పదవులు యాచించను ..

కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన కోమటిరెడ్డి విసుర్లు

రాష్ట్ర కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే  ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు మొదలు మొదటిసారిగా జరిగిన విస్తర్ణంలో తనపేరు లేకపోవడంపట్ల రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అసహనానికి గురవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడి సుమారు పదిహేను నెలలు కావస్తున్నా ఆయన డిమాండ్‌ ‌డిమాండ్‌గానే ఉంది. దీంతో ఆయన ఇటీవల తీవ్ర అసంతృప్తికి లోనవుతూ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, అటు పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టే విధంగా మాటల తూటాలు పేలుస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల మంత్రివర్గ విస్తరణలో ఆరుగురిని మంత్రులుగా తీసుకునే అవకాశముండడంతో పలువురు ఆ పదవులపై ఆశ పెట్టుకున్నారు. ఎవరికి వారు తమకే మంత్రిపదవి దక్కుతుందని నమ్మకంగా ఉన్నప్పటికీ అధిష్టానం కేవలం ముగ్గురిని మంత్రులుగా తీసుకోవడానికి రాష్ట్ర నాయకత్వానికి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఆ మేరకు గడ్డం వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌, ‌వాకిటి శ్రీహరికి మంత్రిపదవులు దక్కాయి. అయితే ఇక్కడ విచిత్రకర విషయమేమంటే ముఖ్యమంత్రి తన అత్యంత సన్నిహితులు ఒకరిద్దరికి మంత్రి పదవిని ఇప్పించుకోలేకపోయారంటే మంత్రివర్గ విస్తరణ అంతా అధిష్టానం కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టమవుతున్నది. అధిష్టానం తనపేరు చెబుతుందని ఎంతో అశపడిన రాజగోపాల్‌రెడ్డికి తీవ్ర నిరాశే ఎదురైంది. అయితే ఇంకా ముగ్గురిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉండడంతో ఇప్పటికైనా తనకు అవకాశం ఇవ్వాలంటూ రాజగోపాల్‌రెడ్డి పట్టుపడుతున్నారు. తనను మంత్రిగా తీసుకునే విషయంలో గతంలో అధిష్టానమే హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన పదేపదే గుర్తుచేస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి మొదటినుండి కాంగ్రెస్‌ ‌నాయకుడే అయినా ఆయన 2022లో రాజీనామాచేసి బిజెపిలో చేరాడు. బిజెపి అభ్యర్థిగా మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో పోటీచేసి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ బిజెపి ఆయనను జాతీయ కార్యవర్గ సభ్యుడి పదవినిచ్చి గౌరవించింది. కాని ఆ పార్టీలో ఇముడలేకనో, కాంగ్రెస్‌ ‌మంత్రి పదవినిస్తానని ఆశపెట్టినందువల్లో బిజెపికి రాజీనామాచేసి 2023 అక్టోబర్‌ 27‌న పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో దిల్లీలో తిరిగి కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకున్నాడు.

అగో అప్పుడే కాంగ్రెస్‌ ‌తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మునుగోడు నియోజకవర్గ ఎన్నిక ఎంతో క్లిష్టతరంగా ఉన్నా విజయం సాధించినప్పటి నుండీ తనకు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందిగా ఆయన అధిష్టానంపైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. అంతేకాదు 2024 లోకసభ ఎన్నికల సందర్భంగా భువనగిరి కాంగ్రెస్‌ ఎం‌పీని గెలిపించుకుని వస్తే మంత్రి ఖాయమని పార్టీ మరోసారి హామీ ఇచ్చిన విషయాన్నికూడా ఆయన గుర్తు చేస్తున్నారు. ఆయన అసహనం ఎక్కడివరకు వెళ్ళిందంటే తాను మరోసారి మునుగోడు శాసనసభ స్థానానికి రాజీనామాచేసి, ఉప ఎన్నికకు కారణంగా మారుతానన్నంతవరకు వెళ్ళారు. ఆ విధంగానైనా అధిష్టానం తనను గుర్తించి మంత్రి పదవి ఇవ్వక పోతుందా అన్నది ఆయన ఆలోచన. తనకు పదవులపైన ఆశ లేదంటూనే, మంత్రి పదవికి తాను అన్ని విధాలుగా అర్హుడినని చెప్పుకుంటున్నారు. తనకన్నా జూనియర్‌లకు మంత్రిపదవినిచ్చి ప్రోత్సహిస్తూ, తనకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కడంపట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో తనకు సహకరించడంలేదని కాబోలు ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా సిఎంపై వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ వస్తున్నారు. భాష మార్చుకోవాలంటూ రేవంత్‌రెడ్డికి సలహాలిస్తున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ‌వర్గాల్లో హాట్‌ ‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్న క్రమంలో రేవంత్‌రెడ్డి వాడుతున్న భాష  సరిగాలేదన్న ఆయన కామెంట్‌ ‌పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేదిగా ఉందంటున్నారు. రేవంత్‌రెడ్డికి ప్రతిపక్షాలను తిట్టడంతోనే సరిపోతున్నదేగాని, రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పథకాలను వివరించేందుకు అ సమయాన్ని వెచ్చిస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్న తీరు కాంగ్రెస్‌లో గందరగోళానికి దారితీసింది. అలాగే సోషల్‌ ‌మీడియాపైన సిఎం విరుచుకుపడిన తీరునుకూడా ఆయన ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. ఆ సోషల్‌ ‌మీడియా కారణంగానే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని చెప్పే క్రమంలో ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లుందన్న సామెతను చెప్పుకొచ్చారు.

ఒకానొక సందర్భంలో మరో పదేళ్ళ వరకు తానే ముఖ్యమంత్రినని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొనడాన్ని కూడా రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. ఇంకా మూడున్నర ఏళ్ళ పదవీకాలం ఉంది. మీరే పదవిలో ఉంటారు. ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది అప్పుడు అధిష్టానమే చూసుకుంటుందని నర్మగర్భంగా మాట్లాడితే, అదే సమయంలో మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే అవుతారని ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సిఎం రేవంత్‌రెడ్డికి కితాబివ్వడం విచిత్ర పరిణామం. కాళేశ్వరం విషయంలోనూ రాజగోపాల్‌రెడ్డి సిఎంను వదలలేదు. అనవసరంగా కమీషన్‌ల పేరున ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. మొత్తానికి రాజగోపాల్‌రెడ్డికి మంత్రిపదవన్నది కాంగ్రెస్‌లో ఇప్పుడు హాట్‌ ‌టాపిక్‌గామారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *