కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారిణి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అయిన అనిశెట్టి రజిత 11 ఆగస్ట్ 2025న మరణించారు. ఆమెకి నివాళిగా ప్రజాతంత్ర సాహిత్య పేజీ ‘శోభ’ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురిస్తున్నది.
అవమానిత స్త్రీ కురుల పాయనై
ఇన్నాళ్ళ నా బ్రతుకులోని బేలతనాన్నిగాక
నీలితనాన్ని బడబాలనంలా కుంభవృష్టించే
నల్ల మబ్బునవుతా!
నేనొక నల్లమబ్బునవుతా!
(నేనొక నల్లమబ్బునవుతా : పు.6)
అనిశెట్టి రజిత (14.4.1958-11.08.2025) మాట్లాడుతూ, మాట్లాడుతూ వెళ్ళిపోయారు. ఏడు పదులు కూడా నిండకుండానే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఆమె ఉద్యమ జీవితాన్ని, ఉద్యమ సాహిత్యాన్ని సమాజానికి వదిలి వెళ్ళారు. ఇప్పుడు ఆమె లేరు. ఆమె జీవితముంది. ఆమె సాహిత్యముంది. రజిత జీవితమంటే ఆమె ఉద్యమమే. ఆమె సాహిత్యమంటే ఆమె ఉద్యమ సాహిత్యమే. రజిత విప్లవోద్యమ ప్రసంగంతో రచయిత్రిగా మొలకెత్తింది. ఆ విప్లవ స్ఫూర్తిని వదులుకోకుండానే ఆమె అస్తిత్వవాదాలోకి ప్రవేశించారు. బౌద్ధాన్ని జీర్ణం చేసుకున్నారు. అందువల్ల ఆమె సాహిత్యంలో విప్లవ వాదం, స్త్రీ వాదం దళిత బహుజనవాదం, తెలంగాణవాదం వంటి ఆధునిక పదాలన్నీ అక్షర రూపం ధరించాయి. ఏ వాదం చెప్పినా ఆమెకు యుద్ధమే.
రజిత 1984-2023 మధ్య నాలుగు దశాబ్దాలలో పన్నెండు కావ్యాలు రాశారు. ఇతర రచనలు చేశారు. ప్రరవేలో కీలక పాత్ర పోషించి ప్రరవే జాతీయ అధ్యక్షులయ్యారు. ఆమె అనుకోకుండా కన్నుమూసిన సందర్భంగా స్త్రీని గురించి ఆమె రాసిన కవిత్వాన్ని సమీక్షించుకుందాం. 1984 నాటి ‘‘గులాబీలు జ్వలిస్తున్నాయి’’ కవితా సంపుటిలోని పదకొండు కవితలలో ఎనిమిది కవితలు స్త్రీని గురించే ఉన్నాయి. (ఇది ఆచార్య కాత్యాయన్నీ విద్మహే చెప్పారు) అంటే ఆమె కవిగానే స్త్రీవాదిగా పుట్టారు. అప్పటి నుండి ఆమె రాసిన పన్నెండు కావ్యాలలో కనీసం 70 కవితలు స్త్రీ జీవితం మీదనే ఉన్నాయి. మామూలు వచన కవితలు రాసినా, దీర్ఘ కవితలు రాసినా, నానీలు, హైకులు రాసినా ఆమె తాను ఆకాశంలో సగమని, తాను స్త్రీవాదినని మరచిపోకుండా కవిత్వం రాశారు.
సమాజంలో మార్పును కోరేవాళ్ళెవరైనా తాత్వికంగా జాతిసవాదులు కావాలి. అలా కాకుండా లోపల భక్తి, పైన శక్తి ఉంటే, సమాజాన్ని వంచించినట్లే. రజిత చాలాచోట్ల తన భౌతికదృక్పథాన్ని చాటుకున్నారు. అది కూడా స్త్రీ జీవితం ఆధారంగానే. రాల్లకు రప్పలకు వరాలు బడ్తె/ పానాలు బోతయిగని పిల్లలు పుడ్తరా/ముక్కోటి దేవుల్లకు ముడుపులుగడితె/ సంతానం గలుగుతదా చెప్పు చెల్లీ (నేనొక నల్లమబ్బునవుతా : పు 18, 1986) అని స్త్రీలను ఆవహించిన అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని, ‘‘చెప్పు చెల్లీ’’ కవితలో నిగ్గదీసి అడిగిన రజిత స్త్రీలను చదువుకోమని, సమాజాన్ని తెలుసుకోమని, స్వంత కాళ్ళ మీద నిలబడమని, అన్నిటికీ తలూపకుండా, అన్యాయాన్ని ఎదుర్కోమని, స్వీయ రక్షణ చేసుకోమని ప్రబోధించారు. నిన్ను తొక్కేటోల్లను ఎదిరించు/ చెల్లే నా మాటిను (పు.19) రజితది మొదటి నుంచి ప్రతిఘటన స్వరం.యుద్ధభాష. ‘‘గులాబీలు జ్విలిస్తున్నాయి’’ (పైరి.పు.13) అనడంలోనే యుద్ధభాష ఉంది. ఇదే ధోరణిని ఆమె రచనలన్నింటిలోనూ ప్రదర్శించింది. శివరాత్రికి లక్ష దీపారాధన చేసే మహిళలు రజితను చదవాలి.
భారతీయ, స్త్రీల మీద పౌరాణిక భావజాల ప్రభావం అంతా ఇంతా కాదు. ఏమీ తెలియని కాలం నుండి చాలా తెలిసిన నేటి దాకా భారతీయ మహిళ ఈ పౌరాణిక భావజాల ఉక్కుపాదాల కింద నలిగిపోతున్నది. మహిళల జీవితంలో మార్పు కోరేవారు, ఆ పౌరాణిక పునాది తవ్వి పారేయాలి. రజిత ఆ పని చేశారు. భారత రామాయణ స్త్రీల స్థితిని చూపించారు. అక్కడితో ఆగకుండా అప్పటి నుండి నేటిదాకా స్త్రీలు అనుభవిస్తున్న అణచివేతలను ప్రస్తావించారు. పతి చింతన తప్ప పరధ్యానం లేక/ అశోక చెట్టు కిందే అహర్నిశలూ శోకించినప్పటికీ/ శీల పరీక్ష కోరిన శ్రీరాముని దేశం మనది…/నిండుసభలో ఒక స్త్రీని వస్త్రాపహరణం చేసిన/ ఘనత వహించిన పౌరాణిక దేశం మనది (పైది. పు.22)
ఒక చిన్న కవితలో భారతీయ స్త్రీ ‘ఆటబొమ్మ’గా పరిగణింపబడుతున్న దుర్మార్గాన్ని అభివర్ణించారు. అలాగే స్త్రీని ఆవరించిన సంప్రదాయ ముళ్ళ కంచెను విధ్వంసం చేయమని రజిత అనేక కవితలలో పిలుపు నిచ్చారు. భారతీయ మహిళ భూస్వామ్య భావజాలం నుంచి విముక్తి కావటమే ఆమెకు విముక్తి అని చాటి చెప్పారు. ‘‘మనమంతా ఒక్కటై ఈ చెరను తుద ముట్టించాలి’’ అని పిలుపునిచ్చారు. (నిర్ణయాకాశం కింద-పు.26). ఈ విముక్తి యుద్ధంతో మహిళలు చేస్తున్న పోరాటాన్ని కూడా రజిత అనేక కవితలలో కొనియాడారు. చరిత్ర పొడుగునా, అన్ని వ్యవస్థలలో స్త్రీ పడిన బాధను పేర్కొని, వర్తమాన స్త్రీ విముక్తి మార్గంలో పయనిస్తూ ఉండడాన్ని ఆమె కొనియాడారు.
బానిస సమాజంలో దాసీగా/ రాచరిక భాగస్వామ్యంలో అలంకారపు ఆటబొమ్మగా/ పెట్టుబడిదారీ వ్యవస్థలో అంగట్లో మారకపు/ సామ్రాజ్యవాద వలసపాలనలో సాధనంగా/ వాడబ(డిన)డుతున్న స్త్రీ/ తరతరాల సంకెళ్ళను ఛెదించుకొని
గుర్తింపు బిళ్ళలూ యోగ్యతా చిహ్నాలైన/ మంగళ సూత్రాలనబడే యుగయుగాల ఉరిత్రాళ్ళను తెంచుకొని/ ఉరిమి చూస్తూ నేడు స్వేచ్ఛ సమరానికి ఉద్యుక్తమౌవుతున్నది (పు. 35) భూస్వామ్య, పురుషాధిపత్య అవశేషం విధవా వ్యవస్థ ఇంకా మన దేశంలో కొనసాగుతున్నది. జుగుప్సాకరమూ, క్రూరమూ, అయిన ఆ పద్య కాండను రజిత ‘‘శతాబ్దాల శృంఖలాలు’’ కవిత (1984)లో తీవ్రంగా విమర్శిస్తూ పెట్టి, ఆ వ్యవస్థ మీద ఇప్పటి స్త్రీలు చేస్తున్న తిరుగుబాటును కొనియాడారు. ఆ తిరుగుబాటును ‘కదనరంగం’ అన్న రజితది యుద్ధ భాషే. అందరూ మనుషులుగా పుడతారు. కొందరు స్త్రీలుగా తయారు చేయబడతారు అన్నది ప్రస్దిద్ధ వాదం. రజిత ‘‘అమ్మ చెట్టు’’ కవితను (1996) ఆ వ్యాసం మీద ఆధారపడి రాశారు. స్త్రీగా తయారు చేయబడడంలోని హింసను వర్ణించారు. ఈ కవితలో స్త్రీకి ‘స్వేదాంబరి’, ‘ఆశాబీజం’, ‘కర్మజీవి’, ‘మానవి’, నీలలోహిత’, ‘ప్రేమమందిరం’, ‘శ్రీగంధపు చెక్క’ లాంటి అనేక విశేషణాలు చేసి స్త్రీ శక్తిని కొనియాడారు.
ఆధునిక సమాజంలో అనేక సమస్యల్ని రజిత తన కవితలలో విమర్శకు పెట్టారు. భ్రూణహత్యలు, అందాల పోటీలు, ఉద్యమ స్త్రీల హత్యలు, పనిమహిళల కష్టాలు, స్త్రీ చట్టాల క్రియాశూన్యత, వంటి అనేక విషయాలను కవిత్వీకరించారు. ఇటీవలే తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలను పెద్దఎత్తున నిర్వహించింది. పెట్టుబడిదారీ విష సంస్కృతికి నిదర్శనం అందాల పోటీలు. వీటిని రజిత 30 ఏళ్ళ క్రితమే 1996లో అతివలను ఆకర్షించే ఈ అందాల పోటీలు
మోహవ్యామోహపు వినిమయ సంస్కృతి (నేనొక – పు.37) అని ‘ముళ్ళ కిరీటాలు’ కవితలో ఈసడిరచారు. 1997లో వరంగల్లులో మ్యూజికల్ గార్డెన్స్‌లో హత్యకు గురైన మహిళని స్మరించుకుంటూ, రజిత ‘‘నీ హత్యకు అందరూ బాధ్యులే’’ (చెమట చెట్టు – పు.36) అని వ్యవస్థనే దోషిగా చూపారు. తెంగాణ భాషలో ఒక దళిత అమ్మాయి ఒక దొరసానికి చేసిన సేవను, దొరసాని సేవ చేయించుకున్నాక, దళిత అమ్మాయి పట్ల ప్రవర్తించే తీరును రజిత ఎంత ఆర్ద్రంగా రాశారి. ‘‘దొర్సానీ! ఓ దొర్సానీ! (పైరి – పు.7) కవితలో చదవాలి. రజిత అక్షరాలు తెలంగాణ శ్రామిక భాషలో ఎంతో అందంగా ఒదిగిపోతాయి.
కూటికి గుడ్డకు కొంపకు కొరతబడి/ బహు కట్టాలతోటి కడతీర్తున్న మనిషి కులపోల్లం/ అయినా పేమలను కరువు కానోల్లం (పైరి – పు.10) ఒక పేద మహిళ జీవితాన్ని ఆవిష్కరిస్తూ, రజిత రాబోయే దళిత బహుజన రాజ్యాన్ని చాటి చెప్పారు. ‘మా ఉతుకల చీర’ కవితలో రాబోయే కాలంలో/ మూడు…../ ఈ దేశపు పరిపాలనను చేపట్టి/ బహుజనస్వామ్యాన్ని దండోరా వేసే మూలవాసిని ఈ భూమి బిడ్డల్ని కన్న పరగొట్టు తల్లి/ ఏలినవా దళిత రాజ్య పతాకాన్ని/ తన మొరటు చేతులతో/ ఎగరేయబోయే భారత స్త్రీ (పైరి-పు.25). రజిత కవిత్వంలో అసమానమైన ఆత్మవిశ్వాసం, రాజీపడని నిశ్చితత్వం, కల్తీలేని శ్రామిక దృక్పథం అడుగడుగునా కనిపిస్తాయి. రాజ్య విప్పవగాయని బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన చరిత్ర అందరెరిగినదే. ప్రగతిశీల రచయితలందరూ ముక్తకంఠంతో నిరసించిన సంఘటన అది. రజిత ‘పాములు మింగిన పాట’ కవితలో ఆ దుర్మార్గాన్ని గర్జించారు. లలిత పాటను గాలిదుమారం అని, తుఫాను అని వర్ణించారు. దోపిడీ రాజ్యం లలిత పాటకు ఎంతగా భయపడిరదో తీరు తీరుగా వర్ణించారు. ఈ గడ్డ మీద చిమ్మిన నెత్తురు సుక్కలకెల్లి/ లెక్కలేనన్ని పాటలు మొలుకలై నిక్కుతయి/ మా అందరి కన్నీల్లు వానలు మర్రి/ నీ పాటలో చెరువులపై నిండుతయి (పైరి – పు.40) స్త్రీ వ్యక్తిత్వాన్ని, స్త్రీ ఔన్నత్యాన్ని రజిత అనేక కవితలలో మమకారంతో చిత్రించారు.
జ్వాలముఖి ఆమె వదనం…/ ఆమె పదం నిరసన నినాదం…/ ఆమె పాదాలు ఆదిమం/ ఆమె పదాలు కదనం (కాలం కాన్వాస్ మీద – పు.20) అన్నారు. ‘ఆమె పాదం’ కవితలో, ‘మావ్వ బడి’ కవితలో, అలాగే ‘ఓ లచ్చవ్వ’ కవితలో రజని స్త్రీని విజ్ఞాన ఖనిగా, పోరాట శక్తిగా కీర్తించారు. ముసలామె చెప్పే అనేక విషయాలను విని ఆశ్చర్యచకితురాలైన కవయిత్రి.
సంధ్య ఆగిపోతున్న చెరువు కుంటలో/ ఎర్రనైన నీటి తీరు/ ఆమె జీవితానుభవం/ నాకెప్పుడూ విస్మయమే. (ఉసురు-పు.20) కవ్వం పెల్లి లచ్చవ్వను ఆధిపత్య/కులాల పురుషులు మోసం చేసిన సందర్భాన్ని వర్ణిస్తూ… ఉన్నోల్లకో నాయెం లేనోల్లకు అన్నాలమాయె/ ఆడోల్లకో అన్నాం మొగోల్లకు కామెమాయె.. అని సమాజంలో సాంఘిక వివక్షను (కులం, జండర్) వివరించి చివరికి, కండ్లు తుడుచుకోవె/ కయ్యానికి కాలుదువ్వవె/ ఓ అవ్వ! నా లచ్చవ్వా! (ఉసురు-పు.29, 30) అని తిరుగుబాటును ప్రభోదించింది. సర్పంచులుగా మహిళలు ఎన్నికైనా, మొగవాళ్ళ పెత్తనము కొనసాగటాన్ని రజని గర్జించారు.
అందుకే రజని 1986లోనే స్త్రీల కోసం చేసిన చట్టాల పైన విమర్శ చేశారు, ‘కాగితం మీద పులులు’ కవితలో.
పీడిత స్త్రీ జనోద్ధరణకు/ చేసారుట చట్టాలు…/ శాసనాలు చేయగానే/ పడేనా అవినీతి జాడం/ చిత్తశుద్ధి లేని చట్టాలు/ కాగితం మీద పులులు (నాకొక-పు.45) స్త్రీని అన్ని రకాల పీడనల నుండి విముక్తం చేయాలంటే పోర్నాం తప్ప మరో మార్గం లేదని రజిత రాజీలేని ప్రబోధం తన కవిత్వమంతా చేస్తూనే వచ్చారు. అందుచే ఆమెకి యుద్ధభాష అయింది.
భుజంగమై నువు బుసబుస లేవాలె అక్కయ్యో! ఓ అక్కయ్యా! సివంగి నీవై పంజా విప్పవె చెల్లమ్మా! ఓ చెల్లెమ్మా!…
తలెత్తి నీవు తెగించి చూడవె ఓ అక్కయ్యా! స్వేచ్ఛ కోసమై సమరం నడిపి జ్వలించి గెలువవె చెల్లెమ్మా! (నిర్ణయాకాశం కింద-పు.31) మహిళా విముక్తి కోసం జీవితమంతా పోరాడిన జయశ్రీ మరణం పట్ల రజని స్పందిస్తూ ‘‘నిలువెత్తు నైతిక శక్తి’’ అనీ, ‘‘తొవ్వ పువ్వు’’ అని వర్ణించారు, ‘ఆమె నడిచిన దారి’ కవితలో.
మానవుడు ఎప్పుడు/ మృగమయ్యిండో/ మృగాళ్ళదే రాజ్యమెప్పుడయిందో/ మీకు తెలిస్తే జరంత/ రాయించి చెప్పండిరా/
విడమందో ఎరుక జెయ్యండిరా (కాలం కాన్వాసు మీద-పు.07) అని అభ్యర్థన రూపంలో విమర్శ మణిపూర్ దుర్మార్గాల మీద రజిత రాసిన ‘ఏ దేవుడు రాసిండు’ కవితలోది. స్త్రీ జీవితాన్ని ఆవరించిన సామాజిక వ్యవస్థలను పురుషాధిపత్యాన్నీ, ఆర్థిక అసమానతలను, దోపిడీ రాజ్య విధానాలను రజిత తన కవిత్వం నిండా ఉతికి ఆరవేశారు. ఆమెది నిర్భయ గొంతుక. అదే సమయంలో స్త్రీల పక్షం వహించి, వాళ్ళకు ధైర్యం, స్థైర్యం నూరి పోశారు. యుద్ధంలోకి ఆహ్వానించారు. శ్రామిక స్త్రీలకు రజిత కలమార కీర్తించారు. వాళ్ళ శ్రమ దోపిడికి గురి కావడాన్ని గర్జించారు. శ్రమ దోపిడికి కాని వ్యవస్థను ఆహ్వానించారు.
గామె మట్టిల బుట్ట మంటల మీద కాలె/ బువ్వంబల్ల కుంతలు తరి నిత్తెం పోయ మీన్కి ఎక్కేస్తుంద దిగే కుండయి/ గామి ఇగురంతోటి ఇంటిల్లి రాజుల ఆకలి మాపే/ అచ్చ పాత్రయితది/ తల్లీ! అగరుబత్తోలె ఏలుకుంట/ జీవునం ఎల్లబుచ్చుతది (ఉసురు-పు.3).





