“గాంధీజీని మొత్తం ఐదు సార్లు శాంతి బహుమతికి నామినేట్చేసినప్పటి కినీ, నోబెల్ ఇవ్వలేదు. 1989లో దలైలామాకు నోబెల్శాంతి బహుమతి ఇ చ్చినప్పుడు, నోబెల్ కమిటీ సభ్ యులు గాంధీకిబహుమతి ఇవ్వకపోవడం పై బహిరంగంగా విచారం వ్యక్తం చే శారు.ఆయనకు బహుమతి దక్కకపోవడం “ ది మిస్సింగ్ లారియేట్” (బహుమతి దక్కని పురస్కృతుడు) గా మిగిలిపోయింది.ప్రపంచవ్యాప్తం గా అహింస, శాంతి మార్గానికి గాం ధీ ఆద్యుడిగా, ఒకప్రేరణగా నిలి చినప్పటికీ, సాంకేతిక, అప్పటి క మిటీ ఆలోచనలకారణంగా ఆ అత్యున్నత పురస్కారం ఆయనకు దక్కలేదు…”

ప్రపంచ రాజకీయాల్లో “నోబెల్ శాంతి బహుమతి”కు ఉన్న అసలు విలువలు, ఆదర్శాలు ఇటీవలి కాలంలో తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొంటున్నాయి. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనలు తరుచుగా వివాదాలకు గురవుతూనే ఉంటాయి. నిజానికి శాంతిస్థాపన కోసం చేస్తున్న కృషి అనే నిర్వచనం మొదటగా లోతైన విమర్శనల పాలైంది. అదేసమయంలో కొన్ని అవార్డులపై వచ్చిన విమర్శనలు రాజకీయ దురుద్దేశాలతో కూడుకొన్నవి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు సిఫారసు చేయడం లేదా ఆయన దానికి అర్హుడని కొంతమంది వాదించడం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, నైతిక చర్చకు దారితీసింది. అయితే, కేవలం ఒక ఒప్పంద సాధనతోనే ఈ మహోన్నత గౌరవాన్ని అందుకోగలరా? ట్రంప్ పాలనలోని అంతర్గత విభజన, అంతర్జాతీయ సహకారంపై ఆయన వైఖరి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, ఆయనను ‘శాంతిదూత’గా పరిగణించడం సరైనదేనా? ఈ ప్రశ్న నోబెల్ బహుమతి చరిత్రలో ఉన్న సంక్లిష్ట వివాదాలనే మరోసారి ముందుకు తీసుకొచ్చింది.
ట్రంప్ పక్షాన వాదించేవారు ఆయన పదవీకాలంలో ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌ల మధ్య కుదిరిన ‘అబ్రహాం ఒప్పందం’ను ప్రధానంగా ప్రస్తావిస్తారు. ఈ చారిత్రక ఒప్పందం మధ్యప్రాచ్యంలో దశాబ్దాల వైరాన్ని తగ్గించి, ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించడానికి దారితీసింది. శాంతి స్థాపనలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా కొందరు నార్వే, జపాన్ పార్లమెంట్ సభ్యులు భావించి ఆయనను నామినేట్ చేశారు. అంతేకాక, నిరంతరంగా సాగుతున్న యుద్ధాలను వ్యతిరేకించడం, కొన్ని విదేశీ యుద్ధభూముల నుండి అమెరికా దళాలను వెనక్కి రప్పించే అంశాలను కూడా శాంతి ప్రయత్నాలుగా పరిగణించారు. బరాక్ ఒబామాకు 2009లో బహుమతి లభించినప్పటి నుండి, ట్రంప్ తాను కూడా “అర్హుడిని” అని పదేపదే చెప్పుకున్నాడు.
ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయడమంటే అది ప్రజాస్వామ్య విలువలపై దాడి అంటూ ఆయన వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. ట్రంప్ విధానాలు నోబెల్ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శకులు గట్టిగా వాదిస్తున్నారు. దేశీయంగా ఆయన అనుసరించిన భాష, వర్ణ వివక్ష, మత అసహనం వంటి చర్యలు రాజకీయ విభజనను పెంచాయి. ముఖ్యంగా, 2021లో అమెరికా క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడికి ఆయన ప్రసంగాలే కారణమని విమర్శలు వచ్చాయి. ఒక దేశంలో ప్రజాస్వామ్య విలువలపై దాడిని ప్రోత్సహించిన వ్యక్తిని ప్రపంచ శాంతికి ప్రతీకగా ఎలా చూడగలమని వారు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ సహకారంపై విముఖతను ప్రదర్శించిన ట్రంప్ “అమెరికా ఫస్ట్” అనే స్వార్థపూరిత సూత్రంతో విదేశాంగ విధానాన్ని నడిపారు. పారిస్ పర్యావరణ ఒప్పందం నుండి అమెరికా ఉపసంహరించుకోవడం, ఇరాన్ అణు ఒప్పందం నుంచి బయటకు రావడం, అలాగే యునైటెడ్ నేషన్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలపై విమర్శలు చేయడం వంటి చర్యలు ప్రపంచ సహకారం, బహుపాక్షిక విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయి. శాంతి ప్రక్రియ కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు, అది సార్వజనీన సహకారం, మానవతావాదం ద్వారా సాధించబడుతుంది. ఈ అంశంలో డోనాల్డ్ ట్రంప్ పూర్తిగా వ్యతిరేక విధానాలను అనుసరించాడు.
అయితే నోబెల్ శాంతి బహుమతి చుట్టూ వివాదాలు ఉండటం కొత్తేమీ కాదు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు విరుద్ధంగా అవార్డులు ఇవ్వబడ్డాయని భావించిన సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. ట్రంప్ వివాదం కంటే చాలా మరింత తీవ్రమైన వివాదాంశాలు అనేకం ఉన్నాయి. 1935 నుంచి ఈ వివాదాలు ఎక్కువయ్యాయి. 1935లో జర్మన్ జర్నలిస్ట్, నిష్కపటమైన నాజీ విమర్శకుడు కార్ల్ వాన్ ఒసియెట్జ్కీకి శాంతి బహుమతి లభించిన తర్వాత హిట్లర్ జర్మన్ లు నోబెల్ అవార్డులను స్వీకరించకుండా నిషేధించాడు. 1939 హిట్లర్ ను సైతం నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. అయితే ఇది ఆ కాలంలో అత్యంత వ్యంగమైన సంఘటనగా పేర్కొనబడింది.
1973లో నోబెల్ శాంతి బహుమతి వరించడం అత్యంత వివాదాస్పదమైంది. వియత్నాం యుద్ధాన్ని ముగించేందుకు కుదిరిన ఒప్పందానికి గాను హెన్రీ కిస్సింజర్, వియాత్నాం కమ్యూనిస్ట్ నాయకుడు లీ డక్ థోలకు ఈ బహుమతి ప్రకటించారు. అయితే, కిస్సింజర్ కంబోడియాలో బాంబు దాడులను ఆదేశించాడని, మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణమయ్యాడని తీవ్ర విమర్శలు వచ్చాయి. వియత్నాం నాయకుడు లీ డక్ థో ఈ బహుమతిని తిరస్కరించడం విశేషం. అదేవిషంగా 1994లో యాసర్ అరాఫత్, షిమోన్ పెరేస్, యిట్జాక్ రాబిన్ లకు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య శాంతిని సాధించే ప్రయత్నాలకు గాను బహుమతి లభించింది. అయినప్పటికీ, అరాఫత్ గత ఉగ్రవాద కార్యకలాపాలు, ఆ తర్వాత కూడా కొనసాగిన వైరం ఈ ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది.
2009లో బరాక్ ఒబామాను బహుమతి గ్రహీతగా ప్రకటించడం తొందరపాటు చర్యగా అభివర్ణించడ మైనది. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి సంవత్సరంలోనే, అపారమైన అంతర్జాతీయ సహకారాన్ని పెంచే ప్రయత్నాలకు గాను ఈ బహుమతి లభించింది. అయితే, ఆయన కేవలం కొన్ని నెలల పదవీకాలంలోనే ఎటువంటి గణనీయమైన ఫలితాలు చూపకముందే బహుమతి ఇవ్వడం అతి తొందరపాటుగా, సామర్థ్యం కంటే సంభావ్యతకు ఇచ్చిన గౌరవంగా విమర్శలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల కార్యకర్త కార్ల్ వాన్ ఒస్సియెట్జ్కీ (1935), బర్మా నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ (1991) వంటి గ్రహీతల ఎంపికపై కూడా తీవ్ర వివాదాలు ఉన్నాయి. సూకీకి బహుమతి లభించిన తర్వాత ఆమె రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించడంలో విఫలమవడంపై విమర్శలు రావడంతో ఆమె బహుమతిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొన్నిసార్లు, ఒక వ్యక్తి లేక సంస్థ శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫలించకముందే లేదా ఆ కృషికి సంబంధించి దీర్ఘకాలిక ప్రభావం తెలియకముందే బహుమతిని ప్రకటిస్తారు. ఈ నిర్ణయాలు తరచుగా ఆకాంక్షల ఆధారంగా ఉంటాయి తప్ప, తిరుగులేని విజయాల ఆధారంగా కాదు. ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్‌కు 2019లో బహుమతి ఇచ్చిన కొద్ది కాలానికే ఆ దేశంలో యుద్ధం ప్రారంభమైంది. నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయాలు కొన్నిసార్లు కేవలం శాంతిని ప్రోత్సహించడం కాకుండా, నిర్దిష్ట రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి లేదా అంతర్జాతీయ సమస్యలపై దృష్టి పెట్టడానికి ఉద్దేశించినవిగా ఉండడం కూడా శాంతి బహుమతి ఔన్నత్యం దెబ్బతిండానికి కారణమవుతుంది. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తులకు లేదా సంస్థలకు బహుమతి ఇవ్వడం ఈ కోవలోకే వస్తుంది.
గాంధీజీని మొత్తం ఐదు సార్లు శాంతి బహుమతికి నామినేట్ చేసినప్పటికినీ, నోబెల్ ఇవ్వలేదు. 1989లో దలైలామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినప్పుడు, నోబెల్ కమిటీ సభ్యులు గాంధీకి బహుమతి ఇవ్వకపోవడంపై బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు. ఆయనకు బహుమతి దక్కకపోవడం “ది మిస్సింగ్ లారియేట్” (బహుమతి దక్కని పురస్కృతుడు) గా మిగిలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అహింస, శాంతి మార్గానికి గాంధీ ఆద్యుడిగా, ఒక ప్రేరణగా నిలిచినప్పటికీ, సాంకేతిక, అప్పటి కమిటీ ఆలోచనల కారణంగా ఆ అత్యున్నత పురస్కారం ఆయనకు దక్కలేదు.గాంధీతో పాటుగా ఎలియనోర్ రూజ్‌వెల్ట్, వాక్లావ్ హావెల్, కెన్ సరో-వివా, సారీ నుస్సేబిహ్, కొరజోన్ అక్వినో, లియు జియాబోలు (లియు జియాబోకు తరువాత కాలంలో బహుమతి ఇచ్చారు) బహుమతి దక్కని శాంతి దూతలుగా మిగిలిపోయారు.
ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం ‘శాంతి’ అంటే ప్రధానంగా జాతుల మధ్య సోదరభావాన్ని, సైన్యాల ఉపసంహరణ లేదా తగ్గింపును సూచిస్తుంది. కానీ కమిటీ కాలక్రమేణా ‘శాంతి’ పరిధిని మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన వంటి విస్తృత రంగాలకు విస్తరించింది. దీనివల్ల, ఏ చర్యలు నిజంగా ‘శాంతి’కి అర్హమైనవనే దానిపై తరచుగా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అంతేకాకుండా విజేతల ఎంపిక ప్రక్రియలో, నామినేషన్ల చర్చలలో గోప్యత పాటించబడుతుంది. కనీసం 50 సంవత్సరాల వరకు నామినేషన్ల జాబితా రహస్యంగా ఉంచుతారు. ఈ గోప్యత కారణంగా, కమిటీ నిర్ణయాల వెనుక ఉన్న కారణాలపై, వాటి నిష్పాక్షికతపై సహజంగానే అనుమానాలు, విమర్శలు పెరుగుతాయి.
శాంతి అనేది కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు. ఇది సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, మానవ హక్కులు, సంఘర్షణల శాశ్వత పరిష్కారం వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న లోతైన, క్లిష్టమైన భావన. శాంతిని స్థాపించడం లేదా పెంపొందించడం అనేది ఎప్పుడూ రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. వ్యక్తులు లేదా సంస్థలు చేసే శాంతి ప్రయత్నాలు తరచుగా ప్రభుత్వాల నిర్ణయాలు, అంతర్జాతీయ సంబంధాలు, దేశాల మధ్య ఒప్పందాలు లేదా నిర్దిష్ట సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే, శాంతికి కృషి చేసిన వారికి బహుమతిని ఇవ్వడం అనేది ఆ రాజకీయ ప్రక్రియకు లేదా దృష్టికోణానికి మద్దతు ఇచ్చినట్టు అవుతుంది.





