జయజయ ధ్వానాలతో వైకుంఠ ద్వారదర్శనం
ఉత్తర ద్వారంలో వైకుంఠ రాముడిని చూసి తరించిన భక్తజనం
ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వారదర్శనం శుక్రవారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛరణలు, దూపదీపాల నడుమ జయ జయ గంటలు మోగుతుండగా స్వామివారి దర్శనాన్ని చూసి తరించే ప్రతీ భక్తుడు జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. అంటూ తన్మయంతో వైకుంఠ రాముడి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఆ గడియలు ఆసన్నమయ్యాయి.
గరుడ వాహనరూపుడైన రామచంద్రుడు భక్తులకు శ్రీమహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చ కులు స్వామివారికి విశేష ఆరాధన, శ్రీరామ పదాక్షరీ మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన, చతుర్వేదాలు, గరుడ ప్రబంధాలు, ఇతిహాసాలు, శరణాగతి గజ్జగరుడ దండం, భక్తరామదాసు రచించిన దాశరథి శతకాన్ని పఠించారు. వైకుంఠ రాముడికి అష్టోత్తర శత హారతినిచ్చారు. భక్తరామదాసు కాలం నుంచి వొస్తున్న సంప్రదాయం ప్రకారం భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్ మూలవరులకు స్నపనం నిర్వహించారు.





