13. జనధర్మోవిజయతే
బిట్ల నారాయణ గారి కుమారుడు రవివర్మ మధుసూదన్ కూడా చాలా బాధ్యతాయుతమైన క్రమశిక్షణ కలిగిన అద్భుతమైన కెమెరా మన్. గంటల తరబడి కుర్చీలో కూచుని కుంచె పట్టుకుని ఫోటో ప్రింటయిన తరువాత దిద్దుబాటు చేస్తూ ఉండేవారాయన. ఈ ముగ్గురూ మరపురాని కళాకారులు. బాధ కలిగించే పరిణామం ఏమంటే, దశాబ్దాలపాటు వరంగల్లు నాగరికులకు పదికాలాల పాటు దాచుకునే అపురూప జ్ఞాపకాలను ముద్రించి ఇచ్చిన చరిత్రాత్మక స్టూడియో ఇప్పుడు లేదు.
ఇక నారాయణగారి చిన్న కొడుకు రవివర్మ. అతను నిశ్శబ్దంగా ఉంటారు. కళలో, స్నేహంలో నాన్నకు నిజమైన వారసుడు. తండ్రితో పోటీ పడి, మానాన్నగారి పెన్సిల్ చిత్రాన్ని శరవేగంగా గీసి నాన్నకు అభినందన సభలో బహూకరించారు. ఈ లైన్ పొర్ ట్రయిట్ గీయడంలో ఆ నవ్వు, దువ్విన లేదా దువ్వని తల, నాన్న గారికి కప్పిన శాలువ కూడా స్పష్టంగా కనపడుతూ ఉంది. నాన్న 30వ పడి ఫోటోను రవివర్మ నాన్నగారు వర్ణాలతో చిత్రిస్తే, యువకుడైన రవివర్మ నాన్నగారి అరవయ్యో పడిచిత్రాన్ని పెన్సిల్ తో చిత్రించారు.
(బిట్ల నారాయణ గారి అద్భుత పోటోగ్రాఫ్ హిందూస్తానీ గాయకుడు శ్రీ వేంకట నరసింహాచార్య గారిది. పెదనాన శ్రీవేంకట నారసింహాచార్య (రచయిత గురువుగారు) నిజంగా ఆ పాట పాడుతున్నట్టుగా కళ్లకు కట్టినట్టు, ఒక వీడియో దృశ్యం కనపడినట్టు లేదూ?) రెండు కుటుంబాల మధ్య రెండు తరాల స్నేహబంధానికి ఈ రెండు చిత్రాలు నిదర్శనాలు.
శ్రీ బిట్లనారాయణ గారికి, శ్రీ మధుసూదన్ గారికి, శ్రీ రవివర్మ గారికి నా సాష్టాంగ దండ ప్రణామాలు. బిట్లనారాయణగారికి ఎంత ఆరాధనాభావం ఉంటే ఆ చిత్రం అన్ని సంవత్సరాలు పాటు అత్యంతశ్రధ్ధాసక్తులతో భక్తితో గీస్తారు? ఈ చరిత్ర తెలిసి ఆ చిత్రం చూస్తే దాని విలువ వేయి రెట్లు పెరుగుతుంది.
మరో ఉదాహరణ రవివర్మ గొప్పతనం తెలిపే చిత్రం కవి దాశరథిగారిది.
స్టూడియో ఆర్టిస్ట్ బిట్ల నారాయణ మాటల్లో నేను షోలాపురము నుండి మార్చి 1956 తేదిన వరంగల్ స్టూడియో పెట్టుదామని వచ్చి షాపు కొరకు అడ్వాన్సు ఇచ్చి మళ్ళీ షోలాపురం పోయి అక్కడి నుండి బొంబాయికి పోయి ఎలక్ట్రికల్ సామాను, ఫోటోగ్రాఫిక్ పేపర్ ఫిల్ములు ఇతర సామానులు తీసుకొని అట్లాగే షోలాపురము నుండి కెమరాలు కొంత ఫర్నీచర్‌ను రైల్వే లగేజ్ చేయించి వచ్చినాను. మే నెల వరకు డార్క్ రూమ్, కరెంటు ఫిట్టింగు, కొంత ఫర్నీచర్ చేయించి జూన్ ఒకటవ తేదీన రవివర్మ స్టూడియో ప్రారంభించినాను.

మొదటి హాలులో మా నాయిన బ్రోమైడ్ ఆయిల్ పెయింటింగ్లో ఫోటో పెట్టించినాను (అదే నాకు పెద్ద ప్రచారమైంది) దాన్ని మన ఆచారిగారు చూశారు అది పెయింటింగు ఎవరు చేశారు అని? నేనేనని అంటే వారికి అనుమానమొచ్చింది. నేను చేయలేదని పదేపదే అడిగారు కూడ. దాన్ని ఏమి పెయింటీంగు అంటారని నేను వారికి బ్రోమైడ్ పేపరుపై ఎన్‌లార్జ్ చేసి ఆయిల్ పెయింటింగు చేసినా అంటే ఓస్ యింతెనా ‘పేపర్ మీద పెయింటింగా? అంటే ఎన్‌లార్జ్ పెయింటింగ్ అంటె చాలా తేలికగా చేయవచ్చని కాని పెయింటింగు చేయుటలో కొంత బాధ వుంటుందని విడమరిచి చెప్పాను.
అప్పటి నుండి వారికి నాకు మైత్రి పెనవేసుకున్నది. నేను బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు శ్రద్ధతో తీసే వాడిని. టచింగ్ ఫినిషింగ్ వగైరాలు, నా ధ్యేయము గ్రాహకులు తృప్తిపడాలి అని ఆచారిగారు నా పనిని గమనించి మెచ్చుకునేవారు. అట్లాగే ఇతరులకు చెప్పే వారు. వారి మిత్రులు శంకర్రావు, దివ్వెల హనుమంతరావు, యాదగిరాచార్యులు కూడ ఇతరులకు చెప్పడం నాకు గ్రాహకులు వచ్చే విధముగా చేయడం ఈ విధముగా వారు తోడ్పడుతూవచ్చారు. ఆచారిగారు అప్పుడు ఆంధ్రపత్రికకు విలేఖరిగా ఉండేవారు. అట్లాగే పాములపర్తి అట్లాగే పాములపర్తి సదాశివరావు, పి.వి.గారు, కాళోజి మున్నగు సాహితీవేత్తలతో సన్నిహిత సంబంధం ఆ విధముగానే పత్రికారంగంలో అనుభవము సంపాదించుకుంటు వాటిలో ఉండే కష్టనష్టాల అనుభవం.
జనధర్మ ఆవిర్భావం- రవివర్మ స్టూడియోలోనే

వారు 1958 మార్చిలో మా స్టూడియోలో (రవివర్మ స్టూడియోలో) ఆచారిగారు శంకర్రావు, దివ్వెల హనుమంతరావు, యాదగిరాచార్యులుగారలు ఈ నల్గురు సమావేశమై వరంగల్ ఒక పత్రిక పెట్టుటకు నిర్ణయించుటమైనది. తర్వాత 1958 ఆగష్టులో జనధర్మ వార పత్రిక పేరుతో తీయాలని పూర్తినిర్ణయం తీసుకొని అన్ని హంగులు సమకూర్చుకొని దీపావళి మొదటి సంచిక వెలువడిరది, కొన్నిరోజుల తర్వాత మనకొక ప్రింటింగ్ ప్రెస్ ఉండాలని ప్రెస్ కొని అందులోనే తమ స్వంత పేపరు ప్రింటు చేయించుకునేవారు. ఎందుకో కొన్ని రోజుల తర్వాత విడిపోయారు. ఆచారిగారు ఒక ప్రెస్సు స్వంతముగా ఖరీదు చేసి ఆత్మ విశ్వాసముతో కష్టనష్టాలతో పత్రికను తీర్చిదిద్దుకుంటూ ద్వైవార పత్రికగా కొన్ని రోజులు నడిపించారు తర్వాత వరంగల్ వాణి పేరుతో 6 రోజుల దినపత్రిక ఆదివారము జనధర్మ అని వెలువరించుచున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల అభ్యుదయ కాంక్షతో ముఖ్యముగా వరంగల్ నగర అభ్యుదయం పట్ల శ్రద్ధాసక్తులతో ప్రచురణ గావిస్తు న్నారు. కొన్ని చిన్న పత్రికలకు ఆదర్శంగావుంటూ తోటి పత్రికలకు చేతనై న సహాయ సహకారాలందిస్తు వస్తున్నారు. ఒకొక్కసారి తనకు నచ్చని విషయాల పై ఈసడిరచినా తర్వాత శాంతముగా, వివరముగా వివరించి బోధించి ఎదుటివారిని తృప్తి పరుస్తారు. కొత్త వారు మొదలు చూచినప్పుడు వారిని అపార్థము చేసుకుంటారు. తర్వాత స్నేహశీలి ప్రేమ పాత్రుడు అని ఖచ్చితమైన నిర్మలమైన మనిషి అని.
వారు తన ఇద్దరు కుమారులను తనకన్న ఒక మెట్టుపైకి వుండేటట్టు చేశారు. వారు కూడ తండ్రికి చేదోడు వాదోడుగావుంటు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించుచున్నారు. ఆచారిగార్కి ఒక విధమైన అహంవుంది. అదేమంటే నేను ఎవ్వడికి ఏ విధమైన హాని చేయలేదు. ఎవరికి చేయి జాపలేదు. తన స్వార్థము కొరకు నాకు వ్యక్తిత్వముతో నా కాలము ఈ విధముగానే జరుగుతుంది అనే ధీమా మరియు ఆత్మవిశ్వాసము వారికి చాలామంది మిత్రులు వున్నా కొంతమంది అమిత్రులు శత్రువులు ఉండవచ్చు ఎందుకంటే ఆయనకు ముక్కుకు సూటిగా పొయే తత్వము ఆయనది అనీ ‘‘ఇప్పుడు వారికి పత్రిక ప్రాణముయే దాన్ని ఖచ్చిత ముగా నిర్భీతితో నడిపించాలి, అదే వారి ధ్యేయము.వరంగల్లో పత్రిక నడిపించుట అంటే కత్తి మీద సాము వంటిది. అది సాహసమే. మన ఆచారిగారు ముందుకూడ పత్రికను ఇంకా అభివృద్ధి పరిచి దీర్ఘ కాలము వెలువరించాలని హృదయ పూర్వకముగా ఆశించుచున్నాను’’ అని బిట్ల నారాయణ గారు మార్చి 1988 లో రాసారు.





