సంచార్ సాథీ యాప్ నిఘాకోస‌మా? సైబ‌ర్ దాడుల‌నుంచి ర‌క్ష‌ణ‌కా?

ఎవ‌రైతే కొద్దిపాటి ర‌క్ష‌ణ‌కోసం త‌మ‌కు అత్య‌వ‌స‌ర‌మైన స్వేచ్ఛ‌ను వ‌దులుకుంటారో, అటువంటివారు స్వేచ్ఛ‌, ర‌క్ష‌ణ‌ల‌ను శాశ్వ‌తంగా కోల్పోక త‌ప్ప‌ద‌ని, అమెరికాకు చెందిన ప్ర‌ముఖ రాజ‌నీతిజ్ఞుడు బెంజామిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన మాట‌లు అక్ష‌ర‌స‌త్యం. తాత్కాలిక భ‌ద్ర‌త పేరుతో నెర‌పే బేర‌సారాల్లో ప్రాథ‌మిక స్వేచ్ఛ‌ను కోల్పోవ‌డం వ‌ల్ల‌ పూర్తి స్థాయి న‌ష్టం త‌ప్ప లాభం లేశ‌మాత్రం కూడా ఉండదు. వ్య‌క్తులు త‌మ స్వేచ్ఛ‌ను ఇచ్ఛాపూర్వ‌కంగా కోల్పోవ‌డానికి సిద్ధ‌ప‌డిన‌ప్పుడు, వారు కోరుకునే భ‌ద్ర‌త‌తో పాటు స్వేచ్ఛ‌ను కూడా పొంద‌డానికి అన‌ర్హుల‌వుతారు. ఫ్రెంచ్‌, భార‌త్ ల్లో జ‌రిపిన యుద్ధాల నేప‌థ్యంలో నాటి బ్రిటిష్ ప్ర‌భుత్వం స్వ‌దేశంలో వ‌ల‌స ప‌న్నులు పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ప్పుడు ప్ర‌జ‌ల్లో తిరుగుబాటు వొచ్చింది. ఈ సంద‌ర్భంగా ఫ్రాక్లిన్ 1755లో ఇచ్చిన రాజ‌కీయ ప్ర‌క‌ట‌న ఇది. అంటే శాస‌న‌ప‌ర‌మైన హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కో సం, ప్ర‌జ‌లు ఈ అనైతిక ప‌న్నును భ‌రించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌న్నఅర్థం ఈ ప్ర‌క‌ట‌న‌లో గోచ‌రిస్తోంది.

ఫ్రాంక్లిన్ చేసిన ఈ వ్యాఖ్య‌లు మ‌న‌దేశంలో చోటుచేసుకుంటున్న వ‌ర్త‌మాన ప‌రిణామాల‌కు మ‌రింత విస్తృత ప్రాతిప‌దిక‌న‌ స‌రిగ్గా వ‌ర్తిస్తాయి. కేంద్ర ప్ర‌భుత్వం విధిస్తున్న నిఘా, ఎక్క‌డిక‌క్క‌డ నిర్బంధాల‌కు వ్య‌తిరేకంగా ఈ వ్యాఖ్య‌లు పౌర హ‌క్కుల‌కు శ‌క్తివంత‌మైన ర‌క్ష‌ణ‌గా ఉప‌యోగ‌ ప‌డ‌తాయన‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు. అంతేకాదు ముఖ్యంగా ఆధునిక ఉగ్ర‌వాదం నుంచి పొంచివున్న ప్ర‌మాదాలకు ప్ర‌తిస్పంద‌న‌ పేరుతో వ్య‌క్తిగ‌త స్చేచ్ఛ‌లోకి ప్ర‌భుత్వం చొర‌బ‌డే ప్ర‌య‌త్నాల‌కు ఫ్రాంక్లిన్ వ్యాఖ్య‌లు అడ్డుగోడ‌ వంటివ‌నే చెప్పాలి. చారిత్ర‌కంగా ప‌రిశీలిస్తే పూర్వ‌కాలపు పాల‌కులు కూడా, భ‌ద్ర‌త పేరుతో నిరంత‌ర నిఘాను కొన‌సాగించిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు.

ఉదాహ‌ర‌ణ‌కు నెపోలియ‌న్ బోనోపార్టీ మంత్రివ‌ర్గంలో పోలీసు శాఖ‌ను నిర్వ‌హించిన జోసెఫ్ ఫౌచీ జాతీయ భ‌ద్ర‌త పేరుతో దేశ‌వ్యాప్తంగా పోలీసు వ్య‌వ‌స్థ‌ను మ‌రింత విస్తృతం చేశాడు. ఇందులో భాగంగా గూఢ‌చారులు, ఇన్ఫార్మ‌ర్లు, కేబినెట్‌నోయిర్ (డార్క్ ఛాంబ‌ర్లు) వంటివాటిని అమ‌ల్లోకి తెచ్చాడు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల మ‌ధ్య కొన‌సాగే ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాల‌పై నిశితమైన నిఘా వుండేది. నిజానికి ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌య్యే వ్య‌తిరేక‌తను దేశ భ‌ద్ర‌త పేరుతో నిర్దాక్షిణ్యంగా అణ‌చివేయ‌డ‌మే ఈ విధానం అమ‌లు ప్ర‌ధాన ల‌క్ష్యం. ఆవిధంగా ఫ్రాన్స్ మొత్తం నెపోలియ‌న్ ఆధిప‌త్యాన్ని సుసంఘ‌టితం చేయ‌డానికి య‌త్నించారు.

తాజాగా కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం, స్మార్ట్ ఫోన్ల‌లో సంచార్ యాప్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని ఆదేశించ‌డం నాటి నెపోలియ‌న్ ప్ర‌భుత్వం అనుస‌రించిన విధానాన్ని గుర్తుకు తెస్తున్న‌ది. కొత్త మొబైల్ ఫోన్ల‌లో ప్ర‌భుత్వానికి చెందిన సంచార్ సాథీ యాప్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఇన్‌స్టాల్ చేయాల‌ని ఆదేశాలు జారీచేయ‌డంతో ఒక్క‌సారిగా విప‌క్షాలు, పౌర‌హ‌క్కుల సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. ఈ యాప్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఇన్‌స్టాల్ చేయాల‌ని ఇచ్చిన ఆదేశాల వ‌ల్ల యావ‌త్తు దేశం నిఘా నీడ‌లోకి వెళ్లిపోతుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. ప్ర‌భుత్వ నిర్ణ‌యం, పౌరుల‌పై ప్ర‌భుత్వం నిఘా పెట్టేందుకు వీలుగా జార్జ్ ఓర్వేలియ‌న్ తీసుకున్న చ‌ర్య‌లను త‌ల‌పున‌కు తెస్తున్నాయంటూ వీరు ఆగ్రహించ‌డంలో స‌హేతుక‌త ఉన్నది.

అంతేకాదు ఈ సంచార్ సాథి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయ‌డం ద్వారా పౌరుల ప్ర‌తి క‌ద‌లిక‌ల‌పై ప్ర‌భుత్వం నిఘా వేయ‌గ‌లుగుతుంద‌ని, ఆవిధంగా ప్ర‌జ‌ల‌పై నిరంకుశ పాల‌న‌ను బ‌ల‌వంతంగా రుద్దే య‌త్నం త‌ప్ప మ‌రోటి కాద‌ని వీరు గ‌ట్టిగా విశ్వ‌సిస్తున్నారు. ఈ యాప్ ఇన్‌స్టాలేష‌న్‌ను స‌మ‌ర్థిస్తున్న వారు మాత్రం, చ‌ట్టానికి బ‌ద్ధులై న‌డుచుకునే పౌరులు ఎటువంటి భ‌యాందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇందులో దాచాల్సిందేమీ లేదంటూ వీరు చేస్తున్న వాద‌న‌ల‌ను, ప్రైవ‌సీ స‌మ‌ర్థ‌కులు తీవ్ర స్థాయిలో ఆక్షేపిస్తున్నారు. ప్రైవ‌సీ హ‌క్కును ర‌ద్దు చేయ‌డ‌మంటే, పౌరులు ఇక దాచుకోవాల్సిందేమీ ఉండదనే క‌దా అర్థం. ఇంత‌కంటే త‌ప్పుడు నిర్ణ‌యం మ‌రేముంటుంద‌ని ప్రైవ‌సీ స‌మ‌ర్థ‌కుల వాద‌న‌.

ముఖ్యంగా ఒక పౌరుడు తాను చెప్పేదేమీ లేన‌ప్పుడు, ఇక వాక్‌స్వాంతంత్య్రం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏముంటుంది? త‌న జీవితానికి ప్రైవ‌సీయే లేన‌ప్పుడు, ఇక ప్రైవ‌సీ ర‌క్ష‌ణ‌ల వ‌ల్ల ఉప‌యోగ‌మేముంటుంద‌న్న స‌త్యాన్ని పౌరులు గ్ర‌హించ‌క‌మాన‌రు. ప్రైవ‌సీ విధానాన్ని రూపొందించినవారు కేవ‌లం తప్పుడు ప‌నుల‌ను దాచే అంశంపైనే దృష్టి పెట్ట‌డం కాదు, ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త విష‌యాల్లో రాజ్యం త‌ల‌దూర్చ‌కుండా చూడ‌టం, ఇత‌ర స్వేచ్ఛ‌ల‌కు ఆధార‌భూతంగా ఉండే విధంగా చూడ‌టం ముఖ్యం. కొన్ని విష‌యాలు నిగూఢంగా ఉంచేందుకు
య‌త్నించే కొంద‌రికి మాత్ర‌మే ఈ ప్రైవ‌సీ వ‌ర్తిస్తుంద‌ని వాదించే వారిని ఈ వాద‌న నిల‌దీస్తోంది.

ఎందుకంటే వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్రైవ‌సీని ఒక‌ ప్రాథ‌మిక హ‌క్కుగా ప‌రిగ‌ణించి, రాజ్యం దీన్ని దుర్వినియోగం చేయ‌కుండా నివారించాల‌న్న‌ది ఈ వాద‌న ప్ర‌ధాన ఉద్దేశం. సంచార్ సాథీ యాప్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని ఆదేశాలివ్వ‌డం ప్రైవ‌సీని అతిక్ర‌మించ‌డమే న‌ని విమ‌ర్శ‌కుల వాద‌న‌. అంటే యాప్‌-ఆధారంగా ప్ర‌భుత్వం ప్రత్యర్థులపై కొత్త రూపంలో నిఘాను ప్ర‌వేశ‌పెడుతోంద‌ని, చూస్తుంటే పెగాస‌న్ స్పైవేర్ మాదిరిగానే ఇదికూడా ప‌నిచేస్తుంద‌న్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్ర‌జాస్వామ్య సూత్రాల‌ను అవ‌హేళ‌న చేయ‌డమే ..! ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంలో ప్ర‌జ‌ల స‌మ్మ‌తిని ఏమాత్రం ఖాత‌రు చేయ‌కుండా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింద‌ని, భ‌విష్య‌త్తులో ఇటువంటి కొత్త‌కొత్త అప్లికేష‌న్ల‌ను తీసుకు రాకూడ‌ద‌నేంలేదు.

ఐఎంఈఐ స్పూఫింగ్‌ను అడ్డుకోవాల‌న్న పేరుతో పౌరుల వ్య‌క్తిగ‌త ప్రైవ‌సీలోకి త‌ల‌దూర్చ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌నేది ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ధ్రువీక‌ర‌ణ పేరుతో ప్ర‌భుత్వ యాప్‌ను స్మార్ట్ ఫోన్ల‌లో ఇన్‌స్టాల్ చేసుకోమ‌న‌డం మితిమీరిన చ‌ర్య‌గా భావించ‌వొచ్చు. ఇంత‌కంటే త‌క్కువ స్థాయి చ‌ర్య‌ల‌తో ప్ర‌భుత్వం త‌న ల‌క్ష్యాన్ని సాధించ‌వొచ్చు. నేటి కాలంలో వ్య‌క్తిగ‌త డేటా చౌర్యం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. దీన్ని పూర్తిస్థాయిలో అరిక‌ట్ట‌డంలో ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు స‌ఫ‌లీకృతం కాలేదు. ఇటువంటి త‌రుణంలో ర‌క్ష‌ణ పేరుతో ఈ కొత్త యాప్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం, డేటా ప్రైవ‌సీపై మ‌రిన్ని అనుమానాల‌కు తావిస్తోంది. ఆధునిక మొబైల్ ఫోన్ల ద్వారా వ్య‌క్తిగ‌త డేటా బ‌హిరంగం కావ‌డ‌మే అత్య‌ధిక స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఈనేప‌థ్యంలో నిఘా పేరుతో తెర‌వెనుక శాశ్వ‌తంగా డేటా ప‌రిశీల‌న‌ను కొన‌సాగించాల‌న్న నిర్ణ‌యం కేవ‌లం జాతి-వ్య‌తిరేక కోణంలో మాత్ర‌మే చూడ‌టానికి వీల్లేద‌న్న‌ది సుస్ప‌ష్టం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *