దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి..
మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8 : దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం గాంధీ భవన్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జి కేసీ వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు.
గాంధీ భవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యేడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పీఏసీ సమావేశంలో వివరించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కి సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశామని మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని చెప్పారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటు అయిందని గుర్తుచేశారు. పాతబస్తీలో కొత్త నిర్మించిన ఫ్లైఓవర్ కి మన్మోహన్ సింగ్ పేరు పెట్టామన్నారు.
జనవరి 26 రైతు భరోసా ఇస్తున్నామని, రైతు కూలీలకు యేడాది 12 వేలు అందిస్తామని, కొత్త రేషన్ కార్డ్ లు కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు. యేడాది లో 55143 ఉద్యోగాలు ఇచ్చామని, రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, యేడాదిలో 54 వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 500 రూపాయల కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 4000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించిందని అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని, ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.





