నలుగురు కలిస్తే రాజకీయం మొదలవుతుందంటారు! ఇక రాజకీయమే ఊపిరిగా కొనసాగే పార్టీల్లో దీన్ని గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది. అయితే సైద్ధాంతిక నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీ అని ప్రచారంలో ఉన్న బీజేపీలో కూడా ఇటువంటి రాజకీయాల ప్రభావం స్పష్టం కనిపిస్తుంది ! ఇటీవలికాలంలో వొస్తున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీలనుంచి బీజేపీలోకి వలసలతో పాటే అంతర్గత రాజకీయాల కలహాలు కూడా క్రమంగా పెరగడం తాజా పరిణామం. తెలంగాణలో మొత్తం జనాభా 3.70 కోట్లమంది జనాభాలో 56.33శాతం మంది వెనుకబడిన వర్గాలేనని తేలిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడే ఎన్నికవుతాడన్న ప్రచారం జరిగిన మాట వాస్తవం.
అగ్రవర్ణాల పార్టీగా ముద్రపడిన బీజేపీ అధిష్టానం కూడా దీన్నే పరిగణలోకి తీసుకుంటుందన్న ఊహాగానాలు కూడా బాగా వెల్లువెత్తాయి. కానీ ఈ ప్రచారహోరులో ఎవరూ గమనించని విషయం ఒకటుంది! రాష్ట్ర పార్టీ అధ్యక్షపదవికి పోటీపడాలంటే రెండు టర్మ్ లు పార్టీ సభ్యత్వం పొంది ఉండాలనేది బీజేపీ అనుసరిస్తున్న విధానం. పార్టీలో వందమంది సభ్యులను చేర్పించినవారినే చురుకైన సభ్యుడిగా పార్టీ గుర్తిస్తుంది. ఈ నిబంధన వలస వొచ్చిన నాయకులకు పెద్ద అడ్డంకిగా మారిందనేది నిష్టుర సత్యం. ఈనేపథ్యంలో వలస నాయకులకు మంత్రిపదవులు వొస్తాయేమో కానీ పార్టీలో కీలక పదవులు కట్టబెట్టడం కష్టం!
రాష్ట్రంలో బీసీ రాగం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, పార్టీలో బీసీలు బండిసంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి నాయకుల మధ్య పోటీ సహజం! ఇంతటి తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో అధ్యక్షుడిగా బ్రాహ్మణ వర్గానికి చెందిన రామచంద్రరావు ఎన్నికవడానికి ప్రధాన కారణం, మొదట్నుంచీ ఆర్ ఎస్ ఎస్ తో గట్టి అనుబంధం కలిగివుండటం, రామ్ మాధవ్ కు అనుయాయుడు కావడం. అజాతశత్రువు కావడం ఆయనకు కలిసొచ్చిన మరో అంశం. అంతవరకు బాగానే ఉన్నది కానీ, అధ్యక్ష ఎన్నిక ముందునుంచి బీసీ వర్గ నాయకుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరు వల్ల బయటపడుతున్న పార్టీలోని లుకలుకల ప్రభావం రాబోయే స్థానిక ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనేది పార్టీ హితైషుల అభిప్రాయం!
పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బండిసంజయ్ చూపించిన దూకుడు, తెగువ అందరినీ అకట్టుకోవడమే కాదు, రాష్ట్రస్థాయి నాయకుడిగా తనను తాను ప్రదర్శించుకోగలిగారు. ఇక ఈటల రాజేందర్ బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ విధంగా ఆయన రాష్ట్ర ప్రజలకు పరిచితులయ్యారు. కరీంనగర్, మెదక్, వరంగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో మంచి పట్టున్న నాయకుడు.
వామపక్షనేపథ్యం నుంచి రావడంవల్ల నిబద్ధత ఉన్నప్పటికీ, పార్టీ మారిన చరిత్ర ఆయనకు మైనస్‌గా మారుతోంది. అంతేకాదు ఇప్పటికీ ఆయనకు బీఆర్ ఎస్ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయన్న సంగతి రాష్ట్రం నుంచి దిల్లీ నాయకత్వం వరకు తెలుసు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందు కూడా విచారణను ఎదుర్కొన్నారు. ఈమధ్య అమిత్ షా పసుపుబోర్డు ప్రారంభం కోసం నిజామాబాద్‌కు వొచ్చినప్పుడు బహిరంగ సభలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేదా, బీఆర్ ఎస్ అవినీతి పార్టీ అవునా కాదా అని ప్రశ్నించినప్పడు ప్రజలు సానుకూలంగా స్పందిస్తే, అక్కడే ఉన్న ఈటల మౌనంగా ఉండడం అధిష్టానం గుర్తించలేదనుకోవడం పొరపాటే అవుతుంది.ఇక రాజాసింగ్ విషయానికి వొస్తే ఆయన మితిమీరిన హిందూత్వ వైఖరి పార్టీకి నష్టం తెచ్చిపెట్టేదిగా ఉంది . అంతేకాదు ఆయన పలుకుబడి పాతబస్తీకి మాత్రమే పరిమితం! అందువల్ల ఆయన అసమ్మతి వల్ల పార్టీకి పెద్దగా జరిగే నష్టం ఏమీ ఉండదు.
వలస వొచ్చిన ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందనరావు, డి. అరుణ వంటి నాయకుల్లో అసంతృప్తి ఉన్నా , వీరెవరూ ప్రస్తుతానికి ఏమీ చేయలేని పరిస్థితి! కాంగ్రెస్‌లో ఇంతకు మించిన వర్గపోరు నడుస్తుండటం, బీఆర్ ఎస్‌లో కె.సి.ఆర్. కుటుంబంలోనే నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ వలస నాయకులకు బీజేపీలో కొనసాగడం తప్ప మరో గత్యంతరం లేదు! అట్లాగని వీరెవరూ రాష్ట్ర స్థాయి నాయకులు కాదు. తమ తమ ప్రాంతాలకు మాత్రమే వీరి పలుకుబడి పరిమితం! రాష్ట్రంలో బీసీల జనాభా ఎక్కువ కనుక ఈ వర్గానికి చెందిన నాయకుడికే పార్టీ పగ్గాలు అప్పగించాలన్న వాదన లో కూడా పస లేదు! ఎందుకంటే బీసీలు సమైక్యంగా లేరు! పార్టీలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న బండిసంజయ్, ఈటల రాజేందర్‌లు ఎంతమంతి బీసీలను ప్రభావితం చేస్తారన్నది ప్రశ్నార్థకమే!
కేవలం బీసీలు మాత్రమే ఎన్నికల సమరం నుంచి పార్టీని విజయతీరాలకు చేర్చగలరు అన్నది కూడా నిజం కాదు! ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలోని అన్ని వర్గాలను సమన్వయ పరచే సమర్థుడు, కరిష్మా కలిగిన నాయకుడు ప్రస్తుతం బీజేపీకి చాలా అవసరం! సదరు నాయకుడు ఏ వర్గానికి చెందినవాడన్నది ప్రశ్న కాదు! అందువల్ల వర్గం కులం ప్రాతిపదికన జరిపే రాజకీయాలు పార్టీకి చెరుపుచేయక మానవు! కాంగ్రెస్‌లో విభేదాలు, కె.సి.ఆర్. కుటుంబ కలహాల నేపథ్యాన్ని పార్టీకి అనుకూలంగా మలచగల సమర్థనాయకుడికోసం అధిష్టానం ఇప్పటినుంచే వెతకాలి! తమిళనాడులో అన్నామలై, యు.పి.లో యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్రలో ఫడ్నవిస్, అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ వంటి నాయకత్వం రాష్ట్ర బీజేపీకి రాబోయే ఎన్నికల నాటికి అవసరమన్నది మాత్రం సుస్పష్టం!