“జెయింట్ వైల్డ్ పగోడా చూడడానికి వెళ్ళాము. దీనిని బిగ్ వైల్డ్ పగోడా అని కూడా పిలుస్తారు. దీనిని క్రీ పూ 652 లో టాంగ్ వంశీయులు నిర్మించారు. జువాన్ జాంగ్ అనే బౌద్ధ సన్యాసి భారత దేశం నుండి తీసుక వచ్చిన బుద్ధుని అవశేషాలను, గ్రంధాలను సంరక్షించడానికి ఈ పగోడా నిర్మాణం జరిగింది.”
గిరియానం – 8
మూడు రోజుల బీజింగ్ పర్యటన తర్వాత మా జియాంగ్ కు మా ప్రయాణం. ఉదయమే బ్రేక్ ఫాస్ట్ ప్యాక్ చేసుకొని ఆరున్నరకల్లా రైల్వే స్టేషన్ చేరుకున్నాం. అది ఎయిర్ పోర్టు స్థాయిలో వుంది. మా ట్రైన్ 8-12 ని. లకు. లగేజీతో పాటు ఎస్కలేటర్ల మీద వెళ్ళడం కొంచం కష్టమే అయింది. లగేజీ పడిపోవడం లేదా మనుషులు పడిపోవడం లాంటివి జరగడం బాధాకరం. ఎలవేటర్స్ లేకపోవడం ఇబ్బందికరం. స్టేషన్లోనే బ్రేక్ ఫాస్ట్ ముగించాము. బీజింగ్ నుండి జియాన్ దాదాపు 1200 కి.మీ. దూరం. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లో సూమారు 5,6 గంటల ప్రయాణం. రైలు గంటకు 300 కి.మీ వేగంతో వెళుతుంది. ఒక్కో స్టేషన్ లో 9.ని.లు ఆగింది. ప్రయాణ సమయంలో ఇరువైపులా ఆకట్టుకునే అందమైన ప్రకృతి దృశ్యాలు ఏవీ నాకు కనిపించలేదు. కబుర్లతో కాలమే తెలియలేదు. మేం మధ్యాహ్నం రెండుగంటలకు స్టేషన్ లో దిగేసరికి టూర్ గైడ్ జాకీ సిద్ధంగా వున్నాడు.
జాకీ తనను తాను పరిచయం చేసుకున్న దాని ప్రకారం.. ఆయన కమ్యూనిష్టు పార్టీ యూనివర్శిటీలో ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్నాడు. వేతనం 10 వేల యువాన్ లు ఆయన చెప్పిన విద్యాశాఖ వివరాల మేరకు .. ప్రైమరీ, హైస్కూల్, కళాశాల స్థాయిలోవిద్యాభ్యాసం వుంటుంది. చలికాలం సెలవులు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉంటాయట. ప్రైమరీ టీచర్ వేతనం సగటున 6వేల యువాన్ లు ఉంటుందట. బోధన మాండరిన్ భాషలో .. టూర్ గైడింగ్ చేయడం తన హాబీ. ఉన్నత చదువుల కోసం వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందట. స్థానిక చైనీయులు ఇప్పుడిప్పుడే ఇంగ్లీషు చదువుకుంటున్నారట. ఆయన మంచి గాయకుడు కూడా.. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చైనా ( మండరిన్ ) భాషలో లలిత, జానపద గీతాలు వినిపించాడు. యువకుడు కావడం వల్ల కాబోలు కొంత తొందరపాటు అతనిలో కనిపించింది.
జియాన్ చైనాలోని పురాతనమైన చారిత్రాత్మక నగరం. జియాన్ నగరాన్ని పూర్వం ‘ చాంగ్ ఆన్ ‘ అని పిలిచే వారు. కానీ చాలా అభివృద్ధి చెందుతున్న నగరం. సాంస్కృతిక, కళల, విద్యాపరంగా చాలా ఉన్నతమైన నగరం ఎంతోమంది విదేశీయులు విద్యాభ్యాసం కొరకు అక్కడికి వస్తున్నారని గైడ్ చెప్పాడు. మేము ఒక ఇండియన్ రెస్టారెంటుకు వెళ్ళి భోజనం ముగించుకొని నగర పర్యటనకు బయలుదేరి, ముందుగా బెల్ టవర్ ప్రాంతానికి అండర్ పాస్ లోనుంచి వెళ్ళాము. ఇది జియాన్ నగరం నడిబొడ్డులోని ఒక చౌరస్తాలో ఉంది. ఇది 1384 లో మింగ్ రాజవంశీయులు నిర్మించిన చారిత్రాత్మక కట్టడం. ఇటుక, కలపతో నిర్మించారు.

మేము వెళ్ళింది సాయంత్రం కాబట్టి విద్యుద్దీపాల కాంతులతో మెరిసిపోతుంది. అవి సెలవు రోజులు కావడం వలన అమ్మాయిలు, అబ్బాయిలు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. బంధు మిత్రులతో ఉత్సాహంగా పార్టీలు చేసుకుంటూ కనిపించారు. డెబ్భై మెట్లెక్కి మాలో ఐదుగరం బెల్ టవర్ పైకి వెళ్ళాము. సుమారు 14 కిలోమీటర్ల ప్రహారీ గోడ చాలా అద్భు తంగా వుంది. దాని మీద కొంతదూరం నడిచాము. ఒకవైపు పాత జియాన్ నగరం మరోవైపు అభివృద్ధి చెందుతున్న కొత్త జియాన్ నగరం స్పష్టంగా కనిపించింది. ఒకవైపు ముస్లిం బజార్, మరోవైపు చైనీయుల వివిధ రకాల వంటకాలతో వీధి దుకాణాలతో ఆ సాయంత్రం చైనీయుల సంస్కృతి కళ్ళముందు సాక్షాత్కరించింది. అలా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్ళ డిన్నర్ ముగించి హోటల్ చేరుకున్నాము.
ఉదయమే ఉపాహారం ముగించి చైనాలో క్రాకరీ ఫాక్టరీకి వెళ్ళాము. అక్కడ అందమైన వస్తువులు కనువిందుచేశాయి. మట్టితో బొమ్మలు చేయడం, అవి మధ్య లో ఖాలీగా ఉండడం నన్ను ఆశ్చర్య పరిచింది. అదే విషయం గైడ్ కు చెపితే..” మనం చూడబోయే మ్యూజియంలో అన్ని కళాఖండాలు అలాగే ఉంటాయని, అందుకే ముందుగా ఇక్కడికి తీసుక వచ్చానని” చెప్పాడు. అక్కడి నుంచి మేము చైనాలో అత్యంత ప్రసిద్ధమైన టెర్రకోట వారియర్స్ చారిత్రక మ్యూజియం
చూడడానికి వెళ్ళాం. ఇది మూడు భాగాలుగా వుంది. సుమారు క్రీ శ 200 ఏళ్ళనాటి ఈ బొమ్మలను 1974 లో కనుగొన్నారు. రైతులు బావి తవ్వుతుండగా ఇవి బయట పడ్డాయని చరిత్ర చెపుతోంది. దీనితో చైనా పురాతత్వ శాస్త్రవేత్త కాంగ్మిన్ బృందం మరిన్ని పరిశోధనలు చేయడానికి అవకాశం ఏర్పడింది. 2007 లో జరిపిన పరిశోధన ప్రకారం .. .. మూడు విభాగాలలో 8000 పైన సైనికులు, 520 గుర్రాలతో 130 రథాలు, 150 అశ్వక దళాలున్నాయి. ఆయా ఉద్యోగుల రాంక్ ను బట్టి ఆయా బొమ్మల ఎత్తు మారుతూ వచ్చింది. అంటే ఆరడుగుల ఎత్తు సైన్యాధికారి బొమ్మ ఉంటే సైనికుడి బొమ్మ ఎత్తు ఐదంగుళాలన్నమాట. వారి వారి యూనిఫాంలో కూడా హోదాను బట్టి తేడాలు కనిపించాయి. కేవలం వారియర్స్ కాకుండా ఇతర అధికారులు, సంగీతకారుల బొమ్మలు కూడా ఉన్నాయి. కొన్ని బొమ్మలకు తలలు విరిగి పోయి ఉన్నందువల్ల అవి లోపల ఖాలీగా ఉన్న బొమ్మలే అన్ని విషయం స్పష్టమైంది. కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంసమై ఉన్నాయి. అన్ని వేల బొమ్మలలో ఒక్క స్త్రీ బొమ్మ కూడా కనిపించలేదు.
జెయింట్ వైల్డ్ పగోడా చూడడానికి వెళ్ళాము. దీనిని బిగ్ వైల్డ్ పగోడా అని కూడా పిలుస్తారు. దీనిని క్రీ పూ 652 లో టాంగ్ వంశీయులు నిర్మించారు. జువాన్ జాంగ్ అనే బౌద్ధ సన్యాసి భారత దేశం నుండి తీసుక వచ్చిన బుద్ధుని అవశేషాలను, గ్రంధాలను సంరక్షించడానికి ఈ పగోడా నిర్మాణం జరిగింది. మొదలు ఐదంతస్తులలో ఇటుక మట్టితో నిర్మించడం వల్ల కొంత కాలానికి మధ్యలో చెట్లు పెరిగి కొంత ధ్వంసమైంది. ఆ తరువాతి పు జిటియన్ రాజుల హయాంలో 704 లో జూన్ చాంగ్ అనే బౌద్ధ సన్యాసి భారత దేశం నుండి తీసుకు వచ్చిన బుద్ధుని అవశేషాలు, పుస్తకాలను సంరక్షించడానికి దానిని పడగొట్టి ఏడు అంతస్తులలో తిరిగి నిర్మించారు. తరువాతి కాలంలో పది అంతస్తులకు పెంచారు. కానీ యుద్ధం లో ధ్వంసమైంది. తిరిగి 1466లో మింగ్ రాజవంశీయులు దానిని పునర్నిమించారు. క్వింగ్ రాజ వంశీయుడైన కాంగ్జీ కాలంలో బిగ్ వైల్డ్ పగోడా ఒక వైపుకు వంగిపోవడం మొదలైంది. పీపుల్స్ రిపబ్లిక్ చైనా స్థాపన తరువాత దాని రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చైనీయులు వారసత్వ సంపదను సంరక్షించు కోవడంలో ఎంతో ముందుంటారనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం.
ప్రస్తుతం మేం చూసింది ఏడంతస్తులలో వున్న బిగ్ వైల్డ్ పగోడా. 1963 లో ఈ పగోడా జాతీయ కీలక సాంస్కృతిక అవశేష రక్షణ విభాగంలో చేరింది. సిల్క్ రోడ్ చాంగ్ ఆన్ టాంగ్ షాన్ కారి డార్ నెట్ వర్క్ లో భాగంగా 2013లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్య సంపదగా గుర్తించింది. పది యువాన్ల ప్రవేశ రుసుం చెల్లించి పై దాకా వెళ్ళవచ్చు. ఏడవ శతాబ్దంలోని శిల్ప కళాకారుడు యాన్ లిబెన్ చెక్కిన బౌద్ధ విగ్రహాలు లోపాలున్నాయని అక్కడి సందర్శకులు చెప్పారు. నాకూ పై దాకా వెళ్ళి చూడాలనిపించింది. సమయాభావం వల్ల పైకి వెళ్ళలేక పోయాను.





