సంప్రదాయ రామదాసు భక్తులు మార్టిన్, హవార్ట్ లు రాసిన దానిని విశ్వసించారు. అయితే యక్షగాన రచయితలు, కవులు రామ, లక్ష్మణులు మారువేషంలో అబుల్ హాసన్ తానాషాకు కనిపించి రామదాసు చెల్లించవలసిన మొహరీలని ‘రామటెంకె’ల రూపంలో బంగారునాణేలుగా చెల్లించినట్టు చెబుతారు. ఇక్కడ ఇంకోవిషయం చెప్పాలి. రామదాసుకు కబీర్ దాసు ‘రామతారకమంత్రం ‘ఉపదేశించినట్టు రజనీ రాశారు (పుట 29). కానీ, భాగవతుల సుబ్రహ్మణ్యం తన పుస్తకం ‘భక్తరామదాసు’లో దీన్ని నిర్ద్వందంగా ఖండించారు.
కబీర్ దాసు 15వ శతాబ్ది వాడని, రామదాసు 17వ శతాబ్ది వాడని, వీరిరువురి మధ్య శతాబ్దం పైగా కాలాంతరం ఉందని, అందువల్ల రామదాసుకు కబీర్ ‘రామతారకమంత్రం’ ఉపదేశించినట్టు చెప్పటం సుతాము అసంబద్ధం’ అని సుబ్రహ్మణ్యశర్మ వాదన. నిజానికి కబీర్ కాలం 15వ శతాబ్దమేనని అనేక రచనలు నిరూపిస్తున్నాయి. ఏటుకూరి బలరాం అనే కమ్యూనిస్టు చరిత్రకారుడు తన ‘ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర’ పుస్తకంలో రామదాసనే కంచర్లగోపన్న 17వ శతాబ్దంలో ఉన్నాడని, అప్పటికి తురకరాజుల ప్రాబల్యం దక్షిణాదిన పెరగటంతో, రామభక్తిని ఉద్యమంగా మరల్చి హిందువుల ఐక్యత కాపాడాడని రాసుకొచ్చారు.
కొండపల్లి రామచంద్రరావు రాసిన ‘శ్రీ భద్రాచల క్షేత్ర చరిత్రము’ (1957)లో ప్రచురితమైంది. ఇందులో రామదాసు జననకాలం ఇవ్వకపోయినా ఆయన 1670లో పాల్వంచ-భద్రాచలం పరగణాధికారిగా నియమితుడైనట్టు పేర్కొన్నారు. అయితే వీరు అబ్దుల్ కుతుబ్ షా 1669లో మరణించినట్టుగా కృష్ణజిల్లా మాన్యువల్ ను ఉదహరిస్తున్నారు. 1674 వరకు భద్రాచలం రామమందిర నిర్మాణం గావించి అదే సంవత్సరం కారాగార బంధితుడైనట్టు రాసుకొచ్చారు. పన్నెండేళ్ల ఖైదు అనంతరం 1686లో విడుదలై తిరిగి భద్రాచలం చేరినట్టు ఈయన రాశారు.
అయితే వీరు కూడా రామ లక్ష్మణులు తానాషాకు గనిపించి దేవాలయమునకైన రొఖ్ఖమును ‘రామటెంకెల’ రూపంలో చెల్లించి రామదాసును విడిపించారనే రాసుకొచ్చారు. ఇది ఇంతకు పూర్వం పేర్కొన్న వికీపీడియా కథనానికి పూర్తిగా భిన్నమైన కాల ప్రమాణం. అంతేగాక, తానాషా 1687లో పదవీచ్యుతుడై ఔరంగేజేబు వద్ద చాలాకాలం బందీగా ఉన్నాడు. కానీ, వికీపీడియా ప్రకారం రామదాసు 1688లోనే, అంటే బందిఖానానుంచి విడుదలైన రెండేళ్లకే, కాలం చేసినట్టుగా ఉంది. ఈ విషయమై ఏ రచయిత/ పరిశోధకులు స్పష్టత ఇచ్చే స్థితి అందుబాటులో ఉన్న సాహిత్య పరిశీలనలో లేదు.
శివాజీ మహారాజ్ మాటకొస్తే ఆయన ఒకసారి గోల్కొండ వచ్చారని వేదం వెంకటరాయశాస్త్రి తన ‘ది స్టోరీ అఫ్ అక్కన్న, మాదన్న’ అనే పరిశోధనాగ్రంధంలో రాశారు. ప్రహ్లాదనీరాజి అనే రాయబారి మాదన్నను సంప్రతించినమీదట ఉభయులకూ లాభం చేకూరేలా మాదన్న రాయబారామును నెరిపించారు. ఫలితంగా శివాజీ గోల్కొండ కొచ్చి అక్కడ బస చేసారని వేదం వెంకటరాయ శాస్త్రి రాశారు (పుట 42). కానీ శివాజీ ఈ సంధిలో కుదిరిన ఒప్పందమును ఉల్లంఘించి, మాదన్నను మోసం చేశారు. అటువంటిది చారిత్రకవాస్తవం కాగా కొందరు చరిత్రకారులు శివాజీ చెప్పినందునే తానాషా రామదాసును ఖైదు నుంచి విడిపించెనని వాదించారు. ఇది అవాస్తవమని వేదం వెంకటరాయశాస్త్రి రాసిన రచన స్పష్టం చేస్తుంది. కొందరు ఇంకొంచెం ముందుకు వెళ్లి మాదన్న, అక్కన్నలు మహారాష్ట్రీయులని, ఇక్కడికి వలస వచ్చారని కూడా రాశారు. అయితే వేదం వెంకటరాయశాస్త్రి దీనిని సమూలంగా ఖండించారు.
వారు పింగళి వంశస్థులని, నియోగి బ్రాహ్మణులని, రామదాసు తల్లివైపువారని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ వేదం వెంకటరాయశాస్త్రి ఒక మెలిక వేశారు. ఆ మెలికేమిటంటే తానాషాకు కంచర్ల గోపన్న (రామదాసు)పై ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ తానాషా వాటిని ఏనాడు పట్టించుకోలేదని. చివరకు ఈ ఫిర్యాదులు నానాటికీ పెరిగిపోగా, ఆయన రామదాసును కొలువుకు రప్పించి విచారించారు. అయితే, ఆ విచారణలో వారికి రామదాసు పరమభక్తుడని, నిర్దోషని తేలటంతో ఎటువంటి శిక్ష వేయకుండా రాచమర్యాదలతో తిప్పి పంపించేశారని వేదం వెంకటరాయశాస్త్రి రాశారు (పుట 88). ఈ వ్యాఖ్యానం రజినీకాంతరావు వ్యక్తంచేసిన భావాలను ఖండిస్తోంది.
ఆరుద్ర, వేదం వెంకటరాయశాస్త్రి ’12 ఏళ్ల జైలుశిక్ష తరువాత దయతో క్షమించి, విడిచిపెట్టమని అక్కన్నా, మాదన్నలు కోరినమీదట తానాషా రామదాసును జైలునుంచి విడుదల చేసినట్టు ‘ రజనీ పేర్కొన్నారు. ఇలా కంచర్ల గోపన్న అనే రామదాసు జీవిత చరిత్ర అనేక ఖండన మండనాలతో, పరస్పర విరుద్ధ రచనలతో నేటికీ అపరిష్కృతంగానే ఉంది. వీటన్నింటిలో నిజమేమంటే రామదాసు దాశరధీ శతకం, రామదాసు కీర్తనలు, భద్రాచలంలో రామదాసువారు శ్రీ రామలక్ష్మణులకు చేయించిన బంగారు ఆభరణాలు. ఎప్పటికైనా ఈ ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు లభిస్తాయా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. (వ్యాసం ముగిసింది)
డా. కొప్పరపు నారాయణమూర్తి





