“సామాన్యంగా,సహజ న్యాయ విధానాల ప్రకారంగానైనా ప్రతి అధికారికి,నిర్వహణాదక్షుడికి కూడా క్రమ శిక్షణ నియమావళి ఉండాలి. అయితే రెవెన్యూ డిపార్టుమెంటు అధికారులకు జ్యుడిషియల్ న్యాయాధికారుల హోదా ఉన్నదనే సాకుతో తప్పులు చేసిన అధికారులకు మినహాయింపు ఇవ్వడం సరికాదు. ఎందుకంటే రైతులు ఎమ్మార్వో ,తహసీల్దార్ ఆఫీస్ లకు నేరారోపణల మీద పోవడం లేదు. భూమి అమ్మకం, కొనుగోళ్లు, హక్కుల రికార్డుల నమోదు,దృవీకరణ పత్రాల గురించి మాత్రమే పోతారు. కాని రెవెన్యూ అధికారులు,సిబ్బంది పాల్పడిన క్రమశిక్షణారాహిత్య చర్యల వలన రైతులు తహశీల్దార్ ఆఫీస్ ల చుట్టూ తిరుగవలసిన దుస్థితి వచ్చింది. కాబట్టి “తెలంగాణ భూ భారతి చట్టం (భూమిపై హక్కుల రికార్డ్)2025 లో బాధ్యత రహితంగా విధులు నిర్వహించిన అధికారులకు,ఉద్యోగులకు శిక్షలు ఉండాలని రైతులు కోరుతున్నారు.”

వాట్సప్ 9441440791
తెలంగాణ రాష్ట్రంలో మూడవ సారి 2023 నవంబర్ 30న శాసన సభ ఎన్నికల్లో ధరణి పోర్టల్ రాజకీయ ఎజెండాగా ముందుకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ధరణిని ఉంచుతామా ? అంటే కనీస స్పందన కూడా రాలేదు.అందుకే డిసెంబర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సర్కార్ “” తెలంగాణ భూ భారతి””
(భూమిపై హక్కుల రికార్డ్ )చట్టం 2025″” రూపొందించింది.2025 జనవరి 3న గవర్నర్ అమోదం పొంది 4న శాసనాలు,నిబంధనలు మొదలైనవి. ఏప్రిల్ 14న భూ భారతిని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల అనంతరం జూన్ 21న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సదస్సులలో రైతులు భూసమస్యల గురించి పెట్టుకున్న 8.50 లక్షల దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు 15 నాటికి పరిష్కరించడానికి డెడ్ లైన్ ను ప్రకటించారు.
గతంలో ఉన్న రెవెన్యూ చట్టాల కంటే””తెలంగాణ భూ భారతి చట్టం 2025 రైతులకు ప్రయోజనకరంగా ఉంది.ముఖ్యంగా సాదా బైనామాలతో కొనుగోలు చేసిన భూములను పట్టా చేయడం హర్షించదగినది.భూమి అనుభవంలో, కాస్తులో ఉండి భూమి హక్కుల రికార్డ్ లో నమోదు చేయకపోతే సెక్షన్ 4,సబ్ సెక్షన్ 6 ప్రకారం హక్కుల రికార్డులో నమోదు చేసి కొత్త బుక్ ను రైతులకు ఇవ్వడం మంచిది.రైతులకు భూమి ఉండి,ధరణి పోర్టల్ లో ఎక్కని భూములను,సర్వే నంబర్స్ ,భూమి విస్తీర్ణం నమోదులలో దొర్లిన తప్పులను సరి చేయడానికి రూ.5 లక్షల విలువ లోపు భూముల విషయంలో ఆర్డీఓకు,అంతకు మించి విలువ గల భూముల విషయంలో కలెక్టర్ కు అధికారాలు ఇవ్వడం వలన రైతుల ముంగిట్లో న్యాయం జరుగుతుంది.గత ధరణి పోర్టల్ లో భూసమస్యల వివాదాల పరిష్కారముకై కోర్టులోనే దాఖలు చేసుకునే అవకాశం ఉండేది.
కాని ఇప్పుడు తహశీల్దార్,ఆర్డీఓ,కలెక్టర్ సమక్షంలో పరిష్కారము చేసుకునే అవకాశం కల్పించడం వలన రైతులకు సులువైన ఊరట కలుగుతుంది.ఒక వేళ మూడు దఫాలలో అధికారులు ఇచ్చిన తీర్పులు,పరిష్కారాలు నచ్చకుంటే హైదరాబాద్ లోని “”భూపరిపాలన ట్రిబ్యునల్ లో కూడా దాఖలు చేసుకునే అవకాశం ఇచ్చారు.2014 జూన్ 2కు ముందు సాధాబైనామాల కొనుగోలు భూములకు సెక్షన్ 6(1) ప్రకారం ఆర్డీఓ స్థాయిలో విచారణ జరిపి క్రమబద్ధీకరణ చేసే అవకాశం కల్పించారు.వీలునామా లేని ఆస్తులకు యాజమాన్య హక్కులను,విరాసత్,మ్యుటేషన్ చేయడానికి వారసులందరూ సంయుక్తంగా ఇచ్చిన వివరణల ఆధారంగా లేదా తహశీల్దార్ వారసులందరికీ నోటీస్ జారీ చేసి విచారణను జరిపిన అనంతరం మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేసే విధానం వలన కుటుంబ వారసులందరికీ న్యాయం జరుగుతుంది. సెక్షన్ 5 ప్రకారంగా భూమి హక్కుల రికార్డులో నమోదైన తప్పులను సరిదిద్దడానికి నిర్దేశిత అధికారికి దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది .అలాగే అట్టి దరఖాస్తుపై విచారణ అనంతరం తన నిర్ణయాన్ని తెలియచేయడం లేదా నిర్ణయానికి అనుగుణంగా హక్కుల రికార్డును సరిదిద్దమనే ఆదేశాలను జారీ చేసే అధికారాలను కల్పించారు.
సెక్షన్ 6 ప్రకారం భూమిని చట్ట బద్ధంగా స్వాదీనం చేసుకుని దానిపై హక్కులు కోరుతున్న ఏ వ్యక్తి అయినా ఆ భూమికి సంబంధించి హక్కుల రికార్డులో నమోదు చేయకపోతే నిర్దేశించిన వ్యవధి లోపు కొత్తగా నమోదు చేయడానికి లేదా నమోదును సరిదిద్దడానికి నిర్దేశించిన అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు.విచారణ అనంతరం హక్కుల రికార్డులో నమోదు చేసే లేదా సరిదిద్దే అధికారాలను కల్పించారు.వ్యవసాయ సంబంధమైన పూర్తి వివరాలను రాయాలని భూ భారతి చట్టంలో కల్పించారు.ఇకపై భూయాజమాని పేరు,ఖాతా నంబర్,సర్వే నంబర్,అనుభవం దారు పేరు,పట్టా దారు పేరు,భూమి స్వరూపం, విస్తీర్ణం ఇలా 11 కాలమ్స్ తో పహాణి రాస్తారు.
ఇంకా భూ భారతి చట్టంలో ఊరి ఆబాదీ/గ్రామ కంఠకం భూములను కూడా క్రమబద్ధీకరణ చేసే ప్రక్రియను,రైతులకు చట్టపరమైన సహాయం(లీగల్ ఎడ్)కల్పించే వ్యవస్థను,భూపాలన ట్రిబ్యునల్ కోర్టుల ఏర్పాట్లు,రైతులను చైతన్యం చేసేందుకు వాలంటీర్ వ్యవస్థను,భూమి యాజమానులకు భూధార్ కార్డ్ లను ఇవ్వడం,అన్ని వివరాలతో కూడిన కొత్త వెబ్ సైట్ ను రూపొందిస్తామని రెవెన్యూ సదస్సులలో ప్రకటించారు. కాని భూ భారతి చట్టంలో ప్రధాన లోపాలను ఎక్కడ చెప్పలేదు.తప్పు చేసిన అధికారులకు శిక్షల నుండి మినహాయింపు ఇవ్వడం రైతుల పాలిట “”భూ భారతి చట్టం చుట్టం కాకుండా” పోతుంది.ఎందుకంటే 561 మండలాల్లో జరిపిన రెవెన్యూ సదస్సులలో తమ భూముల సర్వే నంబర్స్ మిస్ అయినవని 1,26,028 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 18 లక్షల ఎకరాల భూమి ధరణి పోర్టల్ రికార్డులలో ఎక్కలేదని పరిశీలనలో తేలింది.ఇలా లక్షల మంది రైతుల గోసకు, కష్టాలకు కారణం ఎవరు? తహసీల్దార్, గిర్దావరీ లేదా ఇతర రెవిన్యూ సిబ్బందినే కారణం.
ప్రతి ప్రజా సేవకుడికి,ఉద్యోగికి “క్రమశిక్షణ నియమావళి” అవసరం..ఈ రోజుల్లో మనిషి సక్రమంగా పని చేయాలంటే భయం,భుక్తి,నైతికత/భక్తి అయినా ఉండాలి. కాని నైతికత,భక్తి పూర్తిగా సన్నగిల్లుతుంది.ఇక మిగిలింది భయం. భయానికి మెజారిటీగా విధేయులుగా ఉంటారు..సెక్షన్ 18 ప్రకారం హక్కుల రికార్డులో నమోదు చేయడం వలన ఎవరికైనా నష్టం జరిగితే 1963 నిర్దిష్ట ఉపశమన చట్టంలోని అధ్యాయం –6 ప్రకారం దావా వేసే అవకాశం ఇచ్చారు. కాని 19(1) ప్రకారం ఏదైనా హక్కుల రికార్డులో నమోదు చేయబడిన,నమోదుకు సంబంధించి ఎంట్రీని తొలగించిన లేదా సవరించిన ప్రభుత్వ అధికారిపైనా దావా వేయకూడదు.సెక్షన్ 19(2)కింద ఏ ప్రభుత్వ అధికారి అయినా పూర్తి విశ్వాసంతో తీసుకున్న చర్యలపై ఎటువంటి క్రిమినల్ చర్య తీసుకోకూడదు. ప్రయత్నించకూడదు. ఇక సెక్షన్ 20(2) ప్రకారం “తెలంగాణ భూ భారతి చట్టం 2025” నిబంధనలు,నియమాల ప్రకారం పని చేసే “ప్రతి అధికారిని”భారతీయ న్యాయ సంహిత 2023″లోని సెక్షన్ 2లోని క్లాజ్ (28)అర్థంలో ప్రజా సేవకుడిగా పరిగణించాలి.ఇక్కడ భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 28 ఏమి చెప్పుతుందో చూద్దాం. 28(ఎ) సైన్యం, నౌకా దళం లేదా వైమానిక దళంలోని ప్రతి కమిషన్డ్ అధికారి ప్రజా సేవకుడు. 28(బి)చట్టం ద్వారా స్వయంగా లేదా ఏదైనా వ్యక్తుల సంఘం సభ్యుడిగా న్యాయ నిర్ణయ విధులను నిర్వర్తించడానికి అధికారం పొందిన ప్రతి అధికారి,న్యాయమూర్తి ప్రజా సేవకుడు.28(సి) లిక్విడేటర్ రిసీవర్,కమిషనర్ తో సహా కోర్టులోని ప్రతి అధికారి చట్టం లేదా వాస్తవం పై దర్యాప్తు చేయడం,నివేదించడం,పత్రాలను తయారు.
చేయడం,ప్రమాణీకరించడం,ఉంచడం,బాధ్యత తీసుకోవడం,పారవేయడం,ఏదైనా ఆస్తికి,న్యాయ ప్రక్రియను అమలు చేయడానికి,ప్రమాణం చేయడానికి,కోర్టులో క్రమాన్ని వివరించడానికి, పరిరక్షించడానికి అధికారం పొందిన ప్రతి వ్యక్తి ప్రజా సేవకుడు. 28(డి) కోర్టుకు లేదా ప్రభుత్వ ఉద్యోగికి సహాయం చేసే ప్రతి పంచాయితీ మదింపుదారుడు లేదా ప్రతి వ్యక్తి ప్రజా సేవకుడు.అంటే రెవెన్యూ డిపార్టుమెంట్ లో ప్రతి అధికారి భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం ప్రజా సేవకుడే.తప్పులు చేసిన మినహాయింపు పొందే అవకాశం ఉన్న అధికారేనన్న మాట. చివరగా తప్పు చేసిన ఉద్యోగులకు మాత్రం శిక్షలను విధించారు. సెక్షన్ 20(3) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి హక్కుల రికార్డును తారుమారు చేసినా,మోసపూరితమైన ఉత్తర్వులను జారీ చేసినా వర్తించే చట్టాల ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్ తో పాటుగా సేవ నుండి తొలగించడం లేదా జరిమానాకు కూడా బాధ్యత వహిస్తారు.
సామాన్యంగా,సహజ న్యాయ విధానాల ప్రకారంగానైనా ప్రతి అధికారికి,నిర్వహణాదక్షుడికి కూడా క్రమ శిక్షణ నియమావళి ఉండాలి.అయితే రెవెన్యూ డిపార్టుమెంటు అధికారులకు జ్యుడిషియల్ న్యాయాధికారుల హోదా ఉన్నదనే సాకుతో తప్పులు చేసిన అధికారులకు మినహాయింపు ఇవ్వడం సరికాదు. ఎందుకంటే రైతులు ఎమ్మార్వో ,తహసీల్దార్ ఆఫీస్ లకు నేరారోపణల మీద పోవడం లేదు. భూమి అమ్మకం,కొనుగోళ్లు,హక్కుల రికార్డుల నమోదు,దృవీకరణ పత్రాల గురించి మాత్రమే పోతారు. కాని రెవెన్యూ అధికారులు,సిబ్బంది పాల్పడిన క్రమశిక్షణారాహిత్య చర్యల వలన రైతులు తహశీల్దార్ ఆఫీస్ ల చుట్టూ తిరుగవలసిన దుస్థితి వచ్చింది. కాబట్టి “తెలంగాణ భూ భారతి చట్టం (భూమిపై హక్కుల రికార్డ్)2025 లో బాధ్యత రహితంగా విధులు నిర్వహించిన అధికారులకు,ఉద్యోగులకు శిక్షలు ఉండాలని రైతులు కోరుతున్నారు.





