుస్తక మహోత్సవం కళ్లకు కడుతుంది. ఈ పుస్తక మహోత్సవం దానికదే ఒక అద్భుతం.

“ఒకవైపు నుంచి చూస్తే నిజంగానే తెలుగు పాఠకుల సంఖ్య ఉండవలసినంత లేదు. తెలుగు పుస్తకాలు అచ్చు కావలసినన్ని ప్రతులు అచ్చు కావడం లేదు. తెలుగు మాట్లాడే జనసంఖ్య రెండు రాష్ట్రాలలోనూ కలిపి పది కోట్లు ఉండగా, చదువూ రాతా వచ్చినవారు కనీసం ఆరున్నర కోట్లు అనుకుంటే తెలుగులో ఆరు లక్షలు కాదు, ఆరు వేలు అచ్చు అవుతున్న పుస్తకాలు లేవు. తెలుగులో దినపత్రికలన్నీ కలిపి యాబై లక్షల ప్రతులు దాటలేదు. ఏదైనా ఒక పుస్తకం గతంలో వెయ్యి, రెండు వేల కాపీలు అచ్చుపడేది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు యాబై, వంద కాపీలు కూడా అచ్చు వేస్తున్నారు. అంటే తెలుగునాట నూటికి ఒకరో, వెయ్యికి ఒకరో కాదు, లక్షకు ఒకరు కూడా పుస్తకాలు కొని చదివేవారు లేని స్థితి ఉంది.”

అయినా ఎంత సంరంభంలో కూడా కొన్ని భిన్న స్వరాలుంటాయి. ఎంత సంతోషంలో కూడా కొన్ని విషాదజ్ఞాపకాలు సెల వేస్తాయి. పుస్తకాల పండుగ గురించి ఎంత అద్భుతం అనుకున్నా, అసలు మన సమాజంలో పఠన సంస్కృతి గురించి కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఈ తరంలో పుస్తక పఠన సంస్కృతి తగ్గిపోతున్నదని గొణిగేవాళ్లు, ఫిర్యాదు చేసేవాళ్లు, విద్యార్థి యువజనుల్లో సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరిగింది గనుక, పుస్తకాలు చదవడం లేదని అనేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ ఫిర్యాదుల్లో కొన్ని నిజాలూ కొన్ని అపోహలూ.

ఒకవైపు నుంచి చూస్తే నిజంగానే తెలుగు పాఠకుల సంఖ్య ఉండవలసినంత లేదు. తెలుగు పుస్తకాలు అచ్చు కావలసినన్ని ప్రతులు అచ్చు కావడం లేదు. తెలుగు మాట్లాడే జనసంఖ్య రెండు రాష్ట్రాలలోనూ కలిపి పది కోట్లు ఉండగా, చదువూ రాతా వచ్చినవారు కనీసం ఆరున్నర కోట్లు అనుకుంటే తెలుగులో ఆరు లక్షలు కాదు, ఆరు వేలు అచ్చు అవుతున్న పుస్తకాలు లేవు. తెలుగులో దినపత్రికలన్నీ కలిపి యాబై లక్షల ప్రతులు దాటలేదు. ఏదైనా ఒక పుస్తకం గతంలో వెయ్యి, రెండు వేల కాపీలు అచ్చుపడేది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు యాబై, వంద కాపీలు కూడా అచ్చు వేస్తున్నారు. అంటే తెలుగునాట నూటికి ఒకరో, వెయ్యికి ఒకరో కాదు, లక్షకు ఒకరు కూడా పుస్తకాలు కొని చదివేవారు లేని స్థితి ఉంది.

ఇది తీవ్రంగా విచారించవలసిన, చర్చించవలసిన విషయమే. అయితే ఈ బొమ్మకు ఒక బొరుసు కూడా ఉంది. ఇంతగా పుస్తకాలు కొనని, చదవని జాతిలో కూడా ఏడాదికొకసారి హైదరాబాదులో జరిగే పుస్తకాల పండుగలో రోజుకు సగటున కనీసం లక్ష మంది సందర్శకులు పుస్తకాలు చూడడానికి వస్తున్నారు. కచ్చితమైన లెక్కలు చెప్పలేం గాని పది రోజులు గడిచేసరికి కనీసం కొన్ని డజన్ల కోట్ల రూపాయల పుస్తకాల అమ్మకాలు జరుగుతున్నాయి.

దీనికే గుర్తించవలసిన మరొక కోణం కూడా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి పెద్ద ప్రచురణ సంస్థలు కనీసం ఇరవై ఉన్నాయి. మధ్యరకం ప్రచురణ సంస్థలు కనీసం వంద ఉన్నాయి. కొన్ని వందల చిన్న ప్రచురణ సంస్థలతో పాటు, వ్యక్తిగతంగా తమ పుస్తకాలు తామే అచ్చు వేసుకునేవారు ఎందరో ఉన్నారు. వీళ్లందరూ కలిసి సంవత్సరానికి కనీసం వెయ్యి పుస్తకాలు (ఒక్కొక్కటి వంద కాపీల నుంచి రెండు మూడు వేల కాపీల దాకా) అచ్చు వేస్తున్నారు. అంటే తెలుగు పుస్తకాల వ్యాపార మార్కెట్ లోకి ప్రతి రోజూ కనీసం మూడు పుస్తకాలు ప్రవేశిస్తున్నాయి. ఒక్క తెలుగులోనే పుస్తక ప్రచురణ రంగం మీద సాలీనా మూడు కోట్ల రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. ఇందులో బంధుమిత్రులకు, సహరచయితలకు ఉచితంగా పంచుకునేవారు ఒక ఇరవై శాతం ఉంటారనుకున్నా, మిగిలిన పెట్టుబడి తప్పనిసరిగా ఫలితం ఆశిస్తున్న పెట్టుబడే. ఫలితం రాకుండా, కనీసం పెట్టిన సొమ్ము తిరిగి రాకుండా ఉంటే ఆ పెట్టుబడి ప్రవాహం, ఆ ప్రచురణలు రోజురోజుకూ ఇంతగా పెరుగుతూ ఉండేవి కావు.

 వాస్తవంగా పుస్తక ప్రచురణ రంగంలో పెట్టుబడి ఉంది, పుస్తక ప్రచురణ రంగం విస్తరిస్తున్నది, అంటే పుస్తకాల అమ్మకాలు – కొనుగోళ్లు జరుగుతున్నాయి. గత రెండు మూడు సంవత్సరాల్లో తెలుగులో కనీసం ఇరవై కొత్త ప్రచురణ సంస్థలు పుట్టుకొచ్చాయి. కనీసం యాబై మంది బహుళ జనాదరణ పొందిన పుస్తకాల రచయితలు – ఎక్కువమంది ఇరవైల్లో ఉన్నవారు, ఇప్పుడిప్పుడే జీవితంలో ప్రవేశిస్తున్నవారు, ఇంగ్లిష్ మీడియం చదువులూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలూ చేస్తున్నవారు – వచ్చారు. (ఈ కొత్త తరం రచయితలూ ప్రచురణకర్తలూ పుస్తకాల మార్కెటింగ్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శ ఉన్నప్పటికీ, అది వరదనీటితో పాటు వచ్చే తెట్టెగా గుర్తించి వదిలేయవచ్చు).   

అంటే ‘పుస్తకాలు చదవడం లేదు’, ‘తీరిక దొరకడం లేదు’, ‘పుస్తకాలు ఎవరు చదువుతున్నారు’ లాంటి వ్యాఖ్యలన్నీ మొత్తం దృశ్యంలో ఒక భాగాన్ని మాత్రమే చూస్తున్నాయి. వాస్తవంగా పుస్తక ప్రచురణ రంగంలో పెట్టుబడి ఉంది, పుస్తక ప్రచురణ రంగం విస్తరిస్తున్నది, అంటే పుస్తకాల అమ్మకాలు – కొనుగోళ్లు జరుగుతున్నాయి. గత రెండు మూడు సంవత్సరాల్లో తెలుగులో కనీసం ఇరవై కొత్త ప్రచురణ సంస్థలు పుట్టుకొచ్చాయి. కనీసం యాబై మంది బహుళ జనాదరణ పొందిన పుస్తకాల రచయితలు – ఎక్కువమంది ఇరవైల్లో ఉన్నవారు, ఇప్పుడిప్పుడే జీవితంలో ప్రవేశిస్తున్నవారు, ఇంగ్లిష్ మీడియం చదువులూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలూ చేస్తున్నవారు – వచ్చారు. (ఈ కొత్త తరం రచయితలూ ప్రచురణకర్తలూ పుస్తకాల మార్కెటింగ్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శ ఉన్నప్పటికీ, అది వరదనీటితో పాటు వచ్చే తెట్టెగా గుర్తించి వదిలేయవచ్చు).

కాకపోతే ఫిర్యాదుదారులు ఏ పుస్తకాలు అమ్మకం కావాలనుకుంటున్నారో, ఏ పుస్తకాలు చదవాలని అనుకుంటున్నారో వాటికి గిరాకీ తగ్గిపోయి ఉండవచ్చు. ఇవాళ పుస్తక ప్రచురణ రంగం అత్యంత విశాలంగా వ్యాపించింది. స్వతంత్రంగా ప్రక్రియలు, వస్తువులు, విషయాలు, రచనా శైలులు, ఇంతకాలం నిరక్షరాస్యులుగా, చదువుకు దూరంగా ఉండిన వర్గాల రచయితలు, పాఠకులు, ఇతర భాషల నుంచి అనువాదాలు, శాస్త్ర సాంకేతిక రచనలు, సైద్ధాంతిక రచనలు విస్తారంగా వెలువడుతున్నాయి. ఒకప్పటి చదువరుల ముందు ఎంపికకు చాలా చిన్న బుట్ట ఉండేది. అందులోకి సరఫరా చాలా తక్కువగా ఉండేది. ఆ బుట్ట ఎప్పుడూ ఖాళీ అవుతున్నట్టు, చాలా గిరాకీ ఉన్నట్టు అనిపించేది. కాని ఇప్పుడు పరిశీలకులు గుర్తించలేనంత విస్తారంగా బుట్టలు పెరిగిపోయాయి, వాటిలో సరఫరా పెరిగింది. ఆ బుట్టలు ఖాళీ అవుతున్నాయో లేదో కూడా మనకు తెలియదు.

ఈ దృశ్యానికే మరొక కోణం కూడా ఉంది. పుస్తక పఠన సంస్కృతి వెనుకడుగు పట్టడానికి అందరికీ వెంటనే కనబడే కారణాలు సెల్ ఫోన్, ఒటిటితో సహా అనేక ఛానళ్ల టెలివిజన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆధునిక జీవితంలో మనిషి సమయాన్ని తినేసే అనేక వ్యాపకాలు, ముఖ్యంగా ప్రయాణ సమయం. అందువల్ల చదవడానికి తీరిక ఎక్కడుంటున్నది అనే ప్రశ్న చాలా తరచుగా వినబడుతుంది. కాని అమెరికాలో, యూరప్ లో మనకన్నా ఎక్కువ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరిగి, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నప్పటికీ, పుస్తక ప్రచురణ రంగం నానాటికీ పురోగమిస్తూనే ఉన్నది. అమెరికాలో, యూరపియన్ దేశాలలో గ్రంథాలయాలు విపరీతంగా పెరుగుతున్నాయి, వ్యక్తిగత పుస్తకాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పబ్లిక్ రవాణా వాహనాల్లో ఎక్కడ చూసినా వ్యక్తులు పుస్తకాలు చదువుతూ కనబడతారు. జీవితంలోకి చొచ్చుకు వచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వ్యాపకాలు, ప్రయాణ సమయం వంటి ఏ కారణాన్ని బట్టి చూసినా, అమెరికా, యూరప్ లలో మనకన్నా చదివే సమయం తగ్గిపోయి ఉండాలి. కాని వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. అంటే మన సమాజంలో చదివే సంస్కృతి తగ్గడానికి, లేదా పెరగవలసినంతగా పెరగకపోవడానికి ఇతరేతర కారణాలున్నాయని గుర్తించి, వాటిని అన్వేషించి పరిష్కరించవలసి ఉంది. తప్పనిసరిగా పఠన సంస్కృతి ఇప్పుడున్నదానికన్న ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంగీకరించక తప్పదు.

పుస్తకాల పండుగ ఇప్పటికే పుస్తకాల పట్ల సమాజంలో ఉన్న ఆదరణకు ఒక సూచికగా ఉంది. ఇంకొక్క అడుగు ముందుకు వేసి సమాజంలో పుస్తక పఠన సంస్కృతిని పెంపొందించడానికి, విస్తరింపజేయడానికి ప్రయత్నాలు చేయాలి. కుటుంబాలలో, సమూహాలలో, సమాజంలో పఠన సంస్కృతి పెంచడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలి.  దృశ్య శ్రవణ రూపాలు వాటి రంగుల వల్ల, చలన స్వభావం వల్ల ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, అవి మానవ ఆలోచనాశక్తిని గిడసబారుస్తాయని, సర్వస్వమూ తామే కలిపి అందించి, ఆలోచనకు, సృజనకు పరిమితులు విధిస్తాయని, పుస్తకం, అచ్చు అక్షరాలు మనిషి ఊహకు, కల్పనకు, సృజనకు అంతకంతకూ ఎక్కువ అవకాశం ఇచ్చి, మనిషిని ఉన్నతీకరిస్తాయని పుస్తక స్వభావం గురించి ప్రచారం చేయాలి. స్థానిక స్వపరిపాలన సంస్థలన్నీ గ్రంథాలయ సెస్సు పేరుతో ప్రజల దగ్గరి నుంచి వసూలు చేస్తున్న వందల కోట్ల రూపాయల నిధుల్ని నిజంగా గ్రంథాలయాల మీద, పుస్తకాల కొనుగోళ్ల మీద ఖర్చుపెట్టడం లేదనే వాస్తవాన్ని చూపి గ్రంథాలయాల పునరుద్ధరణ కోసం ప్రయత్నించాలి. పాఠశాల గ్రంథాలయాల నుంచి ప్రజా గ్రంథాలయాల దాకా విస్తారంగా గ్రంథాలయాలు నెలకొనే స్థితి కల్పిస్తే, సమాజంలో పఠన సంస్కృతికి పెద్ద ఊతం దొరుకుతుంది.

అక్షరం అంటేనే నాశనం లేనిది అని అర్థం. అక్షరాలు నిండిన పుస్తకానికి కూడా నాశనం లేదు. ఇటువంటి పుస్తకాల పండుగలు ఆ విశ్వాసాన్ని మరింత పెంచుతాయి, పెంచాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *