అంబేడ్కర్ ..ఓ హక్కుల పాలపుంత

తానో హక్కుల పాలపుంత

ఎన్నెన్నో హక్కుల చుక్కలను ఒక్కకాడ పోగేసి

కడగొట్టు ప్రజల జీవితాలు స్వయం ప్రకాశం చేసినోడు

ఈ లోకమంతా ఆదిపత్యపు గుహలో చిక్కుకున్నపుడు

హక్కుల దివిటీ పట్టి బయటకి తెచ్చిన మార్గదర్శకుడు వీడు

ఈ లోకమిప్పుడు వాడు గీసిన గీతమీదనే నడుస్తుంది

తెల్లారితే వాడి నామంతోనే ఈ దేశానికి పొద్దుపొడుస్తుంది

తాను తాకితేనే ముట్టుడైతదన్న మతానికి కూడా

మావత్వపు పాఠాలు నేర్పించినవాడు

ఏ దేవుడి పేర ఈ రాజ్యాన మనుషులను రాచిరంపాన పెట్టిండ్రో

ఆ బండరాళ్ల దేవుడికి కూడా రాజ్యంగపు రక్షణ ఇచ్చినవాడు

ఏ జాతుల పేరు పలికితేనే పాపమనుకున్న పాలకులను

ఒక్క ఓటుతో ఆ జాతుల పాదాలకాడకు ఈడ్చుకొచ్చిన వీరుడు

ఇప్పుడు ఒర్రంగా.. ముట్టుడనుకున్నవాడు రాసిన దానినే

వాళ్ల నెత్తుల మీద పెట్టుకుని ఊరేగకుంటే వారికి బతుకులేదన్నది

కళ్ళముందు నడుస్తున్న చరిత్ర

మనువాదం మళ్ళీ అధికారం ముసుగేసుగుని దాడికొస్తున్నపుడల్లా

వాడిచ్చిన నీలి ఖడ్గమే వారి ఆలోచనల కుత్తుకలు తెంపుతున్నది

రాజ్యం మత విల్లంబులు ఎక్కుపెట్టినపుడల్లా

వాడి నీలిగొడుగే బహుజనుల రక్షణ కవచమై కాపాడుతున్నది

పాలకుడెవ్వడైనా పక్కదారిలో పక్కల పొడుద్దామనుకున్నపుడల్లా

వాడి అక్షరాల వెలుగు ప్రజల కళ్ళకు కుట్రలను కనిపెట్టిస్తున్నది

వాడి చూపే ఈ దేశాన్ని నడిపించే కాంతి రేఖ

వాడు నడిచిన బాటే ఈ దేశపు అభివృద్ధి పతాక

వాడు నిగనిగలాడే నీలి ఆకాశం

అనంతంగా పరుచుకున్న మానవత్వపు సంద్రం

నిటారుగా నిలుచున్న హక్కుల పర్వతం

అలుపు లేకుండా పారె ఆలోచనల జీవనది

అంబేడ్కర్ … ఇప్పుడిదొక పేరు మాత్రమే కాదు

జవసత్వాలు కోల్పోయిన బతుకులకు జీవంపోసి నడిపిస్తున్న శక్తి.

( అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా…)

దిలీప్.వి

మానవ హక్కుల వేదిక

సెల్:8464030808

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *