స్త్రీ పురుషులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమాన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం కల్పిస్తోంది. పౌరుల పట్ల వివక్ష ముఖ్యంగా లింగ వివక్షను ఎపుడో నిషేధించారు. స్త్రీల గౌరవాన్ని కించపరిచే పని ఏదీ చేయకూడదనేది ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. స్త్రీలకు అనుకూలంగా విచక్షణ పాటించవొచ్చునని ప్రత్యేక నిబంధన ద్వారా రాజ్యాంగం వీలు కల్పించింది. స్త్రీల పట్ల అన్ని విధాలా వివక్ష నిర్మూలనకు అంతర్జాతీయ ఒప్పందం 1981 సెప్టెంబర్ 3 నుండి అమలులోకి వొచ్చింది. లింగపరంగా వ్యత్యాసాన్ని, వెలిని, ఆంక్షలను స్త్రీల పట్ల వివక్ష వంటి అంశాలను ఈ ఒప్పందం ద్వారా నిషేధించారు. తరువాతి కాలంలో పౌష్టికాహారం , స్వతంత్రంగా జీవించే స్త్రీలు, నిస్సహాయ స్త్రీలు, నెట్టివేయబడిన వర్గాలు, స్త్రీలపై హింస మొదలైన అంశాలు కూడా ఈ ఒప్పందంలో చేర్చారు. ఇంట్లో ఉన్నపుడు గృహహింసకు, ఉద్యోగాలకు వెళ్తుంటే పనిప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం’ ప్రకారం కేవలం పని ప్రదేశంలోనే కాదు, పనిప్రదేశాన్ని దాటి ఎక్కడ వేధింపులు జరిగినా అది ఆ చట్టం పరిధిలోకే వస్తుంది. ఈ చట్టం రూపకల్పనకు పదేళ్లు పడితే, నిబంధనలు రూపొందించి చట్టం అమలులోకి రావడానికి మరో మూడేళ్లు పట్టింది. ఈ చట్టంపై సంపూర్ణ అవగాహన లేక మహిళలు సకాలంలో స్పందించలేకపోతున్నారు. లైంగిక వేధింపులకు గురిచేయడం అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15లను, స్త్రీల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. ఆర్టికల్ 21 ప్రకారం హుందాగా జీవించే హక్కు, వృత్తి, ఉద్యోగం, వాణిజ్యం లేదా వ్యాపారం ఏ పని చేపట్టినా లైంగిక వేధింపులు లేని వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఆయా సంస్థలపైనే ఉంది. ఈ కేసుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలచింది. ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీల్లో లైంగిక వేధింపుల నిరోధక అంతర్గత కమిటీలను నియమించాలి, ప్రతి జిల్లాలో కలెక్టర్ల అధ్యక్షతన ఫిర్యాదుల కమిటీలను నియమించాలి, ఆ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఉద్యోగులు, దినసరి, తాత్కాలిక, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో పనిచేసే మహిళలందరికీ ఈ చట్టం కింద రక్షణ లభిస్తోంది. ఈ చట్టం కింద వచ్చిన ఫిర్యాదులను 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి 60 రోజుల్లో తదుపరి చర్యలు తీసుకుని దానిని ప్రచురించాల్సి ఉంటుంది. ఉద్యోగినికి మూడు నెలల సెలవుతో పాటు వేధింపులకు గురిచేసే వ్యక్తిని బదిలీ చేయాలని కోరే హక్కు కూడా ఆమెకు కల్పించారు. చర్యలు తీసుకోని సంస్థలపై తొలి తప్పిదం కింద 50వేలు మళ్లీ తప్పు చేస్తే లక్ష జరిమానాతో పాటు ఆ సంస్థ లైసెన్స్‌ను రద్దు చేయడం, న్యాయపరమైన చర్యలకు కూడా అవకాశం కల్పించారు. కాని సంప్రదాయంగా వస్తున్న సమాజంలో అనేక ఇబ్బందులు ఇంకా తొలగిపోలేదు. ఏ దేశంలో లేని వైవిధ్యమైన హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారత్‌లో ఉంది. ఆరువేల సంవత్సరాల క్రితం నుండి వస్తున్న హిందూ ధర్మం (వేదకాలం) నుండి అనేక రూపాంతరాలు చెందుతూ స్మృతులను దాటి సంప్రదాయాలు, ధర్మసూత్రాల ప్రాతిపదికగా ఒక స్వరూపాన్ని పొందింది. ఆధునిక యుగంలో సమానత్వం, న్యాయం, సామాజిక స్పృహ, పూర్వపు శాసనాలు, తీర్పులు, ఆదేశాలు, చట్టాలు ప్రాతిపదికన సమాజం నడుస్తోంది.
మిగిలిన మతాలు కూడా కొన్ని విషయాల్లో మినహాయించి మిగిలిన అన్ని చట్టాలు అందరికీ వర్తించేలా రూపొందించినవే. ఉన్నత విలువలను వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుండి గ్రహిస్తున్నా, స్త్రీని గౌరవించాలని అన్ని మతాల గ్రంథాలూ నూరిపోస్తున్నా లింగవివక్షను పురుషుడు ప్రదర్శిస్తూనే ఉన్నాడు. స్త్రీ – పురుషులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ సమానమనే భావనను పునరావగాహన చేసుకునే సమయం ఆసన్నమైంది. జ్ఞానంలోనూ, శారీరక సామర్ధ్యాలలోనూ, సమర్థతలోనూ ఆలోచన , వివేచన, విశ్లేషణ రంగాల్లోనూ మగవారికి ఏ మాత్రం తీసిపోరని ఇప్పటికే మన చుట్టూ ఉన్న విజయవంతమైన మహిళలను చూస్తే అర్థం అవుతుంది. బ్యాంకింగ్, ఐటీ, విమానయాన రంగం, అంతరిక్ష రంగం, సైన్యంలోనూ, బహుళజాతి పారిశ్రామిక సంస్థలోనూ వారు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. చాలా సందర్భాల్లో పురుషుల విజయాలను అధిగమించి స్త్రీలు సాధించిన మహోన్నతమైన ఆవిష్కరణలు ఆనాటి ఫ్రాన్స్ భౌతిక రసాయన శాస్తవ్రేత్త మేరీ క్యూరీ మొదలు మనం చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్నా పురుషులతో పోలిస్తే మహిళలే తమను తాము తక్కువగా భావించే సామాజిక ఒత్తిడిలో ఎదుగుతున్నారు. దీనికి తగిన చైతన్యం లేకపోవడమే ప్రధాన కారణం. ఆ దిశగా మరింత కృషి జరగాల్సి ఉంది.
-ఎం.నిర్మల





