తెలంగాణలో బ్లాక్ చెయిన్ సిటీ…

  • క్వాంటం కంప్యూటింగ్ లో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’
  • త్వరలో ఏఐ సిటీకి శంకుస్థాపన
  • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఎక్కడ.. ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. శుక్రవారం మాదాపూర్‌లో డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగంలో సుమారు 1800 మందికి ఉపాధి కల్పిస్తున్న ‘సెంటిలియన్ నెట్ వర్క్స్ అండ్ హెచ్ సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నూతన క్యాంపస్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ‘కొత్త సాంకేతికల ఆవిష్కరణలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిచేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామ‌ని తెలిపారు.

ఆయా రంగాల్లో తెలంగాణ యువతకు స్కిల్స్ యూనివర్సిటీ, పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని,  ఫ్యూచర్ సిటీలో నిర్మించ తలపెట్టిన ఏఐ యూనివర్సిటీకి త్వరలో శంకుస్థాపన చేయబోతున్నామ‌ని మంత్రి తెలిపారు.  ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించబోతున్నాం’ అని వివరించారు. ‘దేశంలో ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్ ను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉంది.

ఆ హబ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. ఇక్కడి అనుకూలతలను ప్రత్యేకంగా వివరించాం. ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం ’ అని పేర్కొన్నారు. ‘పౌర సేవలను చివరి వ్యక్తి వరకు సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏఐ, బ్లాక్ చెయిన్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను విరివిగా వినియోగించుకోబోతున్నాం. ఇటీవలి కాలంలో కీలకంగా మారిన డ్రోన్ టెక్నాలజీపై తెలంగాణ యువతకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి.. వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కసరత్తు చేస్తున్నాం’ అని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *