‘అంపశయ్య’ మానసిక అంతర్ముఖ యాత్ర

“మనసుని హత్తుకున్న నవల, కథ, కవిత మరే ఇతర ప్రక్రియ నుంచయినా ఒక రచనని ఎంచుకుని వారం వారం ‘శోభ’ పాఠకుల కోసం పరిచయం చేసే శీర్షిక ‘చెమ్మ’ దీనిని రచయిత, విమర్శకుడు, అనువాదకుడు అయిన వారాల ఆనంద్ నిర్వహిస్తారు.”

అంపశయ్య 1969లో ప్రచురితమైన నవల. మొదట సృజన త్రైమాసిక పత్రికలో రెండుభాగాలుగా ప్రచురితమై ఆ తర్వాత నవలగా వచ్చింది. అప్పటిదాకా యద్దనపూడి, అరికపూడి లాంటి మహిళా రచయితల నవలలు చదివిన 70వ దశకం తెలుగు పాఠకులను ముఖ్యంగా యువతను ఒక కుదుపు కుదుపిన నవల ‘అంపశయ్య’.  ఆ నవలలో రచయిత వాక్యంలో పరుగెత్తిన వేగం, మనిషి మనసులో జరిగే అంతర్ బహిర్ సంఘర్షణల్ని పలికించిన తీరు ఆ తరాన్ని అమితంగా ప్రభావితం చేసింది. అంపశయ్య యువత ముఖ్యంగా విశ్వవిద్యాలయ విద్యార్థుల నవల.

ఒకానొక తెల్లవారుజామున యూనివర్సిటీ హాస్టల్ గదిలో రవికి  ఒక కల రావడంతో మొదలవుతుంది. ఆ కలకు అర్థమేమిటో రవికి తెలియదు. మేలుకున్న రవిలో మొదలైన ఆలోచనల ప్రవాహం నిరంతరంగా పరిగెడుతూ దాదాపు 18గంటల పాటు నడిచి చివరికి ఆ రాత్రి అదేగదిలో ముగుస్తుంది. రవి తల్లిదండ్రులు ఇంటినుంచి కష్టపడి చెమటోడ్చి పంపే డబ్బుతో ఎమ్మే చదువుతుంటాడు ఉస్మానియా యూనివర్సిటీలో. తెలివైనవాడే అయినా పరీక్షలు దగ్గర పడేవరకూ చదవకుండా అవి ముంచుకొస్తుంటే కొద్దిగా అయినా చదవలేక పోతున్నాననే అపరాధ భావనలో పడి కొట్టుకుంటుంటాడు. దానికి తోడు ఇంటిదగ్గర రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బు పంపించే తల్లిదండ్రులు, వాళ్ళ కష్టాలు గుర్తొచ్చి కలవరపెడుతుంటాయి. మెస్ బిల్లు బాకీతో ఆ రోజునుండి భోజనం బంద్. రవికి కాలేజీలో మిగతా విద్యార్థులు పరిచయం అవుతారు. డబ్బుతో మిడిసిపడే రెడ్డి, అతడి బృందం, అభ్యుదయం గురించి మాట్లాడే వేణు, ప్రతినాయక ఛాయల్లో కనిపించే శ్రీశైలం, రంగారెడ్డి, వెధవ యూనివర్సిటీ చదువు అయిపోతే అమెరికాకి వెళ్లిపోదామనుకునే డబ్బున్న కిరణ్మయి, రవి గతజీవితంలోని రత్తి, రవిని నిష్కల్మషంగా, నిజంగా ఇష్టపడిన రత్తిపట్ల రవి ధైర్యం చేయలేకపోతాడు. ఆ పైన రత్తిపట్ల తాను ప్రవర్తించిన తీరు ఆలోచనల్లో నిరంతరం రవిని వెంటాడుతూనే ఉంటుంది. రత్తిని కలలో చూడటంతోనే ఈ నవల  మొదలవుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతిక్షణం ‘టుబి ఆర్ నాట్ టుబి’ అన్న ద్వైదీభావంతో కొట్టుమిట్టాడుతుంటాడు రవి.

నవలకు ‘అంపశయ్య’ శీర్షికే ఓ ప్రతీక. అంపశయ్య అంటే ముల్లుల మంచం. జీవితం కూడా అలాంటిదే నిద్రపోవాలని తలపెట్టినా, ముల్లుగుచ్చే బాధతో నిద్రపట్టని స్థితి. ఈ నవలలో రవి తనచుట్టూ ఉన్న సామాజిక వాస్తవాలను, రాజకీయ సంచలనాలను, కుటుంబ ఒత్తిడులను, అంతర్గత లైంగిక, మానసిక కలవరాలను ఎదుర్కొంటాడు. ఆయన పోరాటం బయట ప్రపంచంతో కంటే ఎక్కువగా తనతోనే. ప్రశ్నలు ఎక్కువ  జవాబులు లేవు. ఆలోచనలు విరుద్ధాలు నిర్ణయాలు అస్పష్టాలు. ఈ నవలలో సంఘటనల కంటే మనస్సు ప్రవాహం ఒత్తిడి ప్రధానంగా ఉంటుంది.

 అంపశయ్య కేవలం కథకాదు. అంతర్ముఖయాత్ర. ఒక యువకుడి ఆత్మసాక్షాత్కారప్రయాణం. తెలంగాణ సాహిత్యంలో కొత్త శైలీప్రవాహానికి శ్రీకారం చుట్టిన రచయితలలో నవీన్ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. అంపశయ్య  తెలుగు నవలాపరిణామంలో ఒక మలుపు. సాంప్రదాయ కథనశైలికి భిన్నంగా చైతన్య స్రవంతి విధానాన్ని అనుసరిస్తుంది. అంతరంగ సంభాషణే ఇక్కడ పాత్రల సంభాషణలు. స్మృతులే ఇక్కడ కథామలుపులు. భావోద్వేగాలే ఇక్కడ ఘట్టాలు. అంపశయ్య బాహ్యసంఘటనల క్రమాన్ని కాదు, అంతర్మనస్సు క్రమరాహిత్యాన్ని చూపుతుంది. మానసిక విషయాల్ని చెప్పినప్పుడు ‘తాళం వేస్తున్నాడు తీస్తున్నాడు’ కరెంట్ స్విచ్చు ఆన్ ఆఫ్ లాంటివి ఎన్నో కనిపిస్తాయి.

ముఖ్యంగా ఈ నవల 1960–70 దశకాల్లో యువతలో పెరిగిన అస్థిరతను ప్రతిబింబిస్తుంది. నిరుద్యోగ భయం సామాజిక అసమానత ప్రేమ, వివాహ సంక్షోభం నైతికవిలువల గందరగోళం- ఆ  తరం మానసికచిత్రం. తెలంగాణ ఆత్మగౌరవ చైతన్యం అప్పుడప్పుడే ముసురుకుంటున్న దశలో యువత మనసుల్లో చెలరేగిన  గందరగోళం అంపశయ్యలో ధ్వనిస్తుంది. అంపశయ్య మనస్తత్వ నవలలకు పునాది వేసింది. దారిచూపింది. నిజానికి అంపశయ్య ఒక యువకుడి నిద్రలేనిరాత్రి. ఒక విద్యార్థి తరం ఆత్మస్వరం. తెలంగాణ నేలలో మొలిచిన ప్రశ్న. జవాబు లేని అనేక ప్రశ్నలతోనే ఈ నవల సాగుతుంది. బాధను సంఘర్షణను భాషగా మార్చిన అక్షరాలుగా అంపశయ్య నిలబడుతుంది.

చైతన్య స్రవంతి అనేది సాహిత్యంలో ఒక కథనపద్ధతి, ఇది ఒకపాత్ర మనసులో జరిగే ఆలోచనలు, జ్ఞాపకాలు, అనుభూతులను ఎటువంటి వడపోత లేకుండా, తార్కికక్రమం లేకుండా యథాతథంగా చిత్రిస్తుంది. నిజానికి 20వ శతాబ్దపు ఆధునిక సాహిత్యంలో చైతన్యప్రవాహ పద్ధతిని అత్యున్నతస్థాయికి చేర్చిన రచయిత జేమ్స్ జాయ్స్. అంపశయ్యపై జేమ్స్ జాయిస్ స్ట్రీం ఆఫ్ కాన్షియస్నెస్ ప్రభావం వుంది అంటారు. కాని నవీన్, జాయ్స్ ని చదవకముందే అంపశయ్య రాసాడు. అంపశయ్య

(నవీన్ ఆసలు పేరు డి.మల్లయ్య  తను 24 డిసెంబరు 1941న వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ (ఆర్థికశాస్త్రం) చదివాడు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్. కళాశాలతో పాటు పలు ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశాడు. కరీంనగర్లో వుండగా కొందరు మిత్రులతో కలిసి కరీంనగర్ ఫిలింసొసైటీని స్థాపించాడు. అది అర్థవంతమయిన సమాంతర సినిమావేదికగా నిలబడింది. నవీన్ 28కి పైగా నవలలు 70కి పైగా కథలు రాసారు. అనేక వ్యాసాలు, విమర్శలు, సమీక్షలూ, బుచ్చిబాబు లాంటి రచయితల పైన పుస్తకాలు రాసారు. ఆయన నవలల్లో అంపశయ్య, ముళ్ళపొదలు, అంతస్స్రవంతి, కాలరేఖలు చీకటిరోజులు, బాంధవ్యాలు, వివిధ కథా సంకలనాలు ఉన్నాయి. ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు  తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ నవల అవార్డు లాంటి అనేక పురస్కారాలు గౌరవాలు అందుకున్నారు.

     -వారాల ఆనంద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *