పాప చింతన లేనివారితో దెబ్బతింటున్న ధార్మికత!

 కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి లడ్డూ వివాదంపై పదిహేను నెలలపాటు నిర్వహించిన దర్యాప్తు నకు సంబంధించి  తుది చార్జ్‌షీట్‌ను ఎట్టకేలకు జనవరి 23న నెల్లూరులోని యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) కోర్టులో దాఖలు చేసింది. సీబీఐ-సిట్ తన నివేదికలో మొత్తం 36 మందిని దోషులుగా పేర్కొంది. ఇందులో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన డైరీ కంపెనీలతో పాటు తొమ్మిది మంది టీటీడీ అధికారులు నిందితులుగా పేర్కొంది. ఇందులో ప్రధాన పాత్రధారులుగా ఉత్తరాఖండ్‌కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ కంపెనీ డైరెక్టర్లు పామిల్ జైన్, విపిన్ జైన్‌లను పేర్కొనడం గమనార్హం.

ఇక తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ, తిరుపతికి చెందిన వైష్ణవీ డైరీల పేర్లను కూడా తన నివేదికలో చేర్చింది. 2019-24 మధ్యకాలంలో 68 లక్షల కల్తీ లేదా సింథటిక్ నెయ్యి టీటీడీకి సరఫరా చేసినట్టు స్పష్టం చేసింది. ఈ మొత్తం విలువ రూ.250 కోట్లు! ఉత్తరాఖండ్‌కు చెందిన డైరీ కంపెనీ తాను సరఫరా చేసిన నెయ్యి తయారీకి పాలు లేదా వెన్న కొనుగోలు చేసినట్టు ఎక్కడా రికార్డుల్లో పేర్కొన‌ లేదని తేలింది. ఈ నెయ్యిలో పామోలిన్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్‌తో పాటు సువాసన కోసం బీటా కెరొటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్‌లను వాడినట్టు  నివేదికలో పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించిన విధంగా  జంతు కొవ్వులు, చేపనూనె, పందికొవ్వు వంటివి వాడినట్టు నిరూపణ కాలేదు. అయితే ఈ నిర్దేశిత ప్రమాణాలతో లేని ఈ నెయ్యిని దేవస్థానంలోని అనుమతించడంలో అవినీతి అధికార్ల పాత్ర ఉన్నదన్నది స్పష్టమైంది.

నిజానికి తిరుపతి లడ్డూల్లో వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలుపుతున్నా రని 2024 సెప్టెంబర్‌లో చంద్రబాబు ఆరోపించడంతో వివాదం మొదలైం ది. దీనికి స్పందనగా మరుసటి నెల అంటే అక్టోబర్‌లో సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, విచారణకు ఆదేశించింది. 2025 ఫిబ్రవరిలో మొదటిసారి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుతో సహా డైరీ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్ల అరెస్ట్ జరిగింది. ఎట్టకేలకు ఈనెల 23న విచారణకు సంబంధించి ఛార్జ్‌షీటును ఏసీబీ కోర్టులో దాఖలు చేయడంతో కేసు ఒక కొలిక్కి వచ్చినట్లయింది. సీబీఐ చార్జ్‌షీటులో టీటీడీ సేకరణ సిబ్బంది, పాల నిపుణులు, కాంట్రాక్టర్లతో సహా 36 మంది పేర్లున్నాయి తప్ప  ఏ రాజకీయ పార్టీల నాయకుల ప్రమేయం ఉన్నట్టు ఎక్కడా పేర్కొనలేదు. నెయ్యి సరఫరా కంపెనీలతో పాటు, టీటీడీలోని మాజీ సేకరణ జనరల్ మేనేజర్ ఒకరు, తదితర అధికార్లు ఉద్దేశపూర్వకంగానే కల్తీనెయ్యికి క్లియరెన్స్ ఇచ్చారని సీబీఐ పేర్కొంది.

డైరీ నిపుణుడు ఒకరు సరఫరా దార్లతో కుమ్మక్కై తప్పుడు నివేదికలిచ్చారని కూడా వివరించింది. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తిపడిన సిబ్బంది ఈ అక్రమానికి పాల్పడ్డారని స్పష్టం చేసింది. కొన్ని బ్యాచ్‌ల నెయ్యిని నిషేధించినా వేరే పేర్లతో సరఫరా చేశారని కూడా సీబీఐ గుర్తించింది. ప్రస్తుతం ఈ కేసు నెల్లూరు ఏసీబీ కోర్టులో విచారణలో ఉంది .  ఈ పరిణామాలపై వైసీపీ నాయకులు స్పందిస్తూ, సీబీఐ చార్జ్‌షీట్‌లో 36 మంది పేర్లు పేర్కొన్నప్పటికీ, తమ ప్రభుత్వం అటువంటి తప్పిదాలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. కేవలం తమను అప్రతిష్ట పాల్జేసేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. చంద్రబాబు ఆరోపించినట్టు ఎక్కడా జంతువుల కొవ్వు ఉన్నట్టు దర్యాప్తు సంస్థ పేర్కొనలేదన్న సంగతిని గుర్తుచేశారు. టీటీడీ బోర్డు నిర్దేశిత నిబంధనల ప్రకారమే పనిచేసిందని కూడా గుర్తుచేసింది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాటించిన పద్ధతులనే బోర్డు అనుసరించిందన్నారు. నాణ్యతలేని నెయ్యి దృష్టికి వొచ్చినప్పుడు తిరస్కరించామని, తెలుగుదేశం హయాంలో కూడా 18 సార్లు ఈవిధంగా తిరస్కరించిన సంగతిని గుర్తుచేశారు.

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని బాధ్యతారహితంగా ..కేవలం రాజకీయ లబ్ది కోసమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు ఆరోపించిన తర్వాత ఇది పెద్ద రాజకీయ దుమారం రేగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను ..విశ్వాసాలను చంద్రబాబు గాయపరిచారు. ఆ తరువాత  విపక్ష వైసీపీకి అధికార టీటీపీకి మధ్య మాటలయుద్ధం కొనసాగింది. అదీకాకుండా మతపరంగా అత్యంత సున్నితమైంది, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించింది కావడంతో ఈ అంశానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఏర్పడటం సహజమే. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆలయ శుద్ధీకరణ వంటి చర్యలు చేపట్టినప్పటికీ, టీటీడీ ఉద్యోగుల్లో కొందరు అవినీతిపరులు ఉన్నప్పుడు రేపు మరో రూపంలో ఇటువంటి అక్రమాలు జరగకూడదనేంలేదు. ప్రపంచ వ్యాప్తంగా హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ధార్మిక సంస్థల ఆధీనంలో ఉండాల్సింది పోయి, గట్టి ప్రభుత్వ నియంత్రణలో ఉండటమే ఇటువంటి అవినీతి జరగడానికి దోహదం చేస్తుందనేది ఈ పరిణామం స్పష్టం చేస్తున్నది. టీటీడీ క్రమంగా రాజకీయ పునరావాస కేంద్రంగా, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ పలుకుబడిని, తమ గొప్పదనాన్ని ప్రదర్శించడానికి వీలైన ప్రదేశంగా మారడం దురదృష్టకరం.

     స్వామికి నిలువుదోపిడీ ఇవ్వడం భక్తుల భక్తికి నిదర్శనం. కానీ భగవంతునికి-భక్తులకు మధ్యలో దలారీలు, అవినీతి ఉద్యోగులు, రాజకీయ నాయకులు చేరి, నిలువుదోపిడీకి పాల్పడుతుండటం వర్తమాన చరిత్ర. భక్తుల బలహీనతే వీరికి ఆదాయం! బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు ఆదాయం వొచ్చే హిందూ ఆలయాలపై ప్రభుత్వం డేగకన్ను పడుతున్నది. ఆదాయం లేని ఆలయాలను పట్టించుకునే దిక్కుండదు. ఇతర మతాలకు చెందిన ప్రార్థనాస్థలాల నిర్వహణ, వాటి ఆస్తుల నియంత్రణను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోగలుగుతుందా?  రాజకీయాలను వ్యాపారంగా చూసే నాయకుల నియంత్రణలో ఇటువంటి దేవాలయాలు ఉన్నట్లయితే ఇట్లాగే జరుగుతుంది. ఆలయాలను ఆదాయవనరులుగా చూస్తున్న ప్రభుత్వాలు, వ్యాపార ధోరణితో వ్యవహరిస్తాయి. ప్రభుత్వ ప్రమేయం ఉన్నదంటే అక్కడ అవినీతికి ద్వారాలు తెరచినట్టే! ఇందులో ఎంతమాత్రం సందేహంలేదు. అందువల్ల ప్రార్థనా స్థలాల  నిర్వహణను భక్తులు, మతపెద్దలకు అప్పగించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *