“పది సంవత్సరాల క్రితం అమాయకులందరూ నరేంద్ర మోదీ అనుచరులయ్యారు.. ఇప్పుడు మోదీ అనుచరులందరూ అమాయకులయ్యారు…” ఈ అభిప్రాయం హిందీ భాషలో కాస్త మొరటుగా ఉంది..విస్తృత ప్రచారంలో ఉన్నది..వృత్తి ప్రమాణాలు భాష పట్ల నియంత్రణను సూచిస్తాయి కాబట్టి గత 11 సంవత్సరాలుగా ప్రధాన మంత్రి హోదాలో దేశ ప్రజలను గుమ్రాహ్ చేస్తున్న తీరును సరళమైన భాషలో చెప్పే ప్రయత్నం..! కొనసాగుతున్న తన పదవీ కాలంలో మొత్తం గా ఏనాడు మీడియా సమావేశం నిర్వహించి..మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సాహసం చేయని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై వివరణ ఇవ్వడానికి దృశ్య మాధ్యమం ద్వారా ప్రయత్నం చేసారు. జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో దేశ ప్రజలకు భవిష్యత్తులో ఉగ్ర దాడుల నుంచి రక్షణ కల్పించే దిశగా ఒక్క భరోసా కూడా ఇవ్వలేక పోయారు. పొరుగు దేశం పాకిస్తాన్ తో ఏర్పడ్డ యుద్ధం మాదిరి పరిస్థితులను దేశ త్రివిధ దళాల ప్రతినిధులు దేశ ప్రజలకు ప్రతి రోజూ మీడియా సమావేశాల ద్వారా తెలియజేసారు.
ఆ వివరాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో తన దైన శైలిలో ప్రస్తావించారు మినహా హోదా కు తగ్గట్టు గా దేశ ప్రజల రక్షణకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. దేశ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న వారు తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో, ప్రధానమంత్రి అభయాన్ని కలిగించే, భవిష్యత్తుపై స్పష్టతనిచ్చే ప్రసంగం చేస్తారని అందరూ ఊహించారు. కానీ ఆయన ప్రసంగం సాధారణ ప్రకటనల మాదిరిగానే సాగింది. ప్రజల భయాలను దూరం చేయడంలో ప్రసంగం విఫలమైంది. 2016లో సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో , 2019 బాలాకోట్ దాడుల అనంతరం చేసిన ప్రసంగాలతో ఈసారి చేసిన ప్రసంగాన్ని పోల్చుకుంటే, మోదీ నాయకత్వంలో స్పష్టతా లోపం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఉన్న ధైర్యవంతమైన మరియు జాతిని జాగృతం చేయగల మాటల బదులు, ఈసారి ఆయన మాటల్లో జోష్, దిశ లేకపోవడం గమనార్హం.
12 మే, రాత్రి 8 గంటలకు ప్రధాని ప్రసంగానికి రెండు గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియా పాకిస్థాన్ ల మధ్య సరిహద్దుల్లో కాల్పుల విరమణకు ..ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి తన దౌత్యం పని చేసిందని మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. యుద్ధం ఆలోచన విరమించుకుంటే ఇరు దేశాలతో వర్తక వాణిజ్యాలు భారీ స్థాయిలో అమెరికా కొనసాగిస్తుందని సలహా ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు.పాకిస్ధాన్ ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే కార్ఖానా అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్థాన్ గొప్ప దేశమని భారత్ తో పోల్చడం గమనార్హం. పాకిస్థాన్ ను ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలని హిమాలయాలకు తాకిన అమాయకుల దేశభక్తి .. భావోద్వేగాలు ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా అధః పాతాళానికి పడిపోయాయి.
ట్రంప్ ప్రకటనను ప్రధాన మంత్రి తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. నరేంద్ర మోదీ కాల్పుల విరమణ నిర్ణయం దేశం క్షేమం కోసమే అని అమాయకులు సముదాయించుకుంటున్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరామణ అంశాలో ట్రంప్ పాత్రను కీలక సమయంలో ప్రధాని స్పష్టం చేస్తారని అమాయకులు ఆశించారు . ట్రంప్ ఒక అణు యుద్ధాన్ని ఆపానని పేర్కొన్న నేపథ్యంలో భారత్ తరఫున స్పష్టమైన ప్రకటన లేకపోతే ప్రపంచం తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది .. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో అమెరికా తన పాత్రను అతిశయోక్తిగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఇదే అంశం పై అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎలా స్పందించబోతోంది అన్నది కీలకం. కానీ ప్రధాని ప్రసంగంలో ఎలాంటి విదేశాంగ విధానం లేకపోవడం, అమెరికా మధ్యవర్తిత్వానికి స్పందన లేకపోవడం విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆపరేషన్ సింధూర్ సందర్బంగా భారత్ కు జరిగిన నష్టాన్ని ఎక్కడా ప్రధాని ప్రస్తావించడం లేదు. త్రివిధ దళాధిపతులు కూడా తోసిపుచ్చడం లేదు ..యుద్ధం లాంటి పరిస్థితుల్లో కొంత నష్టం సహజమే అని వారి అభిప్రాయం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం జాతినుద్దేశించినట్లు గా లేదు , కేవలం మీడియా కథనాలు, త్రివిధ దళాధిపతుల వివరణలు చదివినట్టుగా సాగిపోయింది. ఇది బాధితులకు ఓదార్పు ఇవ్వలేదు, ప్రజలకు భద్రత పై స్పష్టత ఇవ్వలేదు, లేదా రాజకీయంగా కూడా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయలేదు. ఒక దేశ నాయకుడిగా ఈ సమయంలో చూపవలసిన నిర్ణయాత్మకత, స్పష్టత, మానవీయత – అన్నిటిలోనూ ప్రధాని ప్రసంగం లోపించింది.





