“హైదరాబాద్ కున్న వెయ్యెళ్ళు చరిత్ర, తెలంగాణా సంస్కృతి కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం నాలుగు వందల ఇండెక్స్ దాటింది. కనుక వాయు కాలుష్యం ఈ చర్యతో మరింత పెరిగే ప్రమాదం ఉంది. యువత ఉద్యోగాలు, రిజర్వేషన్లు పై పెట్టుకున్న ఆశలు సన్నగిల్లే అవకాశం ఉంది.కేంద్రబలగాల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలసి ఉంటుంది.ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, రిటైర్మెంట్ బకాయిలు గానీ కేంద్రం చెల్లించే అవకాశం లేదు.3లక్షలమంది తెలంగాణా ఉద్యోగులు, 5లక్షలమంది ప్రభుత్వ పెన్షన్ దారుల భవితవ్యం గందరగోళం లో పడుతుంది.ఇప్పటికీ హైదరాబాద్ తలసరి ఆదాయం నెలకు 50వేల రూపాయలు ఉంది. అది గణనీయంగా తగ్గిపోయో ప్రమాదం ఉంది. అన్నింటికి మించి తెలంగాణా ప్రజలజీవన ప్రమాణాలు సన్నగిల్లే అవకాశం ఉంది. తెచ్చుకున్న తెలంగాణా అర్థంలేనిది అవుతుంది..”

(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త)మొబైల్ :9441864414.ఇమెయిల్:thirmal.1960@gmail.com
తెలంగాణా అస్థిత్వం కు మళ్ళీ ప్రమాదం పొంచి ఉందా? హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం ద్వారా తెలంగాణా తలతీసి మోండెం మిగుల్చుతారా? భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ మీద పట్టుకు ఇదే తదుపరి వ్యూహం అమలు చేయబోతుందా? ఇత్యాది ప్రశ్నలు ఇవాళ తెలంగాణా మేధావి వర్గాన్ని వెన్నాడుతున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో దేశభద్రత దృష్ట్యా మన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మెన్ డా.బిఆర్ అంబేడ్కర్ ఈ ప్రతిపాదన తెచ్చినా,ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదన తిరష్కరించింది.ఇప్పటికే రెండు రాజధానులు నిర్వహిస్తున్న జాబితా లో నార్వే, పాకిస్తాన్,హాలెండ్, బొలీవియా, శ్రీలంక, మలేషియా, మైన్మార్ లాంటి దేశాలు ఉన్నాయి.అయితే వీటి రాజధాని నగరాలు ఏవీ యుటీగా లేవు.భారతదేశం రాజధాని గా దిల్లీ అంత సురక్షితం కాదు, దక్కన్ పీఠభూమి మద్యలో ఉన్న హైదరాబాద్ ను సురక్షితమైన రెండవ రాజధానిగా ప్రకటించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి..మళ్ళీతెలంగాణా రాష్ట్రం ఏర్పడే ముందు జరిగిన చర్చల్లో ఈఅంశం ఊపిరిపోసుకొంది.
తెలంగాణా ఏర్పాటుకు ముందు యుపిఏ ప్రభుత్వం ముందు అప్పటి కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఈఅంశం లేవనెత్తింది.అప్పటి తెలంగాణా మేధావులు అనబడే వారు కొందరు దీన్ని సమర్థించారు. కానీ ఆనాటి ఉద్యమపార్టీలు తలలేని తెలంగాణా మాకొద్దని తిరస్కరించారు.సియాసత్ ఉర్దూ పత్రిక ఎడిటర్ జహీర్ ఆలీఖాన్,గద్దర్, బూర్గుల విజయ్, అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారు సోనియా గాంధీ వద్ద జరిపిన సంప్రదింపులతో ఆ విషయం మధ్యే మార్గంగా పరిష్కరించబడింది.విడిపోయిన ఉభయ తెలుగు రాష్ట్రాలకు పదేళ్ళ పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేశారు.మళ్ళీ ఈ అనుమానాలు ఎందుకు పొడ చూపుతున్నాయి.అంటే, తెలుగు రాష్ట్రాల ఉభయ రాజధాని కాలపరిమితి ముగియడం, దిల్లీలో పెరుగుతున్న కాలుష్యం,మార్వాడీ గోబ్యాక్ లాంటి ఉద్యమాలు,రియల్ ఎస్టేట్ వర్గాల వత్తిడితోపాటు, ముస్లిం ఉగ్రవాద మూలాలు హైదరాబాద్ లో పెరుగుతున్నాయన్న ఆరోపణలు, తాజాగా అర్బన్ నక్సల్స్ ప్రస్తావన తదితర అనుకూల అంశాలు కేంద్రం చేతిలో అస్త్రాలుగా ఉంటున్నాయని చెప్పవచ్చును.
వీటన్నింటికీ మించి బిజేపి రాజకీయ వ్యూహం అంతుపట్టని దేమీ కాదు పొగ రాకుండానే నిప్పు పుట్టించే రాజకీయ వ్యూహాలను ఆకస్మికంగా తెరమీదకు తెచ్చి ప్రజలు తేరుకునే లోగానే పని పూర్తి చేస్తుంది.మూడు పార్లమెంటు స్థానాలు హైదరాబాద్, పరిసరాల్లో ఆపార్టీ గెలుపు సాధించినప్పటికీ బిజెపి ప్రత్యామ్నాయ ప్రధాన రాజకీయ శక్తిగా తెలంగాణాలో ఎదగలేకపోయింది.ఎన్ని ప్రయత్నాలు చేసినా మజ్లీస్ ప్రాబల్యం ఆపార్టీ తగ్గించ లేకపోగా, హైదరాబాద్ నుండే దేశం అంతా మజ్లీస్ విస్తరిస్తోంది.ఇటీవల జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ బిఆర్ యస్ వోటుబ్యాంకు పట్టణంలో స్థిరంగా ఉందని అర్థం అయ్యింది.ఇలాంటి స్థితి లో హైదరాబాద్ పైన కేంద్రం పట్టుబిగించి పెత్తనం చేయాలంటే, హైదరాబాద్ ను దేశం రెండవ రాజధానిగా ప్రకటించి యుటీ చేయడం రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎన్నుకునే అవకాశం లేకపోలేదు. బిజెపి రాజకీయ వ్యూహం తెలిసిన ఎవరైనా అనుమానించేదే! ఎందుకంటే ప్రక్కన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నాం. కనీస బలం లేకపోయినా నయానో,భయానో రెండు రాజకీయ పక్షాలను లొంగదీసుకొని రాజకీయ ఊతకర్రలుగా చేసుకొని కేంద్రం లో అత్తెసరు మద్దతుతో బీజేపీ అధికారం నిలబెట్టుకొంది. వారిని సంతృప్తి పరచడం కూడా ఓ రాజకీయ కళనే?
ఇవన్నీ ఒక ఎత్తయితే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ కు ఇస్తున్న ప్రాధాన్యత, రాజకీయ చర్యలు అందుకు అనుగుణంగా గానే ఉన్నాయి.ఇటీవలనే 27మునిషిపాలిటీలు జిహెచ్ఎంసి పరిధిలోనికి తేవడం, ఫ్యూచర్ సిటీ ఆలోచన,సౌతర్న్ మిలిటరీ కమాండ్ సెంటర్ హైదరాబాద్ కు మార్చాలని కోరడం,మూడువేల ఎకరాలు శామీర్ పేట వద్ద భూములు సేకరణ,ఇటీవల మిలిటరీ అవసరాలకోసం అదిలాబాద్ జిల్లాలో 300ఎకరాల విమానాశ్రయం ప్రకటించడం ఇవన్నీ తదానుకూల ఆలోచనలు రేకెత్తించే అంశాలే! ఇకపోతే, కేంద్రం చర్యలు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయి. వికారాబాద్ లో మూడువేల ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు, హైదరాబాద్ -విజయవాడ హైవే ను పోర్ లైన్ నుండి సిక్స్ లైన్ రహదారిగా మార్చడం , సుప్రీంకోర్టు బెంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం,రేడియల్ రోడ్లు నిర్మాణం ఇత్యాది అంశాలతో పాటు, స్థానిక బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వారు చార్మినార్ పై కాషాయ జెండా ఎగురవేస్తాం లాంటి మాటల ఆంతర్యం కూడా అదే కావచ్చుననే భావన నెలకొంటుంది.
దక్షిణాదిన నాగపూర్, బెంగళూరు లాంటి పట్టణాలు ఉన్నా వాటిపట్ల కేంద్రానికి అంత వాతావరణ,రవాణా సానుకూలత కనిపించడంలేదు. ఇప్పటికిప్పుడు చట్టబద్దమైన చర్యలు అందుకు అనుకూలంగా లేక పోయినా కేంద్రంలో మూడవసారి అధికారం లోకి వచ్చిన బిజెపి ఆదిశగా అడుగులు వేసే అవకాశాలు తోసిపుచ్చలేము..!ఒక ప్రాంతం యుటీ చేయాలి, రాజధాని గా ప్రకటించాలంటే, ఆర్టికల్ 3,4ప్రకారం రాజ్యాంగ చట్టం సవరణ, పార్లమెంటు లో బిల్లు పెట్టడం, రాష్ట్రపతి ఆమోదం పొందగలిగిన అవకాశం ఉన్నప్పటికీ,4వషెడ్యూల్ ననుసరించి రాజ్యసభ ఆమోదం ఇప్పటికిప్పుడు బిజెపికి సాధ్యం కాకపోవచ్చును. పశ్చిమబెంగాల్, తమిళనాడు లో ఆపార్టీ విజయం సాధించడం అనే లక్ష్యం వెనుక రాజ్యసభ బలం పెంచుకోవడం కూడా ఒక అంశంగా ఉంటుంది.370(డి) ప్రకారం రాజ్యాంగ సవరణ, గెజిట్ ప్రకటన చేయాలంటే ఈ రాజకీయ, రాజ్యాంగ తంతు జరగాల్సిన ఉంది. లేదా ఇప్పటికిప్పుడు జరగాలంటే రాష్ట్ర పరిపాలన విధింపు, రాష్ట్ర పతి ఆర్డినెన్సు అనే మరో దగ్గర మార్గం ఉండనే ఉంది, వేగంగా అభివృద్ధితోపాటు కాలుష్యం అభివృద్ధి అవుతున్న హైదరాబాద్ కు ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం, అమరావతి,రాంచి లాంటి సముద్ర తీర పట్టణాలు సైతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పరిశీలన చేయవచ్చును.
బిజెపి వ్యూహాత్మకంగా హైదరాబాద్ ను యుటీ చేయడానికి ఎంచుకోవడం వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉండి తీరుతుంది. ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణా తలలేని మోండెంగా మిగులు తుంది.దిల్లీలో కేజ్రీవాల్ కు ఎదురైన పాలనాపరమైన సమస్యలు ఇక్కడా పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదు. లెప్టినెంట్ గవర్నర్ పాత్ర పరిపాలనా జోక్యంకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ కున్న వెయ్యెళ్ళు చరిత్ర, తెలంగాణా సంస్కృతి కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం నాలుగు వందల ఇండెక్స్ దాటింది. కనుక వాయు కాలుష్యం ఈ చర్యతో మరింత పెరిగే ప్రమాదం ఉంది. యువత ఉద్యోగాలు, రిజర్వేషన్లు పై పెట్టుకున్న ఆశలు సన్నగిల్లే అవకాశం ఉంది.కేంద్రబలగాల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలసి ఉంటుంది.ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, రిటైర్మెంట్ బకాయిలు గానీ కేంద్రం చెల్లించే అవకాశం లేదు.3లక్షలమంది తెలంగాణా ఉద్యోగులు, 5లక్షలమంది ప్రభుత్వ పెన్షన్ దారులభవితవ్యం గందరగోళం లో పడుతుంది.
ఇప్పటికీ హైదరాబాద్ తలసరి ఆదాయం నెలకు 50వేల రూపాయలు ఉంది.అది గణనీయంగా తగ్గిపోయో అవకాశం ఉంది. అన్నింటికి మించి తెలంగాణా ప్రజలజీవన ప్రమాణాలు సన్నగిల్లే ప్రమాదం ఉంది. తెచ్చుకున్న తెలంగాణా అర్థంలేనిది అవుతుంది.ఇక పరమార్థం పెరుమాళ్ కే ఎరుక?కనుక తెలంగాణా వాదులు ఈవిషయం లో మోల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఈ విషయం లో కొందరు మేధావులు రౌండ్ టేబుల్ సమావేశాలు లాంటివి జరిపారు.హైదరాబాద్ యుటి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కు సైతం సన్నద్దం అవుతున్నారు. ఓ కీలకమైన నిర్ణయం విషయం లో తెలంగాణ ప్రజల అభిప్రాయం కూడా కేంద్ర ప్రభుత్వం గమనంలో కి తీసుకోవాలసి ఉంటుంది. అవసరం అయితే ప్లెబిసైట్ కూడా నిర్వహించాలసి ఉంటుంది. ప్రొ.వినాయకరెడ్డి లాంటి డెమోక్రటిక్ ఫోరమ్ నేతలు ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేశారు. మళ్ళీ తెలంగాణా అభివృద్ధి కోరుకునే రాజకీయ శక్తుల పునరేకీకరణతో ఈ విషయంలో ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి,తెలంగాణాపునాదులు కాపాడుకుందాం.
జై తెలంగాణా..జైజై తెలంగాణా..!





సత్యాన్ని సమాధి చేసే కుట్రలు