రాష్ట్రంలో దూషణ రాజకీయాలు!!

ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాల్లో విచ్చలవిడిగా అన్‌పార్లమెంటరీ భాషను ప్రయోగించడం బాగా కనిపిస్తోంది. ఇంత దారుణంగా వ్యక్తి గత దుర్భాషలకు దిగడం చూస్తుంటే ఇక ముందు తెలంగాణ రాజకీయాలు ఇంకెంత దారుణంగా మారుతాయోనన్న భయం వేస్తోంది. ముఖ్యంగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి ఎన్నికల ర్యాలీలు, బహిరంగసభల్లో తరచుగా సహనాన్ని కోల్పోతూ అనాగరిక భాషను ప్రయోగిస్తుండటం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. పాలనాపరమైన లేదా విధానపరమైన విమర్శల స్థానాన్ని వ్యక్తిగత దూషణలు ఆక్రమించడం రాజకీయాల ప్రతిష్టను దెబ్బతీస్తోంది. శాసనసభలో ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఆవేశం హద్దులు దాటిన స్థితిలో ప్రత్యర్థులపై ముఖ్యంగా బీఆరఎస్ నాయకులపై తిట్లపురాణాన్ని లంకించుకోవడం సభ్య తెలంగాణ సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నది.

పార్లమెంట్‌లో ఇటీవల  వందేమాతరం రచించి 150 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా జరిగిన చర్చ సందర్భంగా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా వాడ్రా  మాట్లాడుతూ, అవకాశమొచ్చినప్పుడల్లా నెహ్రూ హాయాంలో జరిగాయంటూ తప్పుల‌ను ఎత్తిచూపడం మాని, ఒకేసారి అటువంటి తప్పుల జాబితాను వెల్లడించి చర్చించి అంతటితో దానికి ముగింపు పలకాలన్న సంగతి గుర్తుకు తెచ్చుకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ నాయకురాలు చెప్పిన మాదిరిగానే, బీఆరఎస్‌పై ఎన్ని ఆరోపణలు చేయదలచుకున్నారో అన్నింటినీ ఒకేసారి చెప్పి ఎదుటివారికి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వడం ద్వారా అంతటితో ఈ తిట్ల పురాణానికి ఫుల్‌స్టాప్ పెట్టాలి. లేకపోతే అవసరమనుకున్నప్పుడల్లా చెప్పిందే చెప్పి, రొటీన్ ఆరోపణలు చేస్తూ, సహనాన్ని కోల్పోయి వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది .

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కూడా కాకలు తీరిన డా .వై.ఎస్. రాజశేఖ ర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు వంటి నాయకుల మధ్య రాజకీయ వైరం ఎంతటి తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ వారెప్పుడూ భాషా ప్రయోగంలో హద్దులు దాటలేదు. విధానపరంగానే గౌరవ ప్రదమైన భాషా ప్రయోగంతో పరస్పరం విమర్శించుకున్నారు. ఎప్పుడూ భాషా ప్రయోగంలో నైతికత అనే ‘లక్ష్మణ రేఖ ’ దాటలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో సద్భాష, దుర్భాష ల మధ్య ‘హద్దురేఖ’ చెరిగిపోయింది. ఇప్పుడు ‘వీధిభాషా’ ప్రయోగం ఎప్పటి కప్పుడు కొత్త పుంతలు తొక్కుతుండటం తెలంగాణ సమాజాన్ని నివ్వెర పరుస్తోంది. ‘లాగూల్లో తొండలు వొదుల్తా’, ‘నాలుక కోస్తా’, ‘గుడ్లు పీకి గోటీలు ఆడతా’ వంటి పదజాలం గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ రేవంత్ రెడ్డి  నోటివెంట వెలువడిన సందర్భాలు లేవు. ఆయన ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌వును కేంద్రంగా చేసుకొని తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు వరసలో నిలిచిన  కేసీఆర్‌కు కనీస మర్యాద ఇవ్వకుండా ‘నీచుడు’ వంటి పద ప్రయోగం చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగినది కాదు. ఒకవేళ కేసీఆర్ తెలంగాణ సాధించిఉండకపోతే, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా? అంటూ కేటీఆర్, హరీష్‌రావులు ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ కొనసాగి ఉన్నట్లయితే తెలంగాణ నాయకుడికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కేదా? ఒక్కసారి ఆలోచించుకుంటే వాస్తవం బోధపడుతుంది.

నిజంగా తెలంగాణపై అభిమానముంటే ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి, కాళేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ అంటూ తన రాజకీయ ప్రయోజనం కోసం ఇంతకాలం ప్రత్యర్థులపై  విమర్శల దాడికి దాన్నొక అస్త్రంగా ఉపయోగించకుండా, లక్షల ఎకరాలు సాగుచేసే రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మరమ్మతులు చేయించి తర్వాత బీఆర్‌ఎస్ తప్పిదాలను సరైన రీతిలో విమర్శించినట్లయితే ఆయ‌న‌ గౌరవం ఇనుమడించేది. కానీ అది జరగకపోగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి   కేసీఆర్ లక్ష్యంగా తన స్థాయికి తగని పదజాలం ప్రయోగించడం సముచిత మనిపించుకోదు. కేసీఆర్‌లో ఎన్ని లోపాలున్నా, తెలంగాణ సాధించిన నాయకుడెవరంటే ఆయన పేరే చెబుతారు తప్ప మరొకరి పేరు చెప్పబోరు. ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రమే ఉన్నట్లయితే ప్రస్తుతం తెలంగాణలో కీలక రాజకీయాలు నడుపుతున్న వారంతా రెండో స్థానానికే పరిమితం కావాల్సివచ్చేదన్నది అక్షరసత్యం.

ముఖ్యమంత్రి భాషాప్రయోగాన్ని చూసి విపక్ష బీఆర్‌ఎస్ నాయకులు హరీష్‌రావు, కేటీఆర్‌లు కూడా రెచ్చిపోయి అదేస్థాయి భాషాప్రయోగం చేయడం, రేవంత్ వాడిన పదజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి  తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ ఇటువంటి తిట్ల దండకానికి తెరలేపాడని ప్రచారం మొదలుపెట్టారు. తప్పులు చేసినవారిని ఒక‌రు శిక్షించనక్కర లేదు! కాలమే ఆ పనిచేస్తుంది! రాజకీయాల్లో ఒకస్థాయికి ఎదిగినవారు తమ సామర్థ్యాన్ని చేసే పనుల ద్వారా వెల్లడిస్తారు. అంతేకాని ఎంతసేపూ ఎదుటి వారి తప్పులను ఎత్తిచూపడం ద్వారా కాదు! ఇది అందరు రాజకీయ నాయకులకూ వర్తిస్తుంది! హితం చేసినవారిని సమాజం ఎన్నడూ మరువదు! ఎప్పటికప్పుడు సహనం కోల్పోయి ఎదుటివారిపై బురద చల్లడం ద్వారా, తన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే యత్నాలు ఎప్పుడూ సత్ఫలితాలివ్వవు.

ఎవరి లోపాలు వారికుంటాయి కనుక, ఎదుటి వారిపై హద్దులు దాటిన అసహనంతో దుర్భాషాలాడటం అధికార, విపక్ష నేతలకు ఎంత మాత్రం తగదు! రాష్ట్ర రాజకీయాలు విషపూరితమవుతున్నాయని 2025 జులైలో తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం సహేతుకం! రాజకీయాలు ఇంతటి స్థాయికి దిగజారడానికి కారణం పోటీ పెరిగిపోవడమా? అభద్రతాభావమా? తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నమా? లేక రాజనీతిజ్ఞత స్థాయి తగ్గడమా? అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *