అమెరికా ఆధిపత్య ధోరణి విపరీతంగా పెరిగిపోయి ఏకంగా దేశాధ్యక్షులను అరెస్ట్ చేయడం లేదా అంతమొందించడం వంటి పనులకు పాల్పడుతుండటం ఆయా దేశాల వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నది. ప్రపంచ బాస్‌ను తానేనన్న అహంకారంతో అమెరికా, మరో దేశంలో చట్టబద్ధంగా అధికారంలో ఉన్న మరో ప్రభుత్వా న్ని తన స్వార్థ ప్రయోజనాలకోసం కూల్చి తనకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అస్థిరతకు గురిచేస్తున్న అమెరికా వైఖరి ఎంతమాత్రం సమర్థనీయం కాదు. గతంలో అమెరికా దుశ్చర్యలవల్ల ఇరాక్, లెబనాన్, వెనిజులా, దేశాలు తీవ్ర అస్థిరతకు గురయ్యాయి. యు.ఎస్. ప్రమేయంతో బంగ్లాదేశ్ ఏకంగా మతఛాందసులు చేతుల్లోకి వెళ్లిపోయింది. అక్కడి పరిశ్రమలు దెబ్బతిని లక్షలాది మంది కార్మికులు వీధులపాలయ్యారు. ఇక ఇప్పుడు ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయొతుల్లా ఖమేనీని హతమార్చడం, మాజీ రాజును అధికారంలోకి తెచ్చేందుకు యత్నిస్తున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిణామాలు ముఖ్యంగా మనదేశానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే మనదేశానికి చెందినవారు ఈ దేశాల్లో పెద్దసంఖ్యలో ఈ దేశాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తుండటంతో వీరి భద్రత మన దేశానికి ప్రధానంగా మారింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దీనిపైనే దృష్టి సారించిట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.
మన దౌత్యానికి అగ్ని పరీక్ష!

మధ్యప్రాచ్య దేశాలతో మనకున్న స్నేహ సంబంధాలు, వాణిజ్య అవసరాలు, మనదేశవాసుల భద్రత తదితర కారణాల రీత్యా పూర్తి వ్యూహాత్మక తటస్థ వైఖరి అవలంబించడం చాలా అవసరం. చబ్బహార్ పోర్డు అభివృద్ధికి మనదేశం వేలకోట్లు పెట్టుబడులు పెట్టింది. మనకు ఆసియా అనుసంధానానికి ఈ పోర్టు చాలా అవసరం. కశ్మీర్ విషయంలో మనకు బాసటా నిలిచి, కొన్ని దశాబ్దాలుగా మనతో సన్నిహిత సంబంధాలు నెరపిన ఇరాన్ మనకు అత్యంత ముఖ్యం. అదీకాకుండా రెండు దేశాల నాగరికతలు అత్యంత పురాతనమైనవి.
ఇరుదేశాల వాణిజ్య సంబంధాలు ఈనాటివి కావు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్య, రక్షణ ఒప్పందాలు అమల్లో వున్నాయి. అమెరికా మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా. ఇజ్రాయిల్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. సాంకేతిక పరంగా ఇజ్రాయిల్ మనకు ఆప్తమిత్రుడు. మనదేశానికి సన్నిహిత మిత్రులుగా ఉన్న మూడు దేశాలు యుద్ధంలోకి దిగడం నిజంగా దౌత్యపరంగా అత్యంత కఠినమైన పరిస్థితే! ఎవ్వరూ దీన్ని కాదనలేం. వర్తమాన చరిత్ర పెట్టిన ఈ కఠిన పరీక్షను ఎదుర్కొనడానికి తటస్థవైఖరిని కఠినంగా అనుసరించడమే ఏకైక మార్గం. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న స్నేహ సంబంధాలను కాపాడుకోవడానికి ఇదే సరైన పద్ధతి! అప్పుడే మనం ఎవరికైనా సలహా ఇచ్చే స్థితిలో ఉండగలం. ఈ నేపథ్యంలో ఎటువైపు మొగ్గు చూపినా అది మన ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీయక మానదు.
ప్రస్తుతం ఇరాన్ ప్రతీకార దాడులతో యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైన్ వంటి గల్ఫ్ దేశాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. అమెరికా సైనిక స్థావరాలు ఆయా దేశాల్లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. మనకు టర్కీ, అజర్ బైజాన్, పాకిస్తాన్ దేశాలతో తప్ప మిగిలిన అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. మనదేశంతో వాణిజ్య ప్రయోజనాన్ని పొందుతున్న చైనా, భౌగోళికంగా మనకు ఎప్పుడూ పక్కలో బల్లెమే! చాలా మధ్యప్రాచ్య దేశాలు ప్రధాని నరేంద్రమోదీని అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. దురదృష్టవశాత్తు ఇప్పుడు గల్ఫ్ దేశాలు బలవంతంగా యుద్ధరంగంలోకి దిగాల్సి వొస్తున్నది. ఇంతటి విధ్వంసానికి కారణం అమెరికానే! మరో దేశాన్ని నిందించడానికి అవకాశం లేదు!యు.ఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంతో సంబంధంలేని దేశాలు తమపై జరుగుతున్న దాడులనుంచి తమనుతాము రక్షించుకోవడానికి యుద్ధానికి సన్నద్ధమవుతుండటంతో, మూడో ప్రపంచ యుద్ధం దిశగా ప్రపంచ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. అవకాశాలకోసం వెతుకుతూ వెళ్లిన భారతీయులు, మనదేశానికి పెద్దమొత్తంలో విదేశీమారకద్రవ్యాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పుడు వీరిని భద్రంగా స్వదేశానికి రప్పించడం ప్రభుత్వం ముందున్న పెను సవాలు.
ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో 28వేలకు పైగా, ఇరాన్‌లో 10వేలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా సైనిక స్థావరాలున్న యుఏఈ, ఖతార్, కువైట్ దేశాల్లో 90లక్షల మంది మన పౌరులు వేర్వేరు ఉపాధి రంగాల్లో స్థిరపడ్డారు. వీరందరి పరిస్థితి ప్రస్తుతం అయోమయంలో పడింది. “విశ్వగురు”గా తనను తాను సుప్రతిష్టితం చేసుకున్న భారత్ ఇప్పుడు వ్యూహాత్మక స్వేచ్ఛను అనుసరిస్తూ, ఈ ప్రాంతాల్లోని మనవారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకోవడమొక్కటే మార్గం. రష్యా-యుక్రె యిన్ యుద్ధ సమయంలో రెండు దేశాలకు చెప్పి మనవారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించగలిగాం. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నం. పగతో రగిలిపోతున్న ఇరాన్‌ను లేదా విచ్చలవిడి దాడులకు గురవుతున్న గల్ఫ్ దేశాలను కదిలించే పరిస్థితి లేదు. పశ్చిమ ఆసియాలో వేగంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, భారతదేశం ఒక సున్నితమైన దౌత్య సమతుల్యతను ప్రదర్శిస్తోంది.




