‘బతుకమ్మ’ రాజకీయాలు

  • ‘గిన్నీస్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌వరల్డ్ ‌రికార్డు’ కోసం రాష్ట్ర ప్రభత్వం సన్నాహాలు 
  • అనుమటి కోసం న్యాయస్థానం కు బిజెపి ..?
  • కాంగ్రెస్ పాలన వ్యతిరేక పాటలతో బి ఆర్ ఎస్ 
  • చింతమడక లో జాగృతి బతుకమ్మ సంబురాలు 
తెలంగాణ ప్రజలు సంప్రదాయంగా జరుపుకునే బతుకమ్మ సంబరాలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రధాన ప్రతిపక్షాలైన బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ జరుగని రీతిలో పదివేల మందితో హైదరాబాద్‌ ‌నడిబొడ్డున ఈ వేడుకను నిర్వహించేదుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. గిన్నీస్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌వరల్డ్ ‌రికార్డులోకి ఎక్కాలన్న లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఈనెల 28న భారీ ప్రణాళికను రూపొందించింది. పండుగంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ఈ వేడుకలుంటాయంటున్నారు అధికార పార్టీ మంత్రులు.
కాగా బిజెపికూడా గతంలో మాదిరిగానే ఈనెల 23న చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీర్వచనంతో పెద్దఎత్తున జనసమీకరణతో అత్యంత వైభవంగా బతుకమ్మ ఆట పాట కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఆ రోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించాలని తలపెట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల అనుమతి లభించలేదు. దీంతో న్యాయస్థానం నుంచి అనుమతి తెచ్చుకోనైనా బతుకమ్మ ఆడి తీరుతామంటున్నారు ఆ పార్టీ మహిళా మోర్చా నాయకులు. అలాగే తెలంగాణ భవన్‌లో ఈనెల 21న బిఆర్‌ఎస్‌ ‌పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నది. బతుకమ్మ సంబురాలంటే ఇంతకాలం అందరికీ గుర్తుకు వచ్చింది బిఆర్‌ఎస్‌ ‌పార్టీనే. ఆ పార్టీ పక్షాన జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత బతుకమ్మ ఉత్సవాలను విశ్వవ్యాప్తం చేసిందన్న పేరు వచ్చింది. కవిత పేరు వినగానే బతుకమ్మకు బ్రాండ్‌ అం‌బాసిడర్‌గా చెప్పుకుంటారు. ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్రం తోపాటు విదేశాల్లోని తెలుగువారిని ఈ వేడుకలో భాగస్వాములను చేయడంతో బతుకమ్మ ప్రచార పరిధి పెరిగిందనే చెప్పాలె. అయితే గత రెండు సంవత్సరాలుగా ఆమె కొంత ఇన్‌యాక్టివ్‌గా ఉండటం ఒకటైతే, ఇటీవల ఆమెను బిఆర్‌ఎస్‌ ‌పార్టీ సస్పెండ్‌ ‌చేయడంతో గతంలో ఉన్న వరవడి కాస్తా తగ్గిందనే చెప్పాలె. అయితే బిఆర్‌ఎస్‌ ‌పార్టీతో ప్రమేయంలేకుండానే ఈనెల 26 నుండి 28వ తేదీవరకు ఖతార్‌, ‌మాల్టా, లండన్‌లో నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో కవిత భాగస్వామి కానున్నట్లు సమాచారం.
అంతకుముందు తమ స్వస్థలం సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామస్థుల ఆహ్వానం మేరకు బతుకమ్మ ప్రారంభ వేడుకల్లో పాల్గొంటుందని తెలుస్తున్నది. అలాగే 22న జాగృతి రాష్ట్ర కార్యాలయంలో, 23న మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్‌లో, 24న సిద్దిపేట జిల్లా వర్గల్‌ ‌వేడుకల్లో పాల్గొని 25న హర్యాన వెళ్ళనున్నారు. మాజీ ఉప ప్రధాని దేవెగౌడ 112వ జయంతి వేడుకల్లో పాల్గొనడంతోపాటు స్థానికులు నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలుస్తున్నది. అయితే కవిత లేనిలోటు కనిపించనివ్వకుండా బిఆర్‌ఎస్‌ ‌ప్రణాళిక సిద్దంచేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ బతుకమ్మవేళ సంప్రదాయంగా వస్తున్న పాటలకు భిన్నంగా  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని తీరుపై పాటల రూపంలో అధికార పార్టీపై దాడికి బిఆర్‌ఎస్‌ ‌సిద్దమైంది. గత ఎన్నికల్లో అధికార మార్పిడి జరగాలంటూ కాంగ్రెస్‌ ఎత్తుకున్న నినాదాన్ని తీసుకుని ‘‘మార్పు మార్పు అని వలలో, మనలను ముంచిడ్రే వలలో/ హైడ్రా తెచ్చిండ్రే వలలో, ఇండ్లను కూల్చిండ్రే వలలో/ ఆగమాగం చేస్తున్రే ..
అమ్మో ఈ కాంగ్రెసోళ్ళు అంటూ పాటసాగుతుంది. అలాగే ఆరు గ్యారంటీలు ఉయ్యాలో-ఆగమేచేసిన్రు ఉయ్యాలో/ అభయ హస్తం ఉయ్యాలో శూన్యహస్తమాయే ఉయ్యాలో.. అంటూ కొత్తరకంగా పాటల సీడీలను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తూ, ఆ పాటలనే పాడాలని తమ పార్టీ మహిళకు ఆదేశించినట్లు తెలుస్తున్నది. అలాగే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారిణి విమలక్క నేతృత్వంలో ఈనెల 20 సాయంత్రం 3గంటలకు ఉస్మానియా ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కాలేజీలో బహుజన బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అరుణోదయ గత 15ఏళ్ళుగా బహుజన బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నది.20వ తేదీన ముందుగా గన్‌పార్క్‌వద్ద అమరులకు నివాళులర్పించనున్నారు. అదిమొదలు అక్టోబర్‌ 3‌వ తేదీవరకు వివిధ జిల్లాలో బహుజన బతుకమ్మ వేడుకలు కొనసాగనున్నాయి.
బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే పండుగ. సహజంగా దేవుడికి పూలతో పూజ చేస్తారు. కాని పూలనే అమ్మవారిగా అలంకరించడం ఈ పండుగ ప్రత్యేకత. ప్రకృతిలో సహజసిద్దంగా లభించే విభిన్న రకాల పూలను శంఖు ఆకారంలో పేర్చి భక్తి శ్రద్దలతో కొలవడమన్నది ఆనాధిగా వస్తున్నది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం ఏకాలంలో మొదలైందనడానికి సరైన ఆధారాలులేవు. కాని, సుమారు వెయ్యేండ్లకు కాస్తా అటు ఇటుగా ఈ వేడుకలు ఈ ప్రాంతంలో కొనసాగుతున్నట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. చోళులు, కాకతీయుల కాలంలోకూడా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తున్నది. సహజసిద్దంగా లభించే తంగేడు, గునుగు పూలతోనే నేటికీ బతుకమ్మను పేర్చడం అనవాయితీగా వస్తున్నది. ఈ రెండు రకాల పువ్వులు అడవిలో విచ్చలవిడిగా లభించేవి కావడం విశేషం.
బతుకమ్మను మరింత అందంగా అలంకరించడంలో పోటీ పడటంలో భాగంగా ఇతర రకరకాల పువ్వులను వాడినప్పటికీ తంగేడు, గునుగు లేకుండా బతుకమ్మను తయారు చేయడానికి ఇష్టపడరు. ప్రతీఏటా ఆశ్వీయుజ శుద్ద పాడ్యమి నుండి మహర్నవమి వరకూ తెలంగాణ ప్రాంతంలో రోజొక్క పేరుతో మారుమూల పల్లెలతోపాటు హైదరాబాద్‌ ‌లాంటి మహానగరాల్లో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడమన్నది ఆచారంగా మారింది. అయితే ప్రాంతేతరుల పాలనలో ఈ సంబరాలకు కొంత నిరాధరణ ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడడానికి ముందు బతుకమ్మ కూడా పోరాటంలో భాగస్వామి కావడం విశేషం. నేటికీ పాలకులెవరైనప్పటికీ ప్రజలు బతుకమ్మతో తమ నిరసనలను తెలియజేయడమన్నది కొత్త సంప్రదాయానికి తెరదీసింది. రాష్ట్రం ఏర్పడి పన్నెండు ఏండ్లు కావస్తున్నా ఏ ఏటికాయేడు బతుకమ్మకు మరింత రాజకీయరంగు పడుతూనే ఉంది. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అడుకునే బతుకమ్మను కాంగ్రెస్‌, ‌బిజెపి, బిఆర్‌ఎస్‌లు ఎవరికివారే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవడం సామూహికంగా జరుపుకునే సంప్రదాయానికి విఘాతం ఏర్పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *