ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు-3

అయిదు వారాల ధారావాహిక

(గత సంచిక తరువాయి)
మరాఠీ రచయిత్రి తారాబాయి షిండే 1882 లో రచించిన ఃస్త్రీ పురుషతులనః అనే సుదీర్ఘవ్యాసాన్ని ఈ గ్రంథంలో పొందుపరిచారు. ముఖ్యంగా ఈమెను భారతదేశపు తొలి ఫెమినిస్ట్ అని పేర్కొన్నారు. జ్యోతిరావు ఫూలే కూడా తారాబాయి షిండే రచనలను, ఆమె భాషలో గల స్త్రీవాద పద జాలాన్ని, ఆమె శైలిలో గల స్త్రీత్త్వాన్ని, ఆమె వాదనల్లో గల అగ్ని జ్వాలను అనేకసార్లు ప్రశంసించినట్టుగా ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది. 20వ శతాబ్దపు తొలి రోజుల్లోనే పురుష ప్రపంచాన్ని తీవ్రంగా నిలదీసిన రచయిత్రిని గూర్చి దేవరాజు గొప్పగా వర్ణించారు. ఆమె స్త్రీ అవిద్యపైన, సతీ సహగమనంపైన, సంప్రదాయం పేరిట స్త్రీ కట్టుబాటు తనంపైన చేసిన పోరాటం ఉన్నతమైంది.

ఈ కోవలోనే పండిత రమాబాయిని గూర్చి తెలుపుతూ ఆమె మేథాశక్తితో, సంపాదించిన విద్వత్తుతో మహిళల సమస్యలను ప్రపంచం ముందుంచి సభ్య సమాజాన్ని నిలదీసినట్లుగా దేవరాజు పేర్కొన్నారు. భిన్న సంస్కృతుల పట్ల, ఆచార వ్యవహారాల పట్ల అవగాహన కలిగిన రచయిత్రిగా అభివర్ణించారు. పండిత రమాబాయి, భక్త మీరాబాయిని ఒక కోణంలో దర్శించిన విషయాన్ని దేవరాజు చాలా ఆసక్తిగా స్పష్టపరిచారు. మీరాబాయి కాలంలో మానవ మాత్రుడైన భర్తను భగవంతుడిగా పూజించే ఆచారం అధికంగా ఉండేది. కానీ మీరాబాయి అలాంటి పద్ధతిని తిరస్కరించి, ఏకంగా భగవంతున్నే భర్తగా ఆరాధించే కొత్తపద్ధతికి నాంది పలికింది. అప్పటికే మీరాబాయి ఒక సమాజపు తిరుగుబాటు ధోరణికందని, స్త్రీవాద ఆలోచన పరంపరలో మొదటి ప్రస్థానమైందని పండిత రమాబాయి తెలిపారు. రచయిత్రి రమాబాయిలో గల స్త్రీ అభ్యుదయం పట్ల ఉన్నతమైన భావాలను దేవరాజు విశ్లేషించారు.

వీరేగాక సాహిత్యం ద్వారా స్త్రీ చైతన్యాన్ని కాంక్షించినవారిలో మరాఠీ నవలాకారిణీ కాశీబాయి, బెంగాలీ రచయిత్రి శరత్ కుమారి చౌదురాణి, తొలి తెలుగు రచయిత్రి బండారు అచ్చమాంబ, సింధినీ రచయిత్రి కుమారి పోపటి ఆర్. హీరానందానిని ఈ గ్రంథంలో ప్రస్తావించారు. మహిళలు తమను తాము రెండవ స్థాయి మనుషులుగా భావిస్తూ, అంతా తమ దురదృష్టం అనుకొంటూ మాఢనమ్మకాల మధ్య, కుళ్ళిపోయిన సంప్రదాయాల మధ్య, దుర్భరమైన జీవితం గడుపుతున్న రోజుల్లో కాశీబాయి రచించిన ఃపాల్కీచగొండః (పల్లకీకి వేలాడే సిల్కు కుచ్చు) అనే నవల స్త్రీ స్వేచ్ఛను కాంక్షించింది. విధి వంచితులైన మహిళలకు ఒక దారీ తెన్ను ఈ నవల ద్వారా చూపబడిందని దేవరాజు తెలియజేశారు. ఃఅదోరర్ అనాదోరర్ః అనే పెద్ద కథతో సాహిత్య ప్రపంచాన్ని బాగా ఆకట్టుకొన్న రచయిత్రి శరత్ కుమారి చౌదురాణి గూర్చి తెలుపుతూ ఆమె వ్యాసాలు స్త్రీ సమస్యలపై, సామాజిక సమస్యలపై ఆలోచనాత్మక దృక్పథాన్ని ప్రకటిస్తాయని పేర్కొన్నారు.

పురుషుల కంటే స్త్రీలు ఎందులోనూ తీసిపోరని, నిర్లక్ష్యానికి, నిరాదరణకు అణిచివేతకు గురైన స్త్రీలు లోకజ్ఞానం లేక, విద్యలేక ఇళ్ళలో మగ్గిపోయారే తప్ప శారీరకంగా మానసికంగా, మేధో పరంగా వారు ఎందులోనూ తక్కువ కారని స్పష్టం చేస్తూ బండారు అచ్చమాంబను ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలోనే మొదటి రచయిత్రిగా గుర్తించారు దేవరాజు. 19 వ శతాబ్దంలోనే భారతీయ మహిళా రత్నాల జీవిత చరిత్రలను ఃఅబల సచ్చరిత్ర రత్నమాలః అనే పేరు పొందుపరచడం విశేషంగా పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలోని పంజాబ్, కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలు పర్యటించి రామాబాయి, హర్దేవి, కాశీబాయి తవిష్కర్, కమలా సత్యానందన్, కొటికల పూడి సీతమ్మ వంటి విశిష్ట మహిళల జీవిత విశేషాల్ని అచ్చమాంబ పరిచయం చేశారు. ఇవన్నీ నాటి చింతామణి వంటి ప్రసిద్ధ పత్రికల్లో ప్రచురింపబడటం కూడా చూడవచ్చు. తొలి సాహిత్య చరిత్రకారిణియే గాక అచ్చమాంబను తొలి తెలుగు కథా రచయిత్రిగా కూడా దేవరాజు ప్రస్తావించారు.

బెంగాలీ రచయిత్రి నిరుపమాదేవి రచనలను చాలా విశిష్టమైనవిగా వర్ణిస్తూ, స్త్రీ దృష్టి కోణంలో దర్శించిన జీవితాలను సాహిత్యీకరించిందని వివరించారు. సింధినీ రచయిత్రి హిరానందానీని విశేషంగా పేర్కొన్నారు. ఆమె కచ్చితత్వాన్ని, నిజాయితీని, నిర్భరతను, ఃనేను ఒక మహిళను!ః అంటూ సగర్వంగా జీవించే విధానాన్ని దేవరాజు ఃస్త్రీ దరహాసం దోచిన ఇతిహాసంః లో విస్పష్టంగా తెలిపారు. హీరానందానీ తన సహజమైన విలువల్ని తన రచనల్లో ప్రవేశ పెట్టిందని ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది. మాతృత్వపు భావనల్ని, భర్తపై గౌరవాభిమానాన్ని, ఇంట్లో వారందరి పట్ల సేవా తత్పరతను కలిగి ఉన్న స్త్రీ సహజ నైజాన్ని ఈ సమాజం చాలా తక్కువ అంచనా వేస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన హీరానందానీ ఆత్మ పరిశీలనను గ్రహించవచ్చు. ఃసబాంకుర్ (నవాంకురం) నవలలో ఆడపిల్లపై చూపే వివక్షను ఎత్తి చూపిన ప్రసిద్ధ స్త్రీవాది రచయిత్రి సులేఖా సన్యాల్ ని కూడా ఈ గ్రంథంలో తిలకించవచ్చు. బెంగాల్ కరువుతో, దేశ విభజనతో అతలాకుతలమైన జన జీవనం ఆమెను కదిలించివేశాయని అతి తక్కువ కాలం జీవించి ఉన్న శాంతి ఘట్టాలను సాహిత్యీకరించారని దేవరాజు పేర్కొన్నారు.

ఇల్లిందల సరస్వతీ దేవిని ఒక ఫెమినిస్ట్ గా అభివర్ణిస్తూ ఆమె స్త్రీవాద భావజాలంతో రాసిన కథలను పరిచయం చేశారు. ఃఅమ్మా నాకు ప్రాణంతో పుట్టే హక్కు లేదా?ః అనే కథ సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తుందని, భ్రూణహత్యల పరంపరలను ఖండిస్తుందని పేర్కొన్నారు. ఃబాలూతామ్ ధాడాఘేః (పాపా గుణపాఠం. నేర్చుకో) అనే నవల ద్వారా స్త్రీ విద్యావశ్యకతనే గాక, స్త్రీకి తన జీవిత భాగస్వామిని ఎన్నుకొనే అవకాశం ఈ సమాజం ఇవ్వాలని మరాఠీ రచయిత్రి సహస్ర బుద్ధిని గూర్చి దేవరాజు ప్రస్తావించారు. స్త్రీ స్వేచ్ఛ కోసం, స్త్రీలలో ఆత్మ విశ్వాసాన్ని పెంచడం కోసం ఆమె చేసిన కృషిని అభివర్ణించారు. అలాగే స్త్రీ సమానత్వం కోసం, గౌరవం కోసం పాటుపడిన వారిలో కొర్నీరియా పోరాబ్దిని ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. వృత్తి పరంగా న్యాయవాది అయిన ఆమె స్త్రీ పురుషులకు సమాన హక్కులు, బాధ్యతలు ఉండాలని పేర్కొన్నారు. సాహిత్యం, న్యాయస్థానం, రాజకీయం వంటి మార్గాల ద్వారా స్త్రీవాద చైతన్యాన్ని బహిర్గతం చేసిందనీ దేవరాజు వివరించారు.
(ఇంకా ఉంది)

ఆచార్య వంగరి త్రివేణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *