“తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయ సమ్మేళనానికి అద్దం పడుతుంది ఈ పండుగ. గౌరీ దేవిగా, పార్వతిగా, కాళీమాతగా పూజించడంతోపాటు సంపూర్ణ స్త్రీ మూర్తికి ప్రతిబింబంగా ఆరాధించడం ఆనవాయితీగా వొస్తున్నది. మహిళ కోసమే ప్రత్యేకించబడిన ఈ పండుగ సమాజంలోని మహిళల పాత్రను, కుటుంబ కట్టుబాట్లను తెలియజేస్తుందనడానికి బతుకమ్మ పాటలే నిదర్శనం. నిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో సులభశైలిలో ఈ పాటలుంటాయి. పెండ్లీడుకు వొచ్చిన యువతులు, వివాహిత స్త్రీలు తమ అత్తవారింట్లో ఏ విధంగా మసులుకోవాలో, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే విధంగా పూర్వికులు పాటల రూపంలో అందజేశారు. నేటికి గ్రామాల్లో పాటలను ఆశువుగా చెప్పగలిగే వారున్నారు. ఇవ్వాళ కొత్తతరం, కొత్త బాణిలో కొత్తరకం పాటలు పాడిన వేల సంవత్సరాలుగా ఆనోటఈనోట విన్న పాటలే జనంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అవి ఇప్పుడు తెలంగాణ సరిహద్దులు దాటి, విశ్వవ్యాపిత మైనాయి.”
బతుకమ్మను మరోసారి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 29 సోమవారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో భారీ స్థాయిలో జరిపే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సరిగ్గా తొమ్మిదేళ్ళ క్రితం (2016) ఎల్‌బి స్టేడియంలో ‘మహా బతుకమ్మ’పేరున ఆనాటి అధికార టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఇలానే భారీ స్థాయిలో నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకుంది. ఆనాడు కూడా పదివేల 29 మంది ఆడపడుచులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆనాడు 20 అడుగుల భారీ బతుకమ్మను పేర్చి 9,292 మంది మహిళలు పన్నెండు నిమిషాలపాటు ఆటపాటలతో ప్రపంచ రికార్డు సాధించారు. అప్పటివరకు కేరళలోని ఓనమ్ పండుగకున్న గిన్నీస్ రికార్డును మహా బతుకమ్మ తిరగరాసింది. ఓనమ్ పండుగ సందర్భంగా అయిదువేల 211 మంది మహిళలు కమ్మెల్ కొట్టన్ కలీ నృత్యాన్ని కేవలం అయిదు నిమిషాలపాటు ప్రదర్శించారు. కాని మన బతుకమ్మ మహిళలు పన్నెండు నిమిషాలు భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఈ రికార్డు సాధించారు.
ఈ ఉత్సవంలో సుమారు 40 విదేశీ మహిళలు కూడా అడిపాడటం విశేషం. కాగా ఈ మహా బతుకమ్మ ప్రదర్శనకు లభించిన గిన్నీస్ బుక్ అవార్డును తెలంగాణ అమర వీరులకు అంకితం చేస్తున్నట్లు ఆనాటి నగర మేయర్ ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంకూడా ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేడుకలో కనీసం పదివేల మంది మహిళలు పాల్గొనే విధంగా సన్నద్ధం చేయాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. గతంలో గిన్నీస్ బుక్ అవార్డుకు పేర్చిన 20 అడుగుల బతుకమ్మకు ధీటుగా ఈసారి 63 అడుగుల బతుకమ్మను పేర్చాలని ప్రభుత్వం నిశ్చయించింది. అందుకు కావలసిన మౌలిక సదుపాయాలు, వేదిక, విద్యుదీకరణ, పరిసరాల పరిశుభ్రత ఏర్పాట్లను చూడాలని కూడా ప్రభుత్వం అధికారులకు సూచించింది. తెలంగాణ సంప్రదాయ పండుగను ప్రపంచ పటంలో నిలపాలన్నది ప్రభుత్వం లక్ష్యం. కేవలం సరూర్ నగర్ స్టేడియమేకాదు ట్యాంక్ బండ్, పివిమార్గ్, సచివాలయం అంతా విద్యుద్దీపాలతో అలంకించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితోపాటు అదేరోజున పీపుల్స్ ప్లాజాలోకూడా బతుకమ్మను ఆడుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అలాగే బతుకమ్మ వేడుక చివరిరోజైన 30వ తేదీన ట్యాంక్ బండ్‌పై జరిగే బతుకమ్మ సందడిలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గతంతో పోలిస్తే ఈసారి బతుకమ్మ పండుగ తెలంగాణలో అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకుంటున్నారు. వర్ణుడి తాకిడికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఇంకా నీళ్ళలో మునిగి ఉన్నప్పటికీ, చాలా చోట్ల పచ్చదనం వెల్లివిరుస్తున్నది. బతుకమ్మను తయారు చేసేందుకు ప్రధానంగా వాడే తంగేడు, గునుగు విస్తారంగా ప్రజలకు అందుబాటులో ఉండడం ఈ వేడుకకు మరింత శోభనిచ్చింది. దానికి తగినట్లు మునుపెన్నడూ లేని విధంగా ఈసారి తెలంగాణ వ్యాప్తంగా పంటలు కూడా విస్తారంగా పండాయి. పంట పొలాలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. దీంతో ప్రజల్లో పండుగ ఉత్సాహం ఉరకలేస్తున్నది. ఈ పండుగన్నది కేవలం వేడుకే కాదు.. దాని వెనుక కావల్సినంత పరమార్థం ఉంది. స్త్రీలకు సామాజిక జీవితంలో ఉండే ఆనందాన్ని తెలియజేసేందుకు మన పూర్వికులు అనేక నోములు, వ్రతాలు, పండుగలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతంలో కులమతాలకు, పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా అందరూ ఒక దగ్గర చేరి జరుపుకునే అతి పెద్ద పండుగ బతుకమ్మ. మహాలయ అమావాస్యతో బొడ్డెమ్మ పండుగ పూర్తికాగానే బతుకమ్మ పండుగ మొదలవుతుంది. వరుసగా తొమ్మిది రోజులు మహిళలు, బాలికలు అత్యంత ఆనందోత్సాహం గా జరుపుకునే ఈ వేడుక దుర్గాష్టమి నాడు ముగుస్తుంది. ఈ చివరిరోజు అత్యంత శోభాయమానంగా ఉంటుంది.
ఎంతో భక్తి శ్రద్దలతో ఇంతకాలం పూజిస్తూ వొచ్చిన బతుకమ్మను ఈ చివరి రోజున నీటిలో నిమజ్జనం చేసే ప్రక్రియ ఎంతో నయనానందకరంగా ఉంటుంది. కొన్ని వేల రంగురంగుల బతుకమ్మలు చెరువుల్లో, తటాకాల్లో, కుంటల్లో తేలాడుతుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. ఆ ఆనందం మాటలకు అలవికానిది. అందుకే దీన్ని జల సంబంధమైన పండుగగా చెబుతారు. పూలకు జలానికి దగ్గరి సంబంధం. దీనిలో కూడా పరమార్థం ఉందంటారు. ఈ పండుగ సహజంగా వర్షాకాలంలోనే వొస్తుంది. విపరీత వర్షాలకు, వరదలకు వివిధ ప్రాంతాల నుండి చెరువుల్లో కొత్త నీరు చేరుకుంటుంది. తంగేడు, గునుగుపూలకు నీటిని శుభ్రరిచే గుణముందని చెబుతారు. బతుకమ్మల నిమజ్జనంతో ఆ నీరు శుభ్రపడుతుందన్నది శాస్త్రజ్ఞులు చెబుతున్న మాట. అలాగే బతుకమ్మను పూల పండుగ, ఆటల పండుగ అంటారు.
ప్రధానంగా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయ సమ్మేళనానికి అద్దం పడుతుంది ఈ పండుగ. గౌరీ దేవిగా, పార్వతిగా, కాళీమాతగా పూజించడంతోపాటు సంపూర్ణ స్త్రీ మూర్తికి ప్రతిబింబంగా ఆరాదించడం ఆనవాయితీగా వొస్తున్నది. మహిళ కోసమే ప్రత్యేకించబడిన ఈ పండుగ సమాజంలోని మహిళల పాత్రను, కుటుంబ కట్టుబాట్లను తెలియజేస్తుందనడానికి బతుకమ్మ పాటలే నిదర్శనం. నిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో సులభశైలిలో ఈ పాటలుంటాయి. పెండ్లీడుకు వొచ్చిన యువతులు, వివాహిత స్త్రీలు తమ అత్తవారింట్లో ఏ విధంగా మసులుకోవాలో, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే విధంగా పూర్వికులు పాటల రూపంలో అందజేశారు. నేటికి గ్రామాల్లో పాటలను ఆశువుగా చెప్పగలిగే వారున్నారు. ఇవ్వాళ కొత్తతరం, కొత్త బాణిలో కొత్తరకం పాటలు పాడిన వేల సంవత్సరాలుగా ఆనోటఈనోట విన్న పాటలే జనంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అవి ఇప్పుడు తెలంగాణ సరిహద్దులు దాటి, విశ్వవ్యాపిత మైనాయి.





