“వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ప్రాతిపదిక ఏమిటనే విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉండగా, షెడ్యూల్డ్ కులాల, తెగల జన సంఖ్య విషయంలో కచ్చితమైన జనగణన అంకెలు ఉన్నట్టుగా, ఇతర కులాల విషయంలో అంకెలు అందుబాటులో లేవు. అందువల్ల వెనుకబడిన కులాలకు కచ్చితమైన రిజర్వేషన్ కోటా నిర్ధారించడం జరగలేదు. అసలు వెనుకబడిన కులాలు (కాస్ట్స్) అని కూడా అనకుండా వెనుకబడిన తరగతులు/వర్గాలు (క్లాసెస్) అనే అస్పష్టమైన మాట వాడారు. “అవకాశాలలో సమానత్వం సూత్రాన్నీ, శతాబ్దాలుగా అవకాశాలు నిరాకరించబడినవారికి న్యాయమైన అవకాశం ఇవ్వవలసిన అవసరాన్నీ సమతూకం వేయవలసి ఉంది. అందువల్ల ఇప్పుడిక్కడ కచ్చితమైన కోటాలు నిర్ధారించడం లేదు గాని, సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఉన్నచోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరుగుతున్నది” అని డా. బి ఆర్ అంబేడ్కర్ ఆ చర్చను ముగించారు.”
తెలంగాణ రాజకీయాలలో ఇవాళ మార్మోగిపోతున్న మాట బీసీ కోటా. దాన్ని వ్యతిరేకిస్తే, రాష్ట్ర జనాభాలో అరవై శాతం దాకా ఉన్న వెనుకబడిన కులాల ప్రజలకు దూరం అవుతామనే భయంతో ఏ ఒక్క పార్టీ గాని, ఏ ఒక్క నాయకుడు గాని నేరుగా వ్యతిరేకించే ధైర్యం చేయడం లేదు. కాని పైకి దాన్ని సమర్థిస్తున్నట్టు కనబడుతున్న, మాట్లాడుతున్న వారిలో సగం ముప్పాతిక మందికి ఆ నిబద్ధత ఉన్నదా అనుమానమే. అవన్నీ పెదాల పై నుంచి వస్తున్న మాటలు, ప్రదర్శన కోసం, అమాయక బీసీల అభిమానం సొమ్ము చేసుకోవడం కోసం చేస్తున్న పనులు. అటు ప్రకటనలు, బిల్లులు, ఆర్డినేన్సులతో హడావిడి చేస్తున్న ప్రభుత్వం అయినా, ఇటు సన్నాయి నొక్కులు నొక్కుతున్న ప్రతిపక్షాలైనా, నిజంగా తెలంగాణలో విద్యా, ఉద్యోగ, ఎన్నికల రంగాలలో బీసీలకు దక్కవలసిన స్థానం దక్కకపోవడానికి బాధ్యత ఎవరిది, ఇప్పటికైనా ఆ స్థానం దక్కడానికి చేపట్టవలసిన సముచిత చర్యలేమిటి అనే ఆలోచనలు చేయడం లేదు. బీసీల అభ్యున్నతి గురించి మాట్లాడని వాళ్లు లేరు అనేది ఎంత నిజమో, బీసీల అభ్యున్నతి కోసం అవసరమైన చర్యలు తీసుకోవడమో, సూచించడమో చేస్తున్నవాళ్లు కూడా లేరనేది అంత నిజం.
ఒక అత్యంత న్యాయమైన, ప్రజాస్వామికమైన ఆకాంక్ష ఇట్లా పది మంది నోళ్లలో పడి ఎటూ కాకుండా పోవడం నిజంగా విచారించవలసిన అంశం. పది మందిలో పాము చావదని, వంటవాళ్లు ఎక్కువై వంట చెడగొట్టారని పాత సామెతలు బీసీ రిజర్వేషన్ల విషయంలో నిజం అవుతున్నట్టున్నాయి. అయితే ఈ వంచన చరిత్ర కొత్తదీ, ఇటీవలిదీ కాదు, తరతరాల చరిత్ర ఇది.
మన సమాజంలో శూద్ర కులాలు, మధ్య కులాలు, ఉత్పత్తి కులాలు, శ్రామిక కులాలు వంటి వేరు వేరు పేర్లతో ఉన్న ఈ కులాలు రాజ్యాంగ పరిభాషలో “వెనుకబడిన కులాలు” అని కూడా కాకుండా “వెనుకబడిన తరగతులు/వర్గాలు” అని కొత్త పేరుతో చలామణీలోకి వచ్చాయి. తరతరాలుగా అణచివేతకూ, అవకాశాల నిరాకరణకూ గురి అయినందువల్ల విద్యలో, ఉద్యోగాలలో, ఎన్నికలలో షెడ్యూల్డ్ కులాలకు 15 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగ స్ఫూర్తితో, పాలనాపరమైన ఆదేశాలతో నిర్ధారించినప్పుడు, ఆ నిష్పత్తిని 1951 జనగణన గణాంకాల ఆధారంగా నిర్ణయించారు. రాజ్యాంగ నిర్ణయ సభ చర్చలలో 1949 ఆగస్ట్-నవంబర్ లలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు కాకుండా ఇతర కులాల వెనుకబాటుతనం గురించీ, అందువల్ల వారికి ప్రత్యేక రక్షణలు కల్పించడం గురించీ కూడా చర్చ జరిగింది. వారు కూడా తరతరాలుగా సామాజికంగా, విద్యాపరంగా అవకాశాల నిరాకరణకు గురయ్యారనీ, వారికి కూడా వారి జనాభాకు తగిన దామాషాలో రక్షణ రిజర్వేషన్లు కల్పించాలని వాదనలు వచ్చాయి. మన సమాజంలో సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనానికి కులం ఒక ప్రాథమిక సూచిక గనుక కులపరమైన రిజర్వేషన్ కల్పించాలని కొందరు వాదించగా, వెనుకబాటుతనానికి పేదరికాన్ని, విద్యా లేమినీ సూచికలుగా తీసుకోవాలి గాని కులాన్ని ప్రాతిపదిక చేయగూడదని మరి కొందరు వాదించారు.
వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ప్రాతిపదిక ఏమిటనే విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉండగా, షెడ్యూల్డ్ కులాల, తెగల జన సంఖ్య విషయంలో కచ్చితమైన జనగణన అంకెలు ఉన్నట్టుగా, ఇతర కులాల విషయంలో అంకెలు అందుబాటులో లేవు. అందువల్ల వెనుకబడిన కులాలకు కచ్చితమైన రిజర్వేషన్ కోటా నిర్ధారించడం జరగలేదు. అసలు వెనుకబడిన కులాలు (కాస్ట్స్) అని కూడా అనకుండా వెనుకబడిన తరగతులు/వర్గాలు (క్లాసెస్) అనే అస్పష్టమైన మాట వాడారు. “అవకాశాలలో సమానత్వం సూత్రాన్నీ, శతాబ్దాలుగా అవకాశాలు నిరాకరించబడినవారికి న్యాయమైన అవకాశం ఇవ్వవలసిన అవసరాన్నీ సమతూకం వేయవలసి ఉంది. అందువల్ల ఇప్పుడిక్కడ కచ్చితమైన కోటాలు నిర్ధారించడం లేదు గాని, సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఉన్నచోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరుగుతున్నది” అని డా. బి ఆర్ అంబేడ్కర్ ఆ చర్చను ముగించారు.
ఏ కులానికి చెందినవారు ఎంతమంది ఉన్నారో, 1931 జనగణన తర్వాత నమోదు కాలేదు గనుక, దామాషా సూత్రాన్ని అమలులోకి తేవడానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన మూడు సంవత్సరాలకే గణేష్ వాసుదేవ్ (కాకా) కాలేల్కర్ కమిషన్ నియమించారు. 1953 జనవరి ప్రారంభమయిన ఆ కమిషన్ 1955లో సమర్పించిన నివేదికలో కుల అంతరాల వ్యవస్థలో స్థానాన్ని బట్టి, విద్యా, ఆర్థిక స్థాయిని బట్టి, వృత్తిని బట్టి 2,399 కులాలను వెనుకబడిన కులాలుగా నిర్ధారించింది. భారత గ్రామీణ సమాజంలో మతం పాత్ర కన్న కులం పాత్ర ఎక్కువగా ఉంది గనుక, హిందూయేతర మతస్తులను కూడా మరొక కులంగా గుర్తించే ఆనవాయితీ ఉంది గనుక ఈ 2,399 కులాల జాబితాలో భిన్న మతస్తులున్నారు. కాలేల్కర్ కమిషన్ ఉద్యోగాలలో షెడ్యూల్డ్ కులాలకు 20 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 10 శాతం, ఇతర వెనుకబడిన తరగతులకు 40 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, అన్ని ఉన్నత విద్యావకాశాలలో తగిన రిజర్వేషన్ ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను ఆమోదించడం లేదని ప్రభుత్వం 1961లో ప్రకటించింది. ఆ తర్వాత దేశ స్థాయిలో మండల్ కమిషన్ (1979), రాష్ట్ర స్థాయిలో అనంతరామన్ కమిషన్ (1962), మురళీధర రావు కమిషన్ వంటి ఎన్నో కమిషన్లు వెనుకబడిన కులాల అభివృద్ధికి సూచనలు చేశాయి గాని, ప్రభుత్వాలు, రాజకీయ నాయకత్వాలు ఎప్పుడూ ఆ సూచనలను సంపూర్ణంగా అమలు చేయడానికి చిత్తశుద్ధి చూపలేదు.
ఈలోగా మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయడానికి వి పి సింగ్ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు, ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష, పరోక్ష ప్రోత్సాహంతో మండల్ వ్యతిరేక ఆందోళన చెలరేగి, హింసాకాండ జరిగింది. మరొకవైపు సుప్రీంకోర్టు ఇంద్ర సాహ్నీ కేసులో 1992లో ఇచ్చిన తీర్పులో దేశంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించగూడదనే పరిమితి విధించడంతో ఎస్సీఎస్టీలకు 22.5 శాతం పోగా, బీసీలకు మిగిలిన 27.5 శాతం సరిపెట్టవలసి వచ్చి చిక్కుముడి బిగిసిపోయింది.
“ఈ నేపథ్యంలో తెలంగాణలో కులగణన (2024 సామాజిక, విద్యా, ఆర్థిక, ఉద్యోగ కుల సర్వే) జరిగింది. లోపాలతోనైనా సరే కులగణన జరిపింది గాని పూర్తి నివేదికను బైటపెట్టకుండా, కేవలం అన్ని కులాలనూ కలిపి, బీసీ జనాభా అని ఒక అంకె ప్రకటించింది. సూక్ష్మస్థాయిలో ఒక్కొక్క కులపు జనాభా సమాచారం కాకపోయినా మొత్తంగా వెనుకబడిన కులాల జనాభా 56.33 శాతం అని తేల్చింది. ఒకసారి ఆ అంకె తేలిన తర్వాత అవకాశాలలో ఆ దామాషా అమలు చేస్తారా అనేది ప్రధాన సమస్య. జనాభా ప్రకారం 56 శాతం కాకపోయినా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.”
నిజానికి ఈ 50 శాతం అనే పరిమితి అర్థరహితమైనది, అన్యాయమైనది, నిరంకుశమైనది. ఎవరి జనాభా ఎంతో వారికి అన్ని అవకాశాలు, ‘జిత్నీ ఆబాదీ, ఉత్నీ హక్’ అనే ప్రజాస్వామిక సూత్రానికి వ్యతిరేకమైనది. మండల్ కమిషన్ తర్వాత గడిచిన మూడున్నర దశాబ్దాలలో ఈ ప్రజాస్వామిక సూత్రపు అవగాహన పెరుగుతున్నది. దానిపై ఆందోళనలో భాగంగానే, మొదట బీసీల జనాభా ఎంతో తేల్చండి అనే డిమాండ్ పెరుగుతూ వచ్చింది.
బిహార్ ప్రభుత్వం 2023 అక్టోబర్ 2న ప్రకటించిన కులగణన వివరాల వరకూ బీసీల జనాభా కచ్చితమైన అంకె లేదు, ఉజ్జాయింపు లెక్క మాత్రమే ఉండింది. జనాభా పెరుగుదల రేటును బట్టి 1931 గణాంకాల మీద అంచనా వేసి, 55 శాతం నుంచి 70 శాతం దాకా వేరు వేరు ఊహాగానాలు ఉండేవి. బిహార్ జనగణన మొదటిసారిగా ఆ రాష్ట్రంలో 209 కులాలు ఉన్నాయనీ, వారి జనాభా 63 శాతం అనీ తేల్చి చెప్పింది. అప్పటికి పది సంవత్సరాలకు పైగా ఉన్న కులగణన డిమాండ్ ఆ తర్వాత మరింత పుంజుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణనను సమర్థించిన భారతీయ జనతా పార్టీ, అధికారంలోకి రాగానే వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టింది. అన్ని రాజకీయ పార్టీలూ కూడా ఇటువంటి రెండు నాల్కల వైఖరినే ప్రదర్శిస్తున్నాయి. దేశవ్యాప్త కులగణన జరపాలని డిమాండ్ చేస్తూ వచ్చిన కాంగ్రెస్, తనకు అధికారం వచ్చిన కర్నాటకలో కులగణన జరిపి రెండు సంవత్సరాలు గడిచినా నివేదిక బైట పెట్టలేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కులగణన (2024 సామాజిక, విద్యా, ఆర్థిక, ఉద్యోగ కుల సర్వే) జరిగింది. లోపాలతోనైనా సరే కులగణన జరిపింది గాని పూర్తి నివేదికను బైటపెట్టకుండా, కేవలం అన్ని కులాలనూ కలిపి, బీసీ జనాభా అని ఒక అంకె ప్రకటించింది. సూక్ష్మస్థాయిలో ఒక్కొక్క కులపు జనాభా సమాచారం కాకపోయినా మొత్తంగా వెనుకబడిన కులాల జనాభా 56.33 శాతం అని తేల్చింది. ఒకసారి ఆ అంకె తేలిన తర్వాత అవకాశాలలో ఆ దామాషా అమలు చేస్తారా అనేది ప్రధాన సమస్య. జనాభా ప్రకారం 56 శాతం కాకపోయినా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
బీసీలకు విద్యలో, ప్రభుత్వోద్యోగాలలో, స్థానిక స్వపరిపాలనా సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ కు వీలు కల్పించే రెండు బిల్లులను 2025 మార్చ్ లో తెలంగాణ శాసనసభ ఆమోదించింది. ఇది ప్రస్తుతం బీసీలకు ఉన్న 29 శాతం (ఎ 7, బి 10, సి 1, డి 7, ఇ 4) కన్నా, సుప్రీంకోర్టు విధించిన పరిమితి కన్నా ఎక్కువ. ఈ బిల్లులు రాష్ట్రపతి సంతకం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈలోగా సెప్టెంబర్ 30 లోపు స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికలు జరపాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది గనుక ఆ ఎన్నికలలో 42 శాత బీసీ కోటా ఇస్తూ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది. తమ ప్రభుత్వం మార్చిలో పంపించిన బిల్లుల మీద రాష్ట్రపతి త్వరగా సంతకం చేయాలని కోరుతూ, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ప్రదర్శన జరిపి చట్టపరమైన, రాజకీయపరమైన ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వ తాత్సారం తెలంగాణకు, బీసీలకు అవమానం అని కాంగ్రెస్ అంటున్నది. బిల్లులను అడ్డుకుంటున్న భాజపా వైఖరికి భిన్నంగా, తాము స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలలో 42 శాతం టికెట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ అంటున్నది.
కాగా, ఒకవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తాము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అనుకూలమని అంటుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ రిజర్వేషన్ల బిల్లులు చట్టం కాకుండా అడ్డుకుంటున్నది. రాష్ట్రశాఖ కూడా అశ్వత్థామ హతః కుంజర అన్నట్టు బీసీ-ఇ ఉండగూడదని, ముస్లింలకు భాగం ఉండగూడదని సన్నాయినొక్కులు నొక్కుతున్నది. బీసీలకూ ముస్లింలకూ మధ్య చీలిక తేవడానికి ప్రయత్నిస్తున్నది. తెలంగాణలో కులగణనను వ్యతిరేకిస్తున్నది.
భారత రాష్ట్ర సమితి బీసీలను దూరం చేసుకోకుండా ఉండేందుకు రిజర్వేషన్ పెంపుదల ప్రయత్నాలను ఆమోదిస్తున్నామని అంటూనే కాంగ్రెస్ చిత్తశుద్ధిని మాత్రం శంకిస్తున్నది. మరొకవైపు భారత రాష్ట్ర సమితిలో ప్రస్తుతం ఉన్నారో లేదో తెలియని, శాసన సభ్యులు కె కవిత అసలు బీసీ రిజర్వేషన్లను మొదట అడిగింది తామేనని, తమ డిమాండ్ వల్లనే కాంగ్రెస్ ఆ నిర్ణయం తీసుకున్నదని, కాంగ్రెస్ కు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే చిత్తశుద్ధి లేదని అంటున్నారు. ప్రస్తుత నిర్ణయాన్ని విస్తరించాలని, ఇంకా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
నిజానికి తెలంగాణలో అధికారికంగా 112 బీసీ కులాలు (తాజా సర్వే ప్రకారం 162 – బహుశా కొన్ని ఉపకులాలు కులాలుగా నమోదై ఉండవచ్చు!) ఉండగా, అందులో విద్యా, ఉద్యోగ, సంపద, అవకాశాలలో వారి జనాభాకు తగిన లేదా కనీసం ఎంతో కొంత వాటా అనుభవిస్తున్న కులాలు పది శాతం కూడా ఉండవు. మిగిలిన తొంబై శాతం కులాలవారికి రాజకీయావకాశాలు మాత్రమే కాక మరిన్ని విద్యావకాశాలు కల్పించాలి, ప్రభుత్వోద్యోగాలు కల్పించాలి, లేదా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇంతకూ ఇప్పుడు ప్రకటిస్తున్న కోటా పెంపుదలను ఇప్పటికే అవకాశాలు పొందినవారు తన్నుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ పనులు చిత్తశుద్ధితో చేయనంతవరకూ, అందరూ మద్దతు పలికేవారే, కాని అందే సహాయం శూన్యం.