రాహుల్‌గాంధీపై బండి సంజయ్ వ్యాఖ్యలు అవమానకరం
పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిమతమని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కుల గణన కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా బీసీ కులగణన కోసం పట్టుబడుతున్నారు. కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బిజెపి నేతలు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. త్యాగాల కుటుంబం నుంచి వొచ్చిన రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడని, 30 సంవత్సరాలుగా ఎలాంటి మంత్రి పదవుల్లో లేకుండా దేశం కోసం పని చేస్తున్నారని చెప్పారు. అందుకే గ్రామ స్థాయి నుంచి ప్రధాని వరకు.. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కించపరిచే యత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బిజెపి విధానం.. విద్వేషం, విధ్వంసమేనని మండిపడ్డారు. కానీ రాహుల్ గాంధీ ప్రేమ, శాంతి, సమానత్వం కోసం పని చేస్తున్నారని తెలిపారు. బీజేపీ విద్వేష విద్వంసాలు కావాలో..కాంగ్రెస్ శాంతి సమానత్వం అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.
కుల గణన అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే రాహుల్ గాంధీ మతంపై చర్చ చేస్తున్నారని, పదేళ్లుగా దేశం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం బిజెపి చేసిందేమీలేదని, విభజన రాజకీయాలతో పదవులు పొందటం బిజెపి నేతల నైజమని, రాహుల్ గాంధీ పదవుల కోసం పాకులాడే మనిషి కాదన్నారు. త్యాగాల వారసత్వంతో సమాజ అభివృద్ధి కోసం, సమసమాజ లక్ష్యం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని, అదానీ ఆస్తుల పెంపకం కోసం రాహుల్ గాంధీ పనిచేయటం లేదన్నారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అంతరాలు లేని సమాజమే రాహుల్ గాంధీ లక్ష్యమన్నారు. బిజెపి విద్వేష రాజకీయాలతో సమాజం వెనుకబాటుకు లోనవుతుందని, తొలి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు చేపట్టిన సంస్కరణలే ఈరోజు దేశాన్ని నిలబెడుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ మీద ప్రమాణం చేసి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని, అణరిన వర్గాలు, పేద ప్రజలంటే బిజెపికి పట్టదని, ప్రజలంతా బిజెపి నైజాన్ని గ్రహించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.



