- మందులను సక్రమంగా వినియోగించేలా ఫాలోఅప్ చేయాలి
- మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు
- ఎన్‌సీడీ క్లినిక్స్ లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరా
ప్రభుత్వ దవాఖాన్లలో ఏర్పాటు చేసిన ఎన్‌సీడీ క్లినిక్‌లకు బీపీ, షుగర్ వంటి అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న రోగులను అనుసంధానం చేయాలని అధికారులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లలో అందుతున్న వైద్య సేవలపై పేషెంట్లకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా పేషెంట్ల జాబితాను తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. పేషెంట్లు రెగ్యులర్‌గా మెడిసిన్ వినియోగించేలా ఫాలోఅప్ చేయాలని సూచించారు. అలాగే, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడ్డవారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లైఫ్ స్టైల్‌లో చేసుకోవాల్సిన మార్పులపై పేషెంట్లకు వివరించాలన్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్‌లో తలెత్తే అనారోగ్య సమస్యలపై వివరించాలన్నారు. ఈ మేరకు గురువారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ చేశారు. కోటిలోని టీజీఎంఎస్ఐడీసీ ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో చేసిన ఎన్‌సీడీ సర్వే వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. 30 ఏండ్లు దాటిన 1.66 కోట్ల మందిని స్క్రీన్ చేయగా, 22.94 లక్షల మందికి బీపీ, 11.9 లక్షల మందికి షుగర్ ఉన్నట్టు గుర్తించామన్నారు. పేషెంట్లకు అవసరమైన మెడిసిన్‌ను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పేషెంట్ల జాబితాను రూపొందించాలన్నారు. పేషెంట్లను ఎన్‌సీడీ క్లినిక్స్‌కు అనుసంధానుంచాలన్నారు. ఎన్‌సీడీ క్లినిక్‌లలో అందే వైద్య సేవల వివరాలను పేషెంట్లకు తెలియజేయాలన్నారు. బీపీ, షుగర్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెగ్యులర్‌గా అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహిం చాలన్నారు. మొబైల్ ద్వారా పేషెంట్లకు అవేర్‌నెస్ కల్పించడానికి , సమాచారం ఇవ్వడం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. వారు రెగ్యులర్‌గా ట్రీట్‌మెంట్ తీసుకునేలా ఫాలోఅప్ చేయాలన్నారు. ఎన్‌సీడీ సర్వేను కొనసాగించాలని సూచించారు. కొత్తగా నమోదైన పేషెంట్ల వివరాలను, ఎప్పటికప్పుడు లిస్ట్‌లో అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో ఎక్విప్‌మెంట్, మెడిసిన్, డాక్టర్లు, సిబ్బంది హాజరు, తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు.



