న్యాయాన్ని క‌ప్పేసిన రాజ‌కీయం!!

“ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ), కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌పై తాజాగా నేష‌న‌ల్ హెరాల్ట్ కేసులో (ఎన్ హెచ్ సీ) కోర్టులో దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం ఈ బ‌ల‌హీన‌మైన కేసులో ఏదోవిధంగా ఈ నాయ‌కుల‌ను ఇరికించ‌డానికి ఈడీ చేస్తున్న చివ‌రి ప్ర‌య‌త్న‌మిది! మ‌నీలాండ‌రింగ్ జ‌రిగిందంటూ పేర్కొంటున్న ఈ కేసులో గ‌తంలో ఈడీ ఎటువంటి బ‌ల‌మైన సాక్ష్యాధారాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌లేక‌పోయింది. కొత్త‌గా చార్జ్ షీట్ దాఖ‌లును ప‌రిశీలిస్తే గ‌తంలో తాను చేసిన పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకొని ఈడీ కొత్త‌గా రంగంలోకి దిగిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది..”

“త‌ప్పుడు ప్ర‌చారం ఎప్పుడూ ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌లేదు. ఇది కేవ‌లం త‌మ‌ను తాము మోసం చేసుకోవ‌డానికి మాత్ర‌మే ఉప‌క‌రిస్తుంది,” ప్ర‌ముఖ సామాజిక త‌త్వ‌వేత్త ఎరిక్ హోఫ‌ర్ చెప్పిన ఈ మాట‌ల‌ను, రాజ‌కీయ కోణంలో ప‌రిశీలిస్తే, త‌మ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు కొత్త క‌థ‌ల‌ను అల్ల‌డ‌మ‌నేది రాజ‌కీయ వ్యూహంలో భాగమ‌ని అర్థ‌మ‌వుతుంది. సాధార‌ణంగా అధికారంలో వున్న ప్ర‌భుత్వాలు త‌మ పాల‌నా ప‌ర‌మైన లొసుగుల‌నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌లించ‌డానికి ప్ర‌త్య‌ర్థుల‌పై కొన‌సాగుతున్న ప్ర‌తికూలాభిప్రా యాల‌ను మ‌రింత బ‌లీయం చేసేందుకు ఇటువంటి ఎత్తుగ‌డ‌ల‌ను ప‌న్నుతుంటాయి. ఎరిక్ హోప‌ర్ ఎంతో వివేచ‌న‌తో చెప్పిన మాట‌ల్లోని ఔచిత్యాన్ని స్ప‌ష్టంగా తెలుసుకోవ‌డానికి   “తోడేలు-గొఱ్ఱెపిల్ల క‌థ మంచి ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌వ‌హిస్తున్న కాలువ ఎగువ భాగంలో వున్న తోడేలు, దిగువ‌న వున్న గొఱ్ఱెపిల్ల‌ను తినాల‌ని నిశ్చ‌యించుకుంటుంది. ఇందుకోసం ఏదోవిధంగా గొఱ్ఱెపిల్ల‌ను త‌ప్పు ప‌ట్టి త‌న కోర్కెను నెర‌వేర్చుకోవాలనుకుంటుంది.
ఇందుకోసం గొఱ్ఱెపిల్ల‌పై త‌ప్పుడు అభియోగాలు మోపుతుంది. అయితే అది చేసే అభియోగాల‌ను గొఱ్ఱెపిల్ల తార్కికంగా త‌ప్ప‌ని తేల్చ‌డంతో చివ‌ర‌కు దానిపై దాడి చేస్తుంది. స‌రిగ్గా ఈ క‌థ‌కు స‌రిపోలిన ఉదంతాన్ని  ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ), కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌పై తాజాగా నేష‌న‌ల్ హెరాల్ట్ కేసులో (ఎన్ హెచ్ సీ) కోర్టులో దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్ వెల్ల‌డిస్తోంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం ఈ బ‌ల‌హీన‌మైన కేసులో ఏదోవిధంగా ఈ నాయ‌కుల‌ను ఇరికించ‌డానికి ఈడీ చేస్తున్న చివ‌రి ప్ర‌య‌త్న‌మిది! మ‌నీలాండ‌రింగ్ జ‌రిగిందంటూ పేర్కొంటున్న ఈ కేసులో గ‌తంలో ఈడీ ఎటువంటి బ‌ల‌మైన సాక్ష్యాధారాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌లేక‌పోయింది.
కొత్త‌గా చార్జ్ షీట్ దాఖ‌లును ప‌రిశీలిస్తే గ‌తంలో తాను చేసిన పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకొని ఈడీ కొత్త‌గా రంగంలోకి దిగిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. నిజానికి గ‌తంలో గాంధీకుటుంబంపై ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న బ‌ల‌హీన అంశాల స్థానంలో ఇప్పుడు మ‌రింత ప‌క‌డ్బందీగా బ‌లమైన ఆధారాల‌ను చూప‌డానికి ఈడీ య‌త్నిస్తోంద‌ని న్యాయ పండితులు చెబుతున్న మాట‌! మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చట్టం (పీఎంఎల్ఏ) కింద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శ్యాం పిట్రోడా, సుమ‌న్ దుబే త‌దిత‌ర కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుల‌పై ఈ చార్జ్ షీట్‌ను ఈడీ కోర్టులో దాఖ‌లు చేసింది.
నిజానికి  కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుల పేర్లు వుండ‌టంతో, ఈ విచార‌ణ‌ను అత్యంత సున్నిత‌మైందిగా ప‌రిగ‌ణిస్తున్న ఈ కేసుకు సంబంధించి ఈడీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై త‌క్ష‌ణ‌మే రూలింగ్ ఇచ్చేందుకు కోర్టు నిరాక‌రించ‌డం తాజా ప‌రిణామం. నేష‌న‌ల్ హెరాల్ట్ దిన‌ప‌త్రిక ప్ర‌చుర‌ణ క‌ర్త‌లైన అసోసియేటెట్ జ‌ర్న‌లిస్ట్స్ లిమిటెడ్ (ఏజేఎల్‌)కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తుల‌ను కేవ‌లం రూ.50ల‌క్ష‌ల‌కే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు యంగ్ ఇండియ‌న్ ప్రైవేట్ కంపెనీ ద్వారా త‌మ హ‌స్త‌గ‌తం చేసుకున్నార‌ని ఈడీ ఆరోపిస్తోంది. యంగ్ ఇండియ‌న్ కంపెనీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్ర‌ధాన వాటాదార్లు. అయితే ఈ మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు కొత్త‌గా, అసంబ‌ద్ధంగా వున్నాయంటూ కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. నిజానికి నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల పై 2012లో రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి దిల్లీ ట్రైల్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసేవ‌ర‌కు దీనిపై ఎవ‌రికీ ఏమీ తెలియ‌దు. ఏజేఎల్ ఆస్తుల‌ను మోస‌పూరితంగా కాంగ్రెస్ నేతలు స్వాధీనం చేసుకున్నార‌నేది ఆయ‌న చేసిన ప్ర‌ధాన అభియోగం. పీఎంఎల్ ఏ చ‌ట్టం కింద కేసును విచారిస్తున్న ఈడీ, ప్ర‌స్తుతం ఈ కేసులో మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌ని నిరూపించ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతోంది.
యంగ్ ఇండియా ప్రైవేట్ కంపెనీలోని షేర్ హోల్డ‌ర్ల వివ‌రాల‌ను ఇప్ప‌టివ‌ర‌కు ఈడీ మీడియాకు బ‌హిర్గ‌తం చేయ‌లేదు. 2012లో వోడాఫోన్ కేసులో షేర్ హోల్డ‌ర్లు కంపెనీ ఆస్తుల‌పై స్వామిత్వాన్ని క‌లిగివుండ‌టానికి వీల్లేద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టంగా తీర్పు చెప్పింది. ఆస్తులు కంపెనీకి మాత్ర‌మే సొంతమ‌ని పేర్కొంది. అయితే ఈ కేసు విష‌యంలో ఈడీ విధాన‌ప‌ర‌మైన చిక్కులను ఎదుర్కొంటున్న‌ద‌ని నిపుణుల అభిప్రాయం. చ‌ట్ట‌ప‌రంగా ఈ కేసు బ‌ల‌హీనంగా వున్న నేప‌థ్యంలో, మ‌నీలాండ‌రింగ్‌కు సంబంధించి నేరాన్ని రుజువు చేసే విధంగా ఎఫ్ ఐఆర్‌ను న‌మోదు చేయ‌డం క‌ష్ట‌త‌రంగా మారిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
మొద‌టిసారి ఈ కేసుకు సంబంధించి దాఖ‌లు చేసిన ఛార్జ్ షీటులో, పీఎంఎల్ ఏ కింద రుజువు ప‌ర‌చే నేర అంశాల ను ఈడీ ప‌ట్టించుకోన‌ట్టుగా క‌నిపిస్తోందనేది వారి అభిప్రాయం. అంటే ఇప్ప‌టికే న‌మోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగా మాత్ర‌మే నేర నిరూప‌ణ‌కు సంబంధించిన‌ విచార‌ణ జ‌ర‌పాలి. మొద‌టి సారి ఈడీ కేసు దాఖ‌లు చేసిన‌ప్పుడు, నేరాన్ని రుజువు చేసే రీతిలో వుండాల‌న్న అంశానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. ఈ అనుభ‌వంతో ఈడీ ఇప్ప‌డు తాజాగా దాఖ‌లు చేసిన ఛార్జ్ షీటులో త‌న వ్యూహంలో మార్పు చేసింది. పీఎంఎల్ ఏ చ‌ట్టంలోని 5వ సెక్ష‌న్ ప్ర‌కారం, పోలీసు ఎఫ్ ఐఆర్ లేదా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ఫిర్యాదు న‌మోదైన‌ప్పుడు మాత్ర‌మే ఈడీ విచార‌ణ జ‌ర‌పాల్సి వుంటుంది.
ఈడీ తాజాగా దాఖ‌లు చేసిన ఛార్జ్ షీటు కేవ‌లం రాజ‌కీయ ప్రేరేపిత‌మంటూ కాంగ్రెన్ నాయ‌కులు విమ‌ర్శించ‌డం స‌హ‌జ‌మే. ఇందులో  “నేరం లేదు, నిధులు లేవు, విచార‌ణ‌లో క‌నుగొనేది కూడా ఏమీ వుండ‌దని” స్ప‌ష్టం చేస్తున్నారు. “భార‌తీయ జ‌న‌తాపార్టీ కేవ‌లం సంకుచిత మ‌న‌స్త‌త్వంతో ఈ కేసును తిర‌గతోడింది. న్యాయం గుడ్డిద‌యితే, ఈడీది వ‌ర్ణాంధ‌త్వం. ఇది కేవ‌లం ఒకే రంగును అంటే విప‌క్షాల రంగును మాత్ర‌మే చూడ‌గ‌లుగుతుంది” అంటూ ఒక సీనియ‌ర్ కాంగ్రెస్ నేత ఎద్దేవా చేయ‌డం గ‌మ‌నార్హం. “ఓటు చోరీ” ప్ర‌చారం నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌లించ‌డానికే బీజేపీ నేష‌న‌ల్ హెరాల్డ్ కేసును మ‌ళ్లీ వెలుగులోకి తెచ్చిందంటూ కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. అంతేకాదు ఎన్నిక‌ల సంఘంతో కుమ్మ‌క్క‌యి బిహార్ ఎన్నిక‌ల‌ను హైజాక్ చేసిన బీజేపీ, త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చ‌డానికే కొత్త‌గా ఈ కేసు పేరుతో కొత్త నాట‌కానికి తెర‌లేపింద‌ని ఆరోపిస్తున్నారు. ఈవిధంగా విప‌క్ష నేత‌ల‌ను కోర్టుల చుట్టూ తిప్ప‌డం ద్వారా త‌న తప్పుల‌ను ఎత్తిచూపేవారు లేకుండా చేయ‌డ‌మే బీజేపీ ప్ర‌ధాన ల‌క్ష్యంగా క‌నిపిస్తోంద‌నేది కాంగ్రెస్ వాద‌న‌. అంతేకాదు ఈ కేసు అత్యంత బ‌ల‌హీనంగా వున్న‌ద‌న్న సంగ‌తి అధికార పార్టీకి తెలుసు.
అందువ‌ల్ల ఈ కేసులో విజ‌యం సాధించ‌డం కంటే, విప‌క్ష కాంగ్రెస్‌ను అభాసుపాలు చేయ‌డ‌మ‌న్న ప్ర‌ధాన ఉద్దేశంతో బీజేపీ అడుగులు ముందుకేస్తున్న‌ద‌న్న‌ది వారి ఆరోప‌ణ‌. అదీకాకుండా ఈ కేసులో విధివిధానాలను అనుస‌రించేకంటే, న్యాయ‌ప్ర‌క్రియ‌ను యుక్తిగా త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌డానికే ఈడీ ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ద‌ని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇది కేవ‌లం రాజ‌కీయ ప్రేరేపిత‌మ‌ని, నిజానికి ఈ కేసులో ఈడీ ఆరోపించ‌డానికి బ‌ల‌మైన ఆధారాలేవీ లేవ‌న్న సంగ‌తి సుస్ప‌ష్ట‌మ‌ని కాంగ్రెస్ నాయ‌కుల వాద‌న‌. ప‌రిశీలిస్తే తోడేలు-గొఱ్ఱెపిల్ల క‌థ‌లో తోడేలు పాత్ర‌ను ఇప్పుడు ఈడీ పోషిస్తున్న‌ద‌నుకోవాలి. ఫిర్యాదు దారుగా వున్న ప్ర‌భుత్వ రాజ‌కీయ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌కు బాస‌ట‌గా విచార‌ణ, ఛార్జ్ షీట్ పేరుతో ఈడీ వివాదాస్ప‌ద వైఖ‌రిని ప‌రిశీలిస్తే ఈ కేసులో న్యాయ‌ప‌ర‌మైన అంశాలను రాజ‌కీయం పూర్తిగా క‌మ్మేసింద‌నేది సుస్ప‌ష్టం. అందువ‌ల్ల నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో న్యాయం కంటే రాజ‌కీయమే అధికం!!
-శామ్ సుందర్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *