రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదీన వెల్లడవుతాయి. ఎన్నికల బరిలో నిలిచే ప్రధాన పార్టీలు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ తోపాటు బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అంతకుముందు కంటోన్‌మెంట్, జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ కదనోత్సా హంతో బరిలో నిలిచి మరోసారి ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ముందుకు కదులుతోంది. ముఖ్యంగా తెలంగాణను మూడు ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన “విజన్-47” తో ప్రజల్లోకి వెళ్లాలన్నది కాంగ్రెస్ నాయకత్వ వ్యూహం.
ఇప్పటికే కొన్ని ప్రత్యేక పార్లమెంట్ నియోజకవర్గాలకు, జిల్లా స్థాయి కమిటీలకు నియామకాలను పూర్తిచేయడంతో స్థానిక ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో సమన్వయంతో ముందుకెళ్లేందుకు రాష్ట్ర నాయకత్వం సంసిద్ధమవుతోంది. నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించా లని ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో ఎంతమేర బీసీలకు ప్రాధాన్యతనిస్తుందో వేచిచూడాలి. ఎందుకంటే ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది తప్ప, గుడ్డిగా రిజర్వేషన్‌లపై ఆధారపడితే పుట్టి మునగడమే అంతిమ ఫలితమన్న సంగతి కాంగ్రెస్ నాయకత్వానికి తెలియంది కాదు. అందువల్ల రిజర్వేషన్ నినాదంతో, సర్వేల ద్వారా ఎంపిక చేసిన నాయకులను బరిలోకి దించి మున్సిపల్ పోరులో ముందుకు పోక తప్పదు.
ఇక బీఆర్ ఎస్ విషయానికి వొస్తే 2023 ఎన్నికల్లో దారున ఓటమినుంచి తేరుకొని మళ్లీ తన ప్రాభవాన్ని పొంద డానికి తీవ్రంగా యత్నిస్తోంది. మున్సిపాలిటీలకు ఇన్‌చార్జ్‌లను, ప్రత్యేక కో-ఆర్డినేటర్లను నియమించడం ప్రచార వ్యూహాలను రూపొందిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు పార్టీ నేతలు హరీష్‌రావు, కేటీఆర్‌లు పదునైన విమర్శలతో ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పట్టణాభివృద్ధి పనులు, చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం ద్వారా కాంగ్రెస్‌ను ఎదుర్కొనే వ్యూహాన్ని బీఆర్ ఎస్ నేతలు అనుసరించనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వైఫల్యాలకు విపరీత ప్రచారం కల్పించి దెబ్బతీయాలన్న వ్యూహంతో ముందుకెళ్లడం ఖాయం. ఇక బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావుకు ఈ ఎన్నికలు ఒక పరీక్ష. మంచి సంస్థాగత నిర్మాణం కలిగిన పార్టీగా, బండిసంజయ్, కిషన్‌రెడ్డి, ధర్మపురి అరవింద్ వంటి ఫైర్ బ్రాండ్ నాయకుల దన్నుతో పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో తన బలాన్ని మరింత విస్తరించుకునే దిశగా ప్రయత్నిస్తున్నది.
కాంగ్రెస్ నాయకత్వం వివిధ వర్గాలకోసం తాము అమలు పరచిన సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రతి కార్యక్రమంలో వివరిస్తూ వొస్తున్నారు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న తరుణంలో, నైనీ బ్లాక్ కుంభకోణం వెలుగులోకి రావడం, మంత్రుల మధ్య విభేదాలు బయటపడటంతో పార్టీ ప్రతిష్ట బాగా దెబ్బతిన్నది. అదీకాకుండా కాంగ్రెస్‌లో పాత, కొత్త నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఇబ్బందికరంగా మారాయి. పాత నాయకులను నియంత్రణలో ఉంచేదుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలుగుదేశం మీడియాను ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బొగ్గు స్కాంలో దేశం మీడియా రేవంత్‌కు అండగా నిలవడం, ఆంధ్ర రాజకీయాలు తెలంగాణలోకి ప్రవేశించాయన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రస్తుతం తెలంగాణలో ప్రభావం చూపే పరిస్థితి లేకున్నా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిల బెట్టే వ్యూహంతో ముందుకెళుతున్నారన్న వార్తలు వొస్తున్నాయి.
ఇటీవల ఖమ్మంలో జరిగిన ర్యాలీలో రేవంత్ తెలుగుదేశంకు అనుకూలంగా చేసిన ప్రకటన వెనుక ఇటువంటి వ్యూహం ఉన్నదనుకోవాల్సి వొస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రాజకీయ శైలిని అర్థం చేసుకున్నవారికి ఇటువంటివి తేలిగ్గా అర్థమవుతాయి. కాంగ్రెస్‌ను ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చింది రేవంత్ కనుక, అధిష్టానం ఆయనకే మద్ద తుగా నిలవక తప్పదు. కాంగ్రెస్ అస్థిర రాజకీయాలు రేవంత్‌కు తెలియనివి కావు. అందుకనే రాష్ట్రంలో తెలుగుదేశం క్యాడర్‌ను తనవైపు తిప్పుకొని, తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగమే తెలుగు దేశం అనుకూల మీడియా మద్దతుగా నిలవడం.
విచిత్రమేమంటే కేసీఆర్ కూడా తెలుగుదేశం నుంచి వొచ్చినవారే కనుక, ఈ వ్యూహాలను పసిగట్టలేనంత అమాయకుడు కాదు. అప్పట్లో టీడీపీ వ్యూహకర్తగా పనిచేసిన ఆయనకు రేవంత్ వ్యూహాలను ఎదుర్కొనడం పెద్ద కష్టం కాకపోవొచ్చు కానీ, ఆయన వయసు అందుకు ఎంతమేర సహకరిస్తుందన్నది ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుత బీఆర్ ఎస్ క్యాడర్ దాదాపుగా ఒకనాటి తెలుగుదేశం పార్టీకి చెందిందే కనుక, రేవంత్ ద్వారా చంద్రబాబు వ్యూహాలను ఎదుర్కొనే పనిని కేటీఆర్, హరీష్‌లు నెత్తిన వేసుకున్నారనుకోవాలి. కాంగ్రెస్‌పై విపరీతమైన దూకుడుతో విమర్శలు గుప్పించడం వెనుక వ్యూహం ఇదే కావొచ్చు. సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో పెద్దగా కరిష్మా ఉన్నవారు లేరు కనుక, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి లేదు. వీరు ఒకవైపు తెలుగు దేశం అనుకూల దాడిని, మరోవైపు బీఆర్ ఎస్, బీజేపీలనుంచి వొస్తున్న విమర్శలను ఎదుర్కొనాల్సి వొస్తున్నది. దీనికితోడు రేవంత్ ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్నారన్న వేదన వీరిని వేధిస్తున్నది. ఈ రాజకీయాలన్నీ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపుతాయి.





