గమ్యం లేని జన్ జడ్

“ఏ ఉద్యమమైనా నిర్మాణాత్మక ఆలోచనతో, బాధ్యతతో జరగాలి. డిజిటల్ యుగంలో ప్రబలిన జన్ జడ్ ఉద్యమాల వలన కొన్ని చోట్ల సత్ఫలితాలతో పాటు, దుష్ఫరిణామాలు కూడా చోటు చేసుకోవడాన్ని యువత గమనించాలి.బంగ్లాదేశ్ ను ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు.జన్ జడ్ ఉద్యమాల ప్రభావంతో ప్రపంచంలోని పలుదేశాలు కంపించిపోతున్నాయి. ఇప్పటికే నేపాల్,బల్గేరియా ప్రభుత్వాలు జన్ జడ్ ఉద్యమాల ఫలితంగా కుప్పకూలిపోయాయి.అవినీతికి వ్యతిరేకంగా సాగిన జన్ జడ్ ఉద్యమం బల్గేరియా ప్రభుత్వ పతనానికి దారితీసింది. ఏడాది కాలం లోనే బల్గేరియా ప్రభుత్వం యువత ఆందోళనల కారణంగా కుప్పకూలింది.పెరూ,మొరాకో,మడగాస్కర్ లాంటి దేశాల్లో జన్ జడ్ తీవ్రత  కొనసాగుతున్నది..” 
టెక్నాలజీ తరాలు.
వర్తమాన ప్రపంచంలో “జన్ జడ్” పేరు మారు మోగుతున్నది.సాంకేతిక విప్లవం పెల్లుబికిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లతో ప్రపంచ స్థితిగతులను తెలుసుకుని,సాంఘిక మాధ్యమాల ద్వారా యువత ప్రభావితమై, వివిధ దేశాల్లో జరిగే అరాచకాలు,అవినీతి పాలకుల దమననీతిని ఎదురించడానికి ఉద్యమాలను నిర్మించుకుని, ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్న చైతన్యం నిండిన యువతరాన్ని జన్ జడ్ లేదా జన్ జి గా పిలుస్తారు. ఇదొక టెక్నాలజీ తరం. 1997- 2012 మధ్య జన్మించిన వారిని స్థూలంగా జనరేషన్ జడ్ గా పిలుస్తారు.అవినీతి, ప్రభుత్వాల అరాచకాలు, ఆంక్షలు వంటి సమస్యలపై జన్ జడ్ యువత వివిధ దేశాల్లో తమ ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్నది.  జనెక్సర్ (జనరేషన్ ఎక్స్), మిలీనియన్స్( జనరేషన్ వై) కంటే జన్ జడ్ ప్రపంచం పై  అత్యంత ప్రభావాన్ని చూపిస్తున్నది. జనరేషన్ ఆల్ఫా తరం అనగా ఏఐ తరం ప్రారంభమైనది. ఎన్ని  రకాలుగా జనాభాను,యువతరాన్ని  వర్గీకరణ చేసినా, యువత పెడదారి పట్టకుండా, ప్రపంచాన్ని వివేకంతో నడిపించగల సామర్ధ్యాన్ని సంతరించుకోవాలి.బాధ్యతతో ఉద్యమాలు నడపాలి.
క్షణికోద్రేకంలో అసాంఘిక శక్తుల బారిన పడడం వలన అనర్ధాలే జరుగుతాయని ప్రస్తుత  బంగ్లాదేశ్  పరిస్థితులను బట్టి అవగతం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా కొద్ది నెలల క్రిందట నేపాల్ లో జరిగిన జన్ జడ్ ఉద్యమాన్ని పునరావలోకనం చేసుకోవాలి.హిమాలయ దేశం “నేపాల్” లో  ప్రజలే ఆయుధాలై భయంకరమైన  యుద్ధ వాతావరణాన్ని తలపించేలా పార్టీలకతీతంగా నేపాల్ రాజకీయ నాయకులను తరిమి తరిమి కొట్టిన సంగతి జగద్విదితం. జన్- జడ్  ఉద్యమం విప్లవనాదమై నేపాల్ లో ప్రతిధ్వనించింది. జన్ జడ్ ఉద్యమకారుల నిరసనకు నేపాల్ పాలక,ప్రతిపక్ష నేతలంతా భీతిల్లి   రాజీనామా చేసిన విషయాన్ని మరువలేము. నేపాల్ ప్రజల్లో రాజకీయ నాయకుల పట్ల ఏహ్యభావం కలిగిన ఫలితంగానే ఉవ్వెత్తున ఎగిసి పడిన జన్ జడ్  ఉద్యమం నేపాల్ ప్రభుత్వ పునాదులను పెకలించింది. ఇది జన్ జడ్ ఉద్యమ కారుల విజయంగా ప్రపంచమంతా ఆమోదించింది. అయితే ప్రస్తుతం జన్ జడ్ ఉద్యమాల పట్ల పునరాలోచన చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

     ఏ ఉద్యమమైనా నిర్మాణాత్మక ఆలోచనతో, బాధ్యతతో జరగాలి. డిజిటల్ యుగంలో ప్రబలిన జన్ జడ్ ఉద్యమాల వలన కొన్ని చోట్ల సత్ఫలితాలతో పాటు, దుష్ఫరిణామాలు కూడా చోటు చేసుకోవడాన్ని యువత గమనించాలి.బంగ్లాదేశ్  ను ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు.జన్ జడ్ ఉద్యమాల ప్రభావంతో ప్రపంచంలోని పలుదేశాలు కంపించిపోతున్నాయి. ఇప్పటికే నేపాల్,బల్గేరియా ప్రభుత్వాలు జన్ జడ్ ఉద్యమాల ఫలితంగా కుప్పకూలిపోయాయి.అవినీతికి వ్యతిరేకంగా సాగిన జన్ జడ్ ఉద్యమం బల్గేరియా ప్రభుత్వ పతనానికి దారితీసింది. ఏడాది కాలం లోనే బల్గేరియా ప్రభుత్వం యువత ఆందోళనల కారణంగా కుప్పకూలింది.పెరూ,మొరాకో,మడగాస్కర్ లాంటి దేశాల్లో జన్ జడ్ తీవ్రత  కొనసాగుతున్నది.  బంగ్లాదేశ్ లో విద్యార్ధుల ఉద్యమం వలన, జన్ జడ్ కారుల ఆందోళనల వలన  ప్రపంచంలో అత్యధిక కాలం మహిళా ప్రధానిగా  కొనసాగిన అవామీ లీగ్ కు చెందిన  షేక్ హసీనా వాజిద్  యువత లో పెల్లుబికిన ఆగ్రహజ్వాలలకు బంగ్లా ప్రధానిగా రాజీనామా చేసి భారత్ లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.

షేక్ హసీనా కు బంగ్లా దేశ్ ట్రైబ్యునల్ ఉరిశిక్ష విధించి, బంగ్లాదేశ్ కు తిరిగి రావాలని ఆదేశించింది. అవినీతికి పాల్పడడమే కాకుండా, విద్యార్థుల ఉద్యమంలో మానవత్వం లేకుండా హింసను ప్రేరేపించి, అనేక మంది మరణానికి కారణమైనదనే నెపంతో హసీనాకు ఆ దేశం లోని న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. బంగ్లాదేశ్ లో సుస్థిర ప్రభుత్వం నడిపి అనేక దశాబ్దాలుగా ప్రధానిగా పని చేసిన హసీనా పై తిరుగుబాటు చేసి,ఆమెను దేశం నుంచి వెళ్ళగొట్టి, ఉరిశిక్ష విధించడం ద్వారా బంగ్లాదేశ్ సాధించిందేమిటి? ఇప్పుడు బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అరాచకాన్ని ప్రపంచ దేశాలు ఆమోదిస్తాయా? బంగ్లాదేశ్ లో మత మౌఢ్యం వెర్రితలలు వేసింది. అమాయక ప్రజలు,మైనారిటీ మతస్థులు తీవ్ర హింసకు గురవుతున్నారు.

రాజకీయ శూన్యత- అస్థిరత:
బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిత్వం నెలకొన్నది. బంగ్లాదేశ్ ఇప్పుడు సైన్యం కనుసన్నల్లోకి జారిపోయింది.  నోబెల్ శాంతి బహుమతి గ్రహీత  మహ్మద్ యూనస్ సలహాలతో బంగ్లా దేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా అక్కడ హింసాకాండ చల్లారలేదు.  ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి లోకి పడినట్లయింది. ఇది  విద్యార్థులు కావాలని కొని తెచ్చుకున్న సంకట పరిస్థితిగా మారుతుంది. బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ ఇంక్విలాబ్ మంచా నాయకుడు,జన్ జడ్ ఉద్యమనేత  షరీఫ్ ఉస్మాన్ హాదీ కాల్పుల్లో గాయపడి మరణించడం వలన బంగ్లాదేశ్ భగ్గుమంది.హసీనా కు చెందిన అవామీ లీగ్ కు వ్యతిరేకంగా పనిచేస్తూ హసీనా గద్దె దిగడానికి కారణమైన ఇంక్విలాబ్ మంచా అనే ఒక తీవ్రవాద మత సంస్థ ప్రస్తుతం పాక్ విష పరిష్వంగంలో  సేద తీరుతున్నది.

ఒకప్పుడు భారత్ సాయంతో పాక్ నుండి  కష్టపడి సాధించుకున్న బంగ్లాదేశ్ ను తిరిగి పాక్ కు పణంగా పెట్టడం అనాలోచితమైన చర్యగా భావించాలి. “బంగ బంధు”గా ఖ్యాతి గడించి బంగ్లా దేశ్ ప్రజలకు స్వాతంత్ర్యం సంపాదించిన షేక్ ముజిబర్ రహమాన్ బలిదానాన్ని, జ్ఞాపకాలను తుడిచి వేయడానికి ఆయన మ్యూజియం పై దాడులు జరపడం,పత్రికా కార్యాలయాలను ధ్వంసం చేసి, మైనారిటీ మతస్థులపై దాడులు చేయడం  దేనికి సంకేతం?   బెంగాల్,భారత ఈశాన్య రాష్ట్రాల తో కలిపి గ్రేటర్ బంగ్లా కోసం తీవ్రవాదుల గుంపు  ప్రయత్నించడం భారత్ సమగ్రతకు ముప్పుగా పరిగణించాలి. ఇటీవల ఢాకాలో జరిగిన హింసాకాండ లో అనేక మంది మరణించడం జరిగింది.హసీనా వాజెద్,ముజిబర్ రహ్మాన్ ఇళ్ళను కూలగొట్టినా జమైతీ ఇస్లామీ మతోన్మాద మూకల ఆగడాలు ఆగలేదు.

అవామీ లీగ్ కు చోటు లేని ఎన్నికలా?
షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ను నిషేధించి, బంగ్లాదేశ్ ఎన్నికలకు వెళ్లడం దేనికి? ఇటీవల మరణించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కు చెందిన బి.ఎన్.పి కి మేలు చేకూర్చి, ఆమె కుమారుడైన తారిక్ రహ్మాన్ కు పట్టం కట్టడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే ఈ చర్యను భావించాలి. బంగ్లా ప్రభుత్వ తాత్కాలిక సలహాదారుడైన యూనస్ మరియు  బంగ్లా యువత తాత్కాలిక ఉద్రేకంలో  పాక్ ను నమ్ముకుని, చేరదీయడం పులిమీద  స్వారీ చేయడమే. విద్యార్థులు హింసాకాండలో పాల్గొనడం, అరాచకాన్ని ప్రేరేపించడం దారుణం. బంగ్లాదేశ్ లో తీవ్రవాద శక్తులు ప్రబలడం బంగ్లాదేశ్ కే కాదు,భారత్ కు కూడా ప్రమాదకరం. నిర్మాణాత్మకంగా సాగవలసిన జన్ జడ్ ఉద్యమాలు దారితప్పి, అశాంతికి,అరాచకానికి చోటివ్వడం క్షమార్హం కాదు.ఇప్పుడు ప్రపంచ యువత ఉద్యమించవలసింది దురహంకారంతో ఇతర దేశాలను వేధించుకు తింటున్న అమెరికా పైన. ఎందుకు ఇంకా అమెరికా యువత కాని ఇతర దేశాల్లోని యువత  గాని అమెరికా విషయంలో సరిగా స్పందించడం లేదు? “జన్ జడ్” ట్రంప్ కు వ్యతిరేకంగా ఎందుకు  ఉద్యమించడం లేదు?

-సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్)
తూ.గో.జిల్లా,ఆం.ప్ర.   
మొబైల్:9704903463

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *