“అక్కడ “మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా” అనగానే సభికులనుంచి విశేష స్పందన లభించింది.మనలోని సోదరత్వపు ప్రకాశానికి యావత్ ప్రపంచం సెల్యూట్ చేసింది.పురాతన సంస్కృతి కలిగిన నా హైందవ దేశం పరమత సహనాన్ని,మత సామరస్యాన్ని బోధించిందని, నదులన్నీ సముద్రంలో కలిసినట్లే విభిన్న మతాల సారాంశం మానవత్వమనే సముద్రంలో కలుస్తుందని చెప్పారు.”

“సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని, లోకానికి బోధించిన సనాతన ధర్మం నాదని గర్విస్తున్నాను. మేము సర్వమత సహనాన్నే కాక, సర్వ మతాలూ సత్యాలనే విశ్వసిస్తాం.” అంటారు విశ్వ విఖ్యాత స్వామి వివేకానంద. ఆయన జయంతి జనవరి 12ను భారత ప్రభుత్వం 1984వ సంవత్సరంలో జాతీయ యువజన దినోత్సవం గా ప్రకటించింది.దీనిని పురస్కరించుకొని 1985 నుంచి ప్రతీ సంవత్సరం వ్యక్తిత్వ వికాసం, జాతి నిర్మాణమే లక్ష్యంగా భారత ప్రభుత్వంతో పాటు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
వివేకానందుని స్ఫూర్తివంతమైన సందేశాలకు సంబంధించి ఆయన జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసే ఉద్దేశంతో పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, పల్లెల్లో ,పట్టణాల్లో.. దేశమంతటా విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, ఉపన్యాసం వంటి తదితర పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తారు. “ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇంపాక్ట్ ద వరల్డ్”, కల్చరల్ రూట్స్,YUVA 2026 వంటి థీమ్స్ తో ఈ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం వేడుకలు జనవరి 12,2026న మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఘనంగా నిర్వహించనున్నారు.
చరిత్ర పుటలు తిరిగేయండి. భారతదేశంలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవీణులకు ఏ కాలంలోనూ కొరతలేదు.ఈ సత్యాన్ని ఎవరూ కాదనలేరు. ఈ దేశం కృషి ఆధ్యాత్మికతకు సంబంధించింది.దీనిని యుద్ధాలతోను, సైనిక దాడులతోను సాధించలేరు.ఈ దేశ సంస్కృతీ ప్రభావం ఇతర ప్రపంచ దేశాలపై నిశ్శబ్దతతో పడే హిమంవలే ప్రచ్ఛన్నంగా పడ్డది. అలా పడ్డ మంచు బిందువులు సుగంధ పరిమళాలను వెదజల్లే అన్ని రకాల అందమైన పుష్పాలు వికసించుటకు దోహదం చేసినట్లే భారతీయ సంస్కృతి కూడా ప్రపంచ దేశాల ప్రజలను ప్రభావితం చేస్తూ వచ్చిందని నేటితరం యువతరం వేలాది సంవత్సరాల మన సాంస్కృతిక వారసత్వాన్ని చూసి గర్వపడాలి. భవిష్యత్ తరాలకు తెలియచెప్పాలి.
మంత్రమగ్దుల్ని చేసే తన ఆలోచనల ద్వారా నేటి ఆధునిక యువతరానికి ప్రేరణ అందిస్తూ,మన భారతీయ ప్రాచీన ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన భారతీయ ఆత్మ స్వామి వివేకానంద.విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త నికోలస్ టెస్లా మొదలు గాంధీజీ,అరబిందో,రవీంద్రనాథ్ ఠాగూర్, జంషెడ్జీ టాటా,జగదీష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్, బరాక్ ఒబామా, అబ్దుల్ కలాం వంటి మహానుభావులకు స్ఫూర్తినిచ్చారు.
కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించిన వివేకానంద వేదాంత,యోగ,తత్వశాస్త్రాలతో పాటు వివిధ మత గ్రంథాలు, విజ్ఞాన శాస్త్రం లోని నూతన పోకడలను సైతం అధ్యయనం చేసి,శోధించి, ఆంగ్ల భాషపై అనర్గళమైన వాగ్ధాటిని సాధించి, తన బోధనలతో సమాజంపై అత్యంత ప్రభావం చూపారు.భగవంతునితో ప్రత్యక్ష అనుభవం కావాలనీ నిరంతరం తపించిన నరేంద్రుని జీవితంలోకి రామకృష్ణ పరమహంస రావడంతో ఎన్నో మార్పులు వచ్చాయి.
వివేకానందుడిని కారణజన్ముడిగా భావించిన రామకృష్ణ పరమహంస తన శక్తినంత ఆయనకు ధారపోసి మనదేశాన్ని ఆకలి, అజ్ఞానం నుంచి కాపాడి యావత్ ప్రపంచానికి వేలాది సంవత్సరాల మన సంస్కృతి సాంప్రదాయాలు, భిన్న భాషలు, విభిన్న మతాల జీవన విధానాలలోని ఏకత్వాన్ని చాటిచెప్పాలనే గురుతర బాధ్యతను వివేకానందకు అప్పజెప్పారు.తన గురువు ఆశయాన్ని నిలబెట్టాలనే సంకల్పం బలంగా వున్న సందర్భంలోనే తన తండ్రి చనిపోయి కుటుంబం మొత్తం పేదరికం ఆవరించింది.ఆకలిబాధలతో తల్లడిల్లింది.కుటుంబం కోసం కొన్నాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి, తను పస్తులుండి కుటుంబ సభ్యుల ఆకలి తీర్చేవారు.కటిక నేలపై నిద్రించేవారు.ఆ తరుణంలోనే రామకృష్ణ తన ఆధ్యాత్మిక శక్తులన్నింటిని వివేకానందకు ధారపోసి అస్తమించారు.
1893 సెప్టెంబర్ 11 న షికాగోలో సర్వమత సమ్మేళనంలో వివేకానంద ప్రసంగం నేటికీ నెంబర్ వన్ గానే చెప్పవచ్చు.మానవ మనుగడ ఈ భూమిపై ఉన్నంతవరకు ఆనాటి ఉపన్యాసపు సందేశం మా”నవ జాతులను” కొన్ని శతాబ్దాల తరాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది.అక్కడ “మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా” అనగానే సభికులనుంచి విశేష స్పందన లభించింది.మనలోని సోదరత్వపు ప్రకాశానికి యావత్ ప్రపంచం సెల్యూట్ చేసింది.పురాతన సంస్కృతి కలిగిన నా హైందవ దేశం పరమత సహనాన్ని,మత సామరస్యాన్ని బోధించిందని, నదులన్నీ సముద్రంలో కలిసినట్లే విభిన్న మతాల సారాంశం మానవత్వమనే సముద్రంలో కలుస్తుందని చెప్పారు.
తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించి స్వదేశానికి వచ్చాక 1897 లో రామకృష్ణ మఠం స్థాపించారు.రామకృష్ణ మిషన్ నేటికీ ఎన్నో సామాజిక,విద్యా , సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది.మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పుస్తకాలు, వివేకానంద, రామకృష్ణ బోధనలతో కూడిన సాహితీ పుస్తకాలు,జీవిత చరిత్రలు చాలా తక్కువ వెల తో అందిస్తున్నారు.కొన్ని లక్షల మంది కి ఆంగ్ల భాష ను, కమ్యూనికేషన్ స్కిల్స్ ను ఉచితంగా నేర్పిస్తూనే వున్నారు.వివేకానంద వారి స్ఫూర్తితో ఎంతోమంది సోదరి నివేదిత వంటి విదేశీయులు మనదేశానికి వచ్చి వివేకానంద ఆశయాల కనుగుణంగా తమ ప్రాపంచిక సుఖాలను త్యజించి సన్యాసిగా జీవించారు.పేదలకు సేవ చేశారు.ఆదర్శ గురు శిష్యులుగా పేరొందిన రామకృష్ణ, వివేకానంద స్ఫూర్తితో నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థలకు, సామాజిక సేవా సంఘాలకు,విద్యార్థి సంఘాలకు,శరణాలయాలకు రామకృష్ణ, వివేకానంద పేర్లు పెట్టారు.వాళ్ల విగ్రహాలను నిర్మించారు.
ఈ జాతీయ నౌకలో (సమాజంలో ) రంధ్రాలు ఉంటే మనం దాని పిల్లలం.వెళ్లి ఆ రంద్రాలను మూసివేయాలి. సంతోషంగా మన గుండె రక్తాన్ని ధారపోసి అయినా ఆ పని చేయాలి. మన మెదడును ప్లగ్ గా ఉపయోగించి ఆ రంధ్రాలను పూడ్చాలి కానీ దానిని ఎప్పుడూ నిందించకూడదు”అంటూ ప్రతి భారతీయుడి బాధ్యతను ఏనాడో గుర్తు చేశారు వివేకనంద. ఈరోజు మనమంతా వారి బోధనలను ఆదర్శంగా తీసుకొని బాధ్యతతో కూడిన అభివృద్ధి భారతాలు నిర్మించాలి. వారి ఆశయాలకు అనుగుణంగా అఖండ భారతావనికి పునర్వైభవం తీసుకురావాలి. మన దేశ నుండి పేదరికాన్ని, నిరక్షరాస్యతను, మూఢనమ్మకాలను పారద్రోలాలి.
నేను వివేకానంద రచనలు చదివాక నాలో దేశభక్తి వెయ్యింతలు అయ్యిందంటారు మన గాంధీజీ. వేలాదిమంది ప్రపంచ ప్రముఖులతో పాటూ కోట్లాదిమంది సామాన్యులను కూడా కదిలించిన వ్యక్తిత్వ శిఖరం వివేకానంద. వివేకానంద అడుగులతో తన్మయత్వం పొందిన పుణ్యభూమి మనది. ఆకలి చావులు లేని, రైతుల ఆత్మహత్యలు లేని అభివృద్ధి భారతాన్ని నిర్మిద్దాం. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన భారతీయ యువత ఈ ప్రపంచానికి అవసరమని ఆయన కలలుగనే వారు. మనమంతా వివేకానంద శిష్యులమై… దేశభక్తిని మన గుండెల నిండా నింపుకొని.. విశ్వ గురువుగా మన దేశాన్ని ప్రపంచానికి భవిష్యత్ పాఠం గా పరిచయం చేద్దాం. లేవండి..! మేల్కోండి..! ఆశయం సిద్ధించే వరకు విశ్రమించకండి..!





