ప్రపంచస్థాయి ప్రాముఖ్యతకు నవ యుగం

“భారత్ ఆతిథ్య సామర్థ్యం దాని ట్రాక్ రికార్డ్ ద్వారా స్పష్టమవుతుంది. గత దశాబ్దంలో, దేశం హాకీ ప్రపంచ కప్‌లు, చెస్ ఒలింపియాడ్, ఫిఫా అండర్-17 ప్రపంచ కప్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు, ఐసీసీ పురుషుల, మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ల వంటి 22 ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను 20కి పైగా నగరాల్లో నిర్వహించింది. ప్రతి కార్యక్రమం అథ్లెట్లు, అధికారులకు భద్రత, వృత్తి నైపుణ్యం, సాంస్కృతిక ఆతిథ్యంతో కూడిన వాతావరణాన్ని అందిస్తూ… కచ్చితత్వంతో క్రీడలు నిర్వహించిన దేశంగా భారత ఖ్యాతిని బలోపేతం చేసింది. 2029లో జరగనున్న వరల్డ్ పోలీస్ – ఫైర్ గేమ్స్‌తో… 2030 సీడబ్ల్యూజీకి ముందు భారత్ తన బహుళ-క్రీడా కార్యక్రమాల అనుభవాన్ని మరింత ఏకీకృతం చేస్తుంది.”

భారత క్రీడా పురోగతి: 2030 సీడబ్ల్యూజీ నుంచి ఒలింపిక్ ఆశయం దాకా, – డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ

కామన్వెల్త్ స్పోర్ట్, 2025 నవంబర్ 26 బుధవారం రోజున 2030 కామన్వెల్త్ క్రీడల శతాబ్ది ఆతిథ్య దేశంగా భారత్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇది దేశ క్రీడా ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక క్షణాన్ని సూచిస్తుంది. ఇది ప్రతిష్ఠాత్మక ఆతిథ్య హక్కులను మించిన ఘనత. ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల కోసం అత్యంత విశ్వసనీయమైన, ప్రాధాన్య ఆతిథ్య దేశాల్లో ఒకటిగా భారత్ అభివృద్ధి చెందినదనడానికి ఇది నిదర్శనం. 2036లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలనే దీర్ఘకాలిక ఆశయం దిశగా నమ్మకంగా ముందుకు సాగుతున్న దేశంగా ఇది భారత్‌కు ప్రపంచ స్థాయిలో లభించిన గుర్తింపు.

ఈ ప్రకటన గత దశాబ్దంలో క్రమంగా రూపుదిద్దుకుంటున్న భారత క్రీడారంగ పురోగతిని అంతర్జాతీయ క్రీడా సమాజానికి పునరుద్ఘాటిస్తుంది. భారత్ ఇప్పుడు విశ్వసనీయమైన, అధిక సామర్థ్యం గల, అథ్లెట్-కేంద్రిత ఆతిథ్య దేశంగా విస్తృత గుర్తింపును పొందుతోంది. ఇది స్థాయి, సామర్థ్యం, ఆత్మీయ ఆతిథ్యంతో ప్రపంచస్థాయి ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఈ ఖ్యాతిని ప్రపంచ క్రీడా ప్రముఖులు నిరంతరం గుర్తిస్తూనే ఉన్నారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ల కోసం తన భారత పర్యటన సందర్భంగా అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు… పారా-క్రీడల్లో భారత సంస్థాగత నైపుణ్యం, వేగవంతమైన పురోగతిని ప్రశంసించారు. అనేక మంది ప్రముఖ అంతర్జాతీయ అథ్లెట్లు భారత్‌లోని సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, పోటీల నిర్వహణ తీరు, మొత్తం అథ్లెట్ అనుభవాలను ప్రశంసించారు.

ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఇటీవల ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌ కోసం భారత్‌ను సందర్శించిన సమయంలో… మన దేశాన్ని ప్రపంచ బాక్సింగ్‌కు మూలస్తంభంగా అభివర్ణించారు. మన దేశ వృత్తి నైపుణ్యం, ఆతిథ్య సామర్థ్యాలను ఆయన ప్రశంసించారు. ఈ అంతర్జాతీయ ఆమోదాలు చాలా విస్తృతమైన భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రపంచ క్రీడా సమాజం అత్యున్నత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలను అప్పగించే స్థాయికి భారత్ ఎదిగింది.

శ్రీ మోదీ ప్రభుత్వంలో క్రీడా రంగం, ఆర్థిక వ్యవస్థ రెండింటిలోనూ దశాబ్ద కాలంగా కొనసాగుతున్న అద్భుత పరివర్తన ఫలితంగానే ఈ నమ్మకం ఏర్పడింది. భారత స్థూల ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్, బలమైన ఆర్థిక స్థితి… దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా క్రీడారంగంలో సాటిలేని స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి వీలు కల్పించాయి. 2013–14లో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ రూ. 1,093 కోట్ల కేటాయింపులను పొందింది. 2025–26లో ఈ కేటాయింపు రూ. 3,794 కోట్లకు పెరిగింది. ఇది కేవలం ఒక దశాబ్దంలో దాదాపు 250 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

ఈ పెట్టుబడుల పెరుగుదల దేశ వ్యాప్తంగా క్రీడా పునరుజ్జీవనానికి దారితీసింది. ఖేలో ఇండియా, అస్మితా ఉమెన్స్ లీగ్ వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాల్లో మారుమూల స్థాయి నుంచి అభివృద్ధి విస్తరించింది. దీంతో పాటు జిల్లా స్థాయిలో శిక్షణను, అత్యుత్తమ సదుపాయాలను అందించే 1050కి పైగా ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అదే సమయంలో టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం, కొత్తగా ప్రవేశపెట్టిన టార్గెట్ ఏషియన్ గేమ్స్ గ్రూప్ ద్వారా భారత్ బలమైన, అత్యుత్తమ-పనితీరు గల మార్గాలను నిర్మించింది. ఇది అగ్రశ్రేణి శిక్షణ, క్రీడా శాస్త్రం, పోషకాహారం, ప్రపంచ స్థాయిలో గుర్తింపును అందిస్తుంది. దేశవ్యాప్తంగా 350కి పైగా ప్రధాన క్రీడా కేంద్రాలు నిర్మించగా, వాటిలో కొన్ని పురోగతిలో ఉన్నాయి. ప్రపంచ స్థాయి పోటీలకు మద్దతునివ్వగల వ్యవస్థను సృష్టించడంతో మౌలిక సదుపాయాలు అపూర్వమైన వేగంతో అభివృద్ధి చెందాయి. ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి కేవలం పోటీ కార్యక్రమాలకే పరిమితం కాలేదు… సుస్థిరమైన, దీర్ఘకాలిక అథ్లెట్ అభివృద్ధి వైపు దృష్టి సారించింది. రాబోయే దశాబ్దాల్లో శిక్షణ, పోటీలు, భవిష్యత్ క్రీడా అవసరాలకు కేంద్రంగా పనిచేస్తుంది.

భారత్ ఆతిథ్య సామర్థ్యం దాని ట్రాక్ రికార్డ్ ద్వారా స్పష్టమవుతుంది. గత దశాబ్దంలో, దేశం హాకీ ప్రపంచ కప్‌లు, చెస్ ఒలింపియాడ్, ఫిఫా అండర్-17 ప్రపంచ కప్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు, ఐసీసీ పురుషుల, మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ల వంటి 22 ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను 20కి పైగా నగరాల్లో నిర్వహించింది. ప్రతి కార్యక్రమం అథ్లెట్లు, అధికారులకు భద్రత, వృత్తి నైపుణ్యం, సాంస్కృతిక ఆతిథ్యంతో కూడిన వాతావరణాన్ని అందిస్తూ… కచ్చితత్వంతో క్రీడలు నిర్వహించిన దేశంగా భారత ఖ్యాతిని బలోపేతం చేసింది. 2029లో జరగనున్న వరల్డ్ పోలీస్ – ఫైర్ గేమ్స్‌తో… 2030 సీడబ్ల్యూజీకి ముందు భారత్ తన బహుళ-క్రీడా కార్యక్రమాల అనుభవాన్ని మరింత ఏకీకృతం చేస్తుంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం ఈ పరివర్తనకు కేంద్ర బిందువు. ఆయన క్రీడలను జాతీయ ప్రాధాన్య అంశంగా మార్చి, ‘వికసిత్ భారత్-2047’ విశాల దార్శనికతతో వాటిని అనుసంధానించారు. ఖేలో భారత్ నీతి, జాతీయ క్రీడా పాలన చట్టం-2025 వంటి విధాన సంస్కరణలు పాలక వర్గాలను ఆధునీకరించాయి. పారదర్శకతను ప్రోత్సహించాయి. ప్రపంచ అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా అథ్లెట్-ఫస్ట్ విధానాన్ని అమలు చేశాయి. ఈ సంస్కరణలు అంతర్జాతీయ సమాఖ్యల దృష్టిలో భారత్ విశ్వసనీయతను బలోపేతం చేశాయి. ప్రపంచ క్రీడా వ్యవస్థలో దేశాన్ని క్రియాశీల, బాధ్యతాయుతమైన భాగస్వామిగా నిలిపాయి.

2030 కామన్వెల్త్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యమివ్వడం ఒక సంఘటన కాదు… ఒకే సంస్కరణ, ఒకే విజయం ద్వారా లభించిన ఫలితమూ కాదు. మౌలిక సదుపాయాలు, అథ్లెట్ అభివృద్ధి, అట్టడుగు వర్గాల భాగస్వామ్యం, పాలనపరమైన సంస్కరణలు, క్రీడా వ్యవస్థలు ఆర్థికంగా బలోపేతమవడం కోసం సంవత్సరాల తరబడి చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితం. దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన క్రీడా దేశంగా నిలిపే వ్యవస్థలు, సంస్థలు, సామర్థ్యాలను పెంపొందించడంలో శ్రీ మోదీ ప్రభుత్వ దశాబ్ద కాల నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.

భారత్ లక్ష్యాన్ని చేరడానికి సిద్ధం కావడం లేదు… ఇప్పటికే చేరుకుంది. గత దశాబ్దంలో దేశం పరిమిత మౌలిక సదుపాయాలు, అరకొర ఫలితాల నుంచి…. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయిలో స్థిరమైన ప్రదర్శన, దేశంలోని ప్రతి ప్రాంతానికీ విస్తరించిన నిర్మాణాత్మక క్రీడా వ్యవస్థల దాకా పురోగమించింది. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య ప్రకటన… ప్రపంచం ఈ పరివర్తనను అధికారికంగా అంగీకరించిన క్షణాన్ని సూచిస్తుంది.

ప్రపంచంలోని ప్రముఖ క్రీడా దేశాల్లో ఒకటిగా ప్రపంచ వేదికపై ప్రకాశించడానికి ఆర్థికంగా, సంస్థాగతంగా, క్రీడాపరంగా భారత్ పూర్తిగా సిద్ధంగా ఉంది.

(రచయిత కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి)– డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *