ఎన్నెల మడుగు

అమ్మా
మీవి భూదేవతసొంటి చేతులు
కడపల్ల ఎవలడుగు పెట్టినా
వాళ్ల కడుపిసారించి కంచంలో మెతుకైతరు
ఇంటికెవలొచ్చినా గొంతు తడిపే
సల్లటి నీటికుండైతరు
తీరుబడి ముచ్చటకచ్చినోళ్లకి
మీరు తీరొక్క పలారమైతరు
బయటకెళ్ళి నున్నగున్న గుణపెంక ఇల్లుని జూసి
ఇల్లు ముద్దుగుంది, మంచిగుందని
పొగుడుతరు గానీ
ఇంటి నిట్టాడ వల్లనే
ఇల్లట్ల దీరగ నిలబడ్డదని మాట్లాడరు
మీరు ఇంటి నిట్టాడ లాంటోల్లు
మీరు సుక్కలసోంటోళ్లు
మీ ఎలుగులను మింగే
గ్రహాలట్లా ధగధగ మెరిశేటిది
మీరే లేకుంటే అవి ఉత్త మట్టిముద్దలే
తల్లీ
మీరట్లా కాసుకోబట్టే వారంతా
అమాస సీకట్లను శెరుపుకుంటూ
లోకమంతా ఎలిగేటి ఎన్నెలలైతున్నరు

-దిలీప్. వి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *