జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక – తెలంగాణ రాజకీయ దిశను నిర్ణయించే కీలక పోరాటం

“జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక నియోజకవర్గం ఫలితమేగాక తెలంగాణ రాజకీయ దిశను మారుస్తున్న ఒక యుద్ధ రేఖగా నిలిచింది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి నాయకత్వానికి బలం చేకూరుతుంది, ప్రభుత్వ ప్రజాదరణ పెరుగుతుంది. బి ఆర్ ఎస్ గెలిస్తే అది పార్టీ పునరుజ్జీవనానికి నాంది అవుతుంది, కేడర్‌కి ఉత్తేజం వస్తుంది. బి జె పి గెలిస్తే నగర రాజకీయాల్లో కొత్త ధ్రువం ఏర్పడుతుంది. ఏ ఫలితమొచ్చినా ఈ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ సమీకరణాలను తప్పక మార్చబోతుంది.”

జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాజకీయ దిశను నిర్ణయించే కీలక కేంద్రంగా మరోసారి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. హైదరాబాద్ నగర హృదయంలో ఉన్న ఈ నియోజకవర్గం సాంస్కృతిక, వ్యాపార, విద్యా, సినీ వర్గాల సమ్మేళనంగా నిలిచి, సామాజికంగా, ఆర్థికంగా అత్యంత ప్రభావవంతమైన వోటర్లను కలిగి ఉంది. ఈ ప్రాంతంలోని ఓటర్లు రాష్ట్ర రాజకీయ దిశను తరచుగా నిర్ధారించే పౌర సమూహంగా గుర్తింపబడ్డారు. అందుకే ప్రతి రాజకీయ పార్టీ ఇక్కడ గెలవడం కేవలం ఓటు విజయంగా కాకుండా, ప్రజాభిప్రాయాన్ని కొలిచే సూచికగా భావిస్తోంది.

2025 జూన్‌లో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ సీటు ఖాళీ అయింది. ఆయన వరుసగా రెండు సార్లు విజయం సాధించి జూబ్లీ హిల్స్ ప్రజలలో విశ్వాసం పొందిన నేత. ఆయన మరణంతో ఏర్పడిన ఉపఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయ దిశను నిర్ణయించే పరీక్షగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గోపీనాథ్‌ 80,549 ఓట్లు సాధించి విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ 64,212 ఓట్లు పొందారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ గణాంకాలే ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికలో మూడు పార్టీల బలహీనతలు, బలాలను సూచిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సీటు కోసం కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి , భారతీయ జనతా పార్టీ మధ్య త్రిపాక్ష పోటీ కొనసాగుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రభుత్వ ప్రజాదరణను నిలబెట్టుకునే పోరాటంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, హైదరాబాదు భవిష్యత్తు వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. మహిళా వోటర్లు, మైనారిటీలు, ఉద్యోగ వర్గం, మధ్యతరగతి వర్గాలు కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన వర్గాలు. ప్రభుత్వ పథకాలు “ఇంటి దాకా చేరాయి” అనే సందేశంతో ప్రచారం సాగుతోంది.

బి ఆర్ ఎస్ పక్షానికి ఈ ఉపఎన్నిక “పార్టీ పునరుజ్జీవన సమరం”గా నిలిచింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేడర్‌లో ఏర్పడిన నిస్పృహను తొలగించడానికి, తమ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేసి ప్రజా మద్దతు తిరిగి పొందడానికి పార్టీ బలంగా కసరత్తు చేస్తోంది. కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం మాగంటి గోపీనాథ్ కుటుంబంపై ఉన్న సానుభూతిని కూడా తమవైపు మలుచు కోవాలని ప్రయత్నిస్తోంది. “మేము చేసిన అభివృద్ధే ప్రజల తీర్పు” అన్న నినాదంతో రోడ్లు, డ్రెయినేజ్‌, విద్యుత్‌, నీటి వసతులు, స్మార్ట్ కాలనీలు వంటి ప్రాజెక్టులను గుర్తుచేస్తూ హరీష్ రావు , ఇతర ప్రముఖ నేతలు ప్రచారం చేస్తున్నారు.

భారతీయ జనతా పార్టీకి ఇది నగర రాజకీయాల్లో తమ పునాదిని బలపరచుకునే పరీక్ష. “మార్పు ప్రారంభం జూబ్లీ హిల్స్ నుంచే” అన్న నినాదంతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేంద్ర వంటి ప్రముఖులు ప్రచార బృందాన్ని బలపరిచారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి స్థానిక వ్యాపార వర్గాల్లో పరిచయం కలిగి ఉండటం పార్టీకి కొంత ప్రయోజనంగా మారవచ్చు. అదనంగా తెలుగుదేశం పరోక్ష మద్దతు కూడా బీజేపీకి ప్రోత్సాహాన్ని ఇస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జూబ్లీ హిల్స్ ప్రజలు అభివృద్ధి, మౌలిక వసతులు, ట్రాఫిక్ సమస్యలు, కాలువలు, రోడ్లు, పార్కింగ్, భద్రత వంటి అంశాలను అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్నారు. బహుళ అంతస్తు భవనాలు, వాణిజ్య కేంద్రీకరణతో పెరిగిన ట్రాఫిక్‌ సమస్యలు, కాలువల విస్తరణ లేకపోవడం, నీటి సరఫరా లోపాలు వంటి సమస్యలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తుండగా, బి ఆర్ ఎస్ తమ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేసి కేడర్ ఉత్సాహాన్ని పెంచే ప్రయత్నంలో ఉంది. బి జె పి మాత్రం నగర అభివృద్ధి, కేంద్ర ప్రణాళికల సమన్వయంతో “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే హైదరాబాద్‌ ప్రపంచ స్థాయి నగరంగా మారుతుంది” అని ప్రజల్లో నినదిస్తోంది.

ఈ నియోజకవర్గంలో సుమారు 2.15 లక్షల వోటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 49%, పురుషులు 51%. మైనారిటీ వోటర్లు దాదాపు 25% వరకు ఉండగా, మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు ప్రధాన వోటు బలం. గత ఎన్నికల్లో వోటింగ్ శాతం కేవలం 47% మాత్రమే ఉండటం గమనార్హం. ఈసారి అధిక వోటింగ్‌ జరిగితే కాంగ్రెస్‌కి, తక్కువ వోటింగ్‌ జరిగితే బి ఆర్ ఎస్ కు ప్రయోజనం కలుగుతుందనే విశ్లేషణ ఉంది. బి జె పి మాత్రం యువత, వ్యాపార వర్గం, ఉన్నత విద్యావంతుల వోటర్లలో తన వోటు శాతం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, మూడు పార్టీల మధ్య సమాన స్థాయి పోటీ ఉన్నప్పటికీ రాష్ట్ర అధికారంలో ఉన్న కారణంగా కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి ఆకర్షణ, ప్రభుత్వ యంత్రాంగ మద్దతు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, పబ్లిక్ సెంటిమెంట్— ఈ అంశాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. బి ఆర్ ఎస్ పట్ల స్థానిక స్థాయిలో గోపీనాథ్ కుటుంబానికి ఉన్న సానుభూతి, కేడర్ నిబద్ధత సహకారం, ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం అను కూలంగా మారవచ్చు. బి జె పి మాత్రం నగరాభివృద్ధి, పారదర్శక పాలన, జాతీయ నాయకత్వం వంటి అంశాలను ఎత్తి చూపి యువత వోటర్లను ఆకర్షించగలదే కాని గెలుపు మాత్రం కఠినంగా కనిపిస్తోంది.

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక నియోజకవర్గం ఫలితమేగాక తెలంగాణ రాజకీయ దిశను మారుస్తున్న ఒక యుద్ధ రేఖగా నిలిచింది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి నాయకత్వానికి బలం చేకూరుతుంది, ప్రభుత్వ ప్రజాదరణ పెరుగుతుంది. బి ఆర్ ఎస్ గెలిస్తే అది పార్టీ పునరుజ్జీవనానికి నాంది అవుతుంది, కేడర్‌కి ఉత్తేజం వస్తుంది. బి జె పి గెలిస్తే నగర రాజకీయాల్లో కొత్త ధ్రువం ఏర్పడుతుంది. ఏ ఫలితమొచ్చినా ఈ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ సమీకరణాలను తప్పక మార్చబోతుంది. ప్రజల తీర్పే తుదికి రాజకీయ దిశను నిర్ణయించే శక్తి.

రామ కిష్టయ్య సంగన భట్ల
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌, కాలమిస్టు…9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *