ఇరాన్ పై అమెరికా ఆధిపత్యం

“ఒకప్పుడు  ఇరాన్,ఇరాక్ లకు ఆయుధ,ఆర్ధిక సహకారం అందించిన అమెరికా తర్వాత కాలంలో అమెరికాకు ఎదురు తిరిగిన ఇరాక్ ను నాశనం చేసి, సద్ధాం హుస్సేన్ ను హతమార్చిన సంగతి మరువలేం.  ఇరాక్ వద్ద జీవ,రసాయన ఆయుధాలున్నాయని, ఇవి అమెరికా మరియు దాని మిత్ర దేశాలకు ముప్పుగా పరిణమించాయని,  ఆయుధ తనిఖీకి ఇరాక్ అంగీకరించడం లేదనే నెపంతో  దాడికి తలపడిన అమెరికా  సద్దాం ను ఉరితీయించింది. నాడు ఇరాక్ పై ఏ కారణాలు చూపి అమెరికా దాడికి పాల్పడిందో, ఇప్పుడు అవే కారణాలతో  ట్రంప్ నేతృత్వంలోని అమెరికా మరియు దాని మిత్ర దేశమైన  ఇజ్రాయిల్ లు  సంయుక్తంగా   ఆపరేషన్ చేపట్టి  ఇరాన్ ను ధ్వంసం చేస్తూ అయతుల్లా అలీ ఖమేనీ ని అంతమొందించాయి.”
– సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్)
దేవరపల్లి మండలం,
ఆంధ్రప్రదేశ్,మొబైల్ :9704903463

ఎట్టకేలకు అమెరికా పంతం నెగ్గింది. ట్రంప్ అహం సంతృప్తి చెందింది. ఇరాన్ లో అయతుల్లా ఆలీ ఖమేనీ ఖమేనీ శకం ముగిసింది.కరడు గట్టిన ఇస్లామిక్ నియంత కాలగర్భంలో కలిసిపోయాడు.అమెరికా, ఇజ్రాయిల్ టెక్నాలజీ, క్షిపణుల ముందు ఖమేనీ హుంకరింపులు పని చేయలేదు.అత్యంత అధునాతన ఆయుధాలు గల అమెరికా,ఎంతో సాంకేతిక పరిజ్ఞానం గల ఇజ్రాయిల్ దేశాలు సంయుక్తంగా ” ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”, “ఆపరేషన్ రోరింగ్ లయన్” పేర్లతో  ఇరాన్ పై విరుచుకు పడ్డాయి. ఇరాన్ అణు కార్యక్రమం వలన ప్రపంచమే నాశనమైపోతుందని  ట్రంప్ చెప్పడం, ప్రస్తుత దాడుల వలన ఇరాన్ పౌరులు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పుకొని, సంతోషంగా జీవించగలరని  ట్రంప్ చెప్పడం గాయాలపై ఆయింట్ మెంట్ పూయడం లాంటి కంటి తుడుపు చర్యగానే భావించాలి.ఖమేనీ లేకుండా  ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కేవలం కొద్ది రోజులకే ముగియడం తథ్యం.

ఈ కారణంగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖమేనీ లేని ఇరాన్ ఏమీ చేయలేదని,ఇస్లామిక్  రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐ.ఆర్.జి.సి),సైన్యం,పోలీసులు,ప్రజలు కలసికట్టుగా ఇరాన్ ను పునర్మించుకోవాలని “ట్రూత్” సోషల్ వేదిక ద్వారా  ట్రంప్ ఉచిత సలహా ఇవ్వడం జరిగింది. అమెరికాను ఎదిరించి,గుణపాఠం నేర్పుతానన్న ఖమేనీ అమెరికా చేతిలో  కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే మృత్యువాత పడడం ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు.శాటిలైట్ సహాయంతో ఖమేనీ స్దావరాన్ని గుర్తించి పదుల సంఖ్యలో బాంబర్లను వేసి ఖమేనీ ని  హతమార్చడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు,మహిళలు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చి,ట్రంప్ తనకు విముక్తి కలిగించారని నృత్యం చేస్తూ,బాణాసంచా కాల్చి,సంబరాలు చేసుకోవడం గమనార్హం. ఖమేనీ మరణవార్త ధృవీకరించిన ఇరాన్ ఇందుకు ప్రతిగా అమెరికా,ఇజ్రాయిల్ దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది.

       ఇక పోతే ఇరాన్ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ని మూసి వేయడంతో అనిశ్చితి పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. హార్ముజ్ స్ట్రయిట్ మూసి వేసిన నేపథ్యంలో చమురు దిగుమతుల విషయంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇరాన్- అమెరికా  సంఘర్షణకు కొద్దిరోజుల్లోనే తెరపడవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. అలా కాకుండా ఈ ఘర్షణలు ఇలా మరికొంత కాలం కొనసాగితే భారత్ లో చమురు సమస్య ఏర్పడే అవకాశాలను తోసి పుచ్చలేం. హార్ముజ్ జలసంధి ని మూసి వేసిన దృష్ట్యా  భారత్  తిరిగి రష్యా నుండి చమురు దిగుమతులను పెంచక తప్పదు. రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపివేయాలని   భారత్ పై వత్తిడి తీసుకొచ్చిన అమెరికా   భారత్ చమురు సమస్యకు పరిష్కారం మార్గం చూపించగలదా? అనే సందేహం కలుగక మానదు.
    ఖమేనీ ని అంతమొందించామని అమెరికా- ఇజ్రాయిల్ లు సంబర పడుతున్నా,ఈ పరిణామాలు భవిష్యత్తులో అమెరికా మరియు ఇజ్రాయిల్ దేశాలకు తీవ్రం నష్టం కలిగించవచ్చు. అమెరికా కంటే ఇజ్రాయిల్ కే హమాస్,హెజ్బుల్లా వంటి సంస్థల నుండి తీవ్రమైన ముప్పు ఏర్పడవచ్చు. గతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన దాడిని అమెరికా  గుర్తుంచుకోవాలి. ఇప్పటికే ట్రంప్ పై పలు మార్లు హత్యా ప్రయత్నాలు జరిగిన విషయం మరువరాదు. ఇటీవల ఫ్లోరిడాలో ట్రంప్ నివాసం పై జరిగిన దాడి ట్రంప్ భద్రతకు వాటిల్లిన ముప్పును తెలియ చేస్తున్నది.అమెరికా-ఇరాన్ ల మధ్య  యుద్ధం వలన  అమెరికా పై కేవలం ఆర్థిక భారం మాత్రమే పడుతుంది. కొంతమంది సైనికులను కోల్పోవలసి వస్తుంది. అయితే ఇరాన్ సర్వ నాశనం దిశగా పయనిస్తున్నది. ఇదే సందర్భంలో అమెరికాకు వత్తాసు పలికిన ఇతర గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడి,భారీ విధ్వంసం చేస్తున్నది.ఇది గల్ఫ్ దేశాలకు తీరని నష్టం.తాను చెడిన కోతి వనమంతా చెడగొట్టిన చందంగా.. ఇరాన్ తాను నాశనమవుతూ ఇతర దేశాల వినాశనమే ధ్యేయంగా యుద్ధం చేయడం గమనార్హం.
     ఇరాన్- భారత్ ల మధ్య సౌహార్ధ్ర దౌత్య సంబంధాలున్నాయి. కాశ్మీర్ తో సహా పలు అంశాల్లో ఇరాన్ భారత్ ను సమర్ధించింది. భారత్ ఎప్పుడూ పాలస్తీనా కే మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. అయితే మారిన ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ ఒత్తిళ్ళతో భారత్ ఇజ్రాయిల్ వైపు నిలబడిందనే ఆరోపణలు వస్తున్నాయి.   అలాగే రష్యా తో భారత్ తన చిరకాల మైత్రిని కాలదన్ని, చమురు దిగుమతులను తగ్గించుకుని అమెరికా చెప్పినట్టు,వెనిజులా చమురు దిగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రపంచంలో భారత దేశ  విశ్వసనీయతను దెబ్బతీస్తుందనే అభిప్రాయం ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ  భారత్ కు తన దేశ ప్రయోజనాలు ముఖ్యం గనుక బలమైన అమెరికా దేశంతో ఘర్షణ కొనితెచ్చుకోవడం మంచిది కాదనే అభిప్రాయంతో   అమెరికాతో  ట్రేడ్ డీల్ కుదుర్చుకుందని భా.జ.పా అనుకూల వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అగ్రదేశమైన అమెరికా సరైన దారిలో నడవకుండా,కేవలం తన స్వప్రయోజనాల కోసం పాటు  పడడమే ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితులకు కారణం. తాను ఇబ్బడి ముబ్బడిగా ఆయుధాలను సమకూర్చుకుంటూ,ఇతర దేశాలకు ఆయుధాలను,సాంకేతిక పరిజ్ఞానాన్ని అమ్ముకుంటూ  కుప్ప కూలిన తన దేశ ఆర్ధిక  వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి టారిఫ్ లతో విరుచుపడడం వలన కొన్ని దేశాలు అమెరికా వత్తిడికి తలొగ్గక తప్పడం లేదు.   ఒకప్పుడు ఇజ్రాయిల్- ఇరాన్ లు చెట్టపట్టాలేసుకుని స్నేహ గీతం పాడిన రోజులు మరచిపోగలమా? ఒకప్పుడు  ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేసిన ఇజ్రాయిల్ నేడు అమెరికాతో కలిసి అదే ఇరాన్ ను చావు దెబ్బతీసింది.9 కోట్ల జనాభా గల ఇరాన్ ను కేవలం కోటి జనాభా గల ఇజ్రాయిల్ గడగడ లాడించడానికి కారణం ఆయుధాలు,సాంకేతిక పరిజ్ఞానం.  29 కోట్ల జనాభా గల వెనిజులా లో చొరబడి స్వయంగా ఆ దేశ అధ్యక్షుడైన మదురోను అమెరికా ఎత్తుకు పోవడం ఆశ్చర్యం.
      యుద్ధంలో గెలవాలంటే  జనాభా ముఖ్యం కాదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలు, క్షిపణులు,సైనిక బలగం,యుద్ధ వ్యూహాలు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఇకపై తమ రక్షణ కోసం అధిక నిధులు సమకూర్చుకోక తప్పదేమో.అహం,ఆధిపత్యం వంటి మూర్ఖ భావజాలమే ప్రపంచ ప్రజలను ప్రశాంతంగా జీవించనీయడం లేదు. అధునాతన ఆయుధాలతో,సాంకేతిక పరిజ్ఞానంతో, క్షిపణులతో,ఆకాశ హర్మ్యాలను నేలమట్టం  చేసి, అమాయక ప్రజలను చంపి, ఆర్ధిక వనరులను విధ్వంసం చేసి భూమండలాన్ని భస్మీపటలం చేస్తే గాని అహం చల్లారదా? ఆధిపత్యం నిలబడదా? కొన్ని దేశాల నిర్ణయాలు, నియంతృత్వ భావాలు,మత ఛాందసవాదం ప్రపంచంలో యుద్ధాలను ప్రేరేపిస్తున్నాయి. వినాశనం సృష్టిస్తున్నాయి. తాము చేయని తప్పుకు ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ప్రజల బ్రతుకులు చితికి పోతున్నాయి.. రక్తపాతంతో రావణకాష్టం సృష్టిస్తూ,మారణ హోమం కొనసాగిస్తున్న ఈ ఆధునిక,ఆటవిక మారణ హోమంలో అమాయకులు సమిధలు కావలసిందేనా?  యుద్ధ పిపాసుల దానవ ప్రవృత్తితో మానవత్వం చితిలో తగలబడవలసిందేనా? ఎంత కాలం ఈ అలజడులు? ఎందుకోసం ఈ యుద్ధాలు?యుద్ధాలు ఎవరికీ విజయాన్ని చేకూర్చవు. యుద్ధాల వలన ప్రజలు బాగుపడిన సందర్భాలు చరిత్రలో కానరావు. యుద్ధాల వలన విధ్వంసమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఒనగూడదు. అహం,అధిపత్యం, సామ్రాజ్యవాదం వంటి లక్షణాల నుండి పుట్టి, పెరిగి, ప్రజలు ఈసడించుకుంటున్నా పట్టించుకోకుండా తమ పంతం నెగ్గించుకోవాలనే నియంతల  మానసిక ఉద్వేగ ఉన్మాద ఫలితమే యుద్ధాలకు దారి తీస్తుందనే వాదన సత్య దూరం కాదు.
     ఇతర దేశాలను కబళించాలని పరాయి దేశాలు ప్రయత్నిస్తే ఆ చర్యలను ధీటుగా తిప్పికొట్టడం సముచితమే. దేశ భక్తి, ఆత్మాభిమానం, సార్వభౌమత్వ పరిరక్షణ అన్ని దేశాలకు అవసరమే. కాని తమ దేశమే గొప్పదని,తమ మాటే శాసనమని హుంకరించడం నియంతృత్వమే కాగలదు. అమెరికా లాంటి దేశాలు అహం అనే పునాదులపై నిర్మింపబడి, అగ్రరాజ్యమనే హోదాతో ఇతర దేశాలను లొంగ దీసుకోవడానికి ప్రయత్నించడం ఆక్షేపణీయం. అగ్రరాజ్యాలు తమ వద్ద ఇబ్బడి ముబ్బడిగా  ఆయుధాలను సమకూర్చుకుంటూ, అణ్వాయుధాలను పెంచుకుంటూ తమ రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించడంలో లేని తప్పు ఇతర దేశాలు శతృదేశాల నుండి తమను తాము కాపాడుకోవడానికి తమ రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకోవడంలో తప్పులు వెతకడం భావ్యమా? ఆయుధ వ్యాపారం మొదలు పెట్టింది అగ్రరాజ్యాలు కాదా?  ఒకప్పుడు  ఇరాన్,ఇరాక్ లకు ఆయుధ,ఆర్ధిక సహకారం అందించిన అమెరికా తర్వాత కాలంలో అమెరికాకు ఎదురు తిరిగిన ఇరాక్ ను నాశనం చేసి, సద్ధాం హుస్సేన్ ను హతమార్చిన సంగతి మరువలేం.  ఇరాక్ వద్ద జీవ,రసాయన ఆయుధాలున్నాయని, ఇవి అమెరికా మరియు దాని మిత్ర దేశాలకు ముప్పుగా పరిణమించాయని,  ఆయుధ తనిఖీకి ఇరాక్ అంగీకరించడం లేదనే నెపంతో  దాడికి తలపడిన అమెరికా  సద్దాం ను ఉరితీయించింది. నాడు ఇరాక్ పై ఏ కారణాలు చూపి అమెరికా దాడికి పాల్పడిందో, ఇప్పుడు అవే కారణాలతో  ట్రంప్ నేతృత్వంలోని అమెరికా మరియు దాని మిత్ర దేశమైన  ఇజ్రాయిల్ లు  సంయుక్తంగా   ఆపరేషన్ చేపట్టి  ఇరాన్ ను ధ్వంసం చేస్తూ అయతుల్లా అలీ ఖమేనీ ని అంతమొందించాయి.
    ఇకనైనా పశ్చిమాసియాలో ఈ మారణ హోమానికి స్వస్తి చెప్పాలి. ప్రజాస్వామ్య పద్దతిలో ఇరాన్ లో ఎన్నికలు జరిపి, ఎలాంటి మతపరమైన నిర్భంధాలు లేకుండా  ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించాలి.ఇరాన్ విధ్వంసం  నేర్పిన పాఠాలు ప్రపంచంలోని నియంతృత్వ దేశాలకు గుణపాఠం కావాలి.పహల్గాం లో పాక్ ఉగ్రవాదులు సాగించిన నరమేథానికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పాక్ తాను అమెరికా,చైనా నుండి కొనుగోలు చేసిన ఆయుధాలు,యుద్ధ విమానాలు,క్షిపణి వ్యవస్థలు విఫలమైనాయనే విషయం విదితమే. ఇప్పుడు కూడా అమెరికా దాడులను తిప్పికొట్టడంలో ఇరాన్ ప్రభుత్వం  చైనా నుండి కొనుగోలు చేసిన ఆయుధాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు విఫలమైనాయనే విమర్శలు వ్యాపించాయి.ఈ పరిణామాలు  ఇకనుండి విదేశీ ఆయుధాల కొనుగోలు లో అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యతను గుర్తుచేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *