ఇటీవలి కాలంలో “ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్” (కృత్రిమ మేధ) గురించి తరచుగా వింటున్నాం. ఉద్యోగులు చేసే దాదాపు అన్ని పనులు కృత్రిమ మేద చేయగలుగుతుందని దీని పర్యవసానంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగులుగా మారుతారనే భయాందోళనలు ప్రజల్లో ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అసలు కృత్రిమ మేద అంటే ఏమిటి, నిజంగానే దీని వలన ఉద్యోగాలు కోల్పోతారా, దాని తక్షణ-సమీప భవిష్యత్తు ప్రభావాలు, పర్యవసానాలు, దుష్పరిణామాలు, వాటిని ఎదురుకోవడానికి ప్రభుత్వాలు చేయవలసిన పనుల గురించి క్లుప్తంగా చూద్దాం. ముందుగా కృత్రిమ మేద అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అనేది కంప్యూటర్లకు “తెలివి” నేర్పించే శాస్త్రం. మనుషుల వలే విషయాలు గ్రహించి, విశ్లేషించి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కంప్యూటర్లకు కల్పించడమే దీని ఉద్దేశం. కంప్యూటర్లకు పెద్ద మొత్తంలో డేటాను ఫీడ్ చేయడం ద్వారా కృత్రిమ మేద ఆ డేటాను విశ్లేషించి నమూనాలను (patterns) గుర్తించి అంచనాలు (predictions) వేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, ఇది కంప్యూటర్లకు పరిమితంగా ఆలోచించగల సామర్థ్యాన్ని ఇచ్చినట్టే. అయితే అవి మనుషుల వలె భావోద్వేగాలు కలిగి ఉండవు. చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ, మెటా, గూగుల్ డీప్ మైండ్, అమేజాన్, గ్రోక్, డీప్ సీక్ తదితర ఎన్నో కంపెనీలు వందల బిలియన్ డాలర్లను ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ పైన వెచ్చించాయి.
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అనేక రంగాలలో పరిమితంగా లేదా విస్తృతంగా ఉపయోగించబడుతోంది. కింది రంగాలలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది:
ఆరోగ్య రంగంలో డయాగ్నోస్టిక్స్ (ఉదాహరణకు క్యాన్సర్ గుర్తింపు), ఔషధ తయారీ, రోబోటిక్ సర్జరీ, వర్చువల్ వైద్య సహాయకులు, మెడికల్ ఇమేజింగ్ ఎనాలిసిస్; బ్యాంకింగ్-ఆర్థిక రంగంలో మోసాల గుర్తింపు, ఆల్గోరిథ్మిక్ ట్రేడింగ్, రిస్క్ అసెస్‌మెంట్, కస్టమర్ సపోర్ట్ చాట్‌బాట్‌లు; విద్యారంగంలో వర్చ్యువల్ ట్యూటర్లు; రవాణా రంగంలో సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు, ట్రాఫిక్ నియంత్రణ; మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో రోబోటిక్స్-ఆటోమేషన్, క్వాలిటీ కంట్రోల్; వ్యవసాయ రంగంలో పంటల పర్యవేక్షణ, దిగుబడి అంచనా, రోగాల గుర్తింపు, పురుగుమందుల సూచనలు, వాతావరణ అంచనా; అంతర్గత భద్రత మరియు నిఘా రంగంలో ఫేసియల్ రికగ్నిషన్, చొరబాటుదారుల గుర్తింపు; కస్టమర్ సర్వీస్ రంగంలో AI ఆధారిత చాట్ బోట్, ఆటోమేటెడ్ వాయిస్ కాల్ ఇంకా వినోద రంగం తదితర అనేక రంగాల్లో ఇప్పటికే AI ఉపయోగించబడుతోంది.
AI ప్రభావాలు, పర్యవసానాలు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా ప్రకారం రానున్న 5 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ కారణంగా 83 మిలియన్ (8.3 కోట్లు) ఉద్యోగులు నిరుద్యోగులు కానున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య 1.2 కోట్ల దాకా ఉండవచ్చని WEF అంచనా వేసింది. పరిపాలనా రంగం (Administration), కస్టమర్ సపోర్ట్ (బీపీఓ/కాల్ సెంటర్), సాఫ్ట్ వేర్ (టెస్టింగ్, కోడింగ్), డేటా ఎంట్రీ, రిటైల్ రంగం, అకౌంటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో మానవ శ్రమను AI మరియు ఆటోమేషన్ భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో 20% కోడింగ్/ప్రోగ్రామింగ్ ఇప్పటికే AI చేస్తుండగా రానున్న 1-2 సంవత్సరాల్లో 90% కోడింగ్/ప్రోగ్రామింగ్ AI చేయగలదని అంచనా. సాధారణ ప్రజలు AI మూలంగా ఓవైపు ఉద్యోగాలు కోల్పోతే మరోవైపు కంపెనీలు మాత్రం వాటి లాభాలను వందల వేల రెట్లు పెంచుకోనున్నాయి. ఉదాహరణకు ఒక్క AI చాట్‌బాట్ వేల మంది ఉద్యోగులను భర్తీ చేయగలదు ఫలితంగా, లాభాలు ఉద్యోగులకు కాకుండా, కంపెనీ యజమానులకే వెళ్లిపోతాయి. తద్వారా సమాజంలో సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది.
ఇటీవల వచ్చిన కొన్ని తీవ్రమయిన ఆర్ధిక సంక్షోభ సమయాల్లో కూడా ఏఐ లో పెట్టుబడులు పెట్టిన గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ తదితర కంపెనీలు అనేక బిలియన్ డాలర్ల లాభాలను గడించాయి. కాబట్టి ఇప్పటికే భారతదేశంలోని 90 శాతం సంపద కేవలం 10 శాతం మంది చేతుల్లో ఉండగా ఈ వ్యత్యాసం మరింతగా పెరిగే అవకాశం ఉంది. పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా తయారవనున్నారు. నిర్యుద్యోగం వినియోగదారుల కొనుగోలు శక్తిని హరించివేయడం వలన వినియోగాదారిత ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. కొనుగోలుదారులు లేకపోవడం వలన సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు నడవలేని పరిస్థితి ఏర్పడి నిరుద్యోగం మరింతగా పెరుగుతుంది. మిలియన్ల మంది నిరుద్యోగులై, ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేకపోతే, ప్రజల్లో అసహనం, నిరాశ, భయంకరమైన స్థితిలోకి మారి ఆందోళనలు, తిరుగుబాట్లు మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. “సంపద పంపిణీ చేయాలని, వ్యవస్థను కూలగొట్టాలనే” నినాదాలు ఇచ్చే రాడికల్ భావజాలం వైపు ప్రజలు ఆకర్షింపబడుతారు. నిరుద్యోగం, పేదరికం, ఆకలి చావులు, ఆర్థిక అసమానతలు నెలకొన్నప్పుడు తిరుగుబాట్లు జరిగిన ఘటనలు చరిత్రలో అనేకం ఉన్నాయి.
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వల్ల చాలా వేగంగా తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ వ్యాప్తి చెందుతోంది. ఫేక్ ఫోటోలు, వీడియోలు చాలా సహజంగా కనిపించేట్టు AI చేయగలదు. మనం చూసేది, చదివేది నిజామా కాదా అని గుర్తించటం కష్టంగా మారుతుంది. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం ఫలితాల మానిప్యులేషన్ కోసం వాడుకునే ప్రమాదం ఉంది. తద్వారా ప్రజలకు ఎన్నికల పైన, వ్యవస్థ పైన అవిశ్వసం పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ కంపెనీలు AI ని నిఘా కోసం ఉపయోగిస్తున్నాయి. ఫేసియల్ రెకగ్నిషన్, ఎమోషన్ ట్రాకింగ్, సోషల్ మీడియా మానిటరింగ్ AI ద్వారా సులభతరం అవుతుంది. నిఘా పరికరాలు మరింత చౌకగా, సమర్థవంతంగా మారనున్నాయి. ప్రభుత్వాలు ప్రజలను నియంత్రించే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. AI ఆధారిత నిఘా వ్యవస్థలు సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికంటే, నిరంకుశ సాధనాలుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీనికి వ్యతిరేకంగా మానవ హక్కులను కాపాడే స్పష్టమైన విధానాలు అవసరం.
వ్యవస్తీకృత సంస్కరణలు
AI వలన ఉత్పన్నమయ్యే ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలకు పరిష్కారంగా సమాజంలో గణనీయమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది.
అనేక ఆర్థికవేత్తలు మరియు సాంకేతికరంగ నిపుణులు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ (UBI) ను ఒక పరిష్కార మార్గంగా సూచిస్తున్నారు. ఇది డబ్బును ఆర్థిక వ్యవస్థలో ప్రవాహంలో ఉండేలా చేస్తుంది. ప్రతి పౌరుడికి ఉద్యోగ స్థితితో సంబంధం లేకుండా నిర్ధిష్ట మొత్తంలో ఆదాయం ప్రభుత్వం నుండి కేటాయించబడుతుంది. దీని ద్వారా ఉపాధి కోల్పోయిన ప్రజలు తమ మౌలిక అవసరాలు తీర్చుకోగలుగుతారు.
వెల్త్ టాక్స్ / ఏఐ-రోబో టాక్స్
ప్రభుత్వాలు AI ఆధారిత కంపెనీలపై లేదా అత్యంత ధనిక వ్యక్తులపై ప్రత్యేక పన్నులు విధించాలి. దీని ద్వారా AI వలన కొద్ది మంది వద్ద కేంద్రీకృతమవుతున్న సంపద తిరిగి సామాన్య ప్రజల చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ UBI, విద్య, వైద్యం, మౌళిక సదుపాయలు వంటి సామాజిక కార్యక్రమాలకు వినియోగించవచ్చు.
చిన్న పనివారాలు / ఉద్యోగ పంపకం (Shorter Work Weeks / Job Sharing)
ఒకే పని మొత్తాన్ని కొంత మందికి కాకుండా ఎక్కువ మందికి పంచితే, ఉద్యోగాలు ఎక్కువ మందికి అందుతాయి. ఉదాహరణకు… సాధారణంగా 5 గురు మంది 40 గంటలు పని చేస్తుంటే, అదే పని 10 మంది 20 గంటల చొప్పున చేస్తే పని పంచబడి, రెండింతల మందికి ఉపాధి కలుగుతుంది. దీని ద్వారా నిరుద్యోగాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
ప్రభుత్వ యాజమాన్యంలో ఏఐ ఉండేలా చూడడం
AI చాలా సంపద సృష్టించగల సామర్థ్యం కలిగిందే కాక అత్యంత శక్తివంతమైంది. ఆ సంపదను, ఆ శక్తిని కొద్ది మందికి అందుబాటులో ఉండేలా కాకుండా అందరికీ లభించేలా చేయడానికి ఏఐని ప్రభుత్వ యాజమాన్యంలో ఉంచాలి. రైతులు, విద్యార్థులు, వైద్య వాలంటీర్ల వంటి వర్గాలకు AI టూల్స్ ఉచితంగా లేదా చౌకగా అందించాలి. AI ని విభిన్న భాషలు, సంస్కృతులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండవలసిన అవసరం ఎంతయినా ఉంది. తెలుగు వంటి ఇతర ప్రాంతీయ భాషల్లో ఓపెన్ సోర్స్ AI టూల్స్ అభివృద్ధి చేయడం ద్వారా అందరికీ AI అందుబాటులోకి తీసుకురావొచ్చు. ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు కలిసి AI టెక్నాలజీని అభివృద్ధి చేయాలి. AI మౌలిక వనరులు (డేటా, మోడల్స్, కంప్యూటింగ్ పవర్)పై కూడా పూర్తి ప్రభుత్వ యాజమాన్యం, అజమాయిషీ ఉండాలి. AI మోడల్స్ ట్రెయిన్ చేసే డేటాలో విభిన్న జాతులు, భాషలు, లింగాలు ప్రతిబింబించాలి తద్వారా వివక్షకు అవకాశం లేకుండా ఉంటుంది. సంస్కృతి పట్ల గౌరవం, ప్రాంతీయ అవసరాల గుర్తింపు వంటి అంశాలు AI రూపకల్పనలో భాగమయ్యేలా చూడాలి. AI నిష్పక్షపాతంగా అందరికీ సమానంగా ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలి
నియంత్రణ
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ప్రభావం మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీపై తీవ్రంగా పడే అవకాశం ఉంది కనుక దాని నియంత్రణ గురించి ఆలోచించాలి. మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ ప్రైవసీ వంటి విలువలను AI గౌరవించేలా చట్టాలు రూపొందించాలి. అంతిమంగా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ నూతన టెక్నాలజీ. టెక్నాలజీ ఎప్పుడూ ప్రగతిశీలమే తప్ప పురోగమనం కాదు. తప్పుకుండా AI ని మనం ఆహ్వానించాల్సిందే కానీ దాని వలన నిరుద్యోగం పెరగకుండా చూడడం, సంపదను కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడడం, దాని ఫలాలు కొందరికే చెందేలా కాకుండా అందరికీ దక్కేలా, దానిపై అజమాయిషీ కార్పొరేటు సంస్థలకే కాకుండా ప్రభుత్వం /ప్రజల చేతుల్లో ఉండడం, కులం-మతం-ప్రాంతం-భాష ఆధారంగా AI వివక్ష ప్రదర్శించకుండా చూడడం, తప్పుడు సమాచారాన్ని నియంత్రించడం తదితర దుష్పరిణామాలను అడ్డుకోవడానికి పైన పేర్కొన్న సంస్కరణలు చేపట్టాలి.
ఇప్ప పృథ్వి రెడ్డి, సాఫ్ట్ వేర్ ఉద్యోగి, తెలంగాణ





