బహుముఖాలుగా సాగవలసిన మరో గ్రంథాలయోద్యమం!

మరో గ్రంథాలయోద్యమం నిజంగా విజయం సాధించాలంటే అది కనీసం మూడు స్థాయిలలో విస్తరించాలి. మొదట వ్యక్తుల, కుటుంబాల, స్నేహ బృందాల స్థాయిలో పుస్తక పఠనం పెరగాలి, ప్రతి ఒక్కరూ తన వంతుగా తాను ప్రతి రోజూ ప్రతి వారమూ ఏమి చదువున్నానో ఆలోచించుకోవాలి. అందువల్ల గ్రంథాలయ అవసరం గురించి అవగాహన పెరుగుతుంది. అప్పుడు గ్రంథాలయాల ఏర్పాటు కోసం, ఉన్నవాటి మెరుగుదల కోసం, అభివృద్ధి కోసం ప్రజా సమూహాలు, పౌర సమాజ బృందాలు గ్రంథాలయ అనుకూల చైతన్యాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేయాలి.

telanganardhamసెప్టెంబర్ 8న హైదరాబాదులో ‘పుస్తకంతో నడక’ పేరుతో ఒక చిన్న కార్యక్రమం జరిగింది. దాదాపు వందమంది కవులు, రచయితలు, కళాకారులు, సమాజ పురోగమనం పట్ల నెనరు ఉన్నవారు పుస్తకాల ప్రాముఖ్యతను, పుస్తక పఠన అవసరాన్ని, గ్రంథాలయాల అభివృద్ధి అవసరాన్నినొక్కి చెపుతూ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం దాకా పుస్తకంతో నడక సాగించారు. తెలంగాణలో మరో గ్రంథాలయ ఉద్యమాన్ని నిర్మించాలనే ఆలోచనకు ఇది నాంది.

తెలంగాణ లోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ కొన్ని సంవత్సరాలుగా పుస్తక పఠన సంస్కృతిని అభివృద్ధి చేయాలనే కోరిక ఉన్న కొందరు వ్యక్తుల చొరవతో మరో గ్రంథాలయోద్యమం సాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో కవి, కథా రచయిత, ఉపాధ్యాయుడు మంచికంటి మూడు సంవత్సరాలకు పైగా కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ మరో గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూలకు సైకిల్ మోటార్ యాత్ర, కొన్ని ప్రాంతాలలో పాదయాత్ర చేశారు. ఆ క్రమంలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రచారం నిర్వహించి, వేలాది మందికి ప్రేరణగా నిలిచారు. సరిగ్గా ఆ పద్ధతిలోనే నర్సంపేట నుంచి ఉపాధ్యాయుడు, రచయిత కాసుల రవి కుమార్ తన కారులో పుస్తకాలు పెట్టుకుని, లీడ్ లైబ్రరీ అనే నినాదంతో వందలాది పాఠశాల్లో, కళాశాలల్లో గ్రంథాలయాల స్థాపనకు, పునరుద్ధరణకు, అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లు మాత్రమే కాకుండా రెండు రాష్ట్రాలలోనూ పుస్తకాభిమానులు, పుస్తక పఠన సంస్కృతిని అభివృద్ధి చేయాలని ఆలోచించేవారు, ప్రభుత్వ గ్రంథాలయాల, పాఠశాల, కళాశాలల గ్రంథాలయాల వికాసం కోరుకునేవారు చాలా మందే ఉన్నారు. తమకు తోచిన, సాధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ప్రయత్నాలు తప్పనిసరిగా అవసరమే నిజంగా గ్రంథాలయాలు, పఠన సంస్కృతి అభివృద్ధి చెందాలంటే ఇవి సరిపోవు. ఇవి కేవలం ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించగలవేమో, గ్రంథాలయాల అవసరం వైపు ప్రజల దృష్టి తిప్పగలవేమో గాని, నిజంగా గ్రంథాలయాల అభివృద్ధి, దాని కన్నా ముందు పుస్తక పఠన సంస్కృతి పెంపొందడం జరగాలంటే అది ఒక విశాల, సుదీర్ఘ ప్రయత్నం. అది ఒక ఔత్సాహిక ఆలోచనో, చర్యో కాదు. అది ఒక ప్రణాళికాబద్ధ సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక వికాస పరిణామం. అది జరగాలంటే ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు దోహదం చేస్తాయి గాని, అవి ఇతర విశాల ప్రయత్నాలతో కలిసి సాగకపోతే విజయం సాధించజాలవు.

మరో గ్రంథాలయోద్యమం నిజంగా విజయం సాధించాలంటే అది కనీసం మూడు స్థాయిలలో విస్తరించాలి. మొదట వ్యక్తుల, కుటుంబాల, స్నేహ బృందాల స్థాయిలో పుస్తక పఠనం పెరగాలి, ప్రతి ఒక్కరూ తన వంతుగా తాను ప్రతి రోజూ ప్రతి వారమూ ఏమి చదువున్నానో ఆలోచించుకోవాలి. అందువల్ల గ్రంథాలయ అవసరం గురించి అవగాహన పెరుగుతుంది. అప్పుడు గ్రంథాలయాల ఏర్పాటు కోసం, ఉన్నవాటి మెరుగుదల కోసం, అభివృద్ధి కోసం ప్రజా సమూహాలు, పౌర సమాజ బృందాలు గ్రంథాలయ అనుకూల చైతన్యాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేయాలి.

ఇదే తెలంగాణ సమాజంలో వంద సంవత్సరాల కింద ఒక ప్రజా చైతన్య వాహికగా గ్రంథాలయోద్యమం విస్తరించింది. ఆ నాటికి మొత్తం తెలంగాణ సమాజంలోనే అక్షరాస్యత ఆరు శాతానికి మించలేదు. అది కూడా హైదరాబాదు నగరానికి, రెండు మూడు పట్టణాలకు పరిమితమైనది కావచ్చు. కాని అనేక గ్రామాలలో, పట్టణాలలో గ్రంథాలయాల స్థాపన జరిగింది. నిరక్షరాస్యులను పోగు చేసి, పత్రికలూ పుస్తకాలూ చదివి వినిపించే స్థలాలుగా గ్రంథాలయాలు నిజమైన చైతన్య కేంద్రాలుగా వికసించాయి. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రచురణ సంస్థ పెట్టి పుస్తకాల మూట నెత్తిన పెట్టుకుని మారుమూల గ్రామాలకు వెళ్లారు. కెసి గుప్తా పుస్తకానికి విస్తృత ప్రచారం కలిపించేందుకు అణా గ్రంథమాల స్థాపించారు. వంద సంవత్సరాల తర్వాత, అక్షరాస్యత దాదాపు పది రెట్లు పెరిగాక, ప్రచురణ సంస్థలు ఎన్నో పుట్టుకొచ్చాక, కొనుగోలు శక్తిలో కూడా గణనీయమైన పెరుగుదల, కొన్ని వర్గాలలలోనైనా వచ్చాక, ఇప్పటికీ మనం వంద ఏళ్ల కిందటి స్థితిలో ఎందుకు లేకుండా పోయామో ఆలోచించుకోవడానికి ఈ మరో గ్రంథాలయ ఉద్యమం ఒక సందర్భం.

ఈ రెండు స్థాయిల పనులు ఎంత ఎక్కువగా జరిగినా అవి పఠన సంస్కృతిని, ప్రజా చైతన్యాన్ని పెంచడం మాత్రమే చేయగలవు, లేదా వ్యక్తిగత, చిన్న చిన్న బృందాల స్థాయిలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయగలవు. కాని నిజంగా గ్రంథాలయాలు విస్తరించాలంటే ఆ పని ప్రభుత్వాలు చేయాలి. గ్రంథాలయం ఏర్పాటు చేయడం ఆనే ఆలోచన చిన్నదే. కాని దాన్ని చిరకాలం కొనసాగించడం ఒక ప్రణాళికాబద్ధమైన కృషి. భవనం, కుర్చీలు, బల్లలు, బీరువాలు, లైబ్రేరియన్లు, వారి జీతభత్యాలు, గ్రంథాలయానికి నిరంతరం పుస్తకాల, పత్రికల సరఫరా, ఇప్పుడు విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అచ్చు పుస్తకాలు మాత్రమే కాక, డిజిటల్ పుస్తకాలు చదువుకోవడానికీ, డిజిటల్ సమాచారం తెలుసుకోవడానికీ కంప్యూటర్లు, విద్యుత్తు, ఇంటర్నెట్ సౌకర్యం వంటి సవాలక్ష అవసరాలుంటాయి. అంటే భారీగా నిధులు అవసరం అవుతాయి. ఆ నిధులు సమకూర్చేపని వ్యక్తులో, ప్రజా సమూహాలో చేయజాలవు. అది ప్రభుత్వాలు మాత్రమే చేయవలసిన పని.

ప్రభుత్వం కూడా ఏదో ఔదార్యంతో, మెహర్బానీగా చేసే పని కాదు. గ్రంథాలయాల కోసం, ప్రజల పఠన అవసరాల కోసం, చైతన్య వ్యాప్తి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా తన జేబులోంచి పైసా కూడా ఇవ్వనక్కరలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచీ కూడా ప్రభుత్వం లైబ్రరీ సెస్ అని ప్రత్యేకంగా గ్రంథాలయాల కోసమే అని చెప్పి ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నది. గ్రామ పంచాయతీల్లో, మునిసిపాలిటీలలో, మొత్తంగా స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో వసూలు చేస్తున్న ఆస్తి పన్నులో 8 శాతం గ్రంథాలయ సెస్సు గా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీల చట్టం 1960 నిర్దేశించింది. ఆ చట్టం ప్రకారమే రాష్ట్ర గ్రంథాలయ పరిషత్, జిల్లా గ్రంథాలయ సంస్థలు ఏర్పడ్డాయి.

ఆరు దశాబ్దాలకు పైగా ఆ సెస్సు వసూలు సక్రమంగానే జరిగిపోతున్నది గాని, ఏ కారణం చెప్పి ఆ నిధులు వసూలు చేస్తున్నారో, ఆ నిధులను ఆ కారణానికి వెచ్చించడం క్రమక్రమగా తగ్గిపోతూ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది కోట్ల రూపాయలు గ్రంథాలయాల సెస్సు వసూలు చేస్తూ, అందులో పదో వంతు కూడా గ్రంథాలయాలకు ఇవ్వని పాలన కొనసాగింది. కేటాయించిన, ఇచ్చిన నిధులు కూడా గ్రంథాలయాల నిర్వహణకు, సిబ్బంది జీతభత్యాలకు కూడా సరిపోకపోవడం, అవసరమైన సంఖ్యలో గ్రంథాలయాలు లేకపోవడం, అవసరమైనంత మంది గ్రంథాలయ సిబ్బంది లేకపోవడం కొనసాగాయి. ఇక అవసరాలకు తగిన పుస్తకాలు, పత్రికలు కొనడం అనే ఆలోచనే తరిగిపోయింది. ఎవరు ఎక్కువ ముడుపులు, కమిషన్లు ఇస్తే వారు సూచించిన, ప్రచురించిన చౌకబారు పుస్తకాలు, అతి ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ప్రజాధన దుర్వినియోగం జరిగిపోయింది. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్, జిల్లా గ్రంథాలయ సంస్థల అధ్యక్ష పదవులు రాజకీయ పదవులుగా, పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి.

ప్రజా ఉద్యమ ఫలితంగా, ప్రజా చైతన్య విస్తరణలో భాగంగా రూపుదాల్చిన తెలంగాణలో కూడా 2014 తర్వాత పదకొండు సంవత్సరాలుగా అదే ఆంధ్రప్రదేశ్ వారసత్వం కొనసాగుతున్నది. ఈ పదకొండు సంవత్సరాలలో లైబ్రరీ సెస్సును లైబ్రరీలకే ఇచ్చిన పాపాన పోలేదు. కనుక కొత్త లైబ్రరీలు ఏర్పాటు చేయడం, కొత్త పుస్తకాలు కొనడం, ఒకటికి రెండు పత్రికలు తెప్పించడం, గ్రంథాలయ సిబ్బందిని తగినంతగా నియమించడం వంటి ఏ ఒక్క పనీ జరగలేదు. గ్రంథాలయాల నిర్లక్ష్యం యథావిధిగా కొనసాగింది. రాష్ట్రంలో 2011 జనగణన ప్రకారం 9834 గ్రామాలుండగా దాదాపు 700 పబ్లిక్ లైబ్రరీలు, వెయ్యి ప్రైవేట్ లైబ్రరీలు, రెండు వేల సంస్థాగత లైబ్రరీలు, అంటే అన్నీ కలిపినా సగటున మూడు గ్రామాలకు ఒక లైబ్రరీ కూడా లేదు. ఇందులోనూ చాలా భాగం పట్టణాలలో, పెద్ద గ్రామాలలో ఉండే అవకాశం ఉంది గనుక కనీస ఎనిమిది వేల గ్రామాలు, అంటే రాష్ట్ర జనాభాలో 80 శాతం నివసిస్తున్న ప్రాంతాలు, ఈ ఇరవై ఒకటో శతాబ్దిలో కూడా లైబ్రరీ అంటే ఏమిటో తెలియకుండా బతుకుతున్నాయి. ఇదీ మనం ప్రగల్భాలు పలుకుతున్న జ్ఞాన సమాజం!!

గ్రామాల సంగతి అలా ఉంచండి, విశ్వ నగరంగా చెప్పుకుంటున్న ఒక కోటి పైన జనాభా ఉన్న హైదరాబాద్ లో ఒక అంచనా ప్రకారం పబ్లిక్, ప్రైవేట్ లైబ్రరీలు, విద్యా సంస్థల, ఇతర సంస్థల, ప్రత్యేక విభాగాల లైబ్రరీలన్నీ కలిపి 300 దాటడం లేదు. ఇందులో పబ్లిక్ లైబ్రరీలు 60 లోపే. ఇదే హైదరాబాదులో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఒక్క 2024-25 సంవత్సరానికి వసూలు చేసిన ఆస్తిపన్ను 2012 కోట్ల రూపాయలు. అంటే అందులో లైబ్రరీ సెస్సు రు. 161 కోట్లు. నగరంలోని లైబ్రరీలకు అందులో వందో వంతు అయినా అందిందా అనుమానమే.

ఈ నేపథ్యంలో మరో గ్రంథాలయోద్యమం ముందు ప్రధాన కర్తవ్యం ‘మా దగ్గరి నుంచి లైబ్రరీల పేరు మీద వసూలు చేస్తున్నదైనా లైబ్రరీలకు ఇవ్వండి’ అని ప్రభుత్వాన్ని అడగడం. ‘అదనంగా ఏమీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు, కనీసం ఏ పేరు మీద నిధులు వసూలు చేస్తున్నారో దానికే ఇవ్వండి’ అనే కనీస కోరిక.

అయితే నిధులు వచ్చినంత మాత్రాన గ్రంథాలయాలు బాగుపడతాయా అనే ప్రశ్న ఉంటుంది. విత్తు ముందా చెట్టు ముందా అనే విచికిత్స లాగా, చదివేవాళ్లు లేకపోతే లైబ్రరీలు బాగుపడవు, లైబ్రరీలు బాగుపడకపోతే చదివేవాళ్లు రారు. నిధులు సక్రమంగా రావడం మొదటి షరతు మాత్రమే. నిధులంటూ వస్తే గ్రంథాలయ భవనాలు మెరుగు పడతాయి, సిబ్బంది నియామకాలు జరుగుతాయి. విరిగిపోయిన, చాలీచాలని కుర్చీలు, బల్లల బదులు చదువుకునే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పుస్తకాలు కొనడం మొదలవుతుంది. పత్రికలు ఇప్పటి కన్న ఎక్కువ తెప్పించే అవకాశం కలుగుతుంది.

తప్పనిసరిగా లైబ్రరీలు మెరుగుపడడంతో పాటుగానే, సమాంతరంగానే ప్రజలలో చదివే సంస్కృతి పెరగాలి. ‘లైబ్రరీ మనది, మనమూ మన తల్లిదండ్రులూ చెల్లించిన పన్నులతో నడుస్తున్నది. కనుక దీన్ని సంపూర్ణంగా వాడుకోవాలి’ అనే అభిప్రాయం పాఠకులలో, ముఖ్యంగా యువతరంలో కలగాలి. అంటే యువతరం ఆసక్తిని నిలబెట్టే, పెంపొందించే పుస్తకాలు, పత్రికలు మాత్రమే కాదు, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ పఠన సౌకర్యాలు కూడా అందాలి. మొత్తంగా సమాజంలోనే పఠన సంస్కృతి, పుస్తకాల గురించి మాట్లాడుకునే, చర్చించుకునే, కలిసి చదువుకునే సంప్రదాయాలు పెరగాలి. ఈ పనిని ప్రభుత్వ నిధులో, గ్రంథాలయంలోని సౌకర్యాలో, గ్రంథాలయ సిబ్బందో చేయలేరు. ఈ పనిని సమాజం చేయాలి. పాఠకులు, రచయితలు, విమర్శకులు, పుస్తక పఠన బృందాలు, ప్రచురణకర్తలు, పత్రికలు, సామాజిక మాధ్యమాలు, పుస్తక విక్రేతలు వంటి ఎన్నో రంగాలవారికి ఈ కృషిలో భాగం ఉంటుంది. మనిషి జీవించేది ఒక్క జీవితమేననీ, తన స్వానుభవంలోకి రాలేని అనేక జీవితాల సమాహారం పుస్తకంలో ఉంటుందనీ, అందువల్ల పుస్తక పఠనం మనిషిని ఉన్నతీకరిస్తుందనీ అవగాహన సగటు సామాజిక చైతన్యంలో భాగం కావాలి. పుస్తకం అనేది అలంకారమో, నిర్బంధమో కాక ఇష్టపూర్వక ఆహ్వానం కావాలి. అటువంటి విశాలమైన, లోతైన పఠన సంస్కృతి సమాజంలో వేళ్లూనుకోకుండా గ్రంథాలయ స్థాపన, అభివృద్ధి మాత్రమే ఏమీ సాధించజాలవు. ఆ పఠన సంస్కృతిని రూపొందించడంలో, విస్తరించడంలో మరో గ్రంథాలయ ఉద్యమం తన వంతు కృషి చేయాలి.

ఇదే తెలంగాణ సమాజంలో వంద సంవత్సరాల కింద ఒక ప్రజా చైతన్య వాహికగా గ్రంథాలయోద్యమం విస్తరించింది. ఆ నాటికి మొత్తం తెలంగాణ సమాజంలోనే అక్షరాస్యత ఆరు శాతానికి మించలేదు. అది కూడా హైదరాబాదు నగరానికి, రెండు మూడు పట్టణాలకు పరిమితమైనది కావచ్చు. కాని అనేక గ్రామాలలో, పట్టణాలలో గ్రంథాలయాల స్థాపన జరిగింది. నిరక్షరాస్యులను పోగు చేసి, పత్రికలూ పుస్తకాలూ చదివి వినిపించే స్థలాలుగా గ్రంథాలయాలు నిజమైన చైతన్య కేంద్రాలుగా వికసించాయి. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రచురణ సంస్థ పెట్టి పుస్తకాల మూట నెత్తిన పెట్టుకుని మారుమూల గ్రామాలకు వెళ్లారు. కెసి గుప్తా పుస్తకానికి విస్తృత ప్రచారం కలిపించేందుకు అణా గ్రంథమాల స్థాపించారు. వంద సంవత్సరాల తర్వాత, అక్షరాస్యత దాదాపు పది రెట్లు పెరిగాక, ప్రచురణ సంస్థలు ఎన్నో పుట్టుకొచ్చాక, కొనుగోలు శక్తిలో కూడా గణనీయమైన పెరుగుదల, కొన్ని వర్గాలలలోనైనా వచ్చాక, ఇప్పటికీ మనం వంద ఏళ్ల కిందటి స్థితిలో ఎందుకు లేకుండా పోయామో ఆలోచించుకోవడానికి ఈ మరో గ్రంథాలయ ఉద్యమం ఒక సందర్భం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page