“నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్‌లో ప్రస్తుత అనిశ్చితి పాపం అమెరికాదే! ఎందుకంటే తాను సైనిక స్థావరాన్ని నెల కొల్పుకోవడానికి బంగ్లాదేశ్ సమీపంలోని సెయింట్ మార్టిన్ ద్వీపం తనకు ఇవ్వమని నాటి జోబైడెన్ ప్రభుత్వం కోరగా అందుకు హసీనా అంగీకరించలేదు. అప్పటినుంచి పగబట్టిన అమెరికా, బంగ్లాదేశ్‌లో అస్థిరతను రెచ్చగొట్టి చివరకు ఆమెను పదవీచ్యుతురాలిని చేసి, ఆర్థిక వేత్త యూనస్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. యూనస్ ప్రస్తుతం అమెరికా ఆదేశాల మేరకే పాకిస్తాన్‌తో సత్సంబంధా లు నెలకొల్పుకోవడానికి ప్రయత్నించడం వర్తమాన చరిత్ర..”
ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దారుణ కృత్యాలకు అనుమతించి 1400 మంది విద్యార్థుల మృతికి కారణమయ్యారంటూ బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు (ఐటీసీ) ఆ దేశ మాజీ ప్రధాని హసీనాకు మరణశిక్ష విధించింది. జస్టిస్ మహమ్మద్ గులాం మర్తూజా మజుందార్ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. గతంలోనే కోర్టు ఆమెను పారిపోయిన నేరస్థురాలిగా ప్రకటించడం గమనార్హం. 2024, జులై 15న చోటుచేసుకున్న నిరసనల సందర్భంగా వందలాదిమంది విద్యార్థుల మృతికి కారణమయ్యారని ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణలను, హసీనా తరపు న్యాయవాదులు ఖండించారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత కక్షసాధింపుకోసం తీసుకున్న ఏకపక్ష చర్యగా వారు తమ వాదనలు వినిపించినా ఫలితంలేకపోయింది. ఐటీసీ తీర్పు వెలువడిన వెంటనే అవామీ లీగ్ పార్టీ మద్దతుదార్లు రోడ్లపైకి వచ్చి దేశంలో విధ్వంసకాడకు పాల్పడ్డారు. ఫలితంగా బంగ్లాదేశ్‌లోని పలు కీలక నగరాల్లో ఘర్షణలు జరిగాయి. ఇక తాత్కాలిక ప్రభుత్వ మద్దతుదార్లు కూడా రోడ్ల పైకి వచ్చారు.
ఢాకాలోని హసీనా తండ్రి దివంగత షేక్ ముజిబూర్ రహమాన్ భవనాన్ని కూల్చడానికి ప్రయత్నించిన ఆందోళన కారులపై పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఇదిలావుండగా హసీనాకు పడిన మరణశిక్షను యూనస్ ప్రభుత్వం గట్టిగా సమర్థించుకోవడం సహజ పరిణామమే! ప్రస్తుతం హసీనా దిల్లీలోని అజ్ఞాత ప్రాంతంలో కాలం గడుపుతున్నారు. తాజా తీర్పు నేపథ్యంలో రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బంగ్లా కోర్టు తీర్పును భారత్ లెక్క చేసే పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ కోరుతున్నట్టుగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను స్వదేశానికి పంపడానికి కూడా మనదేశ నాయకత్వం అంగీకరించదు కూడా! నిజానికి హసీనా పదిహేనేళ్ల పాలనలో బంగ్లాదేశ్ అన్నిరంగాల్లో అభివృద్ధిని నమోదు చేయడమే కాదు, ఆర్థికంగా పుంజుకున్నది కూడా.
అయితే ప్రత్యర్థి రాజకీయ పార్టీల వారి నోరు మూయించడానికి కఠిన చర్యలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 5న స్వదేశాన్ని వీడిన ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలావుండగా హసీనా, అసద్దుజమాన్ ఖాన్‌లను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మనదేశాన్ని కోరింది. వారిని అప్పగించకుండా మొండికేస్తే రెండు దేశాల మధ్య విరోధం మరింత పెరుగుతుందని తాత్కాలిక ప్రభుత్వం హెచ్చరించే వరకు వెళ్లడం తాజా పరిణామం.
నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్‌లో ప్రస్తుత అనిశ్చితి పాపం అమెరికాదే! ఎందుకంటే తాను సైనిక స్థావరాన్ని నెలకొల్పుకోవడానికి బంగ్లాదేశ్ సమీపంలోని సెయింట్ మార్టిన్ ద్వీపం తనకు ఇవ్వమని నాటి జోబైడెన్ ప్రభుత్వం కోరగా అందుకు హసీనా అంగీకరించలేదు. అప్పటినుంచి పగబట్టిన అమెరికా, బంగ్లాదేశ్‌లో అస్థిరతను రెచ్చగొట్టి చివరకు ఆమెను పదవీచ్యుతురాలిని చేసి, ఆర్థిక వేత్త యూనస్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. యూనస్ ప్రస్తుతం అమెరికా ఆదేశాల మేరకే పాకిస్తాన్‌తో సత్సంబంధా లు నెలకొల్పుకోవడానికి ప్రయత్నించడం వర్తమాన చరిత్ర. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకొని, మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో కొంత భాగం, మయన్మార్‌లోని కొంత భూభాగంతో కలిపి ఒక క్రైస్తవదేశాన్ని ఏర్పాటు చేయాలన్నది అమెరికా వ్యూహం.
ఈ ప్రాంతం ద్వారా చైనాకు చెక్‌పెట్టాలని యు.ఎస్. ఆలోచన. ఆమెరికా దురుద్దేశాన్ని పసిగట్టిన హసీనా మనదేశ నాయకత్వాన్ని హెచ్చరించడమే కాకుండా, సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని యు.ఎస్.కు ధారాదత్తం చేయడానికి అంగీకరించలేదు. ఇది నాటి జోబైడెన్ ప్రభుత్వానికి ఆగ్రహానికి కారణమైంది. బంగ్లాదేశ్ అస్థిరత నుంచి హసీనాకు మరణశిక్ష వరకు కొనసాగిన నేపథ్యమిది. గత ప్రభుత్వ విధానాన్నే ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. హామీ ఇచ్చిన విధంగా ఎన్నికలు జరిగితే హసీనా మళ్లీ పదవిలోకి రావడం ఖాయం. అందుకనే ఆమెను అడ్డు తొలగించే ప్రక్రియలో భాగమే ఈ ఉరిశిక్ష! ఇదిలావుండగా దిల్లీలో జరిగిన కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్‌లో బంగ్లాదేశ్ జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ ఖలిలో రహమాన్, మనదేశ జాతీయ భ్రదతా సలహాదారు అజిత్ దోభాల్‌ను కలుసుకోవడం తాజా పరిణామం. వీరిద్దరి భేటీవల్ల ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉన్న ప్రతిష్టంభనకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి.
బంగ్లాదేశ్ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. తన పొరుగుదేశాల్లో అత్యధిక సరిహద్దు రేఖ ఉన్న దేశంతో సత్సంబంధాలు పెంచుకోవడం చాలా అవసరమన్న సత్యాన్ని ఆ దేశం గుర్తించాలి. ఇది అర్థం కాకపోతే రాజకీయ, ఆర్థిక సంక్షోభం నుంచి ఆదేశం బయటపడటం చాలా కష్టం. హసీనాకు ఇది తెలుసు కనుకనే మనదేశంతో సత్సంబంధాలు కొనసాగించి దేశాభివృద్ధికి దోహదపడింది. దేశంలో మతఛాందస ఉగ్రవాదం పెచ్చరిల్లకుండా కఠిన చర్యలు తీసుకుంది. కానీ యూనస్ ప్రభుత్వం అమెరికా అండ చూసుకొని, పాక్ సహాయంతో చికెన్ నెక్‌ను విడగొడతామని బెదిరింపులకు దిగుతోంది. అంతేకాదు పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం మొదలుపెట్టింది. అమెరికా దన్నుతో పాక్, బంగ్లాదేశ్‌లు ఇప్పుడు మనదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తున్నాయి. గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌ను యూనస్ ఆవిష్కరించడం మనదేశాన్ని రెచ్చగొట్టే చర్యే. ఒకవేళ అతని ఉద్దేశం అదే అయితే, బంగ్లాను రెండు ముక్కలు చేస్తామని మనదేశం హెచ్చరించాలి.
ఇదిలావుండగా హసీనాను మనదేశం బంగ్లాదేశ్‌కు అప్పగించే అవకాశాలు లేవు. మనదేశ నాయకులు, ప్రజాస్వామ్య ప్రభుత్వ నేతలతో తప్ప మిగిలిన వారితో చర్చలు జరపరు. ఇది మొదటినుంచి మనం అనుసరిస్తున్న విదేశాంగ విధానం. అందువల్ల యూనస్‌తో మనదేశం అధికారిక చర్చలు జరపబోదు. కాకపోతే తెరవెనుక దౌత్యం కొనసాగుతుంది. మనదేశంలో కయ్యం పెట్టుకొని నిండా మునిగిన బంగ్లాదేశ్‌ను మళ్లీ పూర్వపు స్థితికి తీసుకురావడం యూనస్‌కు సాధ్యం కాదు.
హసీనా ప్రభుత్వం జైళ్లలో పెట్టిన మతఛాందస ఉగ్రవాదులను విడుదల చేయడంతో, ఇప్పుడు యూనస్ వారి చేతిలో కీలుబొమ్మగా మారాడు. వాళ్ల ఉచ్చునుంచి బయటపడటం అతనికి అంత తేలిక కాదు. ప్రస్తుత యూనస్ అనుసరిస్తున్న భారత వ్యతిరేక విధానాల వెనుక అమెరికాతో పాటు, మతఛాందసుల ప్రభావం బలీయంగా ఉంది . ఇది మొత్తం ఒక సాలెగూడులా మారి యూనస్ మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలావుండగా ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిణామాల నేపథ్యంలో, యూనస్‌ను దేశం విడిచిపెట్టి వెళ్లిపొమ్మని అమెరికా సలహా ఇచ్చినట్టు ధ్రువీకరించని వార్తలు రావడం కొసమెరుపు!
-జమలాపురపు విఠల్ రావు
సీనియర్ జర్నలిస్ట్





