“ఆసరా” ఏదీ !?

గత ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్లు యధాతధంగా ఇవ్వడం తప్ప గడచిన రెండేళ్లుగా అసరా పెన్షన్లలో ఎదుగూబొదుగూలేదు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిమాదిరిగానే 37,65,304 మంది పెన్షనర్లకు 4,700కోట్ల రూపాయలు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు .ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పెన్షన్లు అసలు ఇంతవరకు మంజూరు చేయలేదు…సరికదా, లక్షలాది పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ లో  నే ఉన్నాయి.

తెలంగాణా రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు  సమీపిస్తున్నప్పటికీ,ఆసరా పెన్షన్ దారులు అయోమయంలో ఉన్నారు. ఎదురు చూపులు ఇంకా ఎన్నాళ్ళు? అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెన్షన్ దారులకుగత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు. వచ్చీ రాగానే ఆసరా లబ్దిదారులైన వయోవృద్ధులు,ఓంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఆరోగ్యం క్షిణించిన వారికి చెల్లిస్తున్న ఆసరా పెన్షన్లు 2వేలరూపాయలనుండి నాలుగు వేల రూపాయలకు,దివ్యాంగులకు ఇస్తున్న 4వేల రూపాయలను 6వేలరూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మెనిపెస్టోలో చేసిన వాగ్దానం ఇంతవరకు అతీగతీ లేదు…వచ్చే పెన్షన్లు కూడా సకాలంలో రాక నెలంతా ఎదురుచూడడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఉంది.

    గత ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్లు యధాతధంగా ఇవ్వడం తప్ప గడచిన రెండేళ్లుగా అసరా పెన్షన్లలో ఎదుగూబొదుగూలేదు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిమాదిరిగానే 37,65,304 మంది పెన్షనర్లకు 4,700కోట్ల రూపాయలు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు .ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పెన్షన్లు అసలు ఇంతవరకు మంజూరు చేయలేదు…సరికదా, లక్షలాది పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ లో  నే ఉన్నాయి. ఇంకా ప్రత్యేక గ్రామసభల్లో ఆరు గ్యారంటీలు, రెవెన్యూ సదస్సులు సందర్భంగా కూడా పెన్షన్ దరఖాస్తులు స్వికరిస్తునే ఉన్నారు. గత రెండేళ్ళ కాలంలో దివ్యాంగులకు సంభందించి ప్రతి జిల్లాలో ఏడాదికి రెండు సార్లు ప్రభుత్వ హాస్పిటల్స్ లలో  జాతర లాగా మానసిక,శారీరక,బదిర,అంధ దివ్యాంగులకు సదరన్ క్యాంపులు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.దివ్యాంగ ధృవీకరణ పత్రాలు వేల సంఖ్యలో జారీచేశారు.

నూతనంగా ధృవీకరణ పత్రాలు పొందిన దివ్యాంగులు కార్పరేషన్, మున్సిపాలిటీ, మండలపరిషత్ కార్యాలయంలో పెన్షన్ల కొరకు దరఖాస్తులు చేసుకున్నారు.కార్పోరేషన్, మున్సిపాలిటీలలోబిల్ కలెక్టర్లు, మండలంలో మండలస్థాయి అధికారులు దరఖాస్తుల పై విచారణ జరిపి అధికారులకు నివేదికలు కూడా సమర్పించారు.జిల్లాకలెక్టర్ నేతృత్వంలోనే నూతన పెన్షన్లు కంప్యూటరైజేషన్ను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం కు నివేదించి నప్పటికీ నూతన పెన్షన్ల జాడ,జవాబు లేదు. రెండేళ్ళుగా అత్యంత మానవీయ మైన దివ్యాంగుల నూతన పెన్షన్లు సైతం ఇంతవరకు మంజూరు చేయలేదు.

దివ్యాంగులు సైతం కార్యాలయాలచుట్టు తిరుగుతున్నా నూతన పెన్షన్ ఎప్పుడు వస్తుందో అధికారులు సైతం సమాధానం చెప్పే స్థితి లేదు.అన్నిరకాల నూతన పెన్షన్ దారులు రెండేళ్ళుగా ఇదే రకమైన ఎదురు చూపులు తప్ప ఇంతవరకు ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉలుకు,పలుకులేదు…రెండేళ్ళ కాలపరిమితి పూర్తి కావస్తున్నా పాత పెన్షన్ దారులు పెన్షన్ పెంపుదల కొరకు,నూతన దరఖాస్తు దారుల కొత్త పెన్షన్ మంజూరు కొరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటనలు, సంకేతాలు ఈ విషయంలో రావడంలేదు.మళ్ళీ సాదారణ ఎన్నికల దాకా తమ వాగ్దానం ఎదురుచూపుల తోనే సరిపెట్టుకోవాలా? అన్న ఆవేదన మాత్రం పెన్షన్ దారులు వ్యక్తం చేస్తున్నారు.

    నిత్యావసర వస్తువులు,మందుల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నందున పెన్షన్ పెంపుదల అనివార్యం అవుతుంది. పెంచుతామన్న కనీసంగా రెండు వేల పెంపుదల అమలు జరగడం లేదు. ఇదిలా ఉండగా సర్వీస్ పెన్షన్ దారుల విషయంలో కూడా ప్రభుత్వం మందకొడిగానే వ్యవహరిస్తుంది. 2024 ఏప్రిల్  నెల నుండి వీరి బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదు. సర్వీస్,ఫ్యామిలీ పెన్షనర్ల బకాయిలు ఉదారంగా ఇచ్చేవి కానేకాదు..సర్వీసు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము వారు ఉద్యోగ కాలంలో పొదుపు ,మదుపు చేసుకున్న సొమ్ము మాత్రమే! అంటే వారి సొమ్ము వారికి ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.ఇప్పటికే రిటైర్ ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు పదివేల కోట్ల రూపాయలు పేరుకు పోయి ఉన్నాయి.

ఆధునిక ప్రభుత్వాలు దేశాన్ని వదలటంలేదు. ఉద్యోగులు మదుపుచేసుకన్న సొమ్ములు వాటేసుకొని, వారి భవితవ్యం,భద్రత గాలికి వదిలేస్తున్నారు. ప్రభుత్వం సర్దుబాటు చర్యగా నెలకు 700కోట్లు విడుదల చేసినా ఉద్యోగుల , రిటైర్ ఉద్యోగుల భవిష్య నిధి చెల్లింపులుకూడా పరిష్కారం కావడంలేదు.. తిరిగి ఏ నెలకానెల ఉద్యోగుల రిటైర్మెంట్లు అదనంగా జమ అవుతూనే ఉంటాయి. ఇప్పటికే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలు సకాలంలో అందక మానసిక ఒత్తిడికిలోనై  తెలంగాణా వ్యాప్తంగా ఆత్మహత్య లు సైతం చేసుకుంటున్నారు.

తమ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందాలేదా అనే ఆవేదన పెన్షనర్లలో రోజురోజుకు పెరిగి పోతుంది. పెన్షనర్లు గత నెలంతా జిల్లా కేంద్రాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేశారు. ఈనెల7,17తేదీలలో రాష్ట్ర స్థాయి ఆందోళనకు , ఇందిరా చౌక్ వద్ద ధర్నాకు పదవీవిరమణ ఉద్యోగ సంఘాలు సన్నద్ధం అవుతున్నాయి. కనుక ఆసరా పెన్షన్లు, సర్వీస్ పెన్షనర్ల ఎదురుచూపులకు తెరవేసి మానవీయ దృక్పథం తో సమస్యను పరిష్కరించాలి. వృద్దాప్యంలో ఉన్న,నిస్సహాయ స్థితిలో ఉన్న పెన్షన్ దారులు పరిస్థితి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని పెన్షన్ దారుల సమస్యలు తక్షణం పరిష్కారం చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణం నుండి ఆలోచన చేయాలని కోరుకుందాం.

-ఎన్.తిర్మల్, 
(సామాజిక కార్యకర్త, రచయిత, సీనియర్ జర్నలిస్టు) 
సెల్:9441864514.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page