‘నువ్వు యెవరినైనా ప్రేమించావా?’ తల్లి అడిగినప్పుడు కూడా ‘ఎట్రాక్షన్ వరకూ వెళ్ళి ఆగిపోయానే కాని లవ్ వరకూ పోలేదు’ అని చెప్పింది యంగ్ రాధి… రాధిక. ‘మీరు చూసినవాణ్ని చేసుకుంటాను’ అని కూతురు అన్నప్పుడు తండ్రి కూడా నమ్మలేకపోయాడు. ఈ కాలంలో కూడా యిలా వుండడం తన సర్కిళ్ళల్లో సహితం చూడలేదు. తమ పెంపకం మీద గొప్పలు పోలేదు. అంచేత హేపీ ఫీలవలేదు. సహజంగా జరగాల్సిందేదో జరగలేదే అని అనుకున్నారు రాధి తలిదండ్రులు. ఎంతకాదన్నా అది వొక లోటుగానే ఫీలయ్యారు. ఎందుకంటే యెవరి లైఫ్ పార్టనర్‌ని వాళ్ళే చూజ్ చేసుకోవాలని వాళ్ళిద్దరూ నమ్మారు. ‘నీ నుంచి కండిషన్స్ యేమన్నా వుంటే చెప్పు’ అని తలిదండ్రులు కూతురిని అడిగారు. ‘ఓన్లీ వన్ కండిషన్’ అంది రాధి. ఆ కండిషన్ విన్నాక షాకయ్యారు తలిదండ్రులు. మావల్ల కాదు, నువ్వే చూసుకో అని నోటిదాక వచ్చినా ఆగిపోయారు. ముందు ప్రయత్నించి చూద్దామని అనుకున్నారు. కాని దిగితేకాని అది సాధ్యం కాదని వాళ్ళకు అర్థమయ్యింది.
ఈ వింత యెక్కడా చూడలేదన్నారు మిత్రులు. ఎందుకు చూడలేదు, జానకి దొరికాకే రాముని జననం అని అన్నవారూ లేకపోలేదు. ప్రిన్స్ హ్యారీ, నిక్ జోనస్, రితీష్ దేశముఖ్ మొదలు సచిన్ దాక యెందర్నో తలచుకున్నవారూ లేకపోలేదు. సింగర్ షకీరాని ఆదర్శంగా తీసుకున్నట్టుంది అని గుసగుసలాడిన వారూ లేకపోలేదు. కులాంతరాల్ని మతాంతరాల్ని దేశాంతరాల్ని ప్రోత్సహిస్తే ప్రోగ్రెస్ అన్న జనమే ఏజ్… వయసు అంతరాలకు వొప్పుకోవడం లేదు. తనకన్నా పదేళ్ళ చిన్నవాడిని మాత్రమే పెళ్ళి చేసుకుంటానని రాధి పెట్టిన కండిషన్ నెరవేర్చడానికి ఆ తలిదండ్రులకు శక్తి చాలలేదు. ‘నిజమే కదా, తనకన్నా యెంత చిన్నవాళ్ళనయినా పెళ్ళి చేసుకొనే వీలు మగాళ్ళకి వున్నప్పుడు ఆడాళ్ళకి ఆ అవకాశం యెందుకు వుండకూడదు?’ అనుకున్నాక కూతుర్ని మరేమీ అనలేకపోయారు.
‘నీకన్నా పదేళ్ళ చిన్నవాడిని పెళ్ళి చేసుకోవాలని యెందుకు అనుకుంటున్నావు?’ యెప్పుడూ దేనీకీ కారణం అడగని తండ్రి తొలిసారిగా కూతుర్ని కారణం అడిగాడు.‘మగాళ్ళకు పోయేవరకూ వుంటుందనీ మరి మన ఆడాళ్ళకు మెనోపాజ్ తర్వాత తగ్గుతుందనీ దీని గురించి మీరంతా ప్రవేటు మీటింగుల్లో మాట్లాడుకుంటారే గాని, అందుకు పరిష్కారంగా చిన్నవాడిని చేసుకుంటే ఆ అనీవెన్ యెంతో కొంత తగ్గుతుంది కదా?’ అని కూతురు అడగడం తల్లికి గుర్తుకు వచ్చింది, కాని ఆ విషయం భర్తతో చెప్పలేకపోయింది. తండ్రి మాటకు జవాబుగా ‘అలా అయితే నేను పోయేవరకూ తోడుంటాడు’ అంది రాధి. తలిదండ్రులకి అర్థం కాలేదు. ‘పెళ్ళి చేసుకొని ఆఖరిరోజుల్లో వొంటరిగా వుండడం నావల్ల కాదు’ రాధి మాట పూర్తికాకుండానే ‘యెవరు ముందుపోతారో యెలా తెలుస్తుంది? నేనే ముందు పోతానేమో మీ నాన్నకన్నా’ ఆందోళనగా అంది తల్లి.
‘నువ్వు చెప్పింది నిజమే, యెవరు యెప్పుడు పోతారో యెవరికీ తెలీదు. అది జనరల్. అదే సైంట్‌ఫిక్‌గా చూసినప్పుడు యెక్కువమంది మగాళ్ళు ముందు పోతారు. ఆడాళ్ళు ఆలస్యంగా పోతారు. నాకు అయిదోతనమూ గాడిదగుడ్డూ అని నమ్మకమేం లేదు. పోయేవరకూ కంపేనియన్‌షిప్ కావాలి. ఇప్పుడే పార్టనర్ని చూసుకోలేని దాన్ని అప్పుడేం చూసుకుంటాను?’ అంది రాధి. ఆమె తలిదండ్రులు యిద్దరూ మూగవాళ్ళయిపోయారు, వొకర్నొకరు చూసుకొని తిరిగి కూతురువంక చూశారు.అప్పుడు రాధి సెల్ తీసి సాక్ష్యంగా వీడియో చూపించింది. ‘నేను ఏమ్బీబియస్ చదువుతున్నప్పుడు వొక ప్రొఫెసర్‌గారు చెప్పారు. ప్రతి స్త్రీ లైఫ్‌లో పదేళ్ళు పిల్లలూ ఫ్యామిలీకోసం సాక్రిఫైజ్ చేస్తుంది. అందుకనే దేవుడు ఆడవాళ్ళకి పదేళ్ళ ఆయస్సు యెక్కువ యిస్తాడు. ఇది మన ఆడవాళ్ళకు గాడ్ యిచ్చిన గిఫ్ట్. సో పిల్లలకు భర్తకు పెట్టిన ఫుడ్ మీరూ తినండి.
ఎక్సైజ్ చెయ్యండి. మనకి మనం టైం యిచ్చుకోవాలి…’ చెప్పుకుపోతోంది. తండ్రి సెల్ తీసుకొని పాజ్ చేసి ఆ డాక్టర్ వెనుక వున్న హాస్పిటల్ పేరూ ముందు బోర్డుమీద ఆమె పేరు చూశాడు.
తండ్రి చేతుల్లోంచి సెల్ తీసుకుంటూ ‘యెవరు చెప్పారు అన్నది కాదు, అందులో పాయింట్ వుందా లేదా అన్నదే ముఖ్యం’ అంది రాధి, తన పెళ్ళి విషయంలో పాయింట్‌కు కట్టుబడినట్టు. తను యే కండిషన్ వల్ల ఆ కండిషన్ పెట్టిందో అర్థమయ్యాక ఆమె తలిదండ్రులు ఆలోచనలో పడ్డారు.‘రిలేషన్ షిప్పులో వుమెన్ కంటే మెన్ చిన్నవాడయితే, యెంతో కొంత పేట్రియార్కీ తగ్గుతుందేమో.’ సమానత్వం దిశగా ఆలోచిస్తూ ఆ మాట పైకే అనేసింది రాధి.
-బమ్మిడి జగదీశ్వరరావు