లడ్డూ వివాదాన్ని కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మార్చేసి, భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీ సే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నడుస్తుండటం విషాదం. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం, రాజకీయాలకు పరిమితం కావాలి తప్ప ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. మనోభావాల పేరుతో నడిపే రాజకీయాల వల్ల టీడీడీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని టీడీపీ, వైఎసఆర్‌సీపీలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. సిట్ నివేదికపై చంద్రబాబు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్‌కుమార్‌నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించడంతో, ఇది కోర్టు ధిక్కారమంటూ సుబ్రహ్మణ్యస్వామివేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేయడం తాజా పరిణామం. ప్రభుత్వం పాలనాపరమైన విచారణకు ఆదేశాలు జారీచేసిందని, సిట్ కొన్ని ప్రత్యేక పరిధుల్లో మాత్రమే దర్యాప్తు చేసిందని స్పష్టం చేసింది.
ప్రభుత్వం కేవలం పాలనా వైఫల్యాలను గుర్తించేందుకే ఈ కమిషన్ వేసినందువల్ల ఇందులో క్రిమినల్ విచారణను అతిక్రమించిందేమీ లేదని స్పష్టం చేసింది.నిజానికి తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ-సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో గత జనవరిలో ఛార్జ్‌షీటు దాఖలు చేసిన తర్వాత ఆ సంగతి అంతటితో వదిలేయక, బురదచల్లుడు రాజకీయంతో మొత్తం పరిస్థితిని అయోమయంలోకి తీసుకెళ్లిన పాపం తెలుగుదేశం ప్రభుత్వానిదే. లంకాదహనం నాటకంలో హనుమంతుడి తోకకు నిప్పుపెట్టే సీన్‌లో ఆ పాత్ర ధరించిన నటుడు నిప్పంటించిన తోకతో స్టేజీపై గంతులు వేస్తున్నప్పుడు తెరకు నిప్పంటుకొని ఊరుకు చుట్టుకున్న రీతిన ఇప్పుడు విద్వేష రాజకీయం ఆంధ్రను కుదిపేస్తున్నది.
ప్రస్తుతం ఈ సిట్ నివేదికపై చంద్రబాబు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించి మరో వివాదానికి తెరలేపింది. అసలు తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలుస్తున్నదని మొదట ఆరోపించింది చంద్రబాబే! వైఎస్‌ఆర్‌సీపీని దెబ్బకొట్టేందుకు ఆయన విసిరిన ఈ లడ్డూ బాణం, అసలు సమస్యలను పక్కనపెట్టి మొత్తం ఏపీ రాజకీయం లడ్డూ చుట్టూ తిరగడం, సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులోదాఖలు చేయడం, సుప్రీంకోర్టు సిట్‌ను ఏర్పాటు చేయడం తదనంతర పరిణామాలకు దారితీసింది. అంతవరకు బాగానే ఉన్నా సిట్ నివేదికపై చంద్రబాబు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్‌కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించడంతో, ఇది కోర్టు ధిక్కారమంటూ సుబ్రహ్మణ్యస్వామి మళ్లీ సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈ పరిణామాల పరంపరను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో లడ్డూకు మించిన సమస్యలు ఏమీ లేవా అన్న అనుమానం వొస్తుంది.
సీన్ కట్‌చేస్తే,..మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ దుర్మరణానికి కారణమైన విమాన ప్రమాదంపై విచారణ నత్తనడకన సాగడానికి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడే కారణమంటూ ఎన్.సీ.పీ-ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ రాజేంద్ర పవార్ చేసిన ఆరోపణలు మరో దుమారం రేపాయి. వీఎస్‌ఆర్ వెంచర్స్‌కు, హెరిటేజ్ ఫిన్‌లీజ్ కంపెనీ అవసరమైన నిధులు సమకూరుస్తున్నదని, బహుశా తమ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయమే బారామతి విమాన ప్రమాద విచారణను ఆలస్యం చేయడానికి బహుశా కారణం కావొచ్చని ఆరోపించడంతో ఆంధ్రలో రాజకీయ కలకలం రేగింది. ఇది వైఎస్‌ఆర్‌సీపీకి ఆయాచితంగా ఒక అస్త్రాన్నిచ్చినట్ల యింది. క్షణం ఆలస్యం చేయకుండా…టీడీపీ-జనసేన-బీజేపీ అలయన్స్‌లోని విశ్వసనీయతను వైసీపీ నేతలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. హెరిటేజ్వీ-ఎస్‌ఆర్ సంబంధాలను బాగా హైలైట్ చేస్తూ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలకంటే, సొంత వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతుండటం వర్తమాన చరిత్ర.
అంతేకాదు కేవలం ఇటువంటి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే, చంద్రబాబు ప్రభుత్వం తిరుపతి లడ్డూ వివాదాన్ని పదేపదే ప్రస్తావిస్తూ, తమను టార్గెట్ చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. విచిత్రమేమంటే రెండు పార్టీలు “ప్రజల దృష్టిని మరల్చే” రాజకీయాలు చేస్తున్నారంటూ పరస్పరం ఆరోపించుకోవడం ఆంధ్ర ప్రజలను అయోమయంలో నెట్టేస్తోంది. సిట్ ఇప్పటికే 36 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత, ఇంకా దీనిపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడం కేవలం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు తప్ప మరోటి కాదని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు రోహిత్ పవార్ ఆరోపణల నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ వీఎస్‌ఆర్ వెంచర్స్ ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడవొచ్చు. ఒకవేళ అదే జరిగితే టీడీపీ కార్పొరేట్ అసోసియేట్స్‌పై ఉన్నతస్థాయి స్కృటినీ నిర్వహించాలని వైసీపీ గట్టిగా డిమాండ్ చేసే అవకాశముంది.
తమపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలన్నీ చట్టవిరుద్ధమంటూ వైసీపీ ప్రజల్లోకి వెళ్లడానికి చంద్రబాబు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ తప్పక దోహదం చేస్తుంది. ముఖ్యంగా రోహిత్ పవార్ ఆరోపణల నేపథ్యంలో, లడ్డూ వివాదాన్ని మరింత రచ్చచేసి, టీడీపీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి వైసీపీ మరింత ఉత్సాహంతో పనిచేయకమానదు. ఏతావాతా చెప్పాలంటే ఏపీ రాజకీయాలు అప్రధాన విషయాలపై, రాజకీయ ప్రయోజనాలకో సంసంఘర్షించడం తప్ప ప్రజల సమస్యలపై దృష్టి సారించకపోవడం ప్రధాన లోపం. రాజకీయాలు నడుపుకోవడం సహజమే, కానీ ప్రజల మనోభావాలు, వారి ప్రయోజనాలను పణంగా పెట్టే విధంగా ఉండకూడదన్న సత్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెప్పకనే చెబుతున్నాయి.





