ఫాతిమా కాలేజీపై ఉదాసీన‌త ఎందుకు?

ఒవైసీ కబ్జాను హైడ్రా రంగనాధ్ సమాజ సేవ‌ అంటున్నారు. ఒవైసీ కబ్జా చేసి విద్యా సంస్థ లను నడిపిస్తున్న సెల్కమ్ చెరువుభూములను స్వాధీనం చేసుకోవడానికి మాటలు మారుస్తూ మీనమేషాలు లెక్కిస్తున్న రంగనాథ్‌ తీరు అవినీతికి వత్తాసు పలుకు తున్నట్లు ఉంది, ఒవైసీ కాలేజీకి తానే  ‘సమాజ సేవ’ అనే ట్యాగ్ లైన్ ఇవ్వటాన్ని బట్టి చూస్తే,  కోట్లాది రూపాయల విలువైన సెల్కమ్ చెరువు భూములను ఆక్రమించి విద్యాసంస్థలు నడిపిస్తున్న ఒవైసీకి  మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు రంగనాథ్‌ వైఖరిని ప‌రిశీలిస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ప్ర‌భుత్వ తీరు కూడా ఇదేవిధంగా వున్న‌ట్టుగా తోస్తున్న‌ది.  హైదరాబాద్ రంగారెడ్డి తదితర జిల్లాల ప్రాంతాల్లో  అక్రమణలకు గుర‌యిన‌ భూములను రక్షించి పునరుద్ధ‌రించ‌డం హైదరాబాద్ సౌంద‌ర్యాన్ని,  ప్రకృతిని కాపాడటం, గొలుసుకట్టు చెరువులకు పూర్వ వైభవం తేవటం, కబ్జా కోరుల నుంచి ప్రజలకు రక్షణగా ఉండటం, దగా కోరులను చ‌ట్ట‌బ‌ద్ధంగా శిక్షించటం వంటి లక్ష్యాలతో హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  హైడ్రా కమిషనర్ రంగనాథ్  తీరు హైడ్రా మూల లక్ష్యానికే విఘాతం కలిగించే విధంగా ఉండటం క్షమించరానిది. విద్యార్థుల భ‌విష్య‌త్‌ అని కొంత కాలం, సమాజ సేవ అని కొంత కాలం కాలయాపనతో హైడ్రా వత్తాసు పలుకుతోంది.. ఇప్పుడు రంగనాథ్‌ ఉచిత విద్య పేరుతో ఏకంగా సమాజ సేవ అంటూ వత్తాసు పలుకుతూ ఒవైసీని కాపాడే ప్రయత్నం విస్మయాన్ని కలిగిస్తోంది.

ఆ మాట‌కొస్తే ఎంపీని ప్ర‌జ‌లు ఎన్నుకుంది స‌మాజ‌సేవ‌కోస‌మే క‌దా! చట్టం ముందు అందరూ సమాన‌మ‌యినప్పుడు,  కబ్జాకోరులకు సమాజాసేవకు, చట్టంలో ఏమన్నా వెసులుబాటు వున్న‌ట్ల‌యితే రంగ‌నాథ్ చూపించాలి. ఓ కాంట్రాక్టర్ పేదల పెళ్లికి  పుస్తెలు ఉచితంగా ఇస్తున్నాడంటే, అత‌ను ఎంత భూమిని క‌బ్జా చేసినా వ‌దిలేస్తారా రంగ‌నాథ్‌?  మొన్న‌టివ‌ర‌కు త‌ర‌గ‌తులు జ‌రుగుతున్నాయ‌ని కూల్చ‌డంలేద‌ని కాలం వెళ్ల‌దీశారు. ఇప్పుడేమో ఉచిత విద్య‌, సామాజిక సేవ అంటున్నారు. ఒవైసీ సొంత డ‌బ్బుల‌తో అటువంటి సేవ చేస్తే త‌ప్ప‌కుండా గౌర‌వించాల్సిందే! కానీ చెరువునే క‌బ్జాచేసి కాలేజీ పేరుతో వ్యాపారం న‌డుపుతూ, దీన్ని ఉచిత స‌మాజ‌సేవ అంటే ఏంటో క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ చెప్పాలి.

ఈవిధంగా మాట మారుస్తూ రంగ‌నాథ్ త‌న గౌర‌వాన్ని తానే త‌గ్గించుకుంటున్నారు.  హైడ్రా క‌మిష‌న‌ర్ అంటే నిబ‌ద్ధ‌తకు మారుపేర‌నుకున్నాం కానీ, ఇంత అసంబద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నుకోలేదు.  దోపిడీ, క‌బ్జాల‌కు పాల్ప‌డి స‌మాజ సేవ అంటే చ‌ట్టం వ‌దిలేస్తుందా? ఇది రంగ‌నాథ్‌కు తెలియ‌దా?  రూ.వెయ్యికోట్ల విలువైన ఎంఐఎం ఆక్ర‌మించుకున్న భూముల‌ను స్వాధీనం చేసుకున్నాం. నిజంగా ఒవైసీది సామాజిక సేవ అని రంగ‌నాథ్ ట్యాగ్ లైన్ ఇస్తే స‌రిపోతుందా? ఎవ‌రైనా దీనిపై కోర్టుకెళితే మీ ప‌రువేం కావాలి? అక్రమ సంపాదన ఉన్న ప్రతివాడు ఏదో ఒక సమాజ సేవ చూపిస్తాడు.

అట్లాగ‌ని వాళ్ల‌ను వ‌దిలేస్తామా?
ఎంతటి క‌చ్చిత‌మైన‌ అధికారి అయినా అధికారానికి దాసోహం అన‌కుండా వ్య‌వ‌హ‌రించ‌లేడ‌నేది రంగనాథ్ విషయంలో నిజం అనిపిస్తోంది. అయితే అధికారం లో ఉన్నవాళ్లకు ఇది మంచిదికాదు ఎవరైనా కోర్ట్ కి పోతే ప్రభుత్వం పరువు, అధికారుల పరువు పోతుంది. ఇది పబ్లిక్ ఇష్యూగా మారితే అధికారులు ప్రభుత్వం తల ఎక్కడ పెట్టుకుంటారు?  మాటను రెండు రకాలుగా మార్చటం తోనే అధికారి వ్య‌వ‌హార‌శైలిలో తేడా వున్న‌ద‌ని తెలిపోతుంది ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులే అన్యాయాన్ని సమర్ధిస్తూ మాట్లాడితే డితే కంచే చేను మేసినట్లుకాదా! దోపిడీ చేసిన ఒవైసీ కన్నా ముం దే హైడ్రా అధికారి రంగనాధ్ సమాజ సేవ ట్యాగ్ లైన్ ఇవ్వటం దేనికి సంకేతం? కబ్జాకోరుల రక్షణ కోసం హైడ్రా  ఉన్న‌దా? రాజకీయ పలుకుబడి ఉన్నోళ్ళను వదిలెయ్యటానికి వున్నామా అనేది అనేది తేల్చుకోవాల్సింది హైడ్రా అధికారులు మాత్ర‌మే!

-సాదం వెంకట్, 

సీనియ‌ర్  జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *