అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉంది. గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలా… బాపూ ఘాట్ లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోంది. గాంధీ వారసులుగా మేం బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతాం. దీన్ని బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయి? .. మీరు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకోవచ్చు కానీ మేము మూసీ పునరుజ్జీవం చేస్తామంటే మీ బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారెందుకు..? ఎందుకంటే మేము గుజరాత్ కు పోటీ ఇవ్వబోతున్నామని అందుకే తెలంగాణను, హైదరాబాద్ ను ఫినిష్ చేయాలని బీజేపీ నేతలు మా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటున్నారు.
ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులతో తెలంగాణ పురోగతి సాధించి గుజరాత్ కు పోటీ ఇస్తుందనే విషయం తెలిసే మా ప్రయత్నాలను ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి. బీఆర్ఎస్ వ్యతిరేకించిన మరుసటి రోజే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడతారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే సమస్య ఏంటీ..? పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన గత సీఎం కేసీఆర్ పది సార్లు కూడా సెక్రటేరియట్ కు రాలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారు. కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎందుకు బయటకు రావడం లేదు. కేసీఆర్ ఆయనే ఫ్రీడం ఫైటర్ అని చెప్పుకుంటాడు. నాకేమీ అభ్యంతరం లేదు. తన ఫాంహౌస్‌లో పడుకొంటాడు.
పదేళ్లలో ఒక్కసారి సచివాలయానికి రాలేదు. గత పది నెలల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు. మీకు డెమొక్రసీపై గౌరవం ఉంటే ఎందుకు రావట్లేదు. తానో జమిందార్, ప్రజలందరూ గులాంలని కేసీఆర్ అనుకుంటాడు. అందుకే బయటకు రావడం లేదు. తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలు ఎన్నుకుంటేనే మేము అధికారంలోకి వొచ్చాం. మీకు నచ్చకుంటే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వాన్ని పని చేయనివ్వండి. మా ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు అంతా గమనిస్తున్నారు. పార్లమెట్ ఎన్నికల్లో వొచ్చిన ఫలితాలతో కేసీఆర్ ప్రజల ఆలోచనను అర్థం చేసుకోవాలి. ప్రజల ఆలోచనను పట్టించుకోకుంటే వొచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సర్కార్ ను పడగొట్టాలని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే నాకు మద్దతుగా నిలిచారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.





